Wednesday, June 7, 2023
Wednesday, June 7, 2023

నేను బతికే ఉన్నాను…

అవును. నేను బతికే ఉన్నాను. మీరూ బతికే ఉన్నారు. కాకపోతే మనం బతికి ఉన్నట్లు సాక్ష్యాలు మనమే చూపించాలి ఈ మాయదారి లోకానికి. అది కూడా ఎవరితోనో ఫోన్‌లో మాట్లాడో, ఎదురుపడో కాదు.. అచ్చంగా మనకు మనమే వీడియోతీసి సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేయించాలి. అలా చేయకపోతే ఈ సోషల్‌ మీడియా మిమ్మల్ని చంపేస్తుంది. మీ ఆధార్‌ కార్డు చింపేస్తుంది. రేషన్‌ కార్డులో మీ పేరు డిలీట్‌ అయిపోతుంది. ఓటర్‌లిస్టులో మీ ఐడీ గల్లంతవుతుంది. అంతేకాదు దూరంగా ఉన్న మీ బంధువులకు కబురు వెళ్లిపోతుంది. ఈ మరణవార్త విని వాళ్లంతా ఆఘమేఘాల మీద శరీరానికి రెక్కలు తొడుక్కుని వాలిపోతారు. అవును, మీరు బతికే ఉన్నారని వారానికో, నెలకో, ఆరు నెలలకో, కనీసం సంవత్సరానికి ఒక సారైనా సెల్ఫీ వీడియోతో ప్రపంచం ముందుకు రావాలి. వివిధ రంగాల్లో ఉన్నవారైతే మరీ ముఖ్యంగా ‘‘నేను బతికే ఉన్నాను’’ అనే వీడియోని తరచుగా అందరికీ పంచాలి. చావు అందరికీ సమానమే అయినా…చావు అందరినీ సమానంగా చూడదు అంటాడు ఓ కవి. మనుషులు అందరికీ సమానమే అయినా… మనుషులందరినీ ఈ సోషల్‌ మీడియా సమానంగా చూడదు.
ఆరోగ్యం బాగుండాలంటే ప్రతి రోజూ జ్యూస్‌ తాగాలి. ఇది పాత మాట. ఈ సోషల్‌ మీడియా తరంలో మాత్రం వ్యూస్‌ తాగాలి. లెక్కకు మిక్కిలిగా లైక్‌లు కొట్టాలి. ఒక్క లైక్‌ కూడా కనిపించలేదా…ఈ రోజు ఏమైంది ఈ సోషల్‌ మీడియాకి. చుట్టూ పొగ కమ్మేసినట్లుగా ఉండాల్సిన సోషల్‌ మీడియాకి ఏమైంది. ఇక ఎవరో ఒకరుకాదు…వందల మంది కామెంట్లు చేయాలి. నువ్వు సూపరేహ అనాలి…అథమ పక్షం నువ్వు పనికిరావు అనైనా కామెటించాలి. లేకపోతే తిండి ఉండదు. నిద్ర పట్టదు. జీవితం ముగిసిపోయినట్లుగా భ్రాంతి కలుగుతుంది.
మీడియా సోషల్‌ అయిన తర్వాత వ్యక్తి ఉనికి ఆ వ్యక్తిది కాకుండా పోయింది. మనుషుల చావు, బతుకులు వారి చేతివేళ్ల సందుల్లోంచి జారిపోయి సోషల్‌మీడియా చేతుల్లోకి వెళ్లిపోతాయి. రెండు రోజుల క్రితం అదే జరిగింది. సంవత్సరం క్రితం కూడా అదే జరిగింది. అంతకు ముందు చాలాసార్లే జరిగింది. వర్తమానంలో ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంటుంది. భవిష్యత్‌లో జరగదనే నమ్మికకూడా లేకుండా పోతుంది. ఓ గొప్ప నటుడ్ని సోషల్‌మీడియా నిర్దయగా చంపేసింది. ఆ నటుడు నేను బతికే ఉన్నాను బాబో అని తన వీడియోతో ప్రపంచం ముందుకు రావాల్సివచ్చింది. గతేడాది ఒకప్పటి హీరో, తర్వాత కమెడియన్‌, నేటి క్యారెక్టర్‌ అరిస్టుకి ఈ సోషల్‌ మీడియా శ్రద్ధాంజలి చెప్పేసింది. ఆ నటుడి కూతురు బెంబేలెత్తిపోయి హడావుడిగా అమెరికా నుంచి వచ్చేసింది. ఈ మధ్యనే ఓ నటి వ్యక్తిగత జీవితాన్ని బజారులోకి తీసుకొచ్చేసింది. ఆమె పాపం… నేను, నా భర్త, పిల్లలు కలిసే ఉన్నామంటూ భోరున విలపించింది. కన్నీళ్లతో ఊరుకోలేదు. తనను మానసికంగా ఇబ్బంది పెట్టిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని కూడా సోషల్‌ మీడియా వైరల్‌ చేసింది.
యూట్యూట్‌ చానల్స్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌ వంటివి విచ్చలవిడిగా పెరిగిపోయిన పాప ఫలితం అందరూ తలో కొంతా అనుభవిస్తున్నారు. ఒకప్పుడు మీరు జర్నలిస్టా అని కాసింత గౌరవంగా, భయంగా అడిగిన వారు ఈ యూట్యూబ్‌ చానెల్స్‌ వచ్చిన తర్వాత ఓ చూడరాని మనిషినో, చూడకూడని వ్యక్తినో, ఇతగాడు కనిపించేడేమిటి భగవంతుడా అనో అనుకుంటున్నారు. ఇది కూడా లోలోపల కాదు…. బహిరంగంగానే తమ అసహ్యన్ని బయట పెట్టేస్తున్నారు. ఎవరి పరువైనా తీసేయడానికో, కుటుంబాన్ని వీధుల పాలు చేయడానికో ఈ సోషల్‌ మీడియాకి ఏమంత కష్టం కాదు. ‘‘వ్యక్తుల బతుకులు వారి వారి సొంతం… పబ్లిక్‌లో నిలబడితే ఏమైనా అంటాం’’ అని శ్రీశ్రీ అన్నారు. దానికి అర్ధం మార్చేసిన ఈ సోషల్‌ మీడియా ‘‘వ్యక్తుల బతుకులు మా సొంతం. పబ్లిక్‌ గానే కాదు మీ ప్రయివేట్‌ బతుకుల గురించి మేమైనా అంటాం’’ అంటూ చెలరేగిపోతున్నారు. ఒక్క స్మార్ట్‌ ఫోన్‌ ఉంటే చాలు, నీకు వీడియో తీయడం వస్తే చాలు, అలా తీసిన వీడియోకి రెండు మాటలు తగిలించి ప్రపంచం మీదకి వదిలేస్తారు. మనం చేసింది మంచా, చెడా, మంచికి చెడు చేస్తుందా… చెడుకు మంచి అవుతుందా… దీని వల్ల ఎవరు లాభపడతారు… ఎవరు నష్టపోతారు… ఎవరు గాయ పడతారు… ఇంకెవ్వరు విలవిల్లాడతారు… మరెవ్వరు వీధిని పడతారు అన్న ఎరుక ఉండదు. తీసామా… పంపించామా… వ్యూస్‌ వచ్చాయా… ఇదొక్కటే సోషల్‌ మీడియా ముందున్న లక్ష్యం. నేను హైదరాబాద్‌లో జర్నలిస్టుగా ఉన్న సమయంలో ఐఏఎస్‌ అధికారి విలేకరుల సమావేశంకాని, మరొక సమావేశం కాని ఏర్పాటు చేస్తే దానికి ఎవరైనా జర్నలిస్టు హాజరు కాకపోతే ఆ మర్నాడు ‘‘మీరు నిన్న రాలేదేం’’ అని అడిగేవారు ఆ జర్నలిస్టుని. ఇప్పుడు అదే ఐఏఎస్‌ అధికారి ఏదైనా కార్యక్రమంలో జర్నలిస్టుని చూస్తే ‘‘వీళ్లెందుకు వచ్చారు. మనం పిలవలేదుగా’’ అని వాళ్ల ముందే అంటున్నారు. ఇదీ సోషల్‌ మీడియా, యూట్యాబ్‌ చానెల్స్‌ తెచ్చిన ఘనత. పెరుగుట విరుగుట కొరకే..ఓ సామెత…పెరిగింది. విపరీతంగా… విస్తృతంగా, విచ్చలవిడిగా… ఇక మిగిలింది విరుగుట మాత్రమే. ఇది కూడా జరుగుతుంది. కాసింత అలస్యం కావచ్చు. అందాకా వేచి చూడాల్సింది.
సెల్‌: 99120 19929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img