రా బావ ఏంటి చిరాగ్గా గొనుక్కుంటూ వస్తున్నావు. ఆ ఏముంది రోజూ ఉండే భారతమే. గతంలో ఒక పెద్దాయన వింటే భారతమే వినాలి తింటే గారెలే తినాలి అన్నాడు. కాని నేనైతే వింటే ప్రస్తుత పాలన గురించే వినాలి తింటే విషంతో కూడుకున్న ప్రస్తుత ఆహారమే తినాలి. అసలేం జరిగిందయ్యా.. ఏం జరగాలి రోజూ పత్రికలలో చూస్తున్న భాగోతమే. అది సరే ఈ రోజు ఏం చూశావు. ఏంటి చూసేది. నీకేంటి సహజ విశ్లేషకుడి విజ్ఞానసంపద కలవాడినని ఇంట్లో కూర్చుంటావు. నీ కేమో అన్నీ కనపడవు వార్తా పత్రికలలో వచ్చినవే నీకు తెలుసు. అసలు ఆ పత్రికలు అమ్ముడుపోయి నిజాలు కప్పిపెట్టి అవాస్తవాలు రాస్తారన్న సంగతైనా తెలుసా. అది సరే ఈ రోజు ఏం చూశావ్ అలా తాపీగా అడుగు. బైటకొస్తే చూసేవన్నీ ఘోరాలేె. ప్రస్తుతం సమాజంలో మనసున్న మనిషి ఒక్కడైనా ఉన్నాడా అని. వికలాంగులు, బధిరులు అని చిన్నచూపు చూసే వారేగానీ, వారిని అక్కున చేర్చుకుని వారికి సహాయపడే వాడున్నాడా. నేను నీ దగ్గరికి వచ్చేటప్పుడు ఒక గుడ్డివాడు రోడ్డు పక్కన కూర్చుని అడుక్కుంటున్నాడు. ఒక వ్యక్తి చూడడడానికి మంచి బట్టలు, విలువైన కళ్లజోడు, మంచి బూట్లు వేసుకుని వెడుతూ ఆ గుడ్డివాని దగ్గరాగి అందులో ఒక రూపాయి వేసి ఎవరో పుణ్యాత్ముడు వేసిన వందనోటు తీసుకొని వడివడిగా పోతుంటే పట్టుకున్నా. పదిమంది చేరి ఆయన దర్పం, దర్జా చూసి భలేవాడిని పట్టుకున్నావయ్యా వదిలేయమని నాపై ధ్వజమెత్తారు. ఎంతో మంది దివ్యాంగులు ఎటువంటి ఆదరణకు నోచుకోక బాధపడుతున్నారు.
అటువంటి వారికి సహాయం చేయకపోగా హేళనచేసేవాడిని కళ్లున్న కబోది అంటారు. అసలు సమాజం కుళ్లిపోయింది. మనసున్న మనిషే కరువయ్యారు. నిజమేనయ్యా కోట్లు కొల్లగొడుతూ అధికారంతో వెలిగి పోయేవాళ్లు పెద్దమనుషులుగా చెలామణి అవుతున్నారు. నిజమే బావ అంతెందుకు ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో నేరం చేసిన అదాని విషయంపై చర్చకు అవకాశం ఇవ్వకుండా రాహుల్‌గాంధి దేశాన్ని అప్రతిష్టపాలు చేశాడని బుకాయిస్తున్నారు. అదాని విషయంపై చర్చకు అనుమతిస్తే ప్రధాని మోదీ గుట్టు బైటపడుతుందని భయం. అంతెందుకు న్యాయం కోసం పోరాడే వామపక్షాలు, కొంతమంది ప్రజాస్వామ్యవాదులు రోడ్డునపడి లాఠీ దెబ్బలు తిని జైలుపాలవుతున్నారే తప్ప ఎవరూ పట్టించుకోవడంలేదు. అంతెందుకు ప్రత్యేక హోదా అవసరమని అందరూ గొంతుచించుకున్నారు. చంద్రబాబు లెక్కలు చెప్పనవసరంలేదని ప్యాకేజీకి ఒప్పుకుంటే ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్ కేసులకు జడిసి మెత్తబడ్డాడు. మధ్యలో నష్టపోయింది ప్రజలు. అందరూ కల్సిపోరాడే పరిస్థితి కనబడటంలేదు. అధికార, ప్రతిపక్షాల వైఖరితో ప్రజలు నష్టపోతున్నారు. నాయకులు చేసే తప్పులు ప్రజలకు శాపాలుగా మారుతున్నాయి. నిజమే బావ కుటుంబానికి 15లక్షలు పంచుతానని ఊరించిన మోది ఆమాట మరచి పెద్ద నోట్ల రద్దుతో హీరో అవుదామనుకుంటే అందులోని డొల్లతనం రిజర్వుబ్యాంకు బైటపెట్టడంతో మోదీ నోరు మూతపడిరది. ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంత్రులు, శాసనసభ్యులు అవినీతికూపంలో కూరుకుపోయి సిగ్గువిడచి తమది అవినీతి రహిత ప్రభుత్వంగా చెప్పుకోవడం చూచి ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. మేధావులు నవ్వుకుంటున్నారు. చూడలేక కలం పట్టిన రచయితలను, మేధావులను హత్యచేసినవారిపై చర్యలు తీసుకోకుండా అది అమానుషం అని చిలకపలుకులు పలికే మోదీ అంతరంగం తెలియకకాదు. నిజమే చదువుకున్న చదువు డబ్బుతో కొనుక్కున్న పదవి ఉపయోగించి సామాన్య ప్రజల్ని ప్రలోభాలలో ముంచి మూఢనమ్మకాలతో ఆటాడుకోవడం నాయకులకు పరిపాటిగా మారింది బావ. మద్యనిషేధం విధించకుండా మద్యం తాగించి ఆసుపత్రిలో ఉచిత వైద్యం చేయించడంలోని ఔచిత్యం తెలియనిదికాదు. ప్రతిదీ తాత్కాలిక ఉపశమనమేగాని ప్రతి సమస్యను కూలంకషంగా పరిశీలించి శాశ్వత పరిష్కారంవైపు ఏ ప్రభుత్వం ఆలోచించడంలేదు. విద్య, వైద్యం ప్రతి మనిషికి ఉచితంగా అందించడం గొప్ప విషయం మాత్రమే కాదు, దినితో పాటు ప్రతి మనిషిని మూఢనమ్మకాల నుండి బైటపడే విద్య బోధిస్తే సమాజం మార్పుకు దోహదపడుతుంది. ఆ విషయంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టకపోతే మోసగాళ్ల చేతిలో పేదలు మోసపోతూనే ఉంటారు. వాళ్ల దరిద్రానికి శాశ్వత పరిష్కారం లభించదు.
ఒక పక్క వాతావరణ కాలుష్యంతో పీల్చేగాలిలో దాదాపు 30శాతం విషవాయువులున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇంకో 50ఏళ్లలో వాటిని నియంత్రించకపోతే యుద్ధాలు, బాంబులు, అవసరంలేదు. పీల్చే గాలి వల్లనే మరణం ఖాయం. అసలు మూలాల్లోకి వెళ్లి శాశ్వత పరిష్కారంవైపు ఏ ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. ఈ స్థితిలో ఇంటికే పరిమితమైన రచయితలు, మేధావులు బైటపడి శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వాలకు సూచనలిచ్చి అవసరమైతే రోడ్డెక్కకపోతే ఈ సమాజం సర్వనాశనంకాక తప్పదు. అందుకు కళాకారులను ఉపయోగించుకొని ప్రజల్లో చైతన్యం కలిగించి వీధిపోరాటాలకు సమాయత్తం చేయాలి. అప్పటివరకు న్యాయం జరగదు సరికదా దాని అడ్రసు తెలియదు.
సెల్: 9885569394