Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నుముక..‘‘పోలీస్‌’’

ఐ.ప్రసాదరావు, 9948272919

సరిహద్దు భద్రతా దళం, ఇండో- టిబెట్‌ బోర్డర్‌ పోలీస్‌ ఫోర్స్‌ వంటి దళాలు ఏర్పడక ముందు, సెంట్రల్‌ రిజర్వ్‌ పోలీస్‌ ఫోర్స్‌ మన దేశ సరిహద్దులను కాపాడుతూ ఉండేవారు. 1959 అక్టోబర్‌ 21వ తేదీన ‘‘ఆక్సాయిచిన్‌’’ సముద్ర మట్టానికి సుమారు 1600 అడుగుల ఎత్తులో ఉన్న ప్రాంతంలో సరిహద్దుల్లో కాపాలా కాస్తున్న సి.ఆర్‌.పి.ఎఫ్‌ పోలీసులుపై అకస్మాత్తుగా విదేశీ సైనికులు దాడిచేసిన ఘటనలో 10మంది పోలీసులు మరణించిన రోజును దేశవ్యాప్తంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా దేశవ్యాప్తంగా జరుపుకుంటూ, వివిధ ప్రాంతాల్లో విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసులకు నివాళులు అర్పిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ధైర్యం నింపుతూ జరుపుకునే ఒక ఉద్వేగభరితమైన దినోత్సవం…
భారత పోలీసు చట్టం 1861 ద్వారా మన దేశంలో పోలీసు వ్యవస్థ ఏర్పడిరది. ఆనాటి బ్రిటిష్‌ ప్రభుత్వం 1902లో కొన్ని మార్పులు చేసింది. స్వాతంత్య్ర వచ్చిన తరువాత నేటికీ 75 సంవత్సరాలు పూర్తి కావచ్చిన తర్వాత 1950 జనవరి 26వ తేదీ నుంచి భారత రాజ్యాంగం అమలులోకి వచ్చినా, రమారమి ఆ పోలీసు చట్టాలే, ఆ వ్యవస్థే నేటికీ కొనసాగుతూ ఉన్నాయి. నేటిపాలకులకు పోలీసులు అనుకూలంగా పనిచేయడానికి కారణం అప్పటి చట్టాలే. దీంతో పోలీసులకు, సామాన్య ప్రజలకు మధ్య అగాధం ఏర్పడిరది. వీరి మధ్య ఉండవలసిన స్నేహ సంబంధాలు, బలహీన సంబంధాలుగా చాలాకాలం కొనసాగాయి. కొంతమంది పోలీసుల పనితీరు కూడా ప్రజలకు, పోలీసులకు మధ్య సంబంధాలు మెరుగు పడకపోవడానికి కారణం. ఈ అపవాదు తొలగించుకోవడానికి, ప్రజలతో స్నేహ సంబంధాలు అభివృద్ధి పరుచుకోవడానికి పోలీసులు ‘‘మైత్రి’’ అనే కార్యక్రమం చేపట్టారు. ‘‘డయిల్‌ యువర్‌ యస్‌.పి’’, సహాయం కొరకు డయిల్‌ 100, దిశ యాప్‌, దిశ పోలీసు స్టేషన్‌, షీ టీం, వివిధ హెల్ప్‌లైన్‌తో పోలీసులు ప్రజలతో మమేకమై పనిచేయాలి.
సంపద కేంద్రీకృతమై, ఆర్థిక అసమానతలు పెరిగాయి. నిరుద్యోగం ప్రబలి కొంతమంది యువత హింసాత్మక పోరాటాలవైపు మరలిన సందర్భంగా, వారికి పోలీసులకు మధ్య కాల్పులు, ఎన్‌కౌంటర్‌ వంటి సంఘటనలు జరిగి కొంతమంది పోలీసులు మరణించిన సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నేటికీ పోలీసులకు ఆదర్శంగా ఉన్న వ్యాస్‌, ఉమేష్‌చంద్ర, కృష్ణ ప్రసాద్‌, పరదేశీనాయుడు వంటి మంచి అధికారులు, తమ వృత్తినే దైవంగా భావించే సమయంలోనే ప్రాణాలు కోల్పోయారు. అటువంటి వారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని నేటి పోలీసులు ముఖ్యంగా కొత్తగా చేరిన యువ పోలీసులు ప్రజల మానప్రాణాలను, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులను, సంస్థలను కాపాడాలి. సంఘ విద్రోహ శక్తులను అణిచివేయాలి. సామాన్యుని పక్షాన వకాల్తా పుచ్చుకుని ధర్మాన్ని అందించి, ప్రజల్లో అభిమానాన్ని చూరగొనాలి. అన్యాయాలపై ఉక్కుపాదం మోపాలి. నిందితులు ఎంతటి వారైనా, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి. అప్పుడే పోలీసులపై ప్రజలకు విశ్వాసం పెరిగి, ఎప్పుడు అన్యాయం జరిగినా పోలీసుల చెంతన రక్షణ, భధ్రత కలుగుతుంది అని భావిస్తారు. ధనికులు, అధికారం ఉన్నవారికి ఒక రకమైన న్యాయం, పేదలకు, ఇతరులకు మరో రకమైన వైఖరి అవలంబిస్తే సమాజంలో ఫ్రెండ్లీ పోలీస్‌ అనే మాట నీటిమూటగానే ఉంటుంది.
ఇటీవల ఉత్తరప్రదేశ్‌ లఖీంపూర్‌ ఖేరి రైతుల మరణంపై పోలీసులు తీసుకున్న చర్యలు ఏమాత్రం సరైనవికావని సాక్షాత్తూ సుప్రీంకోర్టే వ్యాఖ్యానించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే స్వయంగా విచారణ చేపట్టే పరిస్థితి ఏర్పడిరది అంటే, పోలీసులు తమ విధినిర్వహణ ఏవిధంగా చేస్తున్నారో….వారే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రాజ్యాంగ ప్రకారం, చట్ట ప్రకారం వ్యవహరించాలి. అప్పుడు మాత్రమే పోలీసులుపై గౌరవం ప్రజలకు కలుగుతుంది. మన సైన్యం శత్రు మూకలు నుంచి దేశాన్ని, మనల్ని కాపాడుతూ ఉంటే అంతర్గత శత్రువులు నుండి దేశ, రాష్ట్ర ప్రజలను, ఆస్తులను కాపాడేవారే మన పోలీసులు. పండుగలు, పబ్బాలు, సంబరాలు లేకుండా కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపకుండా, రాత్రనక పగలనక 366 రోజులు ప్రజల జీవితాలకు, ఆస్తులకు రక్షణ, భద్రత కల్పిస్తున్న పోలీసులు అందరికీ ధన్యవాదాలు. వరదలు, భూకంపాలు, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వీరు అందించే సేవలు సదా స్మరించుకోవాలి. శ్లాఘించాలి. ఏదో కొందరు తప్పులు చేస్తున్నారు అని పోలీసులను అందరినీ తక్కువ చూపు చూడరాదు. ‘‘వారు లేకపోతే మనం లేము’’ అనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించాలి. ప్రజాస్వామ్య వ్యవస్థకు వెన్నెముక…పోలీసులే.
కరోనా కాలం నుంచి నేటివరకు ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌గా దేశ, రాష్ట్ర వ్యాప్తంగా రేయింబవళ్లు తమ కుటుంబాలను విడిచి, వైద్యుల తరువాత అంతటి విలువైన సేవలు అందించిన పోలీసులు సదా అభినందనీయులు. కరోనా కాలంలో సేవలు అందిస్తూ అమరులైన పోలీసులు మహారాష్ట్రలో 129మంది, తెలంగాణలో 40మంది, ఆంధ్రప్రదేశ్‌లో 21మంది ప్రాణాలు కోల్పోయారు. వారి సేవలను స్మరిస్తూ, వారి కుటుంబ సభ్యులకు అండగా ప్రభుత్వాలు, ప్రజలు ఉండాలి. శాంతి భద్రతల పరిరక్షణ, వివిధ రకాల బందోబస్తులు, పెరుగుతున్న జనాభా వలన ట్రాఫిక్‌ సమస్యలు, ఆస్తి, కుటుంబ పరమైన తగాదాలు, హింసాత్మక ఘటనలు, మానభంగాలు, సైబర్‌ నేరాలు, మద్యం, మత్తు డ్రగ్స్‌ నేరాలు, మత సంబంధమైన అల్లర్లు ఇలా రకరకాల సమస్యలు మధ్యన విధులు నిర్వహిస్తున్న పోలీసుల సేవలు అమూల్యమైనవి. ఒత్తిడి ఎక్కువై అనారోగ్యాలకు గురవుతున్నారు. కాలుష్య బారినపడి మరణించటం జరుగుతుంది. ప్రభుత్వాలు ఖాళీపోస్టులను, జనాభాకు అనుగుణంగా కొత్తపోస్టులు మంజూరుచేసి పారదర్శకంగా భర్తీచేయాలి. సెలవులు, అదనపు సౌకర్యాలు కల్పించాలి. ప్రజలు తమ ఆలోచనా విధానం మార్పుచేసుకుని మంచి పౌరులుగా, పోలీసులకు సహకారం అందించాలి. ప్రభుత్వాలు ఆధునిక ఆయుధాలు, సమాచార వ్యవస్థ పోలీసులకు శిక్షణ ఇవ్వాలి. వాస్తవం చెప్పాలంటే, పోలీసులు వద్ద ఉన్న ఆయూధాల కంటే మరింత ఆధునిక ఆయుధాలు, సమాచార వ్యవస్థ శత్రువులు చేతుల్లో ఉండటం గమనార్హం…దీనివలన శత్రువులు కొన్ని సందర్భాల్లో పోలీసులపై దాడిచేసి, వారి ప్రాణాలను హరిస్తున్నారు. కావున ఇప్పటి నుంచైనా ప్రభుత్వాలు పోలీసులకు ఆధునిక ఆయుధాలు, సమాచార వ్యవస్థ అందించి ప్రజలను, ఆస్తులను సమర్ధవంతంగా కాపాడే ప్రయత్నం చేయాలి. విధి నిర్వహణలో అమరులైన పోలీసులు అందరికీ ఘన నివాళి అర్పిస్తూ…

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img