Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

నూతన విద్యావిధానం ప్రమాదం

డాక్టర్‌ సి ఎన్‌ క్షేత్రపాల్‌ రెడ్డి, 9059837847

విద్యావ్యవస్థలో సమూలమార్పులు రావాలని భారతదేశ సమాజం ఎన్నో ఏళ్ల్లుగా కోరుకుంటోంది. గుమస్తాలను తయారు చేసే విద్యా విధానానికి ముగింపు పలికి శాస్త్రీయ విద్యావిధానం అమలు కావాలని కోరుకుంటోంది. ఈ సందర్భాన్ని అదనుగా తీసుకున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానం పేరుతో అత్యంత లోపభూయిష్టమై విద్యావిధానం అమలుకు పూనుకుంది. దీనికి విద్యావేత్తల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైనా లెక్కచేయకుండా అమలు చేయాలని రాష్ట్రాలపై తీవ్రమైన ఒత్తిడి తెస్తోంది.
గత ఎనిమిదేళ్ల బీజేపీ పాలనను పరిశీలించి ఈ నూతన విద్యా విధానాన్ని గమనిస్తే అందులోని ప్రమాద సంకేతాలు బయట పడతాయి. నూతనత్వం పేరుతో మధ్యయుగాల నాటి విద్య మళ్లీ రాజ్యమేలబోతోందని అర్థమవుతుంది. నేడున్నది ఆధునిక సమాజ మని అందరూ భావిస్తున్నా పాలకుల తీరుతో అన్నిచోట్ల ముూఢత్వం బాగా పెరిగింది. ప్రధాని మొదలుకొని వర్సిటీల ఉపకులపతుల దాకా మూఢత్వంలో కూరుకుపోతున్నారు. 21 శతాబ్దపు నైపుణ్యాలు దేశానికి అందుబాటులోకి రావాల్సి ఉండగా ఇందుకు భిన్నంగా పురాణేతిహాసాలు, భాగవత, భారత, రామాయణ కట్టుకధలను ఆధునిక నైపుణ్యాలకు కొలమానంగా చూపించడం అత్యంత గర్హనీయం. నూతన జాతీయ విద్యావిధానం కోసం పని చేసిన కమిటీకి చైర్మన్‌గా వ్యవహరించిన ఇస్రో మాజీ చైర్మన్‌ కస్తూరి రంగన్‌ చేస్తున్న పనిలో సైన్సు ఉన్నా అదంతా దైవేచ్ఛ అనే భావజాలం ఆయనలో కనిపిస్తుంది. ఈ తత్వమే నూతన జాతీయ విద్యావిధానంలోనూ పొడచూపింది.
నేడు దేశంలోని అన్ని ప్రాంతాల్లోని విద్యార్థులు ఒకే స్థాయిలో ఉన్నారనే భ్రమతో నూతన విద్యావిధానం అమలవుతోంది. దేశ ఔన్నత్యానికి ప్రతీక అయిన భిన్నత్వంలో ఏకత్వం, లౌకికత అంటే పడని పాలకుల కనుసన్నల్లో తయారైన ఈ విద్యావిధానం రానున్న రోజుల్లో భావి భారత విద్యార్థిని మతతత్వంలో మునిగితేలేలా చేస్తుంది. ఇందుకు అనుగుణంగానే చరిత్రను పూర్తిగా వక్రీకరించే పనిలో కేంద్రం ఆధ్వర్యంలోని విద్యాసంస్థలు పని చేస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్న తరుణంలో భగత్‌సింగ్‌ పాఠ్యాంశం స్థానంలో సావర్కర్‌ను పెట్టడం వంటి అనేక ఉదాహరణలున్నాయి.
రాజ్యాంగ విలువలకు భిన్నమైన ఆలోచనే ఏకీకృత భావన. భిన్నత్వంలో ఏకత్వం..ఏకత్వంలో భిన్నత్వం అనే విషయాన్ని పక్కకు నెట్టిన నేటి పాలకులు తమ రాజకీయ అజెండాను విద్యావ్యవస్థలోకి చొప్పించారు. ఇప్పటిదాకా రాష్ట్ర, కేంద్రాల మధ్యన ఉమ్మడి జాబితాలో ఉన్న విద్య ఇకపై కేంద్ర ప్రభుత్వ పెత్తనంలోకి వెళ్లనుండడంతో రాష్ట్రాల హక్కులకు భంగం కలుగనుంది. తమ అవసరాలు, ప్రాధాన్యతలతో నిమిత్తం లేకుండా కేంద్రం రుద్దనున్న విద్య శిరోధార్యం కానుంది. ఇంతకాలం రహస్యంగా హిందుత్వ అజెండాలోని ఏకీకృత భావజాలం విద్యలోకి వచ్చింది. ఇకపై విద్యార్థులు ఏది చదవాలో కూడా పాలకులే చెప్పబోతున్నారు. హిందుత్వ నినాదాలైన ఒకే దేశం…ఒకే జాతి…ఒకే మతం…ఒకే దేవుడు…ఒకే భాష..ఈ వరుసలోకి ఒకే విద్య చేరబోతోంది. అంటే కాషాయీకరణకు మార్గం సుగమం అవుతోంది.
విద్య లక్ష్యం వివేకవంతమైన సమాజనిర్మాణం. ఆర్థిక పరమైన లావాదేవీల వ్యవహారమో, లాభనష్టాలను లెక్కించే వ్యాపారం కారాదు. ఐతే ఇకపై ఇవన్ని చెల్లని మాటలే అవుతాయి. ఇప్పటికే విద్య చాలా వరకు వ్యాపారం అయిపోయింది. ఇకపై ఫక్తు వ్యాపారం కానుంది. మతతత్వ పెట్టుబడిదారి వ్యవస్థ విద్యా వ్యవస్థను ముంచుతోంది. ఆపెట్టుబడే ఇకపై మన దేశ విద్యావిధానాన్ని అమ్మడమూ, కొనడమూ అనే ఇరుసుల మధ్య తిప్పనుంది. ఇటీవలి కాలంలో దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఒక సభలో మాట్లాడుతూ….దేశంలోని కార్పొరేట్లే దేశ ప్రగతి నిర్మాతలు అని పేర్కొనడం ఇందుకోసమే. విద్యారంగంలోకి పెట్టుబడిని ఆహ్వనించడమంటే ప్రభుత్వం విద్యను భారంగా భావించడమే. నూతన విద్యావిధానం అమలైన ప్రతి చోట కేజీ నుంచి పీజీ వరకూ విద్యను కొనకతప్పదు. విద్యను ప్రభుత్వమే భారంగా భావిస్తే లాభాలకోసమే వ్యాపారం చేసే గుత్త పెట్టుబడిదారులు విద్యను తమ బాధ్యతగా ఎలా భావిస్తారనేది మన ముందున్న కీలకమై ప్రశ్న. ఇటువంటి విద్యావ్యవస్థ నుంచి బయటకు వచ్చిన విద్యార్థి సంపాదన తప్ప మరేఇతర వ్యాపకం లేని మానవ యంత్రంగా మారతాడు. దీంతో సమాజం నిండా డబ్బు సంబంధాలే తప్ప మానవ సంబంధాలు కనిపించవు.
మతతత్వ భావనలు పెంచాలని కుల, మత తత్వాలను రెచ్చగొట్టినా ఫలితాలు రాలేదనే నిరాశతో విశ్వవిద్యాలయాలకు నిధుల్లో కోతలు పెడుతోంది. యూజీసీ స్థానంలో నేషనల్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ రెగ్యులేటరీ అధారిటీని ప్రధాని చేతుల్లో పెట్టుకోవాలని చూస్తున్నది. వర్సిటీల్లో పరిశోధనల భవిష్యత్తు అంధకారం అవుతోంది. ప్రధానంగా శాస్త్ర, సాంకేతిక రంగాల్లోని పరిశోధనలు మరింత అప్రతిష్ట పాలవుతాయన్న చర్చ అన్ని వర్సిటీల్లో జరుగు తోంది. భారతీయ సైన్సు కాంగ్రెస్‌ సమావేశాల్లో ప్రధాని మోదీ చేసిన ప్రసంగాలను మననం చేసుకుంటే ఈ విషయం అర్థమవు తుంది. పురాణాల్లోని కట్టుకధలను ఈనాటి సైన్సుకు ముడిపెట్టి ప్రధాని మోదీ మాట్లాడారు. వినాయకుని తల వృత్తాంతాన్ని అత్యాధునిక ప్లాస్టిక్‌ సర్జరీతో పోల్చడం, రామాయణ కధలోని పుష్పక విమానాలే నేటి ఏవియేషన్‌ విధానమని ఢంకా బజాయించిన సంగతి ఇంకా సమాజం మరువలేదు. ఈ పోకడతో భవిష్యత్తులో పరిశోధనలు జరిగితే దేశ విద్యావ్యవస్థ పతనంకాక తప్పదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img