Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

పత్రికా స్వేచ్ఛకు జయహో!

కూన అజయ్‌బాబు

పెగాసస్‌ వ్యవహారంపై విచారణకు ముగ్గురు సైబర్‌ నిపుణులతో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం రాజ్యాంగ విలువలకు జవసత్వాలు నింపినట్లుగా వుంది. ఈ తీర్పులోని ప్రధానాంశాలను ఒక్కసారి పరికిద్దాం. ‘‘చట్టబద్ధ పాలన జరిగే ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తులపై విచక్షణారహిత గూఢచర్యాన్ని అనుమతించలేం. కొన్ని రాజ్యాంగ నిబంధన లకు లోబడి చట్టబద్ధ ప్రక్రియలకు అనుగుణంగా అనుమతి ఇవ్వవచ్చు. పెగా సస్‌ ఆరోపణలపై విచారణకు కేంద్రమే నిపుణుల కమిటీని నియమించడం నిర్దేశిత న్యాయసూత్రాలకు విరుద్ధం. కోర్టు న్యాయం చేయడమే కాదు.. చేసి నట్లు చూపించాలి. పెగాసస్‌ గూఢచర్యానికి సంబంధించి పిటిషనర్లు చేసిన ఆరోపణలను కేంద్రం నిర్ధిష్టంగా ఖండిరచలేదన్న విషయం గమనార్హం. సర్కారు దాఖలు చేసిన పరిమిత అఫిడవిట్‌లో ఖండన కూడా అస్పష్టంగా వుంది. ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ చాలదు. ఈ పరిస్థితుల్లో గూఢచర్యం ఆరో పణలకు ప్రాథమిక ఆధారాలున్నాయన్న పిటిషనర్ల వాదనను అంగీకరించడం తప్ప మాకు మరో మార్గం లేదు. అందుకే సైబర్‌ నిపుణులతో స్వతంత్ర కమిటీని నియమిస్తున్నాం’’ అని సుప్రీంకోర్టు తన తీర్పులో స్పష్టంగా పేర్కొ నడం గమనార్హం. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛ ముఖ్యమని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్య ఈ తీర్పులోనే విశేషాంశం. ఇజ్రాయిల్‌కు చెందిన మిలటరీ గ్రేడ్‌ స్పైవేర్‌ ద్వారా భారత్‌తో సహా ప్రపంచ దేశాల జర్నలిస్టులు, కార్యకర్తలు, రాజకీయ నేతలపై నిఘా పెట్టినట్లు జులై 18న అంతర్జాతీయ వార్తాసంస్థలు నివేదించిన విషయం తెల్సిందే. నాలుగు రోజులకు ఈ వార్తా నివేదికలపై ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్‌) ద్వారా కోర్టు పర్యవేక్షణలో విచారణను కోరుతూ న్యాయవాది ఎం.ఎల్‌. శర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ తర్వాత ఈ వ్యవహారంలో స్వతంత్ర విచారణను కోరుతూ జర్నలిస్టులు ఎన్‌.రామ్‌, శశి కుమార్‌లు కూడా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారు. మీడియా నివేదికలు ఊహాజనితమని త్రోసిపుచ్చిన కేంద్రం అదే విషయాన్ని తన నామమాత్రపు అఫిడవిట్‌లో పేర్కొనడం ఆశ్చర్యమనిపించుకోలేదు.
దేశంలో హక్కులను కాలరాసే క్రమంలో భాగంగా కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పాత్రికేయులు, ప్రతిపక్ష నేతలు, హక్కుల కార్యకర్తలపై నిఘాపెట్టి దేశ రాజ్యాంగ విశిష్టతకు తూట్లు పొడిచింది. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా తీర్పు కేంద్ర వికృత చేష్ఠలకు చెంపపెట్టు వంటింది. అలాగే ఈ తీర్పుతో పత్రికా స్వేచ్ఛకు పట్టం కట్టింది. జర్నలిస్టులపై నిఘా వేయడమంటే… పత్రికలు పోషించే పర్యవేక్షక పాత్రపై దాడి చేయడమేనని వ్యాఖ్యానించి భావస్వేచ్ఛకు ఊపిరి పోసింది. ఈ నేపథ్యంలో కోర్టు రెండు పూర్వ కేసులను పరిగణనలోకి తీసుకోవడం హర్షదాయకమైన విషయం. 1985 నాటి ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసులో సుప్రీంకోర్టు పత్రికా స్వేచ్ఛకు సంబంధించి పేర్కొన్న అంశాలను తీర్పులో ప్రస్తావించింది. స్వేచ్ఛాయుత రాజ్యాంగాలు ఉన్న అన్ని దేశాల్లోనూ పత్రికాస్వేచ్ఛను ఆయా రాజ్యాంగాల్లో పొందుపర్చడం కోసం కఠినమైన, దీర్ఘమైన సంఘర్షణలు జరిగాయని, గణ నీయమైన త్యాగాలు, వేదనల ఫలితంగానే తమ లిఖితపూర్వక రాజ్యాం గాల్లో పత్రికాస్వేచ్ఛను పొందుపరిచిన విషయాన్ని గమనించాలని కోర్టు స్పష్టం చేసింది. 2020 నాటి అనురాధ భాసిన్‌ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు విచారణ సమయంలోనూ ఆధునిక ప్రజాస్వామ్యంలో పత్రికా స్వేచ్ఛ ప్రాముఖ్యత గురించి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం ఉటంకించి గొప్ప పని చేసింది. ఈ రెండో కేసు మోదీ పాలన సమయంలోనే వెలుగులోకి రావడం ఇక్కడ ప్రస్తావనార్హం. ‘‘బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు పత్రికా స్వేచ్ఛను అన్ని వేళలా గౌరవించాలి. పత్రికలపై నిరవధికంగా కత్తిని వేలాడ దీయరాదు’’ అని భాసిన్‌ కేసులో కోర్టు చేసిన వ్యాఖ్యలను జస్టిస్‌ రమణ ఉటం కించారు. 46 పేజీల తీర్పులో నాలుగు పారాగ్రాఫ్‌లు పత్రికాస్వేచ్ఛ గురించే వివరించాయి. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతోనైనా ప్రభు త్వాలు తమ నడవడికను మార్చుకోవాలి. పత్రికా స్వేచ్ఛ ఆవశ్యకతను తెలుసు కోవాల్సిన అవసరం వుంది. భవిష్యత్‌లో భావస్వేచ్ఛకు సంబంధించి ఏ కేసు వెలుగులోకి వచ్చినా తాజా తీర్పును న్యాయస్థానాలు ఉటంకించక మానవు. ప్రజాస్వామ్య మూల స్తంభాల్లో పత్రికా స్వేచ్ఛ ఒకటి. కానీ గడిచిన ఏడు సంవత్సరాల్లో ఈ స్తంభానికి బీటలు వారుతున్నాయి. ఎవరో ఒకరు తమపై నిఘా పెట్టారన్న విషయం తెలిస్తే అది వ్యక్తులు తమ హక్కులను విని యోగించుకునే తీరుపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. ఇక ప్రజాస్వామ్య దేశంలో పర్యవేక్షక పాత్ర పోషిస్తున్న పత్రికలపై దాని భయానక ప్రభావం కచ్చి తంగా ఏదో ఒక రూపంలో ఉండక మానదు. ఫలితంగా కచ్చితమైన, నమ్మక మైన సమాచారాన్ని అందించే సామర్థ్యం పత్రికలకు కొరవడుతుంది. అందుకే ఈ స్వేచ్ఛకు భంగం కలిగే కుట్రకు సర్కార్లు స్వస్థి పలకాలి. పెగాసస్‌ సాఫ్ట్‌ వేర్‌ను ప్రపంచంలోని వివిధ దేశాల ప్రభుత్వాలకు విక్రయించినట్లు ఇజ్రాయిల్‌ ప్రభుత్వాధినేతలు ఇటీవలనే అంగీకరించారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయ మూర్తి ఆర్వీ రవీంద్రన్‌, ఐపీఎస్‌ అలోక్‌ జోషి, సందీప్‌ ఒబెరాయ్‌లతో కూడిన త్రిసభ్య కమిటీ పెగాసస్‌ పీక నులిమి, భారత రాజ్యాంగ స్ఫూర్తికి ప్రాణం పోస్తుందని ఆశిద్దాం!

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img