Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

పోలవరం ఇక బ్యారేజే!

వి. శంకరయ్య

పోలవరం ప్రాజెక్టు భవితవ్యం ప్రమాదంలో పడిరది. ప్రజా ఉద్యమాలతో తప్ప కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచడం కుదరదు. ఈ పూర్వ రంగంలో కమ్యూనిస్టు పార్టీ నేత రామకృష్ణ వామపక్ష పార్టీలతో కలసి ఆందోళన కార్యక్రమాల్లో భాగంగా పాదయాత్ర చేపట్టడం ముదావహం. కేంద్ర మంత్రి షెకావత్‌ ఈ నెల 2 వతేదీ నిర్వహించిన సమీక్ష సమావేశం తర్వాత వెలువడిన అధికారిక వార్తలతో పాటు కేంద్ర ఆర్థిక శాఖ జారీ చేసిన ప్రకటన పరిశీలించితే పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టుగా కాకుండా ఒక బ్యారేజీగా మిగిలి పోనున్నది. తాజాగా కేంద్ర ఆర్థిక శాఖ నిధుల్లో కూడా కోత విధించడంతో అది కూడా సాధ్యం కాదేమో! కేంద్ర మంత్రి జరిపిన సమీక్ష సమావేశంలో ప్రాజెక్టు రెండవ డిపిఆర్‌ పెట్టుబడి అనుమతి ప్రస్తావనకే రాలేదు. రాష్ట్రం వేపు నుండి అభ్యర్థన లేదు. ఉమ్మడి రాష్ట్రంలో 2010-11 నాటి షెడ్యూల్‌ రేట్లతో రూ.16010.45 కోట్లతో ప్లానింగ్‌ కమిషన్‌ ఆమోదించిన తొలి డిపిఆర్‌ తప్ప ఇన్నేళ్లు గడిచినా పోలవరం ప్రాజెక్టు రెండవ డిపిఆర్‌ కేంద్రం ఆమోదించ లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందుగా ఒక ఒప్పందానికి వచ్చి పోలవరం ప్రాజెక్టు తొలి దశ అంటే 41.15 మీటర్లు(135 అడుగులు) వరకు నీరు నింపేందుకు ఎంత వ్యయ మౌతుందనే అంశానికే పరిమితమయ్యారు. 41.15 మీటర్ల వరకే నీళ్లు నిలిపేందుకు అయ్యే వ్యయం 17,144 కోట్ల రూపాయలు అవసరమని సమీక్షా సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం కోరితే కేంద్ర ఆర్థిక శాఖ తోక కోసి 12,911 మాత్రమే ఇచ్చేందుకు సిద్ధ పడిరది. ఇందులోనే మరమ్మతులకు రెండు వేల కోట్లు చూపెట్టింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్నట్లు 2025 జూన్‌ కు కూడా తొలి దశ పనులు 41.15 (135 అడుగులు) మీటర్ల వరకైనా నీళ్లు నింపేందుకు. నష్ట పరిహారం పునరావాసానికి ఈ నిధులు ఏ మాత్రం చాలవు.
45.72 మీటర్లు (150 అడుగులు) పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేస్తే 194. 60 టియంసిల నీళ్లు నిల్వ చేయ గల పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్లకే (135 అడుగులు) పరిమితమైతే వంద టియంసిలలోపు మాత్రమే నీళ్లు నిల్వ చేయ గలరు.ఇదే జరిగితే వరద రోజుల్లో తప్ప మిగిలిన కాలంలో కుడి ఎడమ కాలువల ద్వారా గ్రావెటీతో గోదావరి జలాలను తరలించడం కుదరదు. పోలవరం కుడి కాలువ స్పిల్‌ లెవల్‌ 40.232 మీటర్లయితే ఎడమ కాలువ స్పిల్‌ లెవల్‌ 40.54 మీటర్లు మాత్రమే. ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే కొనే కాబోలు ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పోలవరం నుండి 778 కోట్ల రూపాయల వ్యయంతో గత ఏడాది ఎత్తిపోతల పథకం ప్రకటించి టెండర్‌ కూడా ఖరారు చేశారు. నీటి ఎద్దడి రోజుల్లో గోదావరి జలాలు ఎత్తి పోసుకొనేందుకు పట్టి సీమ పథకం పూర్తయి వున్నా అది తెలుగు దేశం హయాంలో నిర్మించారు. కాబట్టి దాని పొడ గిట్టని ముఖ్యమంత్రి మరో ఎత్తి పోతల పథకం ప్రకటించారు. పోలవరం ప్రాజెక్టు 41.15 మీటర్ల వరకే నీళ్లు నిల్వ చేస్తే ఉత్తరాంధ్రలో దాదాపు 8 లక్షల ఎకరాలకు సాగునీరు 30 లక్షల మందికి తాగునీరు అందివ్వగల ఉత్తరాంధ్ర సుజల స్రవంతి కథ ముగిసినట్లే. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు నుండి కృష్ణా బ్యారేజీకి తరలించవలసిన 80 టియంసిలు వరద రోజుల్లో తప్ప వీలుకాదు. వరద రోజుల్లో కృష్ణాలో ఏలాగూ నీళ్లు వుంటాయి. ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్నాడు ఎత్తిపోతల పథకంతో పాటు గోదావరి జలాలను డెల్టాతో పాటు సాగర్‌ కుడి కాలువకు ఉపయోగించి తద్వారా మిగిలే కృష్ణా జలాలను గొంతెండి పోతున్న రాయలసీమ ప్రాంతానికి ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఆమోదించిన బనకచర్ల క్రాస్‌ అనుసంధానం ద్వారాగాని పోతురెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ నుండి నీళ్లు తరలించడం అటకెక్కినట్లే.
పోలవరం ప్రాజెక్టుకు ఈ దుర్గతి పట్టడానికి పూర్వ రంగం లేక పోలేదు. 2019 ఎన్నికల అనంతరం తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఆలాయ్‌ బలాయ్‌ ఆడుకున్న రోజుల్లో సాక్షాత్తు తెలంగాణ చట్ట సభలో కెసిఆర్‌ పోలవరం ఎత్తు తగ్గించేందుకు జగన్మోహన్‌ రెడ్డి అంగీకరించారని ప్రకటించినపుడు ఎపి ప్రభుత్వ వేపు నుండి ఖండన ఏమాత్రం రాలేదు. పైగా 2020 లోనే పోలవరం సమీక్ష సందర్భంగా పోలవరంలో ఒకే దఫా పూర్తి స్థాయిలో నీళ్లు నిల్వ చేసే అవకాశం లేదని డ్యాం సేఫ్టీ అండ్‌ స్టెబిలిటీ ప్రొటొకోల్‌ సిద్దాంతాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తెర మీదకు తెచ్చారు. అంతిమంగా గత ఏడాది ఎత్తిపోతల పథకం ప్రకటించినపుడే పోలవరం ఒక బ్యారేజీగానే మిగిలి పోనున్నదని సాగునీటి రంగం నిపుణులు భావించారు.
ఎక్కడైనా సరే ఏ సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టినా మొదటి లబ్దిదారులు మునక ప్రాంతాల్లో ఉన్న నిర్వాసితులే. కాని పోలవరం నిర్వాసితులను అందరూ కలిసి గోదావరి వరద పాలు చేశారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు 41.15 మీటర్ల వరకే పరిమిత మైనా ( తాజాగా కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాలతో అసాధ్యం) ఇంకా 2,910 ఎకరాలు భూసేకరణ జరగాలి. అధికారిక గణాంకాల మేరకు ఇప్పటి వరకు 8280 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించినా ఇంకా దాదాపు 8886 కుటుంబాలను తరలించి పునరావాసం కల్పించ వలసి వుంది. ఈ ఏడు గోదావరికి వరద వచ్చేలోపు నిర్వాసితుల తరలింపు పునరావాసం కల్పించడం కుదరదు
ఈ లెక్కలు 41.15 మీటర్ల వరకే. ఇదిలా వుండగా అకస్మాత్తుగా వచ్చే వరదలకు వేలాది కుటుంబాలు రోజుల తరబడి కొండలు గుట్టలపై గడిపే ప్రమాదం గత కొన్నేళ్లుగా చూస్తున్నాము.
పోలవరం ప్రాజెక్టుకు ఇంత దుర్గతి పట్టడానికి కేంద్ర ప్రభుత్వం తొలి ముద్దాయి. రాష్ట్ర విభజన చట్టం ద్వారా చట్ట బద్దత గల ప్రాజెక్టు గురించి కేంద్రాన్ని నిలదీయ లేని రాష్ట్ర ప్రభుత్వం రెండవ ముద్దాయి. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 90 మేరకు పోలవరం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు సబ్‌ సెక్షన్‌ (1)మేరకు పోలవరం ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం పూర్తిగా తన నిధులతో నిర్మించాలి. అటవీ పర్యావరణ తదితర అనుమతులు తీసుకురావడం నష్ట పరిహారం పునరావాసం బాధ్యత కూడా కేంద్ర ప్రభుత్వానిదే. విభజన చట్టంలో ఇందుకు ఎట్టి మినహాయింపులు లేవు. అయినా 2013-14 షెడ్యూల్‌ రేట్లకే పరిమితమౌతామని ఇందులో కూడా సాగునీటి వ్యయం రూ.20,398.81 కోట్లు మాత్రమే తాము భరిస్తామని తాజాగా వెలువడిన కేంద్ర ఆర్థికశాఖ ఆదేశాలు స్పష్టం చేస్తున్నాయి.
2019 ఫిబ్రవరిలో తెలుగు దేశం హయాంలో ఎంతో కసరత్తు చేసిన తర్వాత కేంద్ర జలశక్తి శాఖకు చెందిన సాంకేతిక సలహా మండలి ప్రాజెక్టు నిర్మాణ వ్యయం 2017-18 షెడ్యూల్‌ రేట్ల ప్రకారం రూ.55,548 కోట్ల రూపాయలుగా ఆమోదించింది. వైసిపి ప్రభుత్వం అధికారంలోనికొచ్చిన తర్వాత కాంట్రాక్టరు మార్పు పైగా అవినీతి వెలికి తీతతో సంవత్సరం కాలం గడిచి పోయింది. తిరిగి 2020 మే నెలలో గాని కేంద్ర జల శక్తి శాఖకు చెందిన సవరణ వ్యయం అంచనాల కమిటీ సమావేశం కాలేదు. ఆ కమిటీ కూడా ఒకే మారు రెండు డిపిఆర్‌లు ఆమోదించడం గమనార్హం. 2017లో కేంద్ర మంత్రి వర్గం ఆమోదించిందనే సాకు చూపి 2013-14 షెడ్యూల్‌ రేట్ల ప్రకారం కేవలం సాగునీటి వ్యయం 20 398.81 కోట్లుగా ఒక డిపిఆర్‌ 2017-18 షెడ్యూల్‌ రేట్ల ప్రకారం సాగునీటి వ్యయం 35 950. 16 కోట్లుగా మరో డిపిఆర్‌ ఆమోదించింది. ఫలితంగా కేంద్ర ఆర్థిక శాఖ 2013-14 షెడ్యూల్‌ రేట్లకే పరిమితమౌతోంది. అయితే 2019 లో సాంకేతిక సలహా మండలి రెండవ డిపిఆర్‌ ఆమోదించే సమయంలో 2017 లో కేంద్ర మంత్రి వర్గం తీర్మానాన్ని కేంద్ర జల శక్తి శాఖ ఎందుకు బయటపెట్టలేదు? రాష్ట్ర విభజన చట్టం సెక్షన్‌ 46 (3)మేరకు రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించారు.
అప్పటి ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ 2019 ఫిబ్రవరి 20 వతేదీ విభజన చట్టం రాజ్యసభలో చర్చల సందర్భంగా మాట్లాడుతూ బుందేల్‌ ఖండ్‌ తరహా ప్రత్యేక ప్యాకేజీ ఎపిలో వెనుక బడిన రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలకు అమలు జరుగుతుందని ప్రకటించారు. ఈ పథకానికి మంగళం పాడారు. అయితే గత సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో వ్యాపించి వున్న బుందేల్‌ ఖండ్‌ ప్రాంతానికి తాగు, సాగునీరు అందించేందుకు యమునా నది ఉప నదులైన కెన్‌ – బెత్వా నదుల అనుసంధానం పేర ప్రాజెక్టు చేపట్టింది. దీని నిర్మాణ వ్యయం 2020 – 21 షెడ్యూల్‌ రేట్ల ప్రకారం 44 605 కోట్లు మొత్తం కేంద్రమే భరిస్తోంది. పైగా ఇందుకు చెందిన కేంద్ర బడ్జెట్‌ లో నిధులు కేటాయించడమే కాకుండా తాగునీటి విద్యుత్‌ వ్యయం కూడా కేంద్రం భరించుతోంది. అదే చట్ట బద్దత గల పోలవరం ప్రాజెక్టుకు ఏనాడు కేంద్ర బడ్జెట్‌ లో నిధులు కేటాయించ లేదు. పైగా తాగునీటి వ్యయం మినహాయించింది. .పోలవరం యెడల చిన్న చూపు వ్యక్తం చేస్తూ అదే సమయంలో బుందేల్‌ ఖండ్‌ కన్నా దుర్భరంగా వున్న రాయలసీమలో ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించలేదు. రాష్ట్ర ప్రభుత్వమూ అడగ లేదు.
విశ్రాంత పాత్రికేయులు, 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img