Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

నిగ్గుదేలిన భారత శాస్త్రవేత్తల సత్తా

డా.సోమ మర్ల

భారత్‌ అంతరిక్ష పరిశోధనాసంస్థ (ఇస్రో) ప్రయోగించిన చంద్రయాన్‌3 రాకెట్టు విజయవంతంగా 43రోజుల అనంతరం బుధవారం సాయంత్రం 6.04గంటలకు చంద్రుని ఉపరితలంపై నెమ్మదిగా దిగటం మనందరికి గర్వకారణం. ఆగస్టు 23వ తేదీ చంద్రయాన్‌3 నుండి వెలువడిన విక్రమ్‌ ల్యాండరు చంద్రునిపై దిగిన 4 గంటలకు దానినుండి ‘ప్రజ్ఞాన్‌’ రోబో రోవరు బైటకు వచ్చి చంద్రుని ఉపరితలంపై నడవటం మొదలుపెట్టింది. ప్రజ్ఞాన్‌ చంద్రుడిపై ఒక చంద్ర దినం (అంటే మనభూమిపై 14రోజులకు సమానమైన) సెకండుకు ఒక సెం.మీ వేగంతో సంచరిస్తుంది. ఈ క్రమంలో తన చుట్టూఉన్న వాతావరణం, మట్టి, శిలలు, పర్వతాలు, ఖనిజాలు,నీటి లభ్యత గురించిన సమాచారాన్ని సేకరిస్తుంది. ఇప్పటికే అమెరికా, పూర్వపు సోవియట్‌ యూనియన్‌, చైనా దేశాలు చంద్రుని ఉపరితలంపై రాకెట్టు దింపినా, అతి క్లిష్టమైన దక్షిణ ధృవప్రాంతంలో అడుగుపెట్టడం మన చంద్రయాన్‌3 విశిష్టత. అనేక సాంకేతిక పరమైన ఇబ్బందులతో కూడిన ప్రయోగాన్ని దిగ్విజయంగా సాగించినందు భారత్‌ శాస్త్రసాంకేతిక ప్రతిష్టను ప్రపంచదేశాలన్నీ ప్రశంసించడం మనజాతికి గర్వకారణం. చంద్రుని దక్ష్షిణ ధృవం : అపోలో వ్యోమనౌకనుండి దిగి మొదటిసారిగా చంద్రునిపై (ఆగస్టు, 1969) కాలుపెట్టిన ‘సీ ఆఫ్‌ ట్రాంక్వెలిటీ’ ఉత్తరప్రాంతం కాంతివంతమైన, చదునైనది, పెద్దగా ఇబ్బందిలేని ఉపరితలం. కానీ దక్ష్షిణ ధృవ ప్రాంతం ఎత్తైన పర్వతాలతో, దాదాపు 8 కి.మీల లోతైన గోతులు, లోయలు, రాళ్లు, శిలలతో నిండిన అతి శీతలమైన చీకటి ప్రాంతం. ఇది చంద్రుని వెనుకభాగం కావటంతో సంవత్సరం పొడవునా సూర్యకాంతి పడక, చీకటిగా230 డిగ్రీల చలితో ఉంటుంది. సూర్యుడి నుండి భూమి 5.6 బిలియన్‌ సంవత్సరాల క్రితం వేరుపడగా, ఆ తర్వాత 5.5 బిలియన్‌ సంవత్సరాల తర్వాత చంద్రుడు భూమి నుండి వేరుపడి భూమిచుట్టూ ప్రదక్షిణలు చేస్తూఉంది. అప్పటి నుండి సూర్యకాంతిలేని అతి శీతలప్రాంతం కావటం వలన భూమి ఏర్పడినప్పటి భౌగోళిక, రసాయనిక పరిస్థితులు ఇంకా చెక్కు చెదరకుండా దక్షిణ ధృవంలో ఉన్నాయని నాసా(అమెరికా) శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు. ఈ ప్రాంతంలో సంచరించే ప్రజ్ఞాన్‌ రోబో రోవర్‌లో చుట్టూ ఉన్న మట్టి, శిలలు, వాతావరణాన్ని పరిశీలించి, మట్టినమూనాలను, శిలలను రసాయన పరీక్షలుచేసే స్పెక్టోమీటర్లు, లేజరు కిరణయంత్రాలు, ఛాయాచిత్రాలు తీసే కెమెరాలు బిగించారు. సేకరించిన విలువైన సమాచారాన్ని ఇప్పటికే చంద్రుని చుట్టూ కక్ష్యలో పరిభ్రమిస్తున్న చంద్రయాన్‌2 (2019లో ప్రయోగించడమైంది)కి పంపిస్తుంది. చంద్రయాన్‌2 ఈ సమాచారాన్ని భూమిపై మన ఇస్రో లేబొరేటరీలకు పరిశోధనకై పంపిస్తుంది. ప్రజ్ఞాన్‌రోవర్‌ కేవలం 14 భూ దినాలు సంచరిస్తుంది. అది సేకరించవలసిన సమాచారంఖనిజసంపద, నీరులభ్యత, వాతావరణం తదితరులు. నీటి లభ్యత : 2008వ సంవత్సరంలో ప్రయోగించిన చంద్రయాన్‌2 రాకెట్టు, చంద్రునిచుట్టూ కక్ష్యలో చక్కర్లు కొడుతూ చంద్రుని గురించి విలువైన సైన్సు సమాచారం పంపింది. అందులోముఖ్యమైనది ‘చంద్రునిపై నీరు లభించగల అవకాశాలున్నాయని. ఈ విషయాన్ని ఆ తర్వాత ప్రయోగించిన ఉపగ్రహం 92009) సైతం నిర్థారించింది. అలాగే 2018లో మనం ప్రయోగించిన చంద్రయాన్‌2 నీరు, ఐస్‌, హైడ్రాక్సిన్‌ మాలిక్యూల రూపంలో ఉన్నదని కనుగొంది (చిత్రం 1). నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్‌, కార్లసన్‌ (అపోలో) భూమికి తెచ్చిన మట్టి నమూనాలను తిరిగి ఇటీవల పరిక్షించగా నీటి లభ్యత ఆనవాళ్లు లభించాయి. మనిషి చంద్రయానం చెయ్యాలన్నా, అక్కడ అవాసాలు ఏర్పరచు కోవాలన్నా నీటి లభ్యత అత్యావశ్యకం. లక్షల లీటర్లనీరు భూమి నుండి చంద్రుడికి తీసుకువెళ్లడం అసంభవం. నీరు లభిస్తే, మానవయానానికి, నివాసాలకే కాక, దాని నుండి విడగొట్టే హైడ్రోజన్‌ సైతం రాకెట్‌ ఇంధనంగా తిరుగు ప్రయాణానికి ఉపయోగపడుతుంది. ఖనిజసంపద: చంద్రునిపై, ముఖ్యంగా దక్షిణ ధృవప్రాంతంలో నికెల్‌, లిథియం, బంగారం, ప్లాటినమ్‌, మాంగనీసు తదితర విలువైన ఖనిజాలు పుష్కలంగా లభించే అవకాశాలున్నట్లు నాసా, భారత్‌, సోవియట్‌ ఉపగ్రహాలు సేకరించిన సమాచారం వెల్లడిస్తున్నది. ఎలక్ట్రానిక్‌, కంప్యూటరు మైక్రోచిప్స్‌లో వినియోగించే ఖనిజాల లభ్యత భూమిపై అంతంత మాత్రమే. ఈ ఖనిజాల అన్వేషణ జరిగితే, మనదేశ ప్రారిశ్రామికాభివృద్దికి, అభివృద్ధికి తోడ్పడగలదు. కాగా చంద్రుడిపై అడుగుపెట్టిన దేశాలను, సేకరించిన ఖనిజసంపదపై, వలసలు ఏర్పరచుకోటానికి శాశ్వత యాజమాన్య హక్కులుంటాయా అన్నది శేష ప్రశ్న. కాగా ఐక్యరాజ్యసమితి (ఐరాస) 1966లోనే చంద్రమండలం, దాని సంపద ఏ ఒక్క దేశానికి కాక అన్ని దేశాలకు చెందుతుందని ప్రకటించింది. చంద్రయాన్‌ 1,2,3 రాకెట్ల ప్రయోగానికి నాందిపలికిన పరిశోధనలకు కేంద్రం ఇస్రో, భారత్‌ అంతరిక్ష పరిశోధనాసంస్థ (మొదట్లో దీని పేరు IచీజూూూAR)ను మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ 1962లో స్థాపించారు. ఆ తర్వాత 1969లో విక్రమ్‌ సారాభాయి, సతీష్‌థావన్‌ వంటి శాస్త్రజ్ఞులు దీనిని అభివృద్ధిచేసి ఇస్రోగా నామకరణం చేశారు. అర్యభట్ట, ఇన్‌సాట్‌ తదితర అనేక ఉపగ్రహాలు ప్రయోగించే మనం నిత్యం వినియోగించే టీవీ, టెలిఫోన్‌ అంతర్జాత స్పెక్ట్రమ్‌, వాతావరణ, రిమోట్‌ సెన్సింగ్‌, వ్యవసాయ తదితర సమాచార సేకరణకు ఉపయోగించేవారు. కాగా 1990వ దశకం నుండి గ్రహాంతర వ్యోమనౌకల అభివృద్ధిని, సాంకేతికతను ప్రారంభించారు. 90వ దశకంలో రాకెట్లలో వినియోగించే ద్రవశీతల ఇంధనాన్ని (క్రియోజెనిక్‌ ఫ్యూయల్‌)ని సరఫరాను నిరాకరించి భారత్‌ అంతరిక్ష పరిశోధనలను అడ్డుకోవాలని ప్రయత్నించినా మన శాస్త్రజ్ఞుల కృషి ఫలితంగా నేడు చంద్రయాన్‌3 రాకెట్‌ ప్రొపల్షన్‌లో, గమనంలో వినియోగించే ఈ ఇంధనాన్ని మనశాస్త్రజ్ఞులే తయారుచేయడం గర్వకారణం. చంద్రయాన్‌ రాకెట్‌ ప్రయోగంలోని వివిధ దశలైన రాకెట్‌ ప్రొపల్షన్‌, చంద్రుని కక్ష్యలోకి ప్రవేశపెట్టడం, రాకెట్‌ నుండి విక్రమ్‌ లాండర్‌ను (ప్రజ్ఞాన్‌ రోబోను కల్గి ఉన్నా) విడగొట్టి, లాండరును సురక్షితంగా చంద్రునిపై దింపటం, ప్రజ్ఞాన్‌ చలనం, సమాచారసేకరణ, భూమి నుండి పంపే సూచనలకు అనుగుణంగా పనిచెయ్యటం, భూమికి తిరిగి సమాచారాన్ని పంపటం సాంకేతికలతో కూడినది, క్లిష్టమైనది. దీనిలో ఉపయోగించిన మౌలిక సదుపాయాల రూపకల్పన, కంప్యూటరు అల్గారిథమ్‌లు, సాఫ్ట్‌వేర్‌, రాకెట్టు, లాండరు,రోవర్‌ నిర్మాణం కేవలం స్వశక్తితో మన శాస్త్రజ్ఞులు, ఇంజినీర్లు చేయగలిగారు. వీరిలో ప్రధానపాత్ర వహించిన ప్రాజెక్టు డైరెక్టర్లు సోమనాథ్‌, డిప్యూటీ డైరెక్టరు వేరు ముత్తువేలు, ఉన్ని కృష్ణన్‌ సాయరు, డా.రిటూ కిరండాల్‌, శ్రీమతి కల్పన, శంకరన్‌ ప్రముఖులు. వీరే కాక 56 మంది మహిళా ఇంజినీర్లు, శాస్త్రవేత్తలు ఎంతో తోడ్పడ్డారు. దాదాపు 60 సంవత్సరాల ఇస్రో చారిత్రకత, సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధిచేసి, ప్రత్యక్షంగా చేసి నిరూపించిన వందలమంది శాస్త్రజ్ఞులకృషి ఎంతో ప్రశంసనీయం. వీరికి జేజేలు. కాగా ఇప్పటివరకు పుష్పక విమానాలు, మంత్రోచ్ఛరణతో గ్రహాంతరయానం చేయవచ్చని పుక్కిట పురాణాలు, మూఢ విశ్వాసాలను ప్రచారంచేస్తూ వచ్చిన మతోన్మాదులు చంద్రయాన్‌ ప్రయోగానికి ముందు తిరుపతి వెంకటేశ్వరుని ఆశీస్సులు పొందటం, గత రెండు, మూడు రోజులుగా చంద్రయాన్‌3 విజాయాన్ని కాంక్షిస్తూ హోమాలు, పూజలు గుళ్లలో చేస్తూవచ్చారు. అంటే ఎంతో కృషిచేసి శాస్త్రజ్ఞులు రూపొందించిన రాకెట్‌ ప్రయోగాలపై నమ్మకం, గౌరవం చూపకుండా కేవలం భగవంతుని ఆశీస్సులతో, కృపతో చంద్రయాన్‌3 విజయవంతం కావాలని కోరటం ఆశాస్త్రీయం. ఇది శాస్త్రజ్ఞుల కృషిని, సైన్సుని అవమానపరచటమే. కాగా చంద్రయాన్‌ ప్రయోగాలను టీవీలో, యూట్యూబ్‌లో ఉత్కంఠతో వీక్షించిన పాఠశాల, కాలేజీ విద్యార్థుల జిజ్ఞాస, ఉత్సుకత ప్రశంసనీయం. విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు పెరగటం భవిష్యత్‌లో భారతదేశ శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి శుభసూచకం. ప్రస్తుత గ్రహాంతర యానాలు, పరిశోధనలు, సైన్సు ఆవిష్కరణలు కంపెనీలకు లాభాలు తెచ్చేవిగా కాక ప్రజాసంక్షేమానికి, సామాజికాభివృద్ధికి, ఉపయోగపడగలవని ఆశిద్దాం. ఇంతటి విజయానికి మూలమైన శాస్త్రవేత్తలకు గత నాలుగునెలలుగా ఇవ్వని వేతనాలను తక్షణం చెల్లించాలి. అలాగే శాస్త్రవేత్తలకు పురస్కారాలు ఇవ్వాలి.

ప్రధాన శాస్త్రవేత్త (రిటైర్డ్‌)
ఐసీఏఆర్‌, న్యూదిల్లీ

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img