Wednesday, February 1, 2023
Wednesday, February 1, 2023

పర్యావరణ వినాశనం ` మానవ ఉనికికే ముప్పు

బుడ్డిగ జమిందార్‌

ప్రపంచమంతటా అధిక ఉష్ణోగ్రతలు, ఎక్కువ వర్షపాతం, మంచు కొండలు కరిగిపోవటం, అడవులు కాలిపోవడంతో రోజూ వార్తలకెక్కుతున్నాయి. ఈ వారం అమెరికాలోని హంప్రేస్‌ కౌంటీలో 17 అంగుళాల వర్షపాతం నమోదయింది. వరదల్లో కనీసం 17 మంది చనిపోయారు. ఈ ప్రాంతంలో రికార్డు వర్షపాతం నమోదయింది. టెన్నెస్సేసేలో జరిగిన ఈ ఘటనను ప్రకృతి వైపరీత్యంగా చూడకూడదు. అడవుల్లో మంటలు, హరికేన్స్‌ వంటివి కూడా మానవుని ప్రమేయంతో వాతావరణంలో వచ్చిన మార్పులుగా గుర్తించాలి. వాతావరణ మార్పు గురించి ఐక్యరాజ్య సమితి ‘‘మానవ ప్రభావంతో వాతావరణం, మహా సముద్రాలు, భూమి వేడెక్కాయి. ఈ మార్పును వేడిగాలులతో పాటు భారీ వర్షపాతం, కరవు, ఉష్ణ మండల తుఫానులు వంటి విపరీత పరిణామాలనూ గమనించగలం’’ అన్నది.
ఇటీవలి కాలంలో వచ్చిన వాతావరణ మార్పులతో కొన్ని దేశాల్లో జరిగిన సంఘటనలను ఉదహరించితే, గ్రీసులో 47.1 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో చాలా అడవులు మంటలకు గురయ్యాయి. చాలా ఇళ్లు తగలబడ్డాయి. 482 చదరపు మైళ్ల అడవి కాలిపోగా పరిసర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. అల్జీరియా కొండ ప్రాంతాల్లో 100 చోట్ల అడవుల్లో మంటలు ఏర్పడినవి. 2008 నుండి 2020 వరకూ సంభవించిన మంచు కంటే ఎక్కువగా ఇవి కేవలం ఈ ఒక్క సంవత్సరంలోనే చోటు చేసుకున్నాయి. బొలీవియా దేశంలో 580 చదరపు మైళ్ల అడవులు కాల్పులకు గురయ్యాయి. దక్షిణ అమెరికాలోని స్థానిక ఆదివాసుల ఉనికికి, అనేక రకాల మొక్కలు, జంతుజాతులకు విఘాతాన్ని కల్పించింది. ఈ ప్రపంచంలో ఏర్పడిన కర్భన్‌ను తనలో ఇముడ్చుకొనే చెట్లు కలిగిన అడవులుగా ఇవి పేరుగాంచాయి.
ఈ భూగోళంపై అతిపెద్ద మంటలు ప్రస్తుతం రష్యాలోని సైబీరియాలో ఏర్పడినవి. ఈ సంవత్సరం ప్రారంభం నుండి వందలాది అడవి మంటలతో 62,300 చదరపు మైళ్ల వైశాల్యంలోని అడవుల, జంతువుల సర్వనాశనం జరిగింది. ఈ వేసవిలో 47.8 డిగ్రీల సెంటీగ్రేడ్‌ వేడితో రికార్డు వేసవి ఉష్ణోగ్రతలు నమోదయినవి. మంటలతో ఏర్పడిన పొగమేఘాలు తూర్పు నుంచి పశ్చిమానికి 2000 కిలోమీటర్లు, ఉత్తరం నుంచి దక్షిణానికి 2500 కిలోమీటర్ల పొడవునా వ్యాపించాయి. దట్టమైన ఈ పొగ మేఘాలు మంగోలియా రాజధాని ఉలాన్‌బాటర్‌కు, మొదటిసారిగా ఉత్తర ధృవానికి పాకాయి. టర్కీలో కురిసిన భారీ వర్షాలతో నల్లసముద్రం ప్రాంతంలో కనీసం 82 మంది చనిపోయారు. జులై నెలలోని వరదల తాకిడికి జర్మనీ, బెల్జియం, రొమేనియా, ఇటలీ, ఆస్ట్రియాలో 230 మంది చనిపోయారు. ఈ విధంగానే చైనా, అమెరికా, భారత్‌, పాకిస్థాన్‌, జపాన్‌, అఫ్గానిస్థాన్‌, న్యూజిలాండ్‌లలో కురిసిన వర్ష ప్రభావంతో వేలాదిమంది మరణించగా లక్షలాది ప్రజానీకం నిర్వాసితులైనారు.
మరోవైపు గ్రీన్‌లాండ్‌ వంటి చోట్ల అనేక పర్యాయాలు ఐసు గడ్డలు నీరుగా మారాయి. ఆ తర్వాత విపరీతమైన వర్షపాతం నమోదయింది. ఒక్క రోజులో 8,500 కోట్ల టన్నుల ఐసు కరిగి వరదలుగా ప్రవహించింది. 2019 జులైలో గ్రీన్‌లాండ్‌లో ఏర్పడిన ఉష్ణ తరంగాలతో 53,200 కోట్ల టన్నుల ఐసు కరిగింది. ఈ పరిణామాలతో ప్రపంచ సముద్రాల నీటిమట్టం 1.5 మిల్లీమీటర్లకు పెరిగింది.
ప్రస్తుతం ఏర్పడిన వాతావరణ సంక్షోభాన్ని పరిష్కరించలేని తీరులో పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ ఉంది. ఈ విపత్తులకు పెట్టుబడిదారీ ఆర్థిక వ్యవస్థ దివాళా కోరు విధానాలే ప్రధాన కారణం. ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోనున్నాయని 1982 సంవత్సరంలోనే ప్రముఖ నూనెశుద్ధి కార్పొరేట్‌ సంస్థ ఎక్సాన్‌ అంతర్గత నివేదికలో పొందుపర్చింది. దీనిని బయట ప్రపంచానికి తెలియనీయలేదు. సిఒ2 అధికంగా విడుదల అవుతున్న కారణంగా ప్రపంచ ఉష్ణతాపం 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరుగుతుందని అంచనా వేసింది. ఈ శతాబ్దం మధ్యకు 2060 ప్రాంతాలలో 2 డిగ్రీలు వాతావరణం అదనంగా వేడెక్కుతుందని తెలిపింది. కానీ ట్రంప్‌వంటి వాళ్లు అసలు భూతాపమే లేదని, ఇది కమ్యూనిస్టులు చేసే ప్రచారమేనని కొట్టిపారేసారు. సముద్ర నీటిమట్టాలు పెరిగి అనేక దీవులు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. కరవులు, తుఫానులు సంభవిస్తున్నాయి. అనేక జాతుల వృక్షాలు, పక్షులు, సముద్ర సంపద నాశనమవుతోంది.
2017 కార్బన్‌ మేజర్స్‌ నివేదిక ప్రకారం, ప్రపంచ గ్రీన్‌ గ్యాస్‌ వ్యర్థాల్లో 90 శాతం కేవలం 100 కార్పొరేట్‌ పెద్ద కంపెనీల వలనే కలుషితమవుతుందని, వ్యర్థాల్ని వీరే ఉత్పత్తి చేస్తున్నారని తెలిపింది. పారిశ్రామిక విప్లవం తర్వాత 2100 నాటికి ప్రపంచ ఉష్ణోగ్రతలు 4 డిగ్రీల సెంటీగ్రేడ్‌ పెరిగే అవకాశముంది. ఆ దిశగా అడవులు నరికేస్తూ పర్యవసానాలను మనం చూస్తున్నాము. ఉష్ణోగ్రతల పెరుగుదలతో ఆహార గొలుసుల భద్రతకు ముప్పు ఏర్పడి అతివృష్టి, అనావృష్టిలతో ఆకలి దిశగా వెళ్లే ప్రమాదముంది. జీవవైవిధ్యానికీ అంతరాయం ఏర్పడుతుండడంతో కొవిడ్‌ వంటి మహమ్మారులతో లక్షలాది ప్రజానీకం చనిపోతున్నారు. అయినా దశాబ్దాల నుంచి అడవులను నరకటం, ఖనిజ సంపద అన్వేషణ పేరుతో చెట్లు, నదులు నాశనం చేయటం మనం చూస్తూనే ఉన్నాం. ఎక్విన్‌, బిపి వంటి కంపెనీలు ముడి చమురు, గ్యాసు కోసం జరిపే తవ్వకాలు, లక్షలాది హెక్టార్ల విస్తీర్ణంలో బొగ్గు కోసం ఆస్ట్రేలియా ప్రకృతిని కార్పొరేట్‌ కంపెనీలు నాశనం చేస్తున్నాయి. అధిక లాభాల వేటలో వినిమయ సంస్కృతిని పెంచుతోంది కార్పొరేట్‌ ప్రపంచం. పర్యావరణ వినాశనాన్ని రాజకీయంగా మాత్రమే ఎదుర్కోవాలి. ఈ ఉద్యమంలో యువత అగ్రభాగాన ఉండాలి.
(ప్రపంచ సోషలిస్టు వెబ్‌సైట్‌ సౌజన్యంతో)

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img