మనకు మంచి నాయకులు కావాలి. ఆదర్శవంతులు కావాలి. మంచి నాయకులతో మంచి పాలన కావాలి. ఏంటి బావ ఈ రోజు నాయకులమీద పడ్డావు. నేను పడటం కాదయ్యా ప్రజలు తమ సమస్యలు పరిష్కరించడానికి నీతివంతులైన నాయకులు కావాలని కోరుకుంటున్నారు. అవినీతిలో కూరుకుపోయి కేసుల్లో ఇరుక్కున్న నాయకులకు బదులు సేవాదృక్పధంతో పనిచేసే నాయకులు కావాలని కోరుకోవడం తప్పుకాదుగా. ప్రస్తుతం అమెరికాలో జరుగుతున్న ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థుల గుణగణాల గురించి ఓటర్లు ఆలోచిస్తున్నారట. భారత్ మూలాలు ఉంటే చాలదు. మంచితనం, పాలనా అనుభవం, సేవా దృక్పధం కావాలని ఓటర్లు ఆలోచిస్తున్నారట. నాయకుడు వక్రబుద్ధి కలవాడైతే ప్రజల సొమ్ము దుర్వినియోగం అవుతుంది. నిజమే నయ్యా…అవినీతికి అలవాటుపడ్డ నాయకులు నీతివంతులను పార్టీలో ఎదగనివ్వని పరిస్థితులు కూడా ఉన్నాయి. పాలకులే తప్పుచేస్తే రాష్ట్రం నష్టపోవడమేకాక కేంద్రం దృష్టిలోనూ ఇతర రాష్ట్రాల ముందు తేలికయిపోతున్నాం. అసలు ప్రజల సొమ్ము రక్షించడానికా, భక్షించడానికా మనం ఎన్నుకునేది అనే బాధ సామన్యులలో కనబడుతోంది. ప్రజాస్వామ్యయుతంగా, పార్టీ రహితంగా ప్రజలందరూ మెచ్చుకునేలా పాలించమని మనం ఎన్నుకుంటే అధికారం అందిన మరునాటి నుంచే తన, మన పాలసీతో పరిపాలన మొదలు పెడుతున్నారు.
ప్రభుత్వం అందించే పథకాలన్నీ ప్రజలందరి కోసమైతే పాలకులు మాత్రం తన మన పాలసి అనుసరించి ప్రతిపక్షపార్టీకి ఓటేసిన వారికి అందకుండా చేయడం ఏమి న్యాయం? ఓటేసే వరకే పార్టీలు. ఎన్నికలు ముగిసిన తరువాత ఏర్పడిన ప్రభుత్వం ప్రజలందరిది అనే భావన పాలకులలో కన్పించడంలేదు. రాష్ట్రాన్ని అప్పుల పాలుచేసి దేశం మొత్తం నవ్వే విధంగా పాలించడం వల్ల రాష్ట్రాల పరపతి గంగలో కలుస్తుంటే ఆలోచించే వ్యక్తుల మనసు బాధ పడకతప్పదు. అదికాదు బావ అసలు ఎవరడిగారని ఎన్నికలలో హామీలు ఇవ్వడం తరువాత రాష్ట్ర ఆర్థికపరిస్థితి ప్రజలు అర్థం చేసుకోవాలి అంటున్నారు. వారు అడగకుండానే వాగ్దానాలు చేసి ఏమీ ఇవ్వలేం అర్థం చేసుకోండి అంటే ఏమనాలి? అది సరే బావ నాయకులు కిందివారికి ఆదర్శంగా ఉండాలి. నీతివంతమైన పాలన చేస్తూ తమ అనుచరులకు ఆదర్శనీయులుగా ఉండవలసినవారు అనేక రకాల స్కాములలో ఇరుక్కుని జైలుకెళ్లడం చూస్తే అనుచరులు ఏమి నేర్చుకుంటారు? గతంలో నాయకులు ఆంగ్లేయులపై పోరాటం చేసి జైలుకెళితే ప్రస్తుతం నాయకులు అవినీతి కేసుల్లో జైలుకెళుతుంటే అనుచరులు ఏమి నేర్చుకున్నారని అనుకోవాలి. లాలూ ప్రసాద్ మొదలు ఇటీవల దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ జైలుకెళుతుంటే ఇతర దేశాల ప్రజలు ముందు తేలికైపోయాం కదా. నిజమే అన్నిటికంటే ఘోరమైనది కేంద్రం పక్షపాత వైఖరి.
రాష్ట్ర ముఖ్యమంత్రులు తమ పార్టీ కాకపోతే వారిని జైలులో పెట్టించి తరువాత అనుచరులుగా మార్చుకుని వీలైతే స్థానిక పార్టీలను తమ పార్టీలో విలీనం చేసుకునే దురాలోచనను తీవ్రంగా పరిగణించాలి. దానివలన ముఖ్యమంత్రులు నోరువిప్పి అడగలేక ప్రత్యేక హోదాలాంటివి వదులుకోవడం వలన మన రాష్ట్రం తీవ్రంగా నష్టపోతోంది. మన తన పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు గద్దెదించటానికి వెనుకాడరు. ఇటీవల బీజేపీకి ఊహించనన్ని సీట్లురాకపోవడానికి అదే కారణంగా భావించవచ్చు. అదిసరే అధికారంలోకి రాగానే ప్రతిపక్ష నాయకులపై దాడిచేయడం సంగతిచూసి ప్రజలు విస్తుపోతున్నారు. ఒకరిని మించి మరొకరు మంచి పాలన ఇవ్వడంలో పోటీ పడకుండా ప్రతిపక్షాలపై దాడిచేయడంలో మోదీ పోటీపడటం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీలు కలిసి కేంద్రంపై పోరాడాలి. కాని అలాకాకుండా అధికారంలో ఉన్న పార్టీ అసమర్థత ఎత్తిచూపడం కేంద్రానికి తలవంచి నిధులు తేలేకపోయారని ఎద్దేవా చేయడం మన రాష్ట్రానికి జరిగే మంచి ఏముంటుంది? అధికారంలో ఉండి సాధించలేకపోయారనడం కంటే అందరూ కలిసి కేంద్రం పక్షపాత వైఖరిని ఖండిరచవలసిన అవసరం ఉంది. ఎంత కూటమి అధికారంలో ఉన్నా వారిలో తప్పులు ఎత్తిచూపి వారిని గద్దె దించి తామెక్కడం ప్రధానంగా చేయడం మంచిదికాదు. రాష్ట్రం విడిపోయి నష్టపడిన దశలోనైనా అన్ని పార్టీలు ఐక్యతతో రాష్ట్ర ప్రయోజనాలకోసం పోరాడవలసిన అవసరం గుర్తిస్తే మంచిది.