Friday, December 8, 2023
Friday, December 8, 2023

పాసింజరు రైళ్లు రద్దు – విమానాలు రెట్టింపు !

సత్య
కరోనా కాలం నుంచి కేంద్రం ఉచితంగా ఇస్తున్న బియ్యం పధకాన్ని మరో ఐదు సంవత్సరాల పాటు పొడిగించనున్నట్లు ప్రధాని నరేంద్రమోదీ ఒక ఎన్నికల సభలో ప్రకటించారు. ఇదే సమయంలో నవంబరు మూడవ తేదీన అమెరికా న్యూయార్క్‌టైమ్స్‌ పత్రిక ‘‘ భారత్‌ మాదిరి ఎక్కువగా విమానాలను కొనుగోలు చేస్తున్న దేశం మరొకటి లేదు, ఎందుకో ఇక్కడ చూడండి ’’ అనే శీర్షికతో వార్త ఇచ్చింది. చూశారా జనం పట్ల మోదీకి ఎంత శ్రద్ద ఉందో అని ఉచిత బియ్యం గురించి, విమానాల కొనుగోలులో మనమే టాప్‌ అంటే పదేండ్లలో మోదీ దేశాన్ని ఎంత అభివృద్ధి చేశారో చెప్పటానికి ఇంతకంటే ఏం కావాలి అని తబ్బిబ్బు అవుతున్నారు. రాజుల వద్ద వందిమాగధులు ఉండేవారు. రాజు నోటి నుంచి ఏ మాట వచ్చినప్పటికీ ఆహా ఓహో అని పొగడటమే వారి పని, ఎంతగొప్పగా పొగిడితే వారికి అంత ఎక్కువగా ప్రతిఫలం ముట్టేది. మోదీని పొగిడేవారు వారిని గుర్తుకు తెస్తున్నారు. జనం మీద ఇతర అంశాల్లో లేని ప్రేమ ఉచిత బియ్యం మీద ఎందుకు చూపుతున్నారు? ఐదు రాష్ట్రాల్లో బీజేసీికి పరీక్షగా మారిన అసెంబ్లీ, వచ్చే లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాఖీ బహుమతి పేరుతో ఉజ్వల పథక గ్యాస్‌ సబ్సిడీని 200 నుంచి 400కు పెంచగా, ఇతరులకు రు.200 రాయితీ ఇచ్చారు. పొయ్యి మీదకు ఐదు కిలోల ఉచిత బియ్యం ఇస్తున్నారు. పొయ్యి కిందకు అవసరమైన గ్యాస్‌ ధర మోదీ గద్దె నెక్కినపుడు రు.420 వరకు ఉండగా రు.1,150 కు పెంచారు (రాష్ట్రాలలో ధరల్లో తేడాలు ఉన్నాయి). అంతగా పెంచినపుడు మహిళలు గుర్తుకు రాలేదా? నరేంద్రమోదీ పదేండ్ల ఏలుబడిలో దేశంలో ఆకలి పెరిగింది తప్ప తగ్గలేదు అన్నది పచ్చి నిజం. పెరగకపోతే ఉచిత బియ్యం ఇవ్వాల్సిన అవసరం ఏముంది. కిందపడ్డా పైచేయి నాదే అన్నట్లుగా నరేంద్రమోదీ వైఫల్యాన్ని అంగీకరిస్తారా? అందుకే ఉచిత బియ్యం ఓట్ల కోసం ఎర. మోదీ అధికారానికి వచ్చినపుడు ఆకలి సూచికలో దేశం 120 కిగాను 99వ స్థానంలో ఉంది.2023 నాటికి అది 125 దేశాలకు గాను 2022లో 121కి 107 కాగా 2023లో 125దేశాల్లో 111కు దిగజారింది. ఈ సూచికలను ఏనాడూ కేంద్ర ప్రభుత్వం అంగీకరించలేదు, తప్పుల తడక అని చెప్పటం తప్ప దేశంలో ఆకలి ఎంత ఉందో అసలు లేదో అన్నది కూడా ఇంతవరకు చెప్పలేదు.
భారత్‌కు అదనంగా వెయ్యి విమానాలు కావాల్సి ఉందని 2018 జూన్‌ మొదటివారంలో నాటి పౌరవిమానయాన శాఖ మంత్రి సురేష్‌ప్రభు ప్రకటించారు. మేకిన్‌ ఇండియాలో భాగంగా విదేశీ కంపెనీలు మన దేశంలోనే తయారు చేస్తాయని కూడా చెప్పారు. రానున్న రెండు దశాబ్దాల్లో భారత్‌ తమనుంచి 1,750 కొనుగోలు చేయవచ్చని ఎయిర్‌ బస్‌, 2,100 ఆర్డర్లు తమకు రావచ్చని బోయింగ్‌ కంపెనీ 2017లోనే చెప్పింది. కొత్తగా వెయ్యి విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు సంస్థలు ప్రకటించాయి. దీంతో ఎవరికీ పేచీ లేదు. వీటి వలన సామాన్యులకు ఒరిగేదేమిటి ? డబ్బున్నోళ్లు ఎక్కుతారు.పెరుగుతున్న రైలు ప్రయాణీకులకు అనుగుణంగా రైళ్లను పెంచాలని నెత్తీ నోరు కొట్టుకుంటున్నా పట్టించుకోలేదు. మూడేండ్లనాటి రైల్వే శాఖ అంచనా ప్రకారం కనీసం ఇరవై వేల రైళ్లు అవసరం కాగా పదమూడువేలు మాత్రమే ఉన్నాయి. ఏటా వీటిలో ప్రయాణిస్తున్నవారు 2010 నుంచి 2020 వరకు సగటున ఏడాదికి 811 కోట్ల మంది ఉన్నారు. 2010లో 724 కోట్లు కాగా 2020లో 809 కోట్ల మంది ఉన్నారు. తగినన్ని రైళ్లు లేని కారణంగా ప్రయాణీకులు పెరగటం లేదని ఈ అంకెలు వెల్లడిస్తున్నాయి. నూటనలభై కోట్ల మందికి అవసరమైన రైళ్లలో గడచిన ఆరు సంవత్సరాల్లో ఎనిమిది వందలు మాత్రమే పెంచారు. 2022`23 సంవత్సరంలో దేశంలో విమాన ప్రయాణీకులు 37.7 కోట్లు కాగా వారిలో విదేశీయులు 5.9 కోట్ల మంది ఉన్నారు. వీరి కోసం ఈ ఒక్క ఏడాదే వెయ్యి విమానాలు కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. పోనీ అవి ప్రైవేటు సంస్థలు అనుకుందాం, రైళ్లను పెంచాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా ? అసలు సంగతేమంటే జనాలకు అచ్చేదిన్‌ అని చెప్పిన మోదీ కరోనా పేరుతో రద్దు చేసిన పాసింజరు రైళ్లను, రాయితీలను ఇంతవరకు పునరుద్దరించలేదు. వాటి మీద ఒక నిర్దిష్ట ప్రకటన కూడా లేదు. అనేక పాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చి ప్రయాణీకుల నుంచి జేబులు కొల్లగొడుతున్న సంగతి తెలిసిందే. తక్కువ ఖర్చుతో ప్రయాణించే రైళ్ల బదులు వందే భారత్‌లను ప్రవేశపెట్టేందుకు మాత్రమే శ్రద్ద చూపుతున్నారు. హైస్పీడు, బుల్లెట్‌ రైళ్లు వాటికోసం మార్గాల నిర్మాణం గురించి చూపుతున్న శ్రద్ద సామాన్య జన అవసరాల మీద లేదు. భారత్‌ విమానాల కొనుగోలు గురించి గొప్పగా రాయటం మోదీని మునగ చెట్టు ఎక్కించే యత్నం తప్ప మరొకటి కాదు.
ఒక్కసారిగా వెయ్యి విమానాలను కొనుగోలు చేస్తే అసలు అవి నిండే అవకాశం ఉందా? ప్రస్తుతం దేశంలో ఇరవై ప్రయాణాలు రైల్లో చేస్తే ఒకటి విమానంలో జరుగుతున్నట్లు అంచనా. విమానం కంటే రైల్లో మొదటి తరగతి ఛార్జీలను ఎక్కువగా నిర్ణయించి జనాలను విమానాలవైపు వెళ్లేట్లు చేస్తున్నారు. ఇది ప్రైవేటు సంస్థలకు లబ్ది చేకూర్చే వైఖరి తప్ప మరొకటి కాదు. ఎయిర్‌ ఇండియాను స్వాధీనం చేసుకున్న టాటా గ్రూపు కొత్తగా 470 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించింది. మరో సంస్థ ఇండిగో మరో ఐదువందలు కొనుగోలు చేయనున్నట్లు ప్రకటించింది. తక్కువ ఖర్చుతో ప్రయాణించే విమానాల ద్వారా రద్దీ పెంచుకొని లబ్దిపొందేందుకు అవి చూస్తున్నాయి.ప్రభుత్వం కూడా గత తొమ్మిది సంవత్సరాల్లో 74గా ఉన్న విమానాశ్రయాలను 148కి పెంచింది, 2030 నాటికి 230కి పెంచుతామని చెబుతున్నారు. ఇది తమ ఘనతగా అధికార బీజేపీి ప్రచారం చేసుకుంటున్నది. ఇదే మాదిరి రైలు ప్రయాణీకులకు అవసరమైన ఖర్చు, వేగంగా ప్రయాణించే మార్గాలకు ప్రభుత్వం ఖర్చు పెట్టిందా అంటే లేదు. వందేభారత్‌ రైళ్లు కూడా పూర్తి వేగంతో నడవటంలేదు. రెండు వందల కిలోమీటర్లకు పైగా తిరిగే అన్ని పాసింజరు రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చటంతో దేశంలో ఐదువందలకు పైగా రైళ్లు సామాన్యులకు దూరమయ్యాయి. అనేక గ్రామాల్లో ఉన్న రైల్వే స్టేషన్లలో రైళ్లను ఆగకుండా చేశారు. ఈ కారణంగా కలసి వచ్చిన సమయం గురించి చెప్పకుండా వేగం పెంచి ప్రయాణీకులకు మేలు చేసినట్లు చెప్పారు. ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చినందున గతంతో పోలిస్తే ప్రతి ప్రయాణీకుడి మీద 20 నుంచి 60 రూపాయల వరకు అదనపు భారం పడిరది. దీనికి తోడు ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో సాధారణ స్లీపర్‌ కోచ్‌లను తగ్గించి ఎసి కోచ్‌లను పెంచారు. సీట్లు దొరక్క అనివార్యంగా అదనపు ఛార్జీలు చెల్లించాల్సి వస్తున్నది. వృద్దులు, మహిళలకు ఇస్తున్న ప్రయాణ రాయితీలను రద్దుచేశారు. టిక్కెట్ల రిజర్వేషన్‌, రద్దు చార్జీలను విపరీతంగా పెంచి మరో రూపంలో జేబులును కొల్లగొడుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img