Thursday, December 8, 2022
Thursday, December 8, 2022

పార్లమెంటు విలువలు కాపాడిన ప్రతిపక్షం

బినయ్‌ విశ్వం

ఫాసిస్టు భావజాలం కలిగిన మోదీ ప్రభుత్వానికి పార్లమెంటు, సభలో జరిగే కార్యకలాపాల పైన ఎలాంటి గౌరవమూ లేదు. ప్రజాస్వామ్య సంస్థలను ప్రత్యేకించి పార్లమెంటు గౌరవాన్ని దిగజార్చడమే ప్రభుత్వ లక్ష్యం. పార్లమెంటులో చర్చల విషయమై చాలా మాట్లాడతారు. అయితే చర్చలు జరగకుండా అంతర్గతంగా వ్యూహం పన్నుతారు. పార్లమెంటుకు, చర్చలకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వరు. బీజేపీ, ఆ పార్టీ ప్రభుత్వ ఉద్దేశాలు ఇటీవల ముగిసిన పార్లమెంటు సమావేశాల్లో స్పష్టంగా బయటపడ్డాయి. సమావేశాలు జులై 19 నుంచి ఆగస్టు 13 వరకు జరగాలి. 17 రోజులు సభలు గందరగోళంగానే సాగాయి. ఆ తర్వాత పార్లమెంటును నిరవధికంగా వాయిదా వేశారు. రాజ్యసభలో 19, లోక్‌సభలో 13 బిల్లులను చర్చలు లేకుండానే ఆమోదించారు. ఈ బిల్లులలో అనేకం సామాజిక` ఆర్థిక పరిస్థితులపైన ప్రభావం చూపుతాయి. సగటున 85 నిమిషాలకు ఒక బిల్లును ఆమోదించారు. మరింత ఆశ్చర్య పరిచే అంశం ఏమంటే 14 బిల్లులను పదినిమిషాల్లోపే ఆమోదించారు. చట్టం రూపొందడానికి అవసరమైన నియమ నిబంధనలను కూడా మరిచిపోయారు. చర్చలు జరిగితే రహస్య అజెండా బట్టబయలు అవుతుందని ప్రభుత్వం ఆందోళన చెందుతుంది.
ప్రతిపక్షం చెప్పేది వినాలి. చట్టం రూపొందడానికి ముందు ప్రజల తరపున మాట్లాడే హక్కు ప్రతిపక్షానికి ఉంటుంది. అర్థవంతమైన చర్చలు జరగాలంటే ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వాలి. పార్లమెంటు కార్యకలాపాలు ఇలా జరగడానికి మోదీ ప్రభుత్వం ఇష్టపడదు. పార్లమెంటు సరైన నిర్ణయాలు చేయకపోవటానికి ప్రభుత్వం అనుసరించే ప్రజాస్వామ్య విదుద్ధ వైఖరే కారణం. సభలు ప్రారంభం కావడానికి ముందు ఆయా పార్టీల నాయకులతో ప్రధాని సమావేశమై చాలా తక్కువసేపు మాట్లాడతారు. ఏ అంశాన్నైనా సభలో ప్రతిపక్షం లేవనెత్తడానికి ప్రభుత్వం అనుమతిస్తుందని తగిన జవాబు చెబుతుందని ప్రధాని చెబుతారు. అయితే ఆచరణలో ఈ మాటలు పాటించరు. పార్లమెంటు విలువైన సమయాన్ని నష్టపోతే దానికి జీవం ఉండదు. ఇలాంటి పరిస్థితి రావటానికి కారకులెవరు? ప్రభుత్వ మొండి వైఖరే ప్రధాన కారణం. పెగాసస్‌ పదాన్ని కూడా ప్రస్తావించటానికి పార్లమెంటులో ప్రభుత్వం అనుమతించలేదు. సభలో విచారకరమైన సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇజ్రాయిల్‌ మాల్వేర్‌ ద్వారా ప్రభుత్వమే నిఘాను నిర్వహించిందన్న అంశాన్ని లేవనెత్తడానికి అనుమతించలేదు. పెగాసస్‌, రైతుల పోరాటం, పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, బలహీన వర్గాల వారిపై దౌర్జన్యాలు, అత్యాచారాలు తదితర సమస్యలను చర్చించేందుకు ప్రతిపక్షానికి అవకాశమే ఇవ్వలేదు.
ప్రతిపక్షాలు మాట్లాడకుండా చేసేందుకు దురహంకారం, పిరికితనంగా ప్రభుత్వం వ్యవహరించింది. పెగాసస్‌పై ప్రశ్నలు వేయనివ్వలేదు. సభలో అవాంఛనీయ సంఘటనలకు ప్రతిపక్షాలదే బాధ్యత అని ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీలు దుష్ప్రచారం చేశాయి. ప్రజా వ్యతిరేక బిల్లులను నిలువరించేందుకు ప్రతిపక్షం గట్టిగా ప్రయత్నించిందనేది వాస్తవం. రైతుల, కార్మికుల, దళితుల, యువత ఆగ్రహాన్ని సభలో వ్యక్తం చేసేందుకు కూడా అనుమతించలేదు. సాధారణ బీమా, అత్యవసర రక్షణ సేవలు, ట్రిబ్యునల్‌ సంస్కరణలు, సముద్రజలాల్లో చేపల వేట, దివాలా కోడ్‌ మొదలైన వాటి విధ్వంసకర బిల్లులను ప్రతిపక్షం తీవ్రంగా వ్యతిరేకించింది. ఒబీసీ రిజర్వేషన్‌ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించేందుకు ప్రతిపక్షాలు ప్రభుత్వానికి సహకరించాయి. వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రాజకీయ పరిపక్వతను, సభా నిర్వహణ బాధ్యతను ఏమాత్రం ప్రదర్శించలేదు.
ముఖ్యమైన బిల్లులను సెలక్ట్‌ కమిటీకి పంపాలని ప్రతిపక్షం చేసిన విజ్ఞప్తిని సైతం పట్టించుకోలేదు. పార్లమెంటు కార్యకలాపాలను నిశితంగా పరిశీలించేందుకే సెలక్ట్‌ కమిటీలకు బిల్లులను పంపుతారు. ఇలాంటి ప్రక్రియ బీజేపీ ప్రభుత్వానికి అసలు ఇష్టంలేదు. యూపీఎ ప్రభుత్వ కాలంలో 71శాతం బిల్లులను సెలక్ట్‌ కమిటీలకు పంపగా బీజేపీ పాలనలో కేవలం 11శాతం బిల్లులే సెలక్ట్‌ కమిటీల పరిశీలనకు నోచుకున్నాయి. చర్చలు జరపటం పార్లమెంటు విధి, అయితే సభ అనేక సార్లు సమస్యలను విస్మరిస్తుంది, ప్రజాస్వామ్యబద్దంగానే సభా కార్యకలాపాలకు ఆటంకాలు కలుగుతున్నాయని బీజేపీ ప్రతిపక్షంగా ఉన్న కాలంలో ఆ పార్టీ నాయకుడు అరుణ్‌జైట్లీ చెప్పారు. అంటే ఆటంకాలు ప్రజాస్వామ్య వ్యతిరేకమైనివేమీ కావు. అసమ్మతిని వ్యక్తం చేసినా, చర్చలను కోరేందుకు ప్రతిపక్షం న్యాయంగా వ్యవహరిస్తోంటే వారిపై బీజేపీ బురద చల్లేందుకు పూనుకున్నది.
వర్షాకాల సమావేవాల్లో బీజేపీ ప్రభుత్వ దౌర్జన్యకాండ బట్టబయలైంది. ప్రజాస్వామ్యాన్ని సైనిక బారెక్స్‌లో సంకెళ్లు వేసి ఉంచేందుకు పార్లమెంటును నిర్వహించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రతిపక్ష సభ్యులపై దౌర్జన్యం చేసేందుకు నీలం దుస్తులు ధరించిన గుర్తు తెలియని కండబలం కలిగిన వాళ్లను సమీకరించారు. ప్రత్యేకించి వామపక్ష ఎంపీలను లక్ష్యంగా చేసుకొన్నారు. తక్కువ మంది ఉన్నప్పటికీ వామపక్ష సభ్యులు సమర్థంగా తమ పాత్ర నిర్వహిస్తుండగా వారిని అణచివేయటమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రభుత్వం ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ వర్షాకాల సమావేశంలో ప్రతిపక్షాలు ఒకే వేదికపైకి వచ్చి ఐక్యంగా ప్రతిఘటించేందుకు అవకాశం కలిగింది. సభలో సమన్వయంతో పనిచేయటం, పోరాటం చేస్తున్న రైతులకు సంఫీుభావంగా ర్యాలీని ప్రతిపక్షాలు నిర్వహించాయి. ప్రజలకు పద్నాలుగు పార్టీలు కలిసి ఒక నూతన సందేశాన్ని ప్రతిపక్షాలు అందించాయి. రాజ్యాంగం ఔన్నత్యాన్ని కాపాడేందుకు సభ లోపల ప్రతిపక్షాలు పోరాడాయి. ఆర్టికల్‌ 107 ప్రకారం ఉభయ సభలు ఆమోదించకుండా పార్లమెంటు బిల్లును ఆమోదించరాదు. ప్రతిపక్షాల ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు సంఘపరివార్‌, వారి ప్రభుత్వం 24గంటలూ పనిచేస్తున్నాయి. పార్లమెంటు ఏపనీ లేకుండా కూర్చోదు, ప్రభుత్వాన్ని ప్రశంసిస్తూ పాటలు పాడదు. దోపిడీదారులు ప్రజల హక్కులను హరించినప్పుడు, అలాంటివారు పార్లమెంటు కార్యక్రమాలను కూడా దోపిడీదారులు, వారి ప్రభుత్వం అణచివేసేందుకు వెనుకాడబోరని ఫాసిస్టు చరిత్ర చెప్తోంది. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ సూత్రాలను పరిరక్షించేందుకు దేశ ప్రజలంతా ముందుకు రావాలి.
వ్యాస రచయిత సీపీఐ కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img