Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

ప్రజల దీనావస్థకు ఉద్యోగులే కారణమా…?

డా॥ లచ్చయ్య గాండ్ల

‘ప్రభుత్వ వేతనాలు సమర్థనీయమా..?’ అంటూ ఆర్థికవేత్త రaన్‌రaన్‌వాలా ఒక పత్రికలో రాసినవ్యాసంలో ఉద్యోగులపై ఆర్థికదాడి చేశాడు. ఆయన అభిలషించినట్లుగా ప్రజల కొనుగోలు శక్తి పెరిగినప్పుడే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుంది. ఇది కాదనలేని సత్యం. అయితే సమస్యల్లా ప్రజల ఆర్థికస్థితిని ఎలా మెరుగుపర్చా లనేది ఈ దేశంలో ఏడు దశాబ్దాల తర్వాత కూడా తేలని అంశం. ఆర్థిక నిపుణులు పట్టించుకోని వాస్తవం. ప్రస్తుత పాలకులు ఇలాగే కొనసాగినంతకాలం ప్రజల ఆర్థికస్థితి మెరుగుపడటమేమోగాని, వారి స్థితిగతులు మరింతగా దిగజారుతూనే ఉంటాయి.
ఈ లోతుల్లోకి పోకుండా, దీనిలోని చిదంబర రహస్యాన్ని శోధించ కుండా, రaన్‌రaన్‌వాలా కేవలం ఉద్యోగుల జీతభత్యాలే ప్రజల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్నదనే ఓ అసత్య, అబద్ద ప్రచారం చేయడమంటే, ఓ బూర్జువా ఆర్థిక ఆలోచనా విధానమే! కొందరి ఆర్థికవేత్తల్లా ఈయన కూడా పాలకుల నుంచి ఏదో లబ్ధిని ఆశిస్తున్నట్లే! కాదు కూడదంటే ప్రజల సంక్షేమమే పరమావధి అని ఆయన భావిస్తే నెహ్రూ హయాం నుంచి నేటి మోదీ దాకా ప్రధాన మంత్రులుగా ఈ దేశానికి ఏ స్థాయి దార్శనికతతో పని చేశారో చెప్పాల్సింది. నెహ్రూ ఈ దేశాన్ని 18సం॥పాటు ఏలాడు. అంబేద్కర్‌ ప్రవచిత రాజ్యాంగంలో 1960 నాటికే దళితులకు, ఆదివాసు లకు, గిరిజనులకు రిజర్వేషన్లు కల్పించి, యావత్‌ బలహీన వర్గాల్ని జాతీయ స్రవంతిలోకి తీసుకురావాలన్నాడు. ఇది అమలు జరగలేదు. దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా ఆర్థికంగా వెనకబడిన వారికి రిజర్వేషన్‌ సౌకర్యాన్ని మోదీ కల్పించాడు. దీని అంతరాల దొంతరలను ఆర్థికవేత్తలే విశ్లేషించాలి. ఇందిర 20 సూత్రాల ఆర్థిక పథకం నుంచి నేటి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన దాకా దేశ వ్యాపితంగా ఇళ్లు కడుతూనే ఉన్నారు. రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఇదే ఎజెండా. మరి కట్టిన ఇళ్లు ఎవరికి దక్కుతున్నాయి? ఏమౌతున్నాయి? ఇంత నిబద్దత కల్గిన దేశంలో ఎమర్జెన్సీ ఎందుకు పెట్టాల్సి వచ్చింది? రాజీవ్‌ అయితే, గుడిసెల్లో ఉండే బుడ్డ గోచిగాండ్లకు ఆధునిక టెక్నాలజీ అంటూ అదరగొట్టే! ప్రముఖ కార్టూనిస్టు ఆర్‌కె లక్ష్మణ్‌ పివి, మన్మోహన్‌ ఆర్థిక విధానాలపై వేసిన కార్టూన్లే వారి పాలనకు నిదర్శనం! పైగా పివి భూసంస్కరణల పితా మహుడని కెసిఆర్‌ బాకా ఊదాడు. ఇదే నిజమైతే, కెసిఆర్‌ దళితులకు మూడెకరాలరాద్దాంతం ఎందుకు ముందేసుకున్నట్లు?ఎవరి ప్రయోజనాలకు ఈ మాయాజాలం? అలాగే డబుల్‌ బెడ్‌రూం, దళిత బంధూ కథలు కావా? దాదాపుగా దిల్లీ సుల్తానుల నుంచి, రాష్ట్రాల ముఖ్యమంత్రుల దాకా గత ఏడు దశాబ్దాలుగా దళితుల, బలహీన, బడుగు వర్గాల అభ్యున్నతికే పని చేసినప్పుడు తిరిగి అలాంటి పథకాలే పార్టీల ఎజెండాలుగా ఎందుకు మారుతున్నాయి? ఇదే సందర్భంగా ఈ దేశంలోని ఒక శాతం పెట్టుబడిదారులు తమ ఆస్తుల్ని ఎలా పెంచుకుంటున్నారో, వీరికి దన్నుగా నిలుస్తున్న పాలకులెవరో తేల్చాలి. బ్యాంకులను కొల్లగొట్టి, దర్జాగా లండన్‌లో విలాసవంత జీవితాల్ని గడుపుతున్న పెద్ద మనుషులను పట్టి తేలేనివారు, కనీసం వారి నిరర్థక ఆస్తుల్ని జాతీయం చేయలేకపోతున్నారు. పైగా జాతీయం చేసిన బ్యాంకుల్ని, ఇన్సూరెన్స్‌ రంగాల్ని, ప్రభుత్వ రవాణా సాధనాల్ని, విద్య, వైద్యాన్ని ఎవరి ప్రయోజనాల్ని ఆశించి ప్రైవేటీకరిస్తున్నారో విశదపరిస్తే బాగుండేది. వీటి నష్టాలకు, కష్టాలకు ఉద్యోగులు, కార్మికులే కారణమని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌ అన్నట్లు రaన్‌రaన్‌వాలా కూడా అనాల్సిందే మరి! అలాంటప్పుడు, యజమాని స్థాయిలో ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? ఇన్ని రంగాలు వైఫల్యం చెందితే, చట్టసభలు మాత్రం ప్రభుత్వ రంగంలో ఎందుకు? (నిజానికి ఎప్పుడో ప్రైవేటుపరం అయ్యాయి.) ఇక చట్టసభలకు ఎంపికయ్యే నాయకుల జీవిత నగ్న సత్యాల్ని ఎన్నికల సందర్భంగా వారు ఇచ్చే అఫిడవిట్లే అద్దం పడుతున్నాయి. దాదాపు 80 శాతానికి పైగా నేర చరితులేనని ప్రతి ఎన్నికల సందర్భంగా అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫామ్స్‌ (ఎడిఆర్‌) రూపొందిస్తున్న నివేదికలే చక్కని ఉదాహరణ కాదా? ఈ సందర్భంగా విదేశీ బ్యాంకుల్లో దాచుకున్న నల్ల డబ్బంతా ఉద్యోగులదేనని రaన్‌రaన్‌వాలా అననందుకు సంతోషిద్దాం! ఓ హిందీ సిన్మాలో బిగ్‌ ‘బి’ అన్నట్లు , కూడు, గుడ్డా, గూడులను పక్కన పెడదాం! కనీసం తాగే శుభ్రమైన నీటిని ఎందుకివ్వలేదని ప్రశ్న! పైగా లీటర్‌ నీటిని రు.25/ లకు కొనుక్కునే దౌర్భాగ్యం ఎందుకబ్బిందో ఎవరు చెప్పాలి? దీనంతటికి ఉద్యోగులే కారణమవుతారేమో! వియత్నాం, చైనా, పరాగ్వే దేశాల స్థితిగతుల గూర్చి, ఉద్యోగుల జీతభత్యాల గూర్చి ఇలాగే చెప్పారు. అలాగే ఆ దేశాల జీవన ప్రమాణాలు, భారత్‌ స్థాయిని కూడా పోల్చితే బాగుండేది. దాదాపు ఈ దేశాలన్నింట్లో విద్య, వైద్యం ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతూ ప్రజలతో పాటుగా ఉద్యోగులకు జవాబుదారీతనంగా ఉంటున్నది. మన దేశంలో కూడా ఇలాంటి పరిస్థితులే ఉంటే, రaన్‌రaన్‌వాలా ప్రవచించినట్లు ఉద్యోగుల జీతాల్ని తగ్గించవచ్చు.
అతి ముఖ్యమైన మరో విషయాన్ని ఆయన మరిచిపోయారు. జీతభత్యాల్ని ఉద్యోగులు తమకు తామే పెంచేసుకోరని. పెరుగుతున్న ధరల సూచికకు అనుగుణంగా, అనేక ప్రాతినిధ్యాల మేరకు వేతన సవరణ కమిటీని ప్రభుత్వమే నియమిస్తుంది. ఈ కమిటీలను కాలయాపన చేయించటంలో ఆరితేరిన పాలకవర్గాలు, వేరొక సవరణ నివేదిక ఇచ్చినా, వెంటనే అమలుకు నోచుకోదు. దీనికై ఉద్యమాలు చేయాల్సిందే! అప్పుడు కదిలిన ఫైలు ఆచరణలోకి రావడానికి ఓ పంచవర్ష ప్రణాళిక అవుతుంది. అప్పటికే ధరల సూచి మరో వేతన సవరణకై ఎదిగిపోతుంది. అయినా ఉద్యోగులు కోరిన జీతాలేనాడు, ఏ ప్రభుత్వం నేటికి ఇవ్వలేదు. అధినాయకుల దయాదాక్షిణ్యాలపైననే అంతా భారం. ఇదే తీరు చట్టసభల నాయకులకుందా? వారు కోరుకున్నదే తడవుగా ఇబ్బడి ముబ్బడిగా జీతభత్యాలు, అలవెన్సులు, ప్రయాణభత్యాలు, ఇతర సౌకర్యాలు అట్టే పెరిగిపోతాయి. వెంటనే అమల్లోకి వస్తాయి. ఇంతగా లబ్ధి పొందే ఈ గణనాయకులు చట్టసభల్లో అరగదీసేది, ఒరగబెట్టేది ఏంటో ఏడు దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. సభల ముఖాన్ని చూడనివారు కొందరైతే, నిద్రపోయేవారు మరికొందరు. ఉద్యోగులకు 60సం॥ ఓ మహాభాగ్యం. మరి నాయకులకు…? పాడెపై ఎక్కేదాకా ..నడవలేనివారు, కనీస విచక్షణ లేనివారు, మీడియాలో కోడికూతలు కూసేవారు, ప్రజాస్వామిక అలవెన్సులపై పెంచుకున్న ఆస్తులపై ఆడిట్‌ జరిగితే మీరెంత గౌరవనీయులో తేలుతుంది.
దాదాపు గత 7 దశాబ్దాల్లో దిల్లీ, ఆయా రాష్ట్రాల సంక్షేమ (సంక్షోభ) పథకాలపై ఏనాడైనా, ఏ నాయకుడైనా ఓ సమీక్ష చేశాడా…? యావత్‌ దేశంలోని సంక్షేమ పథకాల జాబితాను చెప్పిన వారికి నోబెల్‌ బహుమతి ఇవ్వవచ్చు. మోదీగాని, ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులుగాని వారు ప్రకటించిన పథకాల్ని ఓ వేదికపై నుంచి చెప్పగలరా? సరే! ఆయా పథకాలు మంచివే అనుకుందాం! ఓ పథకానికి కాల పరిమితేంటి? ముగింపేంటి? దశలవారీగానైనా ఆయా పథకాలకు ముగింపు ఉండాలిగా? పైగా పథక రచన చేసిన ప్రతీసారి లబ్ధిదారుల సంఖ్య ఎందుకు పెరుగుతున్నది. నిజానికి తగ్గాలిగా..! ఉదాహరణకి బియ్యం పథకాన్ని చూద్దా! సంవత్సర సంవత్సరానికి వీరి సంఖ్య తగ్గుతూ పోవాలా? పెరుగుతూ పోవాలా? అంటే మొదటి దశలో 100 మంది ఉంటే, రెండో దశలో 80 మంది అనుకుంటే, అయిదో దశలో సున్నాగా మారాలి. అంటే, వీరి కొనుగోలు శక్తి పెరగాలి. కాని, అదెందుకు జరగడం లేదు? ప్రజలు తిని కూర్చునే వర్గాలా? వారికి పని కల్పించి, ఉపాధి పెంచితే, కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఉత్పత్తిలో భాగస్వామ్యం చేస్తే ఆర్థికాభివృద్ధి జరుగుతుంది. దీనికి తోడు సంపదల (భూమి, దోచుకున్న నల్ల డబ్బు) పంపిణీ జరిగితే, ప్రజల ఆర్థిక పునాది గట్టిపడుతుంది. దీంతో వస్తు వినిమయం పెరుగుతుంది. ఇన్ని అంశాల్ని మరిచి, కేవలం దేశ సంపదనంతా 85 శాతాన్ని ఉద్యోగులే కాజేస్తున్నట్లు ఈ కుహనా ఆర్థికవేత్త ప్రవచించడం ఆభిశంసనీయం కాదా..?
గతంలో కూడా ప్రపంచ బ్యాంకు ప్రవచిత ‘పబ్లిక్‌ వోచర్‌’ ఇవ్వాలని ఈ ఆర్థికవేత్త కోరడం గమనార్హం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దీన్ని తూచ తప్పకుండా పాటిస్తున్నది. దీంతో విద్యారంగం బాగుపడుతుందా..! కాలమే చెపుతుంది. లేదంటే వీటి వైఫల్యానికి కూడా ఉద్యోగులే కారణమంటాడేమో…!!
వ్యాస రచయిత డైట్‌ అండ్‌ ఎస్‌ఎఓ అధ్యక్షులు, సెల్‌ 9440116162

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img