Friday, August 19, 2022
Friday, August 19, 2022

పోలవరం పాపం తలాపిడికెడు

జి.ఓబులేసు

రెండు తెలుగు రాష్ట్రాలకు ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్‌లోని మూడు ప్రాంతాలకు వరపస్రాదిని, జీవనాడి పోలవరం. బహుళార్థసాధక ప్రాజెక్టుగా 2004లో ప్రారంభమైంది. డా.వైఎస్‌.రాజశేఖరరెడ్డి చొరవతో జాతీయ ప్రాజెక్టుగా అంగీకరించారు. 18 ఏళ్లు నిండు తున్నా ప్రాజెక్టు పూర్తికాలేదు. ఎప్పటికి పూర్తవుతుందో చెప్పలేని స్థితి. 2014 ఆంధ్రప్రదేశ్‌ పునర్వ్యవ స్థీకరణ చట్టం ప్రకారం ఈ ప్రాజక్టు నిర్మాణం జరుగుతున్నది.
కాంగ్రెస్‌ (యూపీఏ) హయాంలో 2004 నుంచి 2014 వరకూ ఏమి జరి గింది? ఎంత పని జరిగింది? నిర్వాసితులకు రాజశేఖరరెడ్డి ఇస్తామన్న 1.50 లక్షలు నేటికీ ఎందుకు అందలేదు? పునరావాసం ఏమైంది? భూసేకరణ ఎందు కు జరగలేదు? 2014 నుంచి 2022 వరకు ఎనిమిదేళ్ళ (ఎన్‌డీఏ) బీజేపీ` టీడీపీల సంయుక్త పాలనలో ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ ఎందుకు పరిష్కారం కాలేదు. విలీన మండలాల గిరిజనులకు పక్కా గృహాలు సురక్షిత ప్రాంతాల్లో ఎందుకు నిర్మాణం కాలేదు. 2014లో నాటి రాష్ట్ర ప్రభుత్వం 2018కి ప్రాజె క్టును పూర్తిచేస్తామని చెప్పింది. జాతీయ ప్రాజెక్టు నిర్మాణాన్ని, నిర్వాసితుల పరి హారాన్ని చెల్లించాలి. మరి కేంద్రం తన బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం చేతికి ఎందుకు ఇచ్చింది? రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ బాధ్యతను తన నెత్తిన ఎందుకు ఎత్తుకుంది. ఎత్తుకున్న తర్వాత చెప్పిన సమయానికి లేదా తన కాలపరిమితి ముగిసే నాటికైనా ఎందుకు పూర్తి చేయలేదు. ఈ ఆలస్యంలో అలసత్వంలో కేంద్రప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వానికి బాధ్యత లేదా?
2019లో మళ్లీ ఎన్‌డీఏ రూపంలో బీజేపీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్రంలో జగన్‌మెహన్‌రెడ్డికి అలజడి మొదలైంది. ఎన్నికలకు ముందు జగన్‌ మోహన్‌ రెడ్డి తన తండ్రి ఇస్తామన్న 1.58 లక్షలకు మరో 3.50 లక్షలకు కలిపి 5లక్షలు ఇస్తామని, ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీ క్రింద చంద్రబాబు ప్రభుత్వం 6.85 లక్షలు ట్రైబల్స్‌కు, 6.35 లక్షలు నాన్‌ ట్రైబల్స్‌కు ఇస్తామన్న మొత్తాన్ని 10 లక్షలు చేస్తామని చెప్పారు. మాట తప్పని మడమ తిప్పని వంశం అనే భీకరమైన వాగాడంబర పలుకులు నీటిమూటలైనాయి. రెడ్డి వచ్చే మళ్లీ మొదలుపెట్టు అన్నట్టుగా బీజేపీ ప్రభుత్వం లక్ష ఎకరాల భూమిని ఇచ్చిన రైతులకు సవరించిన అంచనాల ప్రకారం 33,500 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంది. 2016లోనే దాన్ని కేంద్ర జలవనరుల శాఖ అంగీకరించింది. అయినా కేంద్రం అనవస రంగా కొర్రీలు వేస్తూనే ఉంది. బీజేపీ, ఎన్‌డీఏ నుంచి చంద్రబాబు బయటకు రాగానే మోదీ పోలవరం బాబుకు ఎటీయం కాదు అని ఎదురుదాడి చేశారు. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం 2021కి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేస్తుందని, మొత్తం పరిహారాన్ని అందిస్తుందని, పునరావాసం ఏర్పాటు చేస్తుందని ఒకటికి పదిసార్లు అనిల్‌ కుమార్‌ మోదలు కొని విజయ సాయిరెడ్డి జగన్‌రెడ్డిల వరకు చెపుతూ వచ్చారు. ఇప్పుడేమో కేంద్రాన్ని అడగలేని నిలదీయలేని నిస్సహా యతలో పడిపోయి 2024 నాటికి పూర్తి చేస్తామని అంబటితో చెప్పించారు. అవగాహనారాహిత్యం అనవసర ప్రేలాపనలతో మొత్తం ప్రాజెక్టును ఒకేసారి ఎక్కడా చేయలేమని దశలవారీగా విడతల వారీగా చేస్తామని, ప్రతిపాదిత ఎత్తును తగ్గించి ముంపును నివారిస్తామని, పరిహారం అందరికీ ఇవ్వలేని దుస్థితిని కప్పిపెట్టి ఏదోదో మాట్లాడినాడు.
అరయంగ కర్ణుడివై ఆర్గురిచేతిలో అన్నట్లు దాదాపు 400 వరిలంక గ్రామా లు ఏటా కండ్లకు వత్తులు వేసుకుని ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉన్న చోటు వదలలేక వదిలితే బయట పునరావాస కాలనీలు నిర్మితం కాక చచ్చి బతుకుతున్నారు. 7 విలీన మండలాల ప్రజలు ముఖ్యంగా దళితులు, గిరిజనులు రాష్ట్ర భవిష్యత్‌ కొరకు ఎంతో త్యాగంతో లక్ష ఎకరాల భూమిని ధారపోసారు. భూమికి భూమి ఇస్తామన్న మాటలు గాలిలో కలసి పోయాయి. ఆర్‌ఆర్‌ ప్యాకేజీ అమలుకు నోచుకోలేదు. 20 రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాల వల్ల గోదా వరి గతంలో ఎన్నడూ లేనంత (2013 తర్వాత) వరద భీభత్సాన్ని సృష్టించింది. ఆరు జిల్లాలు వరద తాకిడికి గురైనాయి. గ్రామాలకు గ్రామాలు నీట మునిగి జనమంతా విలవిల్లాడిపోయారు. నేటికీ తేరుకోలేదు. ఈ విలయానికి, విపత్తుకు మీరంటే.. మీరే కారణమని నిందారోపణలు మిన్నంటు తున్నాయి. వాస్తవానికి తిలాపాపం తలాపిడికెడు అన్నట్లుగా ఇందులో కాంగ్రెసు అలసత్వం ఉంది, బీజేపీ మోసం, వక్రబుద్ధి, బాబు బడాయి, డాంభికమూ ఉంది, జగన్‌మోహన్‌ రెడ్డి నిస్సహాయత, అసమర్థత ఉంది.
కల్లోల గౌతమి లంక గ్రామాలను, విలీన మండలాలను కకావికలం చేయ డానికి వీరంతా బాధ్యులే. ముంపుపై సర్కార్‌వారి కాకిలెక్కలు, అశాస్త్రీయ అంచ నాలు పూర్తిగా తప్పని నిన్నటి వరదలు స్పష్టం చేశాయి. 41వ కాంటూరు వరకే వరద నీరు వస్తుందని, 42 నుంచి 45 కాంటూరు క్రింద ఉన్న గ్రామాల ప్రజలకు ఇబ్బంది ఉండదని అధికార్లు చెబుతూ వచ్చారు. అయితే 45 కాంటూ రు వరకు వరద ముంచెత్తింది. ఏవైతే సురక్షిత ప్రాంతాలు, మైదాన ప్రాంతాలు అని ప్రభుత్వం భావించి పునరావాస కాలనీలు ఏర్పాటు చేసిందో అవి కూడా జలమయమయ్యాయి. ముంపు ముప్పుని దృష్టిలో పెట్టుకుని 41వ కాంటూరు వరకూ ఉన్నవారిని అక్కడికి తరలించినా ఏ ప్రయోజనం లేకపోయింది. అక్కడ కూడా వారంతా బిక్కుబిక్కుమంటూ చీకటిలో తాగునీరు లేక, తిండిలేక పాములతో సహజీవనం చేయాల్సిన దుర్బర పరిస్థితులను పాలకులే కల్గించడం మన ప్రజాస్వామ్యం, సంక్షేమరాజ్య రెండో పార్శ్వం.
రాష్ట్ర పాలకులేమో గోదావరి, కృష్ణా, పెన్నాల అనుసంధానం ద్వారా మొత్తం రాష్ట్రాన్ని సుభిక్షం చేస్తామని 2 దశాబ్దాలుగా వాగ్దానాల మీద వాగ్దా నాలు చేస్తూనే ఉన్నారు. ఉన్న నికరజలాలను ఉపయోగించడానికి, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు పూర్తి కావడానికే దశాబ్దాలు పడుతుంటే ఇక వరద జలాలను ఒడిసి పట్టేదెపుడు, బీడు భూములకు సాగునీరు, దాహార్తితో అల్లాడే ప్రజలకు తాగునీరు అందించేదెప్పుడు? మొన్న వచ్చిన వరదల వల్ల గోదావరి నది నీరు 2193 టీయంసీలు సముద్రం పాలైంది. మూసీ నీరు 10 వేల ఎకరాలకు పారు దల అవుతుంది. ఈ లెక్కన 2193 టీఎంసీలు అంటే ఎంత భూమి పారుదలకు నోచుకుండా పోతున్నదో కదా?!. ప్రతి ఏడాది 3500 టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి. పోలవరంలో 194 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. సంవ త్సరం పొడవునా 322 టీఎంసీలు వాడుకోవచ్చు. 900 మెగావాట్ల విద్యుత్‌ను తయారు చేయవచ్చు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా 63 టీఎంసీల నీటితో 46 మండలాల్లో 8 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీరు ఇవ్వవచ్చు. విశాఖ దాహార్తి, ఉక్కు పరిశ్రమ నీటి అవసరాలు తీరుతాయి. 53.50 టీఎంసీలతో చింతలపూడి ఎత్తిపోతల ద్వారా కృష్ణా, గోదావరి జిల్లాల్లో 2.8 లక్షల ఎకరాలకు సాగునీరు అందివ్వవచ్చునని 2009లో ప్రాజెక్టుకు పాలనామోదం ఉంది.
అంగట్లో అన్నీ ఉన్నాయి. అల్లుడినోట్లో శని ఉంది అన్నట్టుగా నీళ్లుండి వరదలు ఉప్పొంగి పారుతున్నా వినియోగించుకోలేని దుస్థితి దాపురించింది. ఉత్తరాంధ్ర, కృష్ణ, గోదావరి డెల్టాలే కాకుండా గోదావరి, కృష్ణాలను పెన్నానదితో అనుసంధానిస్తే మరో 320 టీఎంసీల నీటిని నిత్య కరవుపీడిత రాయలసీమకు ఇవ్వవచ్చు. అన్ని విధాలా శ్రేష్టమైన ఉపయుక్తమైన బహుళార్థసాధక ప్రాజెక్టుపై దాగుడుమూతల ఆట జరుగుతున్నది.
వరద బాధితులను పరామర్శించడం, భరోసా కల్పించడం, ఆదుకోవడం శాశ్వత పరిష్కారాలు వెతకడం పక్కకుపోయి ఆపదలో ఉన్న జనంతో ఎన్నికల క్రీడ ప్రారంభించే దుష్ట సంస్కృతికి పాలక, ప్రతిపక్షం వొడిగొట్టడం క్షంతవ్యం కాదు. బాబువల్లే కాఫర్‌డాం కొట్టుకుపోయింది. ప్రత్యేకహోదా తాకట్టుకెళ్ళింది. కమీషన్ల కొరకు జాతీయ ప్రాజెక్టును రాష్ట్రం చేపట్టిందని వైసీపీ ఆరోపిస్తే జగన్‌ నీవు దిగిపో పోలవరం ఎలా పూర్తి కాదో నేను చూస్తాను, మీ ఎంపీలు రాజీనామా చేస్తే పరిహారం దానంతట అదే వస్తుంది, నేను అధికారంలోకి వస్తే పోలవరాన్ని జిల్లాగా చేస్తా అని బాబు మాట్లాడారు. ఈ వాదనలు మతిలేనివాదనలు. అప్రస్తుతమైనవి. ఇక జగన్‌ వైఖరి చూస్తే పూర్తిగా పోలవరాన్ని, నిర్వాసితుల పరిహారాన్ని అటకెక్కించే విధంగా ఉంది. కేంద్రంతో తలపడే స్థోమత ఎటూ లేదు. అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళితే కాగల కార్యం గంధర్వులు తీర్చినట్లు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన మిగిలిన ప్రతిపక్షాలైనా నిలదీస్తాయి కదా.. ఈ పనీ చేతకాదు అంటే ఇక ముఖ్యమంత్రి పీఠం దేనికి?

వ్యాస రచయిత సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

y«dŸ sÁ#ásTTÔá dÓ|Ó× sçwŸ¼ ¿±sÁ«<Š]ôesÁZ dŸuó„T«\T

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img