ఎదురు చూస్తున్న ఉగాది రానే వచ్చింది. ప్రతి సంవత్సరంలాగా పంచాంగ శ్రవణానికి పంతులుగారిని పిలుద్దామనుకొన్నారు. పాపం అందరిలాగానే ఆయన కూడా కోవిడ్ వాక్సిన్ వేయించుకున్న తర్వాత ఆరోగ్యం వెనుకతట్టు పట్టింది. అనారోగ్య సమస్యలు ఎక్కువయ్యాయి. ఓరోజు గుండె బరువుగా ఉందని, ఇంకొక రోజు ఒళ్లంతా నొప్పులని, ఊపిరితిత్తులకు నిమ్ము వచ్చి శ్వాసకు ఇబ్బందిగా ఉంటుందని ఏవేవో బాధలు చెబుతున్నాడు. ఊరందరికి జాతకాలు చెప్పి బాగానే కూడేశాడు కాని కార్పొరేట్ ఆసుపత్రులు మొత్తం ఊదేశాయి. తన భవిష్యత్తే తనకు అర్ధం కావడంలేదు, దేశభవిష్యత్తేమి చెపుతాడు. ఆయన శిష్యుడే రామకృష్ణ పంతులు. సరుకు లేకపోయినా బిల్డప్ ఎక్కువ. పంతులే పంచాంగం చదవాలని, ఇంకెవరకు అర్హతలేదనటంతో ఊర్లో ఇంకెవరు లేకపోవటంతో అతన్నే పిలుచుకొచ్చారు మా కాలనీ వాళ్ళు. లేకపోతే నేనయినా గోచీ బిగించి చదివి చెప్పేవాడ్ని. పంచె కట్టుకోవటం చేతకాకపోయినా రామకృష్ణ పంతులు రామరాజు రెడీమేడ్ పంచె కొనుక్కొని, భూతవైద్యుడులా పెద్దబొట్టు పెట్టుకొని పంచాంగం పట్టుకు బయలుదేరి వచ్చి చప్టా అరుగుపై కూర్చొని పెద్దారెడ్డి రావటంతో సభకు నమస్కారం అంటూ పంచాంగ శ్రవణం మొదలుపెట్టారు.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఎన్నికల వత్సరం కావటంవల్ల జనం ప్రభుత్వాల వరాల జల్లులతో తడిసి ముద్దవుతారు. రసాధిపతి, రాజు బుధమహర్షి, రాజు గారు కొంచం మెతకవైఖరి అవలంబించటం వల్ల మంత్రి అన్నీ తానై నిర్వహిస్తారు. మంత్రి రాక్షస గురువు శుక్రాచార్యులు వారు, ఎత్తుగడలన్ని రాక్షస విధానాలు కొనసాగుతాయి. సేనాధిపతి, మేఘాధిపతి మన గురువు గురుమహర్షి ఎంత మంచివారైనా వాతావరణం మాత్రం గరం గరంగానే ఉంటుంది. ప్రకృతి గ్లోబలైజేషన్‌లో భాగంగా పొల్యూషన్ పెరిగిపోవడంతో వాతావరణం ఎవరికి స్వాధీనంకాదు. ఎన్నికలయ్యే వరకు ధరలు పెరగకుండా ప్రయత్నిద్దాం అనుకుంటారు కానీ మార్కెట్ పగ్గాలు వ్యాపార దిగ్గజాల వశంలో ఉండటంవల్ల, మంత్రిగారి జుట్టు వారి చేతిలో ఉండటంవల్ల వీరిని పెద్దగా పట్టించుకోరు. దానికితోడు కొనుగోలుదారులపై ప్రభుత్వ పన్నుల బాదుడు వల్ల సరుకులు అత్యంత అప్రియమై పోతాయి. పెళ్లి రోజున కనిపించని అరుంధతీ నక్షత్రం నిరంతరం కనిపిస్తూనే ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులు, ఉక్రెయిన్`రష్యా యుద్ధం కొనసాగడం వల్ల చమురు ధరలు ఆకాశాన్నంటుతాయి. దానివల్ల మార్కెట్ ఒడిదుడుకులకు లోనవుతూ ఉంది. వేటి ధరలూ స్థిరీకరించటం ఎలాగో అర్ధం కాక ఆర్ధిక నిపుణులు జుట్లు పట్టుకుంటారు.
ముఖ్యంగా ‘ధరా’ఘాతాల సెగ అధికారపార్టీకి తలనొప్పి తెప్పిస్తుంది. ప్రతిపక్షాలు ముప్పేట దాడిచేస్తాయి. సశ్యాధిపతి చంద్రుడు. చంద్రుని సహజసిద్ధమైన చల్లని చూపు రైతులపై ఉన్నప్పటికీ అధిక వర్షపాతం వల్ల పల్లపు పంటలు నాశనమవ్వటమే కాక, దిగుమతి బాగా వచ్చిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతుల ఆక్రందనలు షరా మామూలే. స్కూళ్లలో, కాలేజీలో చదువుకొనే విద్యార్థి, విదార్థినులు అనేక వత్తిళ్లవల్ల డిప్రెషన్‌కు లోనవుతారు.
సాంకేతికతను అడ్డం పెట్టుకొని ఈ నేరగాళ్లు ఇటు ప్రజలకు, అటు పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తారు. ఇదంతా గతమాదిరిగానే కొనసాగుతుంది. ఈ నేరగాళ్లు మీకు తెలియ కుండా ఆధార్‌కి మీరిచ్చిన (వేలిముద్రలు వగైరా) ఆధారాల నడ్డంపెట్టుకొని మీ ఖాతాల్లో సొమ్ము జమచెయ్యగలరు, తీసుకొన గలరు. ప్రజలు బాంకు ఖాతాల్లో నిల్వ ఉంచటం అంత శ్రేయస్కరం కాదు. బాంకులు మీ ప్రమేయం లేకుండా మీ సొమ్ము నిక్కచ్చిగా బాంక్‌లకు శఠగోపం పెట్టేవారికీ లోన్లు ఇవ్వటం, వాడు బాకీలెగగొట్టి విదేశాలకు ఉడాయించే ఫలితాలు గోచరిస్తున్నాయి. డబుల్ ఇంజను రైలు కొంచం ఇరకాటంలో పడుతుంది. కేంద్ర ప్రభుత్వం బుల్డోజర్ డ్రైవింగ్ లైసెన్సులు ఎక్కువగా ఇవ్వటం వల్ల విశ్వగురు కీర్తి మసకబారుతుంది. క్రోనీలకు కట్టబెట్టేసొమ్ము ప్రజలదే అనే విషయం అందరికి తెలిసిపోతుంది. పరిశ్రమలు మూతబెట్టటంవల్ల ఉన్న ఉద్యోగాలు ఊడి రోడ్డున పడతారు. నూతన నిరుద్యోగులు మరింత నిరాశ చెందవలసి ఉంటుంది. ఉద్యోగ నియామకాలు పేపర్ ప్రకటనలకు పరిమితమైపోతాయి. ఏది ఏమైనా అష్ట గ్రహాల గ్రహస్థితి బాగున్నా దేశ, రాష్ట్రాల రాజకీయ పరిస్థితులు పెద్దగా బాగుండదు. ఎన్నికల్లో ఈ సారి బాగా ఖర్చుపెట్టినవారు ఎక్కువ నష్టాల్లో కూరుకుపోతారు. ఓటరునాడి రాజకీయ నాయకులకు, సిద్ధాంత కర్తలకు అంతు చిక్కదు. రాజకీయనాయకులు, వారిపై కోసుపందాలు కాసుకొనే పందెగాళ్ళు ఆచితూచి అడుగేయాలి. ఇంతటితో సెలవు. అందరమూ ఇలా బతికి బాగుంటే శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాదికి కలుద్దాం…
బంగారు వి బి ఆచార్యులు, 9849579569