దేవవ్రత బిశ్వాస్
రాయ్‌టర్స్, ఐపీఎస్‌ఓఎస్‌లు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బైడెన్, ట్రంప్‌లు మరోసారి పోటీచేయడంపై పెద్దగా ఆసక్తి వ్యక్తంచేయలేదు. అయితే వీరిద్దరినీ రెండు పార్టీలు కోరుకోవడం పోటీ చేయడానికి ప్రధాన కారణ మవుతోంది. బైడెన్ ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత కనిపించడం లేదు. ట్రంప్‌కు పార్టీ దిగువస్థాయిలోనూ గట్టిపట్టు ఉంది. రిపబ్లికన్ జాతీయ కమిటీ మాజీ చైర్మన్ మైఖేల్ స్టీల్ మాట్లాడుతూ నేటి రాజకీయాలు ఏమాత్రం ఉత్తేజంగా లేవని అన్నారు. రెండు పార్టీలకు మద్దతు తెలియజేయకుండా ఉన్న ఓటర్లు, యువకులు, ఎన్నికల్లో పాల్గొనడానికి ఏ మాత్రం ఆసక్తిగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. బైడెన్ గత ఎన్నికల్లో 53శాతం మంది ఆమోదంతో వైట్‌హౌస్‌లో ప్రవేశించారు. ప్రస్తుత ఆయన మద్దతుగా ఉన్నవారి సంఖ్య 43శాతానికి తగ్గింది. అదే సమయంలో ట్రంప్‌ను సమర్థించేవారి సంఖ్య 38శాతంగా అంచనా ఉంది. ఈ గణాంకాలు చూసినప్పుడు బైడెన్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లు ప్రజాదరణ కోల్పోయారని ఇటీవల జరిగిన ప్రజాబిప్రాయ సేకరణలో వెల్లడైంది. ట్రంప్ కంటే కొంచెం ఎక్కువమంది ప్రజలు బైడెన్‌ను కోరు కుంటున్నారు. అయితే అటు డెమొక్రాట్లు బైడెన్‌ను, రిపబ్లికన్‌లు ట్రంప్‌ను సమర్థిస్తున్నారు. ప్రజలు మాత్రం వీరిరువురు గాకుండా మరొకరు అధ్యక్షుడైతే బాగుంటుందని భావిస్తున్నట్లు సర్వే తెలియజేసింది. అయితే డెమొక్రాట్లు, రిపబ్లికన్లు వీరిద్దరికే మళ్లీ అవకాశం ఇవ్వవచ్చునని అంచనా వేస్తున్నారు. ట్రంప్ ఇప్పటికే తాను తిరిగిపోటీ చేస్తానని ప్రకటించి ప్రచారం ప్రారంభించారు. ఫ్లోరిడా గవర్నరు డిమెన్ డి శాంటిస్ పోటీ చేయాలని భావిస్తున్నప్పటికీ పార్టీలో ట్రంప్‌ను వాస్తవంగా సవాలు చేయగల వారెవరూలేరని చెబు తున్నారు. డి శాంటిస్‌పైన ట్రంప్ దాడి ప్రారంభించాడు. రిపబ్లికన్ పార్టీలో ట్రంప్‌ను సమర్థించేవారే ఎక్కువ ఉన్నారు. ట్రంప్ వైట్‌హౌస్‌ను ఆక్రమించడం, ఆయన అనుచరుల దాడి, కీలకమైన రహస్యపత్రాలను తన ఇంటికి తరలించడం, నిఘా సంస్థ అధికారుల సోదాలు, ఆయన అరెస్టు, మన్‌హట్టన్ కోర్టు మందలించడం లాంటివి జరిగి ప్రజాదరణ తగ్గినప్పటికీ రిపబ్లికన్లు మాత్రం ట్రంప్‌కే మద్దతు పలుకుతున్నారు. తనపై అత్యాచారం చేశాడని ట్రంప్‌పై జీన్ ఈ కారొల్ ఫిర్యాదుచేయగా మన్‌హట్టన్ కోర్టు ఆయన దోషిగా నిర్థారించి నష్టపరిహారంగా 5 మిలియన్ డాలర్ల జరిమానా విధించింది. ఇవన్నీ ట్రంప్‌పై ప్రజాదరణ తగ్గడానికి దోహదం చేశాయి. పార్టీలో ట్రంప్‌ను గుడ్డిగా సమర్థించే వారుండటం వల్ల తిరిగి 2024లో జరగనున్న ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యారు.
మన్‌హట్టన్ కోర్టు ట్రంప్‌ను దోషిగా నిర్థారించి జరిమానా విధించిన తర్వాత ఆయనను సమర్థించేవారు పెరిగారు. పైగా తమ మీద రాజకీయ, వ్యక్తిగత కక్షతోనే కోర్టుకు లాగారని తన అనుచరులను నమ్మించగలిగారు. అలాగే అనేక మిలియన్ డాలర్లను ఆయన మద్దతుదారుల నుండి విరాళంగా తీసుకున్నారు. జనంలో మాత్రం మొదట తీవ్రమైన వ్యతిరేకతే వచ్చింది. ఇదేసమయంలో కొన్ని ప్రాంతాలలో ఓటర్లలో ఆయనకు ఉన్నమద్దతులో ఏమీ మార్పురాలేదు. ట్రంప్‌మీద ఆరోపణలు వచ్చినప్పటికీ వాటివల్ల ఆయనపై ఉన్న ఆదరణ తగ్గలేదని రిపబ్లికన్ పార్టీ వ్యూహకర్త చార్లి జిరోవ్ అన్నారు. వ్యతిరేకత ఉన్నప్పటికీ అది చాలా పరిమితంగానే ఉందన్నారు. అతి త్వరలోనే ట్రంప్‌పైన సివిల్, క్రిమినల్ కేసులు, ఫెడరల్, రాష్ట్ర స్థాయి ఎజన్సీలు నమోదు చేయనున్నాయని తెలుస్తోంది. అయితే ఇవన్నీ అధ్యక్ష ఎన్నికల్లో పోటీకి ఆటంకంగా నిలవబోమని అంచనా వేస్తున్నారు. ఈలోపు ట్రంప్ పార్టీ ప్రైమరీ నామినేషన్‌ను కూడా గెలుచుకోగలరని అంచనా. అధ్యక్షభవనం క్యాపిటల్ హిల్‌పై దాడులు, రహస్యపత్రాలు తన ఇంటికి తరలించగా సోదాచేసి వాటిని స్వాధీనం చేసుకోవడం, జార్జియా ఫల్టన్ కౌంటీలో దర్యాప్తు కేసులను ఇప్పటికే ఆయన అనుభవించారు. వచ్చే సంవత్సరం ప్రారంభంలో జరిగే రిపబ్లికన్ల సదస్సులో ట్రంప్‌ను ఎన్నికల్లో పోటీ చేయడానికి పార్టీ ప్రతినిధిగా ఎంపిక చేయనున్నారు.
ప్రస్తుత అధ్యక్షడు జో బైడెన్ 2023 ఏప్రిల్‌లోనే లాంఛనంగా ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. 2024లో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయ నున్నానని ప్రస్తుతం ప్రారంభించిన కార్యక్రమాలు పూర్తి చేయడానికి మరోసారి అవకాశం ఇవ్వాలని ఓట్లర్లకు విజ్ఞప్తిచేశారు. పార్టీలో బైడెన్‌పై పోటీచేసే అభ్యర్థి ఇంత వరకు కనిపించలేదు. అయితే ఆయన వయస్సు, మానసిక దృఢత్వంలేమి అంశాలు ఆటంకంగా ఉన్నాయి. 2024నాటికి ఆయన వయస్సు 82ఏళ్లు అవుతుంది. అయితే ట్రంప్‌ను ఓడిరచగలిగిన సామర్ధ్యం ఆయనకే ఉందని డెమొక్రాట్లు విశ్వసిస్తున్నారు. అందువల్ల ట్రంప్‌తో బైడెన్ పోటీకి సిద్దమవుతున్నారు. రెండవసారి ట్రంప్, బైడెన్ మాదిరిగా పోటీచేసిన సంఘటనలు చరిత్రలో చాలాఉన్నాయి. జాన్‌ఆడమ్స్, థామస్‌జపర్‌సన్‌లు 1796, 1800 సంవత్సరాల్లో పోటీ చేశారు. అలాగే క్విన్సీ ఆడమ్స్, జాక్సన్ మధ్య 1824, 1928 సంవత్సరాల్లో పోటీ జరిగింది. మార్టిన్ వాన్ బురెన్, విలియం హారీల మధ్య 1836, 1840లో పోటీ జరిగింది. ఇదే మాదిరిగా విలియం మెకన్లీ, విలియం జెన్నింగ్స్ బ్రియన్‌లు 1896, 1900 సంవత్సరాల్లో అధ్యక్షపదవికి పోటీపడ్డారు. ఈ విధంగా పోటీచేసిన సందర్భం చివరిగా 1968లో చోటుచేసుకుంది. అప్పుడు రిపబ్లికన్‌లు రిచర్డ్ నిక్సన్‌ను తమ అభ్యర్థిగా ప్రకటించగా, డెమొక్రాట్ల అభ్యర్తి జాన్ ఎఫ్ కెనడి ఎన్నికల్లో గెలుపొందారు. వీరిదారిలోనే ఇప్పుడు బైడెన్, ట్రంప్‌ల మధ్యపోటీ జరగనుంది. బైడెన్‌కు రెండు ఆటంకాలు ఉన్నాయి. ఒకటి ఈసారి అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొంది తన పదవీ కాలం ముగిసే టప్పటికీ ఆయన వయసు 86 సంవత్సరాలు ఉంటుంది. ప్రస్తుతం ఆయన పదవిలో ఉన్నంతకాలం ఆయన ఆరోగ్యం గురించి పదేపదే ప్రశ్నలు వస్తున్నాయి. ఓటర్లు ఈ విషయాన్ని ఒక సమస్యగా తీసుకోవచ్చు. ఆయన ఆరోగ్యంపై ఆందోళనకూడా వ్యక్తమైంది. ఆయన వయసు, ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తంచేస్తూ ఇటీవల న్యూయార్క్‌టైమ్స్ సంపాదకీయం కూడా రాసింది. అలాగే బైడెన్‌ను ఎన్నుకోవడం చరిత్రాత్మక తప్పు అవుతుందని వాల్‌స్ట్రీట్ జర్నల్ తన సంపాదకీయంలో పేర్కొంది. అలాగే ట్రంప్ వయసుపైకూడా 35శాతం రిపబ్లికన్లు ఆందోళన వ్యక్తం చేశారు.
వామపక్షవాది అయిన సెనేటర్ బెర్ని శాండర్స్, చాలామంది డెమొక్రాటిక్ పార్టీ నాయకులు బైడెన్‌ను సమర్థిస్తున్నారు. ఓటర్లే సందేహం వ్యక్తం చేస్తున్నారు. బైడెన్ బాగా వృద్ధుడయ్యాడని 44శాతం మంది డెమొక్రాటిక్ ఓటర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయస్థాయిలో ట్రంప్‌కు 38శాతం మంది మద్దతు ఉండగా, బైడెన్‌కి 43శాతం మద్దతు ఉన్నట్లు సర్వేలు చెబుతున్నాయి. అయితే ఆర్థిక అంశాలపై బైడెన్‌కు అనుకూలత తగ్గుతోంది. గతకొన్ని నెలలుగా ఈ విషయంలో ఆయనను సమర్థించేవారు పెరగలేదు.
రాయ్‌టర్స్, ఐపీఎస్‌ఓఎస్‌లు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణలో బైడెన్, ట్రంప్‌లు మరోసారి పోటీచేయడంపై పెద్దగా ఆసక్తి వ్యక్తంచేయలేదు. అయితే వీరిద్దరినీ రెండు పార్టీలు కోరుకోవడం పోటీ చేయడానికి ప్రధాన కారణమవుతోంది. బైడెన్ ప్రభుత్వంపై పెద్దగా వ్యతిరేకత కనిపించడంలేదు. ట్రంప్‌కు పార్టీ దిగువస్థాయిలోనూ గట్టిపట్టు ఉంది. రిపబ్లికన్ జాతీయ కమిటీ మాజీ చైర్మన్ మైఖేల్ స్టీల్ మాట్లాడుతూ నేటి రాజకీయాలు ఏమాత్రం ఉత్తేజంగా లేవని అన్నారు. రెండు పార్టీలకు మద్దతు తెలియజేయకుండా ఉన్న ఓటర్లు, యువకులు, ఎన్నికల్లో పాల్గొనడానికి ఏ మాత్రం ఆసక్తిగా లేరని ఆయన వ్యాఖ్యానించారు. బైడెన్ గత ఎన్నికల్లో 53శాతం మంది ఆమోదంతో వైట్‌హౌస్‌లో ప్రవేశించారు. ప్రస్తుత ఆయన మద్దతుగా ఉన్నవారి సంఖ్య 43శాతానికి తగ్గింది. అదే సమయంలో ట్రంప్‌ను సమర్థించేవారి సంఖ్య 38శాతంగా అంచనా ఉంది. ఈ గణాంకాలు చూసినప్పుడు బైడెన్‌కే గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.