Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

పెరుగుతున్న ధరలు సామాన్యులపై సమ్మెట

సాగర్‌ నీల్‌ సిన్హా

ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులు సోషల్‌ మీడియాలో ధరల పెరుగుదలపై ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఆందోళన చేపడుతున్నారు. కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు ధరల పెరుగుదలపైన ఇంతవరకు నిర్ధిష్ట ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహించలేదు. పెగాసస్‌ నిఘా సమస్య పైనే ఇటీవల ప్రతిపక్షాలు కేంద్రీకరించాయి. పెగాసస్‌ అత్యంత తీవ్రమైన, ముఖ్యమైన సమస్య అనే విషయంలో సందేహం లేదు. ఈ సమస్య పైన ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. ఇప్పుడు ప్రజలు పెరుగుతున్న ధరల నుండి ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఆ దిశలో చర్యలు చేపట్టడం లేదు.

దేశంలో పెట్రోలు, డీజిలు, వంట గ్యాస్‌ సిలిండర్‌ ధరలు అపారంగా పెంచివేసి దీనికి కారణం గత ప్రభుత్వం అని చెప్పటం మోదీ ప్రభుత్వానికే చెల్లింది. పెట్రోలు లీటరు ధర రూ.100కు పైగా, డీజిల్‌ ధర దాదాపు రు.100, గ్యాస్‌ సిలిండరు ధర రూ.900కు పైగా పెరిగింది. ఈ ధరల పెరుగుదల మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి ఎంతమాత్రం ఆందోళన కలిగించడం లేదు. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగటానికి యూపీఏ ప్రభుత్వం దాదాపు రూ.1.34 లక్షల కోట్ల విలువైన ఆయిల్‌ బాండ్లను విడుదల చేయటమే కారణమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ ఆరోపిస్తు న్నారు. ఇది అబద్దమని పెట్రో ఉత్పత్తులపై పెంచిన ఎక్సైజ్‌ సుంకాలు నిరూపిస్తున్నాయి. 202021 ఆర్థిక సంవత్సరంలో పెట్రోలు, డీజిల్‌పై విధించిన పన్నుల మూలంగా రూ.3.35 లక్షల కోట్ల ఆదాయం లభించినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి. 201920 ఆర్థిక సంవత్సరంలో సుంకాల వసూలు రూ.1.78 లక్షల కోట్లు. అంటే మోదీ ప్రభుత్వం విధించిన సుంకాల వల్లే పెట్రో ఉత్పత్తులు అనూహ్యంగా పెరిగిపోయాయి.
అంతర్జాతీయ మార్కెట్‌లో పెరుగుతున్న ముడి చమురు ధరలకు అనుగుణంగా దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలు పెంచవలసి వచ్చిందని మోదీ ప్రభుత్వం చెప్తున్న మాటల్లో సత్యం లేదు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు గణనీయంగా తగ్గినపుడు కూడా తగ్గుదల ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయలేదు. పైగా ఎక్సైజ్‌ సుంకాలను అపారంగా పెంచి తద్వారా వచ్చే డబ్బును ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తున్నది. ఈ ఆదాయాన్ని సంక్షేమ పథకాల అమలుకు, మౌలిక సదుపాయాల కల్పనకు ఖర్చు చేస్తున్నామని చెబుతున్నదే కానీ వివరాలు మాత్రం ఉండటం లేదు. గత ఏడాది కొవిడ్‌`19 మహమ్మారి విజృంభించిన కాలంలో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధర రికార్డు స్థాయిలో పడిపోయింది. అయినప్పటికీ మోదీ ప్రభుత్వం పెట్రో ఉత్పత్తుల ధరలను పెంచుతూనే ఉంది. ఇటీవల ఇండియా టుడే జరిపిన సర్వేలో మోదీని ఆదరిస్తున్న ప్రజలలో తీవ్ర మైన మార్పు వచ్చినట్లు వెల్లడైంది. ఆయన పలుకుబడి గతంలో 66 శాతం ఉండగా, తాజా సర్వేలో అది 24 శాతానికి పడిపోయింది. అలా పడిపోవ టానికి పెట్రో ఉత్పత్తులు, వంట గ్యాస్‌ ధరల పెరుగుదల ఒక కారణం. నిత్యావసర వస్తువుల ధరలు కూడా రోజురోజుకూ పెరుగుతూనే ఉన్నాయి.
పెట్రో ఉత్పత్తులు, గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కొంత కారణమవుతున్నాయి. రాష్ట్రాలలో ఇంధన ధరలపై గణనీయంగా వ్యాట్‌ విధిస్తున్నారు. 2021 జులైలో టైమ్స్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన సర్వేలో మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం లీటరు పెట్రోలు పైన రూ.31.55 వ్యాట్‌ను విధించింది. అన్ని రాష్ట్రాలలో విధించిన పన్ను కంటే ఇక్కడే ఎక్కువగా ఉంది. అలాగే కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌ రాష్ట్రంలో లీటరు డీజిలు పైన అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా రూ.21.82 వ్యాట్‌ను విధించారు. రాజస్థాన్‌లో రూ.29.88, మహరాష్ట్రలో రూ.29.55 వ్యాట్‌ను విధించారు. రాజస్థాన్‌లో ఈ ఏడాది 2 శాతం వ్యాట్‌ను తగ్గించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెట్రోలు, డీజిలు ధరలలో రూపాయి చొప్పున తగ్గించారు. బీజేపీ పాలిత అసోం రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పెట్రోలు, డీజిల్‌పై లీటరుకు 5 రూపాయలు తగ్గించారు. డీఎంకె పాలిత తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల తర్వాత లీటరు పెట్రోలుపై 3 రూపాయలు తగ్గించారు.
మన్మోహన్‌సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వ కాలంలోనూ పెట్రో ఉత్పత్తుల ధరలు పెరిగాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ ఈ ధరల పెరుగుదలను తీవ్రంగా విమర్శించింది. అలాగే వామపక్షాలు ధరల పెరుగుదలకు ప్రభుత్వం చెప్పే కారణాలకు సంబంధం ఉండటం లేదని ఆందోళన చేశాయి. పార్లమెంటులోనూ ప్రభుత్వాన్ని వామపక్షాలు నిల దీశాయి. బీజేపీ, వామపక్షాలు దేశ వ్యాప్తంగా అనేకసార్లు ఆందోళన కార్య క్రమాలు చేపట్టాయి. పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. దిల్లీలోను పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదలపై బీజేపీ, వామపక్షాలు భారీ ఆందోళన కార్యక్రమాలు నిర్వ హించాయి. ఈ ధరల పెరుగుదలను రాజ్యసభలో బీజేపీ నాయకుడు అరుణ్‌ జైట్లీ, లోక్‌సభలో ఆ పార్టీ నాయకురాలు సుష్మా స్వరాజ్‌లు ప్రభుత్వంపై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. సుష్మాస్వరాజ్‌ పెట్రో ఉత్పత్తుల ధరల పెరుగుదల కారణంగా గృహబడ్జెట్‌ పెరిగిందని దానికి సంబంధించిన వివ రాల జాబితాను కూడా పార్లమెంటులో చదివి వినిపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఓటమికి గల కారణాల్లో ధరల పెరుగుదల కూడా ఒకటి.
ప్రస్తుతం ప్రతిపక్ష నాయకులు సోషల్‌ మీడియాలో ధరల పెరుగుదలపై ప్రకటనలు విడుదల చేస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని చోట్ల ఆందోళన చేపడుతున్నారు. కాంగ్రెస్‌తో సహా ఇతర ప్రతిపక్షాలు ధరల పెరుగుదలపైన ఇంతవరకు నిర్ధిష్ట ఆందోళనా కార్యక్రమాన్ని నిర్వహించలేదు. పెగాసస్‌ నిఘా సమస్య పైనే ఇటీవల ప్రతిపక్షాలు కేంద్రీకరించాయి. పెగాసస్‌ అత్యంత తీవ్రమైన, ముఖ్యమైన సమస్య అనే విషయంలో సందేహం లేదు. ఈ సమస్య పైన ప్రభుత్వం మొండిగా వ్యవహరించింది. కాంగ్రెస్‌ కేరళ, పంజాబ్‌, రాజస్థాన్‌, చత్తీస్‌ఘర్‌లలో అంతర్గత గొడవలతో సతమతమవుతోంది. కాంగ్రెస్‌ దేశవ్యాప్తంగా బలహీనపడి రాజకీయాలలో గతంలో ఉన్నంత పలుకుబడి లేకుండా పోయింది. బీజేపీ ప్రభుత్వం రెండుసార్లు ఏర్పడి అనేక తప్పులు చేసినప్పటికీ కాంగ్రెస్‌ బలహీనంగా ఉన్నందున తీవ్ర ఓటమిని చవి చూసింది. ఇప్పుడు ప్రజలు పెరుగుతున్న ధరల నుండి ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నప్పటికీ మోదీ ప్రభుత్వం ఆ దిశలో చర్యలు చేపట్టడం లేదు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img