Tuesday, January 31, 2023
Tuesday, January 31, 2023

ప్రజల పార్టీగా మరింత బలోపేతం

ముప్పాళ్ల నాగేశ్వరరావు

వ్యవసాయ రంగం సంక్షోభంలో చిక్కుకుని అనేక తీవ్ర సమస్యల నెదుర్కొంటోంది. పార్టీ చురుకుగా పని చేయటానికి ఇప్పుడు ఒక గొప్ప కార్యక్షేత్రం ఈ వ్యవసాయ రంగం. పెరుగుతున్న నిరుద్యోగం, సామాన్యులకు అందుబాటులో లేని విద్యా, వైద్య రంగాలు యువజన, విద్యార్థుల సమీకరణకు గొప్ప అవకాశాల్ని కల్పిస్తున్నాయి. డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు మోదీ పాలనలో రెండిరతలు పెరిగాయి. ప్రజల్లో ఆగ్రహం ఉంది. దానికి నిర్మాణ రూపం ఇచ్చేందుకు మన పార్టీ కృషిని తీవ్రతరం చేయాల్సిన కర్తవ్యం ముందుకొచ్చింది.

ఇటీవల భారత కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర స్థాయి వర్కుషాప్‌ విశాఖపట్నంలో విజయవంతంగా ముగి సింది. పార్టీ శ్రేణులకు ఈ వర్కు షాప్‌ దిశానిర్దేశం చేసింది. వేగంగా మారుతున్న సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అంతే వేగంతో పార్టీ శ్రేణులు కూడా స్పందించాల్సిన అవసరాన్ని గుర్తింప జేసే ప్రయత్నం జరిగింది. పార్టీ నిర్మాణంలో ప్రాథ మిక శాఖలు కీలకమని, వాటి పనితీరు సంతృప్తి కరంగా లేదని గుర్తించాం. నిత్యం ప్రజలతో సంబంధాలు బలోపేతం చేసు కోవటం ద్వారా శాఖల పనితీరులో మార్పులు తీసుకు రావాలని నిర్ణయం తీసుకున్నాం. ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలపై వారిని సమీకరించాలి. ఇందుకు పార్టీ శాఖలు చొరవ ప్రదర్శించాలి. పార్టీ సభ్యులు క్రియాశీలంగా వ్యవహరించటంలో మరింత కృషి జరగాలి. పార్టీ కార్యక్రమాలపై ఆసక్తి లేని సభ్యులను గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలి. ప్రజాసంఘాల నిర్మాణంలో పార్టీ చొరవ మరింత పెంచేందుకు కార్యాచరణపై చర్చ జరిగింది. పార్టీ ఎడ్యుకేషన్‌, సైద్ధాంతిక, భావజాల రంగంలో పరిస్థితిపై వర్కు షాప్‌లో మదింపు జరిగింది. పార్టీ శ్రేణుల చైతన్య స్థాయిని మరింత పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చ జరిగింది. పార్టీలో అన్యవర్గ ధోరణులు, పెత్తందారీ పోకడల పట్ల జాగ్రత్త వహించాలనీ, లెనినిస్ట్‌ నిర్మాణ సూత్రాలకు ఖచ్చితంగా కట్టుబడి ఉండాలని నొక్కి చెప్పింది. ప్రజలపై ప్రేమ, పార్టీపై విధేయత, మార్క్సిస్టు సిద్ధాంతంపై ప్రగాఢ విశ్వాసం పార్టీ శ్రేణులకు ఆభరణాలుగా ఉండాలి. పార్టీ పత్రికలు, సాహిత్యం, ఇతర ప్రచురణల అధ్యయనం మెరుగుపడాలని పార్టీ శ్రేణులకు ఈ వర్కుషాప్‌ పిలుపునిచ్చింది. పార్టీ శాఖల పనితీరు, ప్రజాసంఘాల నిర్మాణం తదితర అంశా లపై కేరళ రాష్ట్ర సీపీఐ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్‌ సంతోష్‌ కుమార్‌ వివరిం చారు. కేరళ అనుభవాలు వర్కుషాప్‌లో పాల్గొన్నవారందరినీ ఉత్తేజితుల్ని చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ విస్తరణపై కేంద్రీకరణ తక్షణావసరమని నొక్కి చెప్పింది. దేశంలో ఇప్పటికీ సగానికి పైగా ప్రజానీకం గ్రామీణ ప్రాంతాల్లోనే నివసిస్తున్న వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకున్నాం. మతోన్మాద, ఫాసిస్ట్‌ తరహా పాలన రాజ్యమేలుతున్న ప్రస్తుత విపత్కర పరిస్థితిని ఇక్కడ వివరించాం. రాజ్యాంగ మౌలిక లక్ష్యాలైన ప్రజాస్వామ్యం, లౌకిక వాదం, సోషలిజం భావనల విధ్వంసానికి ఆర్‌.యస్‌.యస్‌. ఇతర ప్రతీఘాత శక్తులు పాల్పడుతున్న నేపధ్యం పైనా చర్చ జరిగింది. సామాజిక, రాజకీయ, భావజాల రంగాల్లో ఆర్‌.యస్‌. యస్‌. విసురుతున్న సవాళ్ళను మరింత ధీటుగా ఎదుర్కోవాలని బోధించారు. ప్రజల్ని వేధించుకు తింటున్న, కార్పొరేట్‌ అనుకూల జాతి వ్యతిరేక బీజేపీ ప్రభుత్వ విధానాలపై సుదీర్ఘ వివరణలు ఇచ్చారు. కేంద్రం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 కార్మిక కోడ్స్‌ను అమల్లోకి తెచ్చి కార్మికవర్గం గొంతు నులిమే ప్రయత్నానికి ఒడిగట్టింది. యావత్తు కార్మిక వర్గాన్ని కాంట్రాక్ట్‌, ఔట్‌ సోర్సింగు, ఫిక్సడ్‌టెరం ఎంప్లాయిమెంట్‌, అప్రెంటీస్‌, దినసరి కూలీలుగా మార్చేసింది.
గౌరవ కార్యకర్తలనే పేరుతో అంగన్‌ వాడీ, ఆశా తదితర స్కీం వర్కర్స్‌ శ్రమను దోపిడీ చేస్తోంది. సమ్మె హక్కుపై దాడి జరిగింది. సంఘం పెట్టుకునే హక్కు కుదించేసింది. 12 గం.లు పనిదినం ప్రవేశపెట్టే ప్రయత్నాలపై కార్మిక ఉద్యోగ సంఘాలు ఆగ్రహంగా ఉన్నాయి. కార్మిక వర్గాన్ని కట్టు బానిసలుగా మార్చేస్తున్నారు. దేశవ్యాప్త సమ్మెలు, పార్లమెంట్‌ ముట్టడులు, నిరసనలతో యావత్తు కార్మికవర్గం ఐక్య ప్రతిఘటనకు పూనుకుంది. ప్రధాని మోదీ వీటిని ఏ మాత్రం లెక్క చేయలేదు, పట్టించుకోలేదు. కార్మిక రంగంలో ఏర్పడిన ఈ పరి స్థితులు ఎఐటియుసి, పార్టీ బాధ్యతను మరింత పెంచుతున్నాయి. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో బడా కార్పొరేట్‌ కంపెనీలకు అనుకూలంగా 4 కార్మిక కోడ్స్‌ తెచ్చారు. పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తల నుండి రావలసిన దాదాపు రూ 6 లక్షల కోట్ల రుణాలు రద్దు చేయటమేగాక, వారినుండి రావాల్సిన రూ. 8 లక్షల కోట్ల పన్ను బకాయిలనూ పట్టించుకోవటం లేదు. కార్పొరేట్‌ పన్ను, ఎక్సైజు సుంకాలు రద్దు పరచి కార్పొరేట్లకు లక్షల కోట్ల రూపాయల ప్రయోజనం కల్గించారు. ప్రసిద్ధి చెందిన ప్రభుత్వరంగ సంస్థలు, బ్యాంకులు, ఇన్సూరెన్స్‌, టెలికాం, రైల్వే, విమానయానం, ఉక్కు, బొగ్గు, ఆయిల్‌, ఆయుధ ఫ్యాక్టరీలు, ఆఖరికి అంతరిక్ష పరిశోధనలు, రక్షణరంగం అన్నింటినీ స్వదేశీ, విదేశీ ప్రైవేట్‌ కార్పొరేట్లకు అప్పనంగా ఇచ్చేస్తున్నారు. గ్యాస్‌, పెట్రోల్‌, డీజిల్‌ ధరలు ఆకాశా న్నంటుతున్నాయి. నిత్య జీవితావసర వస్తువుల ధరలన్నీ సామన్య ప్రజల బ్రతు కుల్ని దుర్భరం చేశాయి. పెద్దనోట్ల రద్దు, జి.యస్‌.టి. అమలు చేయటంతో, కొన్ని లక్షల పారిశ్రామిక, వ్యాపార వాణిజ్య సంస్థలు మూతపడ్డాయి. కోట్ల మంది ప్రజలు ఉద్యోగ ఉపాధులు పోగొట్టుకుని రోడ్లపాలయ్యారు. ఆర్థిక వ్యవ స్థను అస్తవ్యస్తం చేశారు. కోవిడ్‌ మహమ్మారి కారణంగా ఆర్థికాభివృద్ధి ప్రతి కూలంగా మారింది. ఇప్పుడేమో ‘‘జాతీయ ఆస్తుల నగదీకరణ పైప్‌ లైన్‌’’ పేరుతో ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేయటం ద్వారా 6 లక్షలకోట్ల రూపాయలు సేకరించాలని నిర్ణయించారు. ఆఖరికి గ్రామాల్లో ఉండే ప్రభుత్వ ఆస్తుల్ని సైతం అమ్మేయాలని గ్రామ పంచాయతీలకు ఆదేశాలు జారీచేశారు. ఈ విధానాల వల్ల పేదలు మరింత పేదలుగానూ, ధనికులు మరింత ధనికులుగానూ మారుతున్నారు. తీవ్ర ఆర్థిక, సామాజిక అసమానతలు ఏర్పడుతున్నాయి. ఈ వాస్తవ పరిస్థితికి తగినట్లుగా పార్టీ మరింత చొరవను, క్రియాశీలతను ప్రదర్శించాలి.
రైతుల నడ్డి విరిచే మూడు వ్యవసాయ చట్టాలు తెచ్చారు. 12 మాసాల నుండి రైతులు ఆందోళనలు చేస్తుంటే, వారి డిమాండ్స్‌ పరిశీలించాల్సింది పోయి, వారిపై దౌర్జన్యానికి దిగుతున్నారు. రైతు ఆందోళనాకారులను కేంద్ర మంత్రి కాన్వాయితో తొక్కించి 8 మంది మృతికి కారకులైన మంత్రిని బర్త్‌రఫ్‌ చేయాలన్న డిమాండును పట్టించుకోవడం లేదు. దేశమంతటా, రైతాంగంలో పాలకులపై తీవ్ర ఆగ్రహం పెల్లుబుకుతూ ఉంది. వ్యవసాయ రంగం సంక్షో భంలో చిక్కుకుని అనేక తీవ్ర సమస్యల నెదుర్కొంటోంది. పార్టీ చురుకుగా పని చేయటానికి ఇప్పుడు ఒక గొప్ప కార్యక్షేత్రం ఈ వ్యవసాయ రంగం. పెరుగుతున్న నిరుద్యోగం, సామాన్యులకు అందుబాటులో లేని విద్యా, వైద్య రంగాలు యువజన, విద్యార్థుల సమీకరణకు గొప్ప అవకాశాల్ని కల్పిస్తున్నాయి. డీజిల్‌, పెట్రోల్‌, గ్యాస్‌ ధరలు మోదీ పాలనలో రెండిరతలు పెరిగాయి. ప్రజల్లో ఆగ్రహం ఉంది. దానికి నిర్మాణ రూపం ఇచ్చేందుకు మన పార్టీ కృషిని తీవ్రతరం చేయాల్సిన కర్తవ్యం ముందుకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు 32 మంది బలిదానంతో సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని విదేశీ ప్రైవేటు యజమానులకు అయినకాడికి అప్పజెప్పేస్తున్నారు. దీన్ని నిలిపివేయాలని నెలల తరబడి ఆందోళనలు జరుగుతున్నా పాలకులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. పచ్చి కార్పొరేట్‌ అనుకూల, కార్మిక వ్యతిరేక కేంద్రప్రభుత్వ పాలన సాగుతూ ఉంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనా లు, హక్కులు కాలరాస్తున్నారు. రాష్ట్రంలోని పాలక, ప్రతిపక్ష పార్టీలు సైతం కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయటంలో మీన మేషాలు లెక్కిస్తున్నాయి. మనరాష్ట్ర ప్రయోజనాల సాధన కోసం సీపీఐ నికరమైన వైఖరితో, స్వతంత్రంగానూ, ఇతర పార్టీలతో ఐక్యంగానూ ప్రచార ఆందోళనలను, పోరాటాలను నిర్వహించింది. ప్రజల మన్ననలను పొందింది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఎన్నో ప్రజావ్యతిరేక విధానాలకు పాల్పడుతోంది. ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వటం లేదు. కొన్ని రంగాలలో కార్మికులకు 15, 20 మాసాల బకాయిలు ఉన్నాయి. కనీస వేతనాలు లేవు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులను రెగ్యులరైజ్‌ చేస్తానని ఎన్నికల ముందు ముఖ్యమంత్రి చేసిన వాగ్దానం నెరవేర్చలేదు. ప్రభుత్వోద్యోగులకు జీతాలు, డిఏలు, పెన్షన్లు బకాయిలు పెడుతున్నారు. ముఖ్యమంత్రి వాగ్దానం చేసిన యన్‌.పి.యస్‌. రద్దు ఊసే లేదు. ఉద్యోగులు, కార్మికులలో అసంతృప్తి నెలకొని వుంది. చెత్తపన్ను, విలువ ఆధారిత ఆస్తిపన్ను, విద్యుత్‌ చార్జీల పెంపుదల, రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టడం, పాలకపార్టీ నేతల దౌర్జన్యాలు లాంటి ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడటంపై ప్రజల్లో అసంతృప్తి రాజుకుంటోంది. టిడ్కో ఇళ్ల ప్రహసనం, నిర్మితమై పంపకానికి రెడీగా ఉన్న ఇళ్లను కూడా లబ్ధిదారులకు అందించకపోవటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమౌతోంది. వీటన్నింటిపై ఆయా వర్గాల ప్రజలను సంఘటిత పరచి ఉద్యమించటంలో మనపార్టీదే అగ్రస్థానం.
కానీ, ఇంకా మరింత క్రియాశీలంగా, లబ్దిదారులకు చేరువై, పెద్దఎత్తున పోరాటాలు నిర్వహించటానికి గల అవకాశాలను వర్కుషాప్‌ గుర్తించింది. నవ రత్నాల పేరుతో అమలవుతున్న పథకాలు లక్షలమంది లబ్ధిదారులకు అందటం లేదు. అనేక లోపాలు బహిర్గతమౌతున్నాయి. పేదలకు ఇళ్లస్థలాల పథకం తీవ్ర విమర్శలకు గురైంది. ఇందుకవసరమైన భూమిని సేకరించటంలో వందలకోట్ల రూపాయలు చేతులు మారినట్లు ఆరోపణలు వచ్చాయి. పాలకపార్టీ వైఫల్యాలను ప్రజల ముందుంచి ఎండగట్టటంలో మన పార్టీ అగ్రభాగాన ఉంది. మనపార్టీ శ్రేణులు మరింత చురుకుగా, క్రియాశీలంగా వ్యవహరిస్తే, సీపీఐని గొప్ప ప్రజల పార్టీగా నిర్మించవచ్చు. అందుకవసరమైన భౌతిక పరిస్థితి, అవకాశాలు మెండుగా ఉన్నాయి. కాకపోతే, పార్టీ నిర్మాణాన్ని అందుకనుగుణంగా బలోపేతం చేసు కోవాలి. విశాఖపట్నం వర్కుషాప్‌ సందేశం అదే!
వ్యాస రచయిత సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img