డాక్టర్ సి ఎన్ క్షేత్రపాల్ రెడ్డి
జనం మాటను ఆకాశమంత ఎత్తున నిలబడి కవిత్వమై, పద్యమై వినిపించిన మహాకవి దాశరథి. ప్రజాకవిగా దాశరథి కృష్ణమాచార్య కలం నుంచి, కంఠం నుంచి బయట పడ్డ ప్రతి అక్షరం జనంలో చైతన్యం నింపింది. సమసమాజం పట్ల బలమైన ఆకాంక్ష దాశరథిది. తెలంగాణ నేలపై ఉద్యమ కవితలు పండిరచిన మహాకవి దాశరథి. తన కవితల ద్వారా నిజాం పాలనకి వ్యతిరేకంగా సాగే పోరాటలకు ఊపిరులు ఊదాడు. స్వయంగా ఉద్యమంలో పాల్గొన్న కవి. చిన్న వయసులోనే పెద్ద బాధ్యతను తలపై పెట్టుకొని జైలు గోడల మీద అక్షరాలై మెరిశాడు. జన సామాన్యం పాలిట కంటకపాలన సాగిస్తున్న నిజాం నిరంకుశాన్నీ తన కలం అనే ఆయుధంతో చీల్చి చండాడాడు. ఆయన కవిత్వం నిండా సమస్యల ప్రస్తావన, అందుకు గల కారణాలు, మార్పునకు అవసరం అయిన ఆలోచనలు కనిపిస్తాయి. ప్రతి అక్షరం అభ్యుదయ భావాలతో దర్శనమిస్తుంది. సమాజంలో నెలకొన్న అన్ని రుగ్మతలపై కవిత్వం అలంబనగా పోరాటం చేశారు. రాజీ పడని జీవితం ఆయనది. ముసలి నక్కకు రాజరికమా అని గర్జిస్తూ ఈ తెలంగాణ రైతులదేనని తీర్పు చెప్పారు. ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని కీర్తించాడు దాశరథి కృష్ణమాచార్య.
దాశరథి కృష్ణమాచార్య వరంగల్ జిల్లాలోని చినగూడూరు గ్రామంలో జన్మించాడు. జూలై 22, 1925న జన్మించిన దాశరథిపై చిన్నప్పుడే అభ్యుదయ భావాల ప్రభావం పడిరది. సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషల్లో మంచి పండితుడు. ఉపాధ్యాయుడిగా, పంచాయితీ ఇన్‌స్పెక్టరుగా, ఆకాశవాణి ప్రయోక్తగా ఉద్యోగాలు చేసాడు. ఉర్దూకవి ఇక్బాల్ కవిత్వం తనపై తీవ్ర ప్రభావం చూపిందని ఆయనే చెప్పుకున్నారు. ‘ఏ పొలమున నిరుపేదకు దొరకదో తిండి, ఆ పొలమున గల పంటను కాల్చేయండి’ అనే పద్యం తన హృదయానికి ఉద్రేకం కలిగించేదని చెప్పుకున్నారు. అత్యంత చిన్న వయసులోనే సాహిత్యాన్ని ప్రజా సంక్షేమంకోసం సృజియించిన కృష్ణమాచార్య గొంతు నుంచి ఆలపించబడిన పద్యాలు, కవితలు పదునైన ఆయుధాలుగా మారాయి. తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించాయి. ముసలి నక్కకు రాజరికమా అంటూ నిలదీస్తూ ఈ తెలంగాణం రైతులదేనని నినదిస్తూ ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ’ అని గర్వంగా ప్రకటించిన మహాకవి పోషించినపాత్ర అనన్య సామాన్యం.
నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు దుర్భర జీవితాలను గడిపేవారు. నిజాం నిరంకుశ పరిపాలనలో ప్రజలకు ఎలాంటి స్వేచ్ఛ ఉండేది కాదు. ప్రజలు తమ మనసులోని కోర్కెలను తెలుపడానికి వీలుండేది కాదు. సభలు ఏర్పాటుచేసి తమ కష్టాలను, బాధలను చేప్పుకోవడమనేది అసాధ్యం. ప్రజలపై అధికపన్నులు విధించడం, వారి భూములను లాక్కోవడం సాధారణ అంశాలు. తెలంగాణ ప్రాంతంలో నవాబుల కింద పనిచేస్తున్న రజాకార్లు ప్రజలపాలిట నరభక్షకుల్లా తయారయ్యారు. నిజాం నవాబుల పరిపాలనలో స్వేచ్ఛÛ, స్వాతంత్య్రాలు ఉండేవి కావు. ఈ నేపథ్యంలోనే ఉన్మాద, కిరాతక, నియంతృత్వ, నిరంకుశ నిజాం నవాబును ఎదురించిన ప్రజల గొంతుక దాశరథిది. నిజాం ప్రభువుకి వ్యతిరేకంగా గొంతు సవరించి ఓ నిజాము పిశాచమా అంటూ పాడుతూ నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని ఎలుగెత్తి వినిపించి తెలుగు నేలపై ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. ఆయన అందించిన సాహిత్యంలో అగ్నిధార, మహాంధ్రోదయం, ‘రుద్రవీణ’ ‘మార్పు నా తీర్పు’ ‘ఆలోచనాలోచనాలు’ ‘ధ్వజమెత్తిన ప్రజ’ తదితరాలు ఉన్నాయి. ఆంధ్రమహాసభలో చైతన్యవంతమైనపాత్ర నిర్వహించి నిజాం ప్రభుత్వం జైలుశిక్ష విధించింది. పళ్ళు తోముకోవడానికిచ్చే బొగ్గుతో జైలు గోడలమీద పద్యాలురాసి దెబ్బలు తిన్నాడు. మంచి ఉపన్యాసకుడిగా భావప్రేరిత ప్రసంగాలతో ఊరూరా సాంస్కృతిక చైతన్యం రగిలించాడు. ఈ కోరిక అయన కవిత్వం నిండా దర్శనమిస్తుంది.
సమసమాజ నిర్మాణం కోసం కృషి చేసిన కలం కార్మికుడాయన. ఇదే ఆయన రాసిన ‘రానున్నది’ అనే కవితా ఖండికలో కనిపిస్తుంది. ఆ ఖండికలో…
రానున్నది యేది నిజం?
అది ఒకటే : సోషలిజం
కలపండోయ్ బుజం బుజం
కదలండోయ్ గజం గజం
అడుగడుగున యెడదనెత్రు
మడుగులుగా విడవండోయ్
పడిపోయిన గుడి గోడలు
విడిచిపెట్టి నడవండోయ్…అంటూ సోషలిజం సాధన పట్ల తనకున్న బలమైన కోరికను వ్యక్తం చేశారు.
పోరాటాల నుండి కళ పుడుతుంది. నాజీవితం పోరాటం. ఎన్నో ప్రతీపశక్తులతో పోరాటం చేశాను. పోరాడుతున్నాను. ఇంకా పోరాడగలను. నేను ఆశావాదిని. దురాశావాదులు నిరాశ పడతారు. ఆశావాదికి నిరాశలేదు. నమ్రతతో నాదారిన నేను పయనిస్తాను. నా గమ్యం ప్రపంచ శాంతి. నా ధ్యేయం ప్రజాస్వామ్య సామ్యవాదం అని ప్రకటించిన దాశరథి ఆ ఆశయ సాధన కోసమే జీవితాంతం కృషి చేశారు. పద్యం రాసినా, కవిత్వం చెప్పినా, వచన కవిత పాడినా అంతటా పోరాటమే. ప్రజాకవులు ఎవ్వరూ ప్రేక్షకులు కాదు. వారు ప్రజల కష్టనష్టాల్లో కలసిపోతారు. కాబట్టే కవిత అయినా, పద్యమైనా కాల్పనికతతో ఉబుసుపోక రాసినవికావు. దాశరథి సాహిత్యం అంతా తెలంగాణ ప్రజా ఉద్యమమే. దాశరథిది సమర సాహిత్యం. సాహిత్యం నిండా జనం గుండెల జ్వాలలు, సెగలు, పొగలతో శక్తివంతమై కవిత్వంగా ప్రవహించింది.
‘అనాదిగా సాగుతోంది అనంత సంగ్రామం`అనాధుడుకి, ఆగర్భ శ్రీనాధుడికి మధ్య’
అంటూ ‘అనంత సంగ్రామం’ కవితలో సమాజ పరిణామం క్రమాన్ని వెల్లడి చేశారు.
పెట్టుబడిదారి సమాజంలో రెండు విరుద్ధ శక్తుల మధ్య జరిగే పోరు పర్యవసానాలను అక్షరీకరిస్తూ….
‘కార్మికులు, కర్షకులు, శాస్త్రవేత్తలు, మేధావులు
తమ శ్రమకు తగిన ఫలితం ఇమ్మంటే ‘‘తిరుగుబాటు’’
షావుకారు వడ్డీలకు, జామిందార్ల హింసలకు
వేగలేక ఆగలేక తిరగబడితే ‘‘అతివాదం’’ అవుతున్నదని తనలోని అవేదనను వ్యక్తం చేశారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆస్థాన కవిగానూ, ఆంధ్ర విశ్వకళాపరిషత్ నుంచి కళాప్రపూర్ణ బిరుదును పొందిన దాశరథి సాహిత్యం ప్రజా ఉద్యమాలు నిర్వహించే వారందరికీ ఉద్యమ స్ఫూర్తి. ప్రజల కన్నీళ్లను, కడగళ్ళను తుడవడంకోసం జన సామాన్యం పక్షాన నిలిచిన ఆ మహాకవి తన అక్షరాలనే ‘అగ్నిధార’లు గా మలచుకొని నిజాం పాలన మీదికి ఎక్కుపెట్టారు. ఆయన రాసిన కవితా పుష్పకంకు ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. తిమిరంతో సమరంకు కేంద్ర సాహిత్య అకాడమి పురస్కారం అందుకున్నారు. ఆంధ్ర సారస్వత పరిషత్తు నిర్మాతల్లో దాశరథి ఒకరు. ఆంధ్రప్రదేశ్ ఆస్థానకవిగా 1977 ఆగష్టు 15 నుండి 1983 వరకు పనిచేశారు. రాష్ట్ర, కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతులు గెల్చుకునారు. అనేక సినిమాలకు గీతాలు రచించి అభిమానుల్ని సంపాదించుకున్నాడు. మీర్జాగాలిబ్ ఉర్దూ గజళ్ళను తెలుగులోకి గాలిబ్ గీతాలు పేర అనువదించారు. తల్లి మీద, తెలంగాణ మీద ఆయన రచించిన పద్యాలు నిత్య స్పూర్తినందిస్తాయి.
దాశరథి నిరుపేద గురించి చెబుతూ…
తరతరాల దరిద్రాల బరువులతో పరువెత్తే, నిరుపేదా!
విరుగుతోంది నీ మెడ పెరుగుతోంది నీ గుండెల్లో దడ…
అంటూ తాము చేస్తున్న శ్రమ విలువను గమనించని అమాయకుడని, అన్నార్తుడిగ మిగిలిపోతున్న వైనాన్ని పేర్కొంటూ నవ్య భవితకోసం అన్యాయపూరితమైన పాలకులపై విరుచుకుపడాలంటూ ఆయన చూపిన పోరుదారిలో శ్రామిక శక్తులన్నీ కలసికట్టుగా కృషిచేస్తూ ప్రజాస్వామ్య సామ్యవాదం అనే ఆశయ సాధనకోసం కంకణబద్దులవుదాం.
(నేటి నుంచి రెండురోజుల పాటు విశాఖలో జరుగుతున్న దాశరథి కృష్ణమాచార్య శత జయంతి ఉత్సవాల సందర్భంగా)
సెల్: 9059837847