Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

దేశ విముక్తి పోరాటంలో ముస్లిం యోధులు

యం.డి. ఉస్మాన్‌ ఖాన్‌
భారతదేశ స్వాతంత్య్రం కోసం అనేకమంది ప్రాణాలను పణంగా పెట్టారు. హిందువులు, ముస్లింలు అందరూ సమైక్యంగా బ్రిటిషు వలసపాలన నుండి విముక్తి కోసం జరిగిన స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. ఈనాడు మనం ఇంత హాయిగా స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామంటే దీనివెనుక అసంఖ్యాకమైన ప్రజల అలుపెరుగని పోరాటాలున్నాయి. త్యాగా లున్నాయి. బలిదానాలున్నాయి. ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామంగా చెప్పుకునే 1857 తిరుగుబాటుకు వందేళ్ళ పూర్వమే ముస్లింలు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా సమరశంఖం పూరించారు. మొట్టమొదట షా వలివుల్లా ముహద్దిస్‌ దహెల్వీ రహిమహుల్లా ఆంగ్ల ముష్కరుల కుట్రలను పసిగట్టి, ప్రజలను చైతన్యవంతం చేశారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా ‘జిహాద్‌’ చేయాలని దేశంలో మొట్టమొదట ఫత్వా జారీ చేసింది షా వలియుల్లా కుమారుడు షా అబ్దుల్‌ అజీజ్‌ జహీమాబాదీ. బెంగాల్‌, ముర్షదాబాద్‌ ప్రాంతాల్లో అలీ వర్దీ ఖాన్‌ ఆంగ్లేయులను ఢీకొన్నాడు. 1757లో వర్దీఖాన్‌ మనవడు, బెంగాల్‌ నవాబ్‌ సిరాజుద్దౌలా బ్రిటిషర్లపై విరుచుకుపడ్డాడు. 1780లో మన విశాఖ పట్నంలోని ఈస్టిండియా కంపెనీలో సుబేదారుగా పనిచేస్తున్న షేఖ్‌ అహ్మద్‌ను మైసూరుపై దండెత్తమని ఆంగ్ల అధికారులు ఆదేశించినా బేఖాతరుచేసి, తన మద్దతుదారులతో కలిసి ఈస్టిండియా సైన్యంపైనే కాల్పులు జరిపాడు. మొట్టమొదటి సైనిక తిరుగుబాటుదారుడు షేఖ్‌ అహ్మద్‌. ఏ కారణం వల్లనో చరిత్ర ఈ వీరుణ్ణి విస్మరించింది.
షా ఇస్మాయీల్‌ షహీద్‌, షా అహ్మద్‌ బరేల్వీలు 1820లో వహాబీ ఉద్యమాన్ని ప్రారంభించారు. హిందూ ముస్లింల ఐక్యత కోసం మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌ సంపాదకత్వంలో ‘దిల్లీ ఉర్దూఅఖ్‌ బార్‌’ పేరిట ఉద్యమ పత్రికను నడిపారు. పత్రిక ద్వారా ప్రజల్లో విప్లవ బీజాలు నాటుతూ, ఉద్యమానికి ఉసిగొల్పుతున్నారనే నెపంతో పత్రికపై, పత్రిక సంపాదకుడు మౌలానా ముహమ్మద్‌ బాఖర్‌పై దాడి చేసి చిత్రహింసలు పెట్టి పొట్టన పెట్టుకున్నారు ఆంగ్ల ముష్కరులు. 1857లో జరిగిన సైనిక తిరుగుబాటును సర్‌ హెండ్రీమిడ్‌ అనే ఆంగ్ల రచయిత, ‘అది సిపాయిల తిరుగుబాటుకాదు, ముస్లింల తిరుగుబాటు. దీనికి నారునీరు పోసినవారు, ముందుండి నడిపించినవారు ముస్లింపండితులు (ఉలేమాలు) అని రాశాడంటే స్వాతంత్య్రో ద్యమంలో ముస్లింలపాత్ర ఎంత మహోజ్వలమైనదో మనం అర్థం చేసు కోవచ్చు. అలాగే పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ తను రాసిన ‘డిస్కవరీ ఆఫ్‌ ఇండియా’ అనే గ్రంథంలో ఈ సిపాయీల తిరుగుబాటుకు అసలు ప్రేరణ ముస్లింలే అని, స్వాతంత్య్రోద్యమానికి ఆద్యులువారేనని రాశారు. ఆ సమయంలో ఒక్క దిల్లీలోనే 27వేల మంది ముస్లింలు దేశంకోసం ప్రాణాలు కోల్పోయారు.
దేశ స్వాతంత్య్రంకోసం ప్రాణాలర్పించిన మరో ముద్దుబిడ్డ మౌల్వీసయ్యద్‌ అలావుద్దీన్‌. ఈయన ప్రియశిష్యుడు, దేశం గర్వించదగ్గ యువకిశోరం, హైదరాబాదు సమరసింహం తుర్రెబాజ్‌ ఖాన్‌. ఉద్యమంలో భాగంగా గురుశిష్యులిద్దరూ ఒకరోజు 500 మందితో కలసి హైదరాబాదులోని ఆంగ్ల సైన్యాధికారుల నివాసాలపైకి దండెత్తి వీరోచిత పోరాటం చేశారు. స్వదేశీ పాలకుల మధ్య ఐక్యత కోసం పరితపిస్తూ, లేఖల ద్వారా కార్యోన్ముఖుల్ని చేసిన మరోయోధుడు అజీముల్లాఖాన్‌. నానాసాహెబ్‌కు వెన్నంటి నిలిచి, సమర వ్యూహాన్ని రచించారు. ‘పయామెఆజాదీ’ అనే పత్రికను హిందీ, ఉర్దూ భాషల్లో నడిపారు. దేశస్వాతంత్య్ర సమరంలో మొగల్‌ చక్రవర్తి బహదూర్‌ షా జాఫర్‌ పాత్ర చిరస్మరణీయం. మౌలానా లియాఖత్‌ అలీఖాన్‌, హిక్మతుల్లాఖాన్‌, ముహమ్మద్‌ బఖ్త్‌ ఖాన్‌, ఖాన్‌ బహదూర్‌ ఖాన్‌, బక్షిష్‌ అలీ, ఖాన్‌ అబ్దుల్‌ గఫార్‌ ఖాన్‌, తుర్రెబాజ్‌ ఖాన్‌, మౌలానా ఆజాద్‌, దూదూమియాలతో పాటు ఎంతోమంది ముస్లియోధులు దేశంకోసం అనుపమానమైన త్యాగాలు చేశారు. తృణప్రాయంగా ప్రాణాలను అర్పించారు.
ఆబాదీబానూ, బేగం హజ్రత్‌ మహల్‌, బేగం అజీజున్‌, ముందర్‌, హమీదాబేగం, బేగం రహీమా, బేగం హబీబా, అజ్గరీబేగం లాంటి ఎందరో వీరవనితలు తమ జీవితాలను ధారపోశారు. బ్రిటిష్‌ ముష్కరుల కబంధ హస్తాలనుండి దేశాన్ని రక్షించడానికి కదనరంగంలోకి దూకిన ధీరవనిత బేగం హజ్రత్‌ మహల్‌. స్వయంగా ఏనుగు అంబారీపై స్వారీ చేస్తూ, యుద్ధ రంగంలో ఆంగ్లేయులపై శివంగిలా విరుచుకు పడిన వీరనారి. భరతమాత సంకెళ్ళు తెంచడానికి దేశసేవకు అంకితమైన మహిళ ఆబాదీబానూ తన ఇద్దరు కొడుకులకూ ఉగ్గుపాలతోనే విప్లవభావాలు రంగరించిపోసి సమర రంగానికి పంపిన ధీశాలి. అలీ బ్రదర్స్‌గా ప్రసిద్ద్ధులైన మౌలానా ముహమ్మద్‌ అలీ, మౌలానా షౌకత్‌ అలీ ఆబాదీబాను ముద్దుబిడ్డలేకాదు, భరతమాత ముద్దుబిడ్డలు కూడా. స్వాతంత్య్రోద్యమంలో ఈ ఇద్దరు అలీల పాత్ర అజరామరం. స్వయంగా గాంధీజీయే ఆమెను అమ్మా అని సంబోధించడంతో ప్రజలంతా ఆమెను అమ్మా అని పిలిచుకునేవారు. దీంతో ఆమె బీబీ అమ్మాన్‌గా ప్రసిద్ధిగాంచారు. వయసు మీద పడినా, అనారోగ్యం వేధించినా ఆమె స్వాతంత్య్ర పోరాటం నుండి వీసమెత్తుకూడా వెనక్కి తగ్గలేదు. ‘హోమ్‌ రూల్‌’ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారు. ఆబాదీబాను పోరాట పటిమను, మొక్కవోని ధైర్యసాహసాలనుచూసి ఆంగ్లేయులు ఈమె చాలా ప్రమాదకరమైన మహిళ అని ప్రకటించారు.
ఆనాడు దేశ స్వాతంత్య్రం కోసం అందరూ కలసికట్టుగా పోరాడుతుంటే, ఉద్యమంలో రవ్వంతకూడా భాగస్వామ్యం లేకుండా ఆంగ్లతొత్తులుగా వ్యవహరించిన ‘పరివార్‌’ శక్తులు ముస్లింల దేశభక్తిని శంకించడమంటే దయ్యాలు వేదం వల్లించినట్లుగా ఉంది. కులమతాలకు అతీతంగా యావద్దేశ ప్రజలు అనేక త్యాగాలు చేసి కలసి సాధించుకున్న ఈ దేశం ఏమైపోనుందో అన్న భయం కూడా ఈనాడు దేశ ప్రేమికుల్లో నెలకొంది. ఆలోచనాపరులు, మేధావులు, లౌకిక, ప్రజాస్వామిక వాదులు, యావద్దేశ బహుజనులు, యావత్‌ పౌర సమాజం ఏకతాటిపై నిలిచి మతోన్మాదశక్తుల నుండి దేశాన్ని కాపాడడం కోసం నిర్మాణాత్మకమైన, ఆచరణాత్మక కార్యాచరణ రూపొందించ వలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే ఇప్పటి కర్తవ్యం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img