Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

నవ్వుల చిరుజల్లులు కురిపించే‘చంద్రహాసం’

మనుషులు హాయిగా నవ్వుకుని ఎన్ని రోజులైందో.. ఎవర్ని చూసినా అసంతృప్తి, విసుగు, చిరాకు.. జీవితగమనంలో ఎన్నిటిని స్వంతం చేసుకున్నా ఇంకా అందనివాటిని అందుకోవాలన్న ఆరాటంలో మనిషి నవ్వుని మర్చిపోయాడు. కొన్ని దశాబ్దాల క్రితం కుటుంబ సభ్యులు ఒక చోట చేరి, హాయిగా కబుర్లు చెప్పుకుంటుా, చెణుకులు విసురుకుంటూ, మనసారా నవ్వుకుంటూ.. ఇడియట్‌ బాక్స్‌ వచ్చి జీవితంలోని సగం సరదాల్ని మింగేస్తే, సెల్‌ఫోన్‌ వచ్చాక మిగతా అన్నిటినీ స్వాహా చేసింది. ఎడారిలో ఒంటరి ప్రయాణం లాంటి నేటి జీవితంలో చిరుజల్లులా సేద తీర్చడానికి అడపాదడపా హాస్య రచనలు రావడం స్వాగతించదగిన విషయం. అలా నవ్వుల పువ్వుల్ని కురిపించి, వెన్నెల హాసాన్ని పాఠకులమీద చిలకరించడానికి శ్రీ చంద్రప్రతాప్‌ కంతేటి పూనుకుని వెలువరించిన పుస్తకమే ‘చంద్రహాసం’.
చంద్రప్రతాప్‌ జగమెరిగిన సాహితీవేత్త. కొన్ని దశాబ్దాలపాటు విపుల, చతుర మాసపత్రికలకు సంపాదకులుగా పనిచేసిన అనుభవం అదనపు అర్హత.. కాబట్టే ఏది రాసినా అది ఉత్తమ సాహితీవిలువల్తో పరిపుష్ఠమై ఉంటుంది. రచయిత తన ముందు మాటలో చెప్పినట్టు హాస్యం రాయడం కత్తిమీద సాము లాంటిదే. వేయాల్సిన దినుసుల్లో కొద్దిగా తేడా వచ్చినా హాస్యం కాస్తా అపహాస్యంగా మారే ప్రమాదంఉంది. హాస్యం రాసి విజయం సాధించాలనుకోవడం సాహసమే. చంద్రహాసం పుస్తకంలోని 45 ఖండికలను చదివాక, చంద్రప్రతాప్‌ హాస్యం, వ్యంగ్యం రాయడంలో విజయశిఖరాలు అధిరోహించారని ఒప్పుకోక తప్పదు. కొన్ని ఖండికలు సుతిమెత్తగా చక్కిలిగిలి పెట్టినట్టు నవ్విస్తే మరికొన్నిటిలో సమాజంలోని పోకడల మీద వ్యంగాస్త్రాలను సంధించి, వాటి గురించి ఆలోచింపచేసేలా రాశారు.
దిల్‌సుఖ్‌నగర్‌ వెళ్ళాల్సిన సదానందం సికింద్రాబాద్‌ బస్‌ కోసమో ఉప్పల్‌ బస్‌ కోసమో ఎదురు చూస్తున్నట్టు ఎందుకు నటిస్తాడో తెలియాలంటే ‘బ్రహ్మ కడిగిన పాదమూ’ అనే ఖండిక చదవాల్సిందే. చలపాయ్‌ తీరు మరో రకం. హౌసింగ్‌ బోర్డ్‌కి టికెట్‌ తీసుకున్నా, కండక్టర్‌తో పోట్లాడి మరీ చందానగర్‌ దాకా వెళ్ళి, అక్కడ బస్‌దిగి, వెనక్కి వచ్చేంత మొండితనం. అందుక్కారణం ఏమిటో తెలిస్తే ముసిముసి నవ్వులు ముసురుకోక తప్పదు. పుత్రపౌత్ర ప్రాప్తిరస్తు అని పెళ్ళిళ్ళలో దీవిస్తే జగన్నాధం ఎందుకు మండిపడతాడో తెల్సుకున్నాక గుండె బరువెక్కుతుంది.
పిల్లికి బిచ్చం వేయని శ్రీపాదం.. అరకప్పు టీ ఇప్పించడానికి శిబి చక్రవర్తిలా ఫీలయ్యే శ్రీపాదం తన కొత్త కారులో రౌండ్‌ వేయడానికి ముగ్గురు స్నేహితుల్ని పిలవడంలో అంతరార్థమేమిటో అర్థం కాగానే కిసుక్కున నవ్వుకుంటాం. ‘మనవన్నీ వాట్సాప్‌ బంధాలే. అయినదానికీ కానిదానికీ ‘మా యింట్లో కుక్కపిల్ల,’ ‘బాల్కనీలో రెట్ట వేస్తున్న పిట్ట’ అంటూ పిచ్చి ఫోటోలతో మన ఇన్బాక్స్‌లన్నీ నింపి పెట్టే మనుషులకు ముఖ్యమైన విషయాల పట్ల ఎందుకింత నిర్లక్ష్యమో అర్థం కాదు’ అంటూ సాఫ్ట్‌ సంబంధాలు అనే ఖండికలో రచయిత విచారం వ్యక్తం చేస్తుంటే పాఠకుడు కూడా ‘ఔనుస్మీ..ఎంతటి దారుణం!’ అనుకోకుండా ఉండలేడు.
భావిభారత పౌరుల్ని ఆణిముత్యాలుగా తీర్చిదిద్దే కార్యక్రమానికి ఏ పేరు పెడ్తే బావుంటుందో ఆలోచించే క్రమంలో దొర్లిన హాస్యానికి దొంతర్లు దొంతర్లుగా నవ్వాలనుకుంటే ‘తలచినదే జరిగినదా దైవం ఎందులకు’ చదవాల్సిందే. ‘తాత ఒడి’ ఎలా ఉంది అని ఒకడంటే ‘నీ బొంద.. బామ్మ మడి అని కూడా పెట్టు’ అంటాడు యింకొకడు. ‘ఫలానా పార్టీకి చెందిన రంగనాథయ్య పేరు ప్రతిష్ఠలున్న వ్యాపారి. శివారుల్లో పెద్ద ఖామందు..’ అని పత్రికలో వార్త ప్రచురించినందుకు పార్టీ కార్యకర్తలు ఎందుకు పెద్ద గొడవచేసి, కోర్టుకెళ్తామని బెదిరించారో చదివినప్పుడు ఆపుకుందామనుకున్నా నవ్వుని ఆపుకోలేం. నాలుగో తరగతి ఉద్యోగులకు జీతాలు పెంపు అనే వార్త చదివి ‘‘ఈ పెద్దోళ్ళున్నారే.. ఎప్పుడూ ఇంతే’’ అని పిల్లలు ఎందుకనుకున్నారో చదివి, వెన్నెల్లా చల్లగా నవ్వుకోవడమే.
వ్యంగ్యంగా రాసిన కొన్ని ఖండికలు చదివినపుడు ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల ఈ రచయితకున్న అవగాహన, ఆందోళన అర్థమౌతాయి. సెల్‌ఫోన్‌ వల్ల ఏర్పడిన సామాజిక రుగ్మతలు,బంధాల పట్ల నిర్లక్ష్యం, ఎఫ్‌బీలో ఫ్రెండ్‌ రిక్వెస్టులు పెట్టి చేసే మోసాలు, బ్లాక్‌ మెయిలింగ్‌లు, ముసలి తల్లిదండ్రుల విషయంలో పిల్లల నిరాదరణ, అనుబంధాలన్నీ ఆర్థిక సంబంధాలతో ముడిపడిన వైనం, భ్రమా స్వామ్యంగా మారిన ప్రజాస్వామ్యం.. ఇలా చాలా విషయాల్ని రచయిత సున్నితంగా విమర్శిస్తూ, సుతిమెత్తటి మొట్టి కాయలు వేశారు.
కొన్ని ఖండికలకు పెట్టిన శీర్షికలు… బ్రోచేవారెవరురా, ఏ తీరుగ నను దయచూచెదవో, అంతర్యామి అలసితి సొలసితి, జగమంతకుటుంబం మాది- ఏకాకి జీవితం మాది, తలచినదే జరిగినదా దైవం ఎందులకు.. ఇలా సినిమా పాటలు, త్యాగరాజ కృతులు, రామదాసు కీర్తనలు, అన్నమయ్య పదాలు గుర్తుకు తెస్తూ మనల్ని అలరిస్తాయి.
వాక్యంలోని పదాల విరుపుల్తో పెదాలమీద నవ్వులు విరబూయించడంలో ఈ రచయిత ఎంత సిద్ధహస్తుడో కొన్ని ఉదాహరణలు గమనించండి.
‘ప్లేట్లో మూడో నాలుగో స్వీట్లు తెచ్చిపెట్టింది. అవి ఎప్పుడో ప్లేటో కాలం నాటివి.’ ‘ఎలాగైతేనేం కారు కొండెక్కింది. మా ఓపికా కొండెక్కింది’ కారుని నెట్టీ నెట్టి అలసిపోయిన వారి స్వగతం.
రిటైరై విశ్రాంత జీవితం గడుపుతున్న వృద్ధులు మొదలెట్టబోతున్న కార్యక్రమానికి ఒకతను ‘‘వృద్ధే మాతరం’’ అని పేరు పెడదాం అంటాడు. ‘వృద్ధపదం వద్దనుకున్నాం గదా’ అంటాడు మరొకడు. ‘వృద్ధ కాదు. ఇక్కడ పదం వృద్ధి అంటే డెవలప్‌మెంట్‌. నాట్‌ ఓల్డేజ్‌’ అంటూ రీజనింగ్‌..
‘ఠావులు ఠావులు రాసి జనాల్ని ఠావులు తప్పేలా చేయడం ఎందుకనేది నా పశ్న.’ తన ముందు మాటలో రచయిత..
చక్కని పఠనీయత ఈ రచయిత స్వంతం. ఇందులోని ఖండికలు రెండు మూడు పేజీలకు మించకుండా ఉండటంతో పాఠకుడు సునాయాసంగా చదువుకుంటూ పోతాడు. రచయిత ముందు మాటలో చెప్పినట్టు ‘పాఠకుడికి విసుగు పుట్టేలా కాక అప్పుడే అయిపోయిందా అనుకునేలా రచన ఉంటేనే సక్సెస్‌ అయినట్టు.’ ఆ రకంగా ఆలోచిస్తే ఈ పుస్తకం నూటికి నూరు శాతం మార్కులతో విజయం సాధించినట్టే లెక్క.
మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తూనే, సమాజంలో వేళ్ళూనుకొంటున్న విష సంస్కృతుల పట్ల ఆలోచనని రేకెత్తించే ఇంత మంచి పుస్తకాన్ని కేవలం వంద కాపీలు మాత్రమే వేయడం కించిత్తు బాధ కలిగించిన విషయం. తెలుగు ప్రజలు పుస్తకాలు కొని, చదివే సంస్కారాన్ని అలవాటు చేసుకోలేదని రచయిత తన వ్యంగ్య ధోరణిలో ఈ రకంగా వ్యాఖ్యానం చేశారేమో?
తెలుగు సాహిత్యానికి ఓ విలువైన పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిన రచయిత చంద్రప్రతాప్‌ గారికి అభినందనలు.

  • సయ్యద్‌ సలీం

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img