Friday, September 22, 2023
Friday, September 22, 2023

న్యాయం కోసం కుస్తీ

దేశానికి తమ క్రీడా నైపుణ్యంతో వన్నె తెచ్చిన మల్లయోధులు తమకు సహజంగా అందాల్సిన న్యాయంకోసం నెలల తరబడి పోరాడాల్సి రావడం జాతికే అవమానకరం. దేశంలో అధికార కేంద్రానికి వ్యతిరేకంగా జరిపే పోరాటం ఎంత కష్టమో తెలియజెప్తున్న ఉదంతం. దేశంలో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు జనాభా ప్రకారంచూస్తే అతి తక్కువ. అందులోనూ మహిళా క్రీడాకారులు మరీ తక్కువ. ప్రభుత్వం, సమాజం వారిని ప్రోత్సహించడం ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. క్రీడల వైపు యువత చూడడం మొదలైంది. ఈ పరిస్థితిలో మహిళా క్రీడాకారుల భద్రతకు పూర్తి భరోసా కల్పించగలిగినప్పుడే ముందు ముందు సత్ఫలితాలుంటాయి. పైగా ఎన్నో అవరోధాల్ని అధిగమించి తమనుతాము రుజువు చేసుకున్న కొందరు క్రీడాకారులు తమకు అన్యాయం జరిగిందని ప్రభుత్వం దృష్టికితెస్తే సత్వరం స్పందించాలి. అమలులో ఉన్న చట్టాలకు అనుగుణంగా చర్యలు చేపట్టాలి. ఏ పౌరుడికి అన్యాయం జరిగినా స్పందించాల్సినతీరు ఇదే అయినా, కనీసం దేశానికి పతకాలు తెచ్చిన వారికైనా ఆ గౌరవం ఇవ్వాలి. అది న్యాయం, చట్టాలు, ప్రభుత్వంపై పౌరుల్లో నమ్మకం పెంచుతుంది. కానీ ఇక్కడ జరిగిందేమిటి? కుస్తీ వీరుల బాగోగులు చూడాల్సిన అధ్యక్షుడు, తన స్థానాన్ని దుర్వినియోగపరుస్తూ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వారు నేరారోపణ చేశారు. ఇది ఆరోపణ.
ఇటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు, ట్రయిల్‌ ఎలా జరగాలో చట్టం స్పష్టంగా చెప్పింది. గతంలో విశాఖ మార్గదర్శకాలు కానీ, జస్టిస్‌ వర్మ నివేదిక గానీ మహిళల రక్షణకు ఎన్నో విలువైన సూచనలు కూడా చేశాయి. అయితే ఈ కేసులో ఉన్న నిందితుడు అధికారపార్టీ పార్లమెంట్‌ సభ్యుడు. కాబట్టి చట్టం చెప్పిన ప్రక్రియలన్నీ నిదానంగా సాగుతున్నాయి. కనీసం ప్రాథమిక సమాచార నివేదిక (ఎఫ్‌ఐఆర్‌) పోలీసు స్టేషన్‌లో నమోదు కావడానికి సుప్రీంకోర్టు చెప్పాల్సి వచ్చింది. అభియోగ పత్రం నెలలు గడుస్తున్నా అయిపులో లేదు. అందుకనే ఆ క్రీడాకారులు, వారికి మద్దతుగా మరికొంతమంది ఢల్లీిలో నిరసనలు చేపట్టారు. వారికి మద్దతుగా, రైతు సంఘాలు, 1983లో ప్రపంచకప్‌ గెలిచిన క్రికెట్‌ టీమ్‌తో పౌరసమాజం ముందుకి వచ్చింది. నేడు ప్రభుత్వం తరపున క్రీడా శాఖామంత్రి వారిని చర్చలకు పిలిచారు. ఇకనైనా వారి ఆవేదనని ప్రభుత్వం గమనంలోకి తీసుకోవాలి. నిందితుడి పవర్‌ని, పార్టీని చూడకుండా, వచ్చిన నేరారోపణ ఆధారంగా చట్టం తనపని తాను చేసేలా చూడాలి. ప్రముఖులైన వారికే న్యాయం అందకపోతే సామాన్య పౌరుల మాటేమిటన్న సందేహం ప్రజలకు రాకూడదు. – డా. డి.వి.జి.శంకర రావు,
మాజీ ఎంపీ సెల్‌: 94408 36931.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img