Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

ప్రజాస్వామ్యానికి మోదీ ఎసరు

ప్రజాస్వామ్యం అనే భావన పురాతన గ్రీస్‌లో ఏథెన్స్‌ నగరరాజ్యంలో ఉద్భ వించింది. ‘‘క్లీస్టెనెన్‌’’ ఎధీని యన్‌ ప్రజాస్వామ్య పితా మహుడిగా పరిగణించారు. క్లీస్టెనెస్‌ ‘ఐసోనోమియా’ అనే కొత్త రాజకీయ వ్యవస్థను అంటే రాజకీయ సమానత్వం అనే దానిని ప్రవేశపెట్టాడు. ఇది ప్రత్యక్ష ప్రజాస్వామ్యం! దీనిలో ప్రజలందరికీ ఓటు ద్వారా తన నాయకుని ఎన్నుకునే స్వేచ్ఛ గలిగిన శాసనవ్యవస్థ ఉంటుంది. చాలాకాలం తరువాత రోమన్‌ రిపబ్లిక్‌ ప్రభావంతో నేటి ఆధునిక ప్రజాస్వామ్య ప్రాతినిధ్య విధానం ఆచరణకు వచ్చింది. ప్రపంచంలో ఆధునిక ప్రజాస్వామ్యం మొదట బ్రిటన్‌లో ప్రారంభమైంది. 1948లో బ్రిటన్‌లో సార్వత్రిక ఓటుహక్కు కల్పించారు. 1929కి ముందు బ్రిటన్‌లో మహిళలకు ఓటుహక్కు లేదు. 1789 విప్లవం నుండి ఫ్రాన్స్‌లో ‘ఫ్రెంచ్‌ డిక్లరేషన్‌ ఆఫ్‌ ది రైట్స్‌ ఆఫ్‌ మ్యాన్‌’ ద్వారా ప్రజాస్వామ్యం ప్రారంభమైంది. 1848 విప్లవం తరువాత ఫ్రాన్స్‌లో సార్వత్రిక పురుష ఓటింగ్‌ హక్కు, 1946లో స్త్రీలకు ఓటుహక్కు ఇచ్చారు. 1776 స్వాతంత్య్ర ప్రకటన తరువాత అమెరికాలో ప్రజాస్వామ్యం అమలు చేయడమైంది.19వ శతాబ్దంలో అనేక యూరోపియన్‌ దేశాలు ప్రజాస్వామ్యం బాటపడ్డాయి. మొదటిది ప్రపంచయుద్ధం తరువాత ఐరోపా దేశాలు, స్కాండినేవియా దేశాలు, రెండవప్రపంచ యుద్ధం తరువాత జర్మనీ, ఇటలీ దేశాలు, తూర్పుయూరప్‌, అమెరికా దేశాలలో ప్రజాస్వామ్యం నెలకొల్పడమైంది. 1947లో భారతదేశం స్వాతంత్య్రం పొందటంతో భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు పునాదులు ఏర్పడ్డాయి. అబ్రహం లింకన్‌ చెప్పినట్లు ‘‘ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజలే ఎన్నుకునే’’ ప్రభుత్వ విధానం ప్రాతిపదికగా 1950లో మన రాజ్యాంగాన్ని పార్లమెంటు ఆమోదించింది.. ‘లౌకిక, సర్వసత్తాక, సామ్యవాద, ప్రజాస్వామిక’ దేశంగా ఎన్నో విజయాలను సాధించింది. చట్టం దృష్టిలో ప్రతి ఒక్కరికి సమానత్వం, స్వేచ్ఛ, ఇతర ప్రాధమిక హక్కులు ఉంటాయి. మనం స్వాతంత్య్రం పొందే నాటికి నిరక్షరాస్యత, పేదరికం ఉన్నాయి. బ్రిటిష్‌ వలసపాలన, దేశవిభజన వల్ల స్థానభ్రంశం చెందిన స్థిరమైన నివాసంలేని స్థితిలో సైతం ప్రథమ స్వాతంత్య్ర ఎన్నికలు 1951`52 ప్రాంతంలో జయప్రదంగా జరిగాయి. సార్వత్రిక ఓటింగ్‌హక్కు ప్రాతిపదికగా జాతి, కులం,మతం, భాష సంస్కృతులతో సంబంధం లేకుండా భిన్నత్వంలో ఏకత్వాన్ని సాధించి ప్రపంచంలో భారత ప్రజాస్వామిక వ్యవస్థ ఒక విశిష్టతతో విజయం సాధించింది.
1975లో నాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి విధించి దేశ ప్రజాస్వామిక వ్యవస్థకు ఒక మాయనిమచ్చను తెచ్చారు. 2014 నుండి దేశాన్ని పాలిస్తున్న నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం కుట్రపూరితంగా దేశప్రజాస్వామిక సౌధం పునాదులను ధ్వంసంచేసే చర్యలకు పూనుకున్నది. గత 9 ఏళ్ల మోదీ పాలనలో దేశ ప్రజాస్వామిక వ్యవస్థ తీవ్రమైన కుదుపులకు గురైంది. కుట్రపూరితంగా దేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో మూల స్తంభాలైన శాసన వ్యవస్థను, కార్యనిర్వాహక వ్యవస్థను, న్యాయవ్యవస్థను నియంత్రిస్తోంది. సమాచార వ్యవస్థను కూడా తమ చేతులలోకి తీసుకుని గోబెల్స్‌ తరహా ప్రచారానికి పాల్పడుతున్నది. బీజేపీ పాలనలో దేశంలో మత విద్వేషాలను తరచు రెచ్చగొడుతున్నారు. దేశంలో ప్రజాస్వామ్యం, సమానత్వం, సౌభ్రాతృత్వం నెలకొల్పటంలో పాలకులు విఫలం చెందారు. తరచుగా మతం పేరుతో మూకహత్యలు, సామూహిక అత్యాచారాలు జరుగుతున్నాయి. దేశంలో పరిస్థితులు వివరిస్తూ రాష్ట్రపతికి 69మంది మేధావులు లేఖరాస్తే వారిని దేశద్రోహులుగా చిత్రించారు. బీజేపీకి చెందినవారు హత్యలుచేసి మేమే హత్యచేశాం అని ప్రకటించినా ఎటువంటి చర్యలు లేవు. కోర్టులో శిక్షలు అనుభవిస్తున్న తమ ఆశ్రితులకు క్షమాభిక్ష పేరుతో జైలు నుంచి గడువుకు ముందే విడుదల చేస్తున్నారు. నేరస్థులకు బహిరంగంగా బీజేపీ స్వాగతం చెబుతూ సన్మానాలు చేస్తున్నారు. స్వతంత్ర జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలను మతోన్మాదులు హత్యలు చేస్తే కనీసం కేసులు పెట్టలేని నిస్సహాయస్థితిలో ఈ దేశం ఉంది. మోదీ పాలనలో రాజ్యాంగం, చట్టాలు, న్యాయం మృగ్యమయ్యాయి. బీమా కోరెగాంలో ర్యాలీ జరిగితే మేథావులను అరెస్టుచేసి అర్బన్‌ నక్సలైట్లు అనే పేరుతో విచారణ లేకుండా జైళ్లలో నిర్బంధించారు. హిందూత్వ రాజకీయాలను వ్యతిరేకించేవారు చేసిన ప్రదర్శనపై బీజేపీవారు దాడులుచేసి ముగ్గురిని చంపివేస్తే మోదీ హత్యకు కుట్ర పన్నారని 9మందిని అరెస్టుచేసి నిర్బంధించారు. పూర్తి ఆరోగ్యం చెడిపోయి కదలలేని స్థితిలో ప్రొఫెసర్‌ సాయిబాబాకు, 90ఏళ్లపైబడిన విప్లవకవి వరవరరావులకు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులకు, సామాజిక హక్కుల కార్యకర్తలకు బెయిల్‌ నిరాకరించి జైలుపక్షులుగా మార్చివేశారు. గాంధీని చంపిన గాడ్సే మహాత్ముడని ప్రకటించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞాసింగ్‌పై ఎటువంటి చర్యలు లేవు. రాజస్థాన్‌లో ఆవుని చంపాడనే నెపంతో ముస్లిం రైతును దారుణంగా కొట్టిచంపారు. వీడియోతీసి సోషల్‌ మీడియాలో పెట్టారు. అయినా ఎలక్ట్రానిక్‌ మీడియా సాక్షం చెల్లదని కేసుకొట్టి వేశారు. కానీ బీమా కొరెగావ్‌ కేసులో కంప్యూటర్‌లో సాక్ష్యం ఉందని ఆరోపిస్తూ కేసులు నమోదుచేసి నిర్బంధించారు. బహుళజాతి కంపెనీల దోపిడీని ప్రతిఘటించిన వారిని అరెస్టులుచేసి హింసిస్తున్నారు. అడవులు, సముద్రాలు, మైదానప్రాంతాలు, పర్యావరణాన్ని నాశనం చేస్తున్న బహుళజాతి కంపెనీలకు పాలకులు దాసోహం అని వత్తాసు పలుకుతున్నారు. యురేనియం తవ్వకాలు విచ్చలవిడిగాచేసి నేటి కాలుష్యానికి పాల్పడుతున్నారు. కోర్టులు, చట్టాలు చివరకి సీబీఐ, ఇన్‌కంట్యాక్స్‌వంటి సంస్థలను సైతం తమ కుట్రపూరిత రాజకీయాలకు పావులుగా వినియోగించుకుంటున్నారు. హిట్లర్‌, ముస్సోలినీ మార్గంలో ఏకజాతి సిద్దాంతాన్ని ప్రతిపాదిస్తున్నారు. ఇటీవల కాలంలో దేశంలో జరుగుతున్న సంఘటనలు ప్రజాస్వామ్య వాదులను తీవ్ర అందోళనకు గురిచేస్తున్నాయి. ఫ్రాన్స్‌ను పాలించిన 14వ లూయీ ‘‘రాజ్యమంటే నేనే’’ అని చెప్పాడు. నేడు నరేంద్ర మోదీ పాలన కూడా అలాగే ఉంది. నేనే రాజ్యం! నా చేతిలో రాజదండం ఉంది. నేనుచెప్పిందే శాసనం అనేరీతిలో పాలన సాగుతున్నది. ప్రజాస్వామ్యం పేరుతో నియంతల పాలన సాగించాలని ప్రయత్నిస్తున్నారు. దీనిలో భాగమే రైతులపై కారుతో దాడిచేసిన మంత్రిని సమర్థించటం. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన స్వంతపార్టీ పార్లమెంటు సభ్యుడ్ని కాపాడటం. ప్రజాస్వామ్య విలువలకు పాతరవేస్తూ ఒకే పౌరస్మృతి తీసుకువస్తామని చెబుతున్నారు. ఒకే పౌరస్మృతి పేరుతో మను ధర్మశాస్త్రాన్ని చట్టబద్దం చేయాలని మోదీప్రభుత్వం భావిస్తున్నది. అందుకే డార్విన్‌ పరిణామ సిద్ధాంతాన్ని ప్రపంచమంతా ఆమోదించినా దానిని పాఠ్యగ్రంధాల నుండి తొలగించే చర్యలకు మోదీ ప్రభుత్వం పూనుకుంది. మతం రంగుపులిమి మణిపూర్‌ రాష్ట్రాన్ని రావణకాష్టం చేసింది మోదీ పాలనే. ప్రజాస్వామ్యాన్ని తుంగలోతొక్కి అక్కడ ఒకవర్గం ప్రజలపై దాడులు జరిపించటం, దానికి పాలకపక్షం ప్రత్యక్షపాత్ర వహించటం దుర్మార్గం. రాజ్యాంగాన్ని తుంగలోతొక్కి ఇప్పుడు ఉమ్మడి పౌరస్మృతిని తెస్తామని, ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తమ అధికారాన్ని సుస్థిరం చేసుకోవాలని బీజేపీ ప్రభుత్వం భావిస్తున్నది. ఇప్పటికే రామమందిరం, ఆర్టికల్‌ 370 రద్దు, కాశ్మీర్‌ విభజనవంటి అంశాలలో ఏకపక్షంగా వ్యవహరించిన మోదీ ప్రభుత్వం ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక ఒకే నాయకుడు’ నినాదం ముందుకుతెచ్చి జర్మన్‌ నియంత హిట్లర్‌లాగా దేశాన్ని ఏలాలనే దుష్టతలంపులతో ఉన్నారు. మోదీ నియంతృత్వ ధోరణిలో భాగమే ఇప్పుడు దేశం పేరుతో ‘ఇండియా’ అనే దానిని తొలగించాలనే ప్రయత్నం. ఇండియా అంటేనే భారత్‌ అని అర్థం. ఇప్పుడు ఇండియాపేరు తొలగిస్తే ఆధార్‌కార్డు దేశకరెన్సీతో సహా అనేక వ్యవహారాలలో పేరుమార్పులు చేయాలి. ఒక్క పదం మార్పుచేస్తే 50వేల కోట్ల రూపాయలు ప్రజాధనం ఖర్చు అవుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. నేటి దేశ పరిస్థితులలో ఈ ఖర్చు పెనుభారం కాగలదు. దేశంలో పేదరికం, నిరుద్యోగం, అవినీతిని నిర్మూలించకుండా పేరుమార్చటం ద్వారా పాలకులు ఏమి సాధించదలచుకున్నారో అర్థం కాదు. ప్రజల మౌలిక అవసరాలైన ‘తిండి, గుడ్డ, గూడు’ గూర్చి ఆలోచించకుండా, విద్య, వైద్యం ప్రజలకు చేరువచేసే ఆలోచనచేయకుండా ప్రజాస్వామ్య వ్యతిరేక, నియంతృత్వ పోకడలను అనుసరించడం దేశప్రయోజనాలకు ఎటువంటి మేలుచేయదు. ‘‘స్వేచ్ఛ కోసం ప్రజాస్వామ్యం’’ ఉండాలని ప్రముఖ తత్వవేత్త అరిస్టాటిల్‌ చెప్పారు. అందువల్ల ప్రజాస్వామ్య దేశంలోనైన ప్రజలే అంతిమ నిర్ణేతలు, ప్రభువులు. ఇప్పుడు భారత ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది. దానిని రక్షించుకోవలసిన బాధ్యత ప్రజలదే. ‘ఒక్కసారి నియంతృత్వానికి చోటు దొరికితే తీవ్రఅనర్థాలకు దేశం బలికాకతప్పదు. అందుకే ప్రజలు ఆలోచించాలి. నవభారత నిర్మాణానికి శక్తివంచనలేకుండా కృషిచేయాలి. అందుకు అనుగుణమైన ప్రజాస్వామిక ప్రత్యామ్నాయాన్ని రాజకీయ రంగంలో నెలకొల్పాలి. (సెప్టెంబరు 15 ప్రజాస్వామ్య దినోత్సవం సందర్భంగా) సెల్‌ : 94909 52093

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img