Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

పౌరసమాజ మౌనం ప్రమాదకరం

భారతదేశం ‘ప్రపంచంలోని అతిపెద్ద ప్రజాస్వామ్యం’ అనే లేబుల్‌ను చాలా కాలంగా ఆస్వాదిస్తోంది. ఈ లేబుల్‌ ఎల్లప్పుడూ బలానికి మూలంగా ఉంది, తరచు అంతర్జాతీయ సంస్థల సభ్యుల నుంచి ప్రశంసలు, గౌరవాన్ని పొందు తుంది. అయితే ఇటీవల పరిణామాలు భారతదేశ ప్రజాస్వామ్య ఖ్యాతిని విదేశాంగ విధాన ఆశయాలను అంతర్జాతీయంగా నీరుగారుస్తున్నారు.
భారతదేశంలో పెరుగుతున్న నిశ్శబ్ద మధ్యతరగతి, నిశ్శబ్ద ప్రతిపక్షం, నిశ్శబ్ద పత్రికలు ప్రమాదకర పరిణామాలు. నిశ్శబ్ద వాతావరణం దళితులు, మైనార్టీలు, సామాన్య ప్రజలకు, పేదలకు మొత్తంగా దేశానికి క్షేమదాయకంకాదు. ద్వేషం, హింస, కష్టాలు, అసమానతలను, బాధలను ప్రోత్సహిస్తుంది. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో వాగ్దానం చేసిన సామాజిక, ఆర్థిక, రాజకీయ ఆకాంక్షలు నెరవేరకపోవడానికి ఇది కారణం కావచ్చు. నియంతృత్వ లక్ష్యాలతో దుష్ట రాజకీయ, మతపరమైన ఎజెండాతో పరిపాలన సాగించి నప్పుడు మౌనం మంచిదికాదు. మతం లేదా మతోన్మాద జాతీయ వాదం పేరుతో హింసకు పాల్పడే వారికి పాలక నాయకత్వ నిశ్శబ్దం పచ్చజెండాగా భావించవలసివస్తోంది. భారతదేశంలో ప్రజాస్వామ్యానికి మౌనం ప్రాణాంతకం. 2021లో రాజకీయ ప్రేరేపిత ప్రాసిక్యూషన్‌లను ఉపయోగించి కార్యకర్తలు, జర్నలిస్టులు ప్రభుత్వంపై ఇతర విమర్శకులపై భారత పాలకులు అణిచివేతను తీవ్రతరం చేశారు, హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ తన వరల్డ్‌ రిపోర్ట్‌ 2022లో స్పష్టంగా పేర్కొంది. కోవిడ్‌ -19 కేసుల పెరుగుదల సమయంలో లక్షలమంది మరణించారు. అవసరమైన వారికి తగిన వైద్యం అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. క్రూరమైన ఉగ్రవాద నిరోధకచట్టం, పన్నుదాడులు, విదేశీ నిధుల నిబంధనలు, ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఆరోపణలతో అసమ్మతిని అణచివేశారు. బీజేపీ నేతృత్వంలోని హిందూ జాతీయవాద ప్రభుత్వంలో మతపరమైన మైనార్టీలపై దాడులుచేసినవారికి శిక్షలు లేవు. బిజెపి మద్దతుదారులు మూకుమ్మడి దాడులకు పాల్పడ్డారు, హింసను ప్రేరేపించారు. అయితే అనేక రాష్ట్రాలు మైనారిటీ వర్గాలను, ముఖ్యంగా క్రైస్తవులు, ముస్లింలు, దళితులు, ఆదివాసీల లక్ష్యంగా చేసుకోవడానికి చట్టాలను దుర్వినియోగం చేశారు. భారత అధికారులు భిన్నాభిప్రాయాలు గలవారిని విడిచిపెట్టలేదు, విమర్శకుల నిశ్శబ్దంకోసం రాష్ట్ర యంత్రాంగాన్ని ఉపయోగిస్తారు అని హ్యూమన్‌రైట్స్‌ వాచ్‌ దక్షిణాసియా డైరెక్టర్‌ మీనాక్షి గంగూలీ అన్నారు. బిజెపి ప్రభుత్వం మైనారిటీలు అసురక్షితంగా భావించే వాతావరణాన్ని సృష్టించింది. హ్యూమన్‌ రైట్స్‌ వాచ్‌ దాదాపు వంద దేశాలు మానవ హక్కుల పద్ధతులు సమీక్షించింది. జైల్లో ఉన్న 84ఏళ్ల గిరిజన హక్కుల కార్యకర్త స్టాన్‌స్వామి మరణించడం హక్కుల కార్యకర్తలపై జరుగుతున్న హింసకు ప్రతీక.
2017లో మహారాష్ట్రలో జరిగిన కులహింస ఘటనకు సంబంధించి రాజకీయ ప్రేరేపిత ఉగ్రవాద ఆరోపణలపై అరెస్టయిన 16 మంది ప్రముఖ మానవహక్కుల రక్షకుల్లో స్వామి కూడా ఉన్నారు. త్రిపురలో పోలీసులు నలుగురు న్యాయవాదులపై అక్టోబరులో మతహింసపై నిజనిర్ధారణ విచారణ జరిపేందుకు తీవ్రవాద కేసులను నమోదు చేశారు. ఇందులో హిందూ గుంపులు మసీదులు, ముస్లింల ఆస్తులపై దాడిచేశారు. 2002 గుజరాత్‌ మతపరమైన అల్లర్ల సమయంలో బిల్కిస్‌బానో అనే ముస్లింమహిళపై సామూహిక అత్యాచారంచేసి, ఆమె కుటుంబ సభ్యులను హత్యచేసిన కేసులో దోషులుగా తేలి యావజ్జీవ కారాగారశిక్షపడిన 11 మందిని గత ఆగస్టులో గుజరాత్‌ ప్రభుత్వం విడుదల చేసింది. 102 సోషల్‌ మీడియా ఖాతాలపై తీవ్రవాద కేసులు నమోదు చేశారు. అలాగే హింసపై నివేదించిన ఇద్దరు జర్నలిస్టులను ‘‘మత హింసను వ్యాప్తి చేస్తున్నారు’’ అనే ఆరోపణలపై అదుపులోకి తీసుకున్నారు. ముస్లిం లపై వివక్షచూపే పౌరసత్వచట్ట సవరణలను నిరసించినవారిపై తీవ్రవాద నిరోధక, దేశద్రోహ చట్టాలు ఇంకా అనేక మంది విద్యార్థులు, కార్యకర్తలపై నమోదుచేశారు. మూడు వ్యవసాయ చట్టాల రద్ద్దుకోరుతూ మహాత్తర ఉద్యమంచేసిన రైతులు, మైనారిటీ సిక్కు కమ్యూనిటీకి చెందిన చాలామంది వేర్పాటువాద ఎజెండాను కలిగి ఉన్నారని బీజేపీ నేతలు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ వివిధ శాంతియుత నిరసనల్లో పాల్గొనే వ్యక్తులను ‘‘పరాన్నజీవులు’’గా అభివర్ణించారు. భారత రాజ్యాంగాన్ని దానిలో పొందుపరచిన స్వేచ్ఛలను హరిస్తున్నారు. పౌరనియమాలు, నిబంధనలను ఉల్లంఘిస్తూ చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవడానికి తహతహలాడుతున్నారు. వీరికి సమాంతర శక్తులు ఎటువంటి కార్యనిర్వాహక లేదా చట్టబద్ధమైన అధికారం లేకుండా, శిక్షలు లేకుండా వీధుల్లో పాలన సాగిస్తున్నాయి, కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీని ఎంపీిగా అనర్హుడ్నిచేసి రాక్షసానందం పొందుతున్నారు. సామాన్య మదుపరుల డబ్బు లక్షల కోట్లు ఆవిరవుతున్నా, దానికి కారణమైన అదానీపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ వేయకుండా కార్పొరేట్‌ ఎగవేతదారులకు రక్షణగా నిలుస్తున్నారు.
భారత ప్రజాస్వామ్యం గత దశాబ్దకాలంగా కల్లోల పరిస్థితులను ఎదుర్కొంటున్నది. ఇది నిస్సందేహంగా దేశంలోని మీడియాపై ప్రభావం చూపింది. మీడియా పరిస్థితి గురించి అర్ధవంతమైన చర్చలు లేకపోవడం గత దశాబ్దకాలంగా కొనసాగు తోంది. మీడియా స్వేచ్ఛపై పౌరసమాజం మౌనం వహించడం భారతదేశంవంటి ప్రజాస్వామ్యంలో మీడియా పోషించగల పాత్ర అర్థరహితమైంది. మీడియా రాజకీయపక్షపాతం లేదా స్వతంత్రంగా పనిచేయలేకపోతోంది. ప్రభుత్వం అనుకూలంగా ప్రధాన మీడియా పనిచేస్తోంది. తీవ్ర రాజకీయ పక్షపాతం, భూస్వామ్య, మతపరమైన శక్తులతో అనుబంధం సమకాలీన కాలంలో భారతదేశంలోని పౌర సమాజ స్వభావాన్ని నిర్వచిస్తుంది. దేశంలో మీడియావంటి ప్రజాస్వామ్య సంస్థలు క్షీణించడంపై పౌరసమాజం ఉదాసీనత ఈ దౌర్భాగ్యానికి ప్రధానకారణంగా భావించవచ్చు.
డా. యం. సురేష్‌బాబు, ప్రజాసైన్స్‌ వేదిక అధ్యక్షులు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img