గత కొన్ని దశాబ్దాలుగా విశ్వ మానవాళి బహుముఖీన వికాసంతో పాటు భూగోళంపై వాతావరణ ప్రతికూలమార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. మానవ అభివృద్ధితోపాటు అపరిమితంగా కార్బన్ ఉద్గారాలు పెరగడం, భూతాపం, సముద్రమట్టంపెరగడం, ఆహార ఉత్పత్తులు ప్రభావితం కావడం, నీటి వనరులు తరగడం, హరిత కవర్ పడిపోవడం లాంటి అనారోగ్యకరమార్పులు జరుగుతూనే ఉన్నాయి. ప్రమాదకరమైన వాతా వరణమార్పులను అధిగమించడం అంత సులభమేమీకాదు. ఈ మార్పులకు కారణమైన నరులకు ఆ విషయాలు ఏమీతెలియదు. తెలిసినా వాటిని కట్టడి చేయడానికి ఎలాంటిప్రయత్నాలు చేయడంలేదు. వాతావరణ ప్రతి కూల మార్పులకుకారణం పౌరులైతే వాటిని నిలువరించడం ప్రభుత్వ కర్తవ్యంగా భావించాలి. ‘‘తాగినవాడే తాళ్లపన్ను కట్టాలి’’, ‘‘మార్పులకు కారణ మైన నరులే వాటికి సమాధానంచెప్పాలి’’ అనే కనీసబాధ్యత మరిచి పోతున్నాం.
వాతావరణ మార్పులను కట్టడి చేయడం ఒక సంక్లిష్ట సమస్య. వీటిని అధిగమించడానికి సాధారణ వ్యక్తులు, వ్యవస్థలు, సంస్థలు, పౌర సమాజం, పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వాలు చేయి చేయి కలిపి నిలువ వలసిందే. భారత్‌లాంటి పేదదేశంలోని విభిన్న జాతులు, మతాలు, అభిప్రాయాలు, ఆచారాలు పాటించే మానవసమాజం ఏకంకావడం అసాధ్యంగానే తోస్తున్నది. ప్రతిఒక్కరు తమ తమ పరిధిలో వాతావరణ మార్పుల దిశగా సానుకూల ఆలోచనలు చేస్తూ, ఆచరణ యోగ్యమైన చర్యలు చేపట్టాలి. పర్యావరణం, పౌర సమాజం, ప్రభుత్వం ఏకమైతేనే రాబోయే వాతావరణ విపత్తులను అధిగమించవచ్చు.
కార్పొరేట్ వ్యవస్థలు సామాజిక బాధ్యత(సియస్‌ఆర్)గా వాతావరణ ప్రతికూల మార్పులకు విరుగుడు వెతకాల్సిందే. వ్యక్తులు నెలకొల్పే కార్పొరేట్ వ్యవస్థలు స్వలాభం ఆశిస్తూ వాతావరణ ప్రతికూల మార్పులకు కారణం కావడం, ప్రభుత్వ అవినీతి వ్యవస్థలను గుప్పిట్లో పెట్టుకొని విచ్చలవిడిగా వ్యవహరించడం అనాదిగా జరుగుతునే ఉన్నది. వాతావరణ మార్పులకు సంబంధించిన ప్రభుత్వ చట్టాలకు అవినీతి చెదలుపట్టి కాగితాలకే పరిమితమై పోతున్నాయి. కార్పొరేట్ దిగ్గజాలు పర్యావరణ విచ్ఛిన్నానికి కారణంఅవుతూ, స్వచ్ఛందంగా వాటి విరుగుడుకు ఆలోచించడం లేదు. ప్రభుత్వ చొరవతో ప్రవేశపెట్టిన ‘‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సియస్‌ఆర్’’) నిధులను ఏ విధంగా వినియోగిస్తున్నారో పర్యవేక్షించే పటిష్ట యంత్రాంగాలు లేవు. ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ప్రభుత్వాలను నడిపిస్తున్నారు. వ్యవసాయరంగంలో విచక్షణారహితంగా రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడడంతో విషపూరిత ఆహార ధాన్యాలు ఉత్పత్తి అవుతూనే నేల నిస్సారమై ఎడారీకరణకు దారి తీస్తున్నది. పరిశ్రమలు విడుదల చేసే కాలుష్యాలతో నేల, నీరు, గాలి విషతుల్యం అవుతున్నది.
సాధారణ పౌరుడి నుంచి ప్రభుత్వ, ప్రభుత్వేతర వ్యవస్థల వరకు విచ్చలవిడిగా శిలాజ ఇంధనాలను వినియోగించడంతో కార్బన్ ఉద్గారాలు పెరిగిపోతున్నాయి. పర్యావరణహిత ‘‘ప్రత్యామ్నాయ తరగని సాంప్రదా యేతర ఇంధనాల’’ వినియోగాలను ఆశ్రయించాల్సిన సమయం ఆసన్నమైంది. విద్యుత్ వాహనాలను(ఎలక్ట్రిక్ వెహకిల్స్,ఈవి) ప్రవేశపెడు తూనే శిలాజఇంధన వినియోగ వాహనాల వాడకాన్ని క్రమంగా, వేగంగా తగ్గించాల్సిందే. రైతులు ‘‘పంట మార్పిడి’’ పద్దతులను ఆచరిస్తూ నేల సత్తువను పెంచడానికి ప్రయత్నించాలి. అడవుల నరికివేతను తక్షణమే యుద్ధప్రాతిపదికన ఆపివేస్తూ, అటవీ వైశాల్యాలను, సామాజిక అటవీ సంపదలను పెంచి పోషించాలి.సామాన్య జనాల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంచడం, రాజకీయ వ్యవస్థలపై ఒత్తిడి పెంచడం, ప్రజారవాణ వ్యవస్థలను అందుబాటులోకి తేవడం, శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించడం, కూరగాయల వినియోగాన్ని పెంచడం, స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించడం, ఆహారాన్ని వ్యర్థం చేయకపోవడం, పర్యా వరణహిత దుస్తులు/వస్తువులను వాడడం, పచ్చదనాన్ని పెంచడం/ పోషించడం, భూగోళ పరిరక్షణదిశగా సుస్థిరాభివృద్ధికి పెట్టుబడులు పెంచడం, కార్బన్ ఉద్గారాలను తగ్గించడం, తరగని ఇంధనాల విని యోగాన్ని పెంచడం, కార్బన్‌ఉద్గారాల శోషణ వ్యవలేఖలను ప్రోత్స హించడం, కార్చిచ్చులను నియంత్రించడం, ప్లాస్టిక్ వినియోగాన్ని నిషేధించడం, నీటిని పొదుపుగావాడడం, విద్యుత్‌వినియోగాన్ని తగ్గించడం లాంటి అనేకచర్యలు వాతావరణ ప్రతికూలమార్పులను కట్టడి చేస్తాయి.
ఏకకణంతో ప్రారంభమైన ప్రాణి జీవితం చివరికి మట్టిలో కలిసి ‘‘లైఫ్ సైకిల్’’ను పూర్తి చేస్తూ నేల నాణ్యతను స్థిరీకరించాల్సిందే. వ్యక్తులు, కుటుంబాలు, పల్లెలు, పట్నాలు, పౌర సమాజాలు, వ్యాపారులు, కార్పొరేట్లు, ప్రభుత్వ యంత్రాంగాలు ఏక తాటిపై నిలబడి వాతావరణ ప్రతికూల మార్పులకు వ్యతిరేకంగా చర్యలు చేపట్టవలసిందే. ‘‘పర్యావరణ విధ్వంసం మానవాళి మనుగడకే విధ్వంసమని కళ్లు తెరవాల్సిందే’’. సమీప భవిష్యత్తులో అణు విధ్వంసంతో కాని వాతావరణ ప్రతికూల మార్పుల సంక్షోభాలతో కాని విశ్వమానవాళి, సమస్త జీవకోటి, నేల-నీరు-గాలి నాశనం కావలసిందే. ప్రపంచ మానవాళి నివాసమైన భూమాతను కాపాడుకుంటూ, ‘‘ధరణితో దోస్తీ’’ చేయడానికి తక్షణమే కార్యోన్ముఖులు కావలసిందే అని గమనిస్తూ, సుందర ప్రకృతిమాత ఒడిలో సమస్త ప్రాణికోటి ఆయురారోగ్యాలతో జీవించాలని కోరుకుందాం.
డా.బుర్ర మధుసూదన్‌రెడ్డి, 9949700037