Monday, February 6, 2023
Monday, February 6, 2023

ప్రజా సమస్యలపై ప్రతిపక్ష ఐక్యకార్యాచరణ

బినయ్‌ విశ్వం

నరేంద్రమోదీ ప్రభుత్వ పాలక విధానాలను 60శాతం దేశ ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. దేశం సంక్షుభిత పరిస్థితులలో పయనిస్తోంది. ఈ నేపథ్యంలో రాజకీయ పరిణామాలు చాలా వేగంగా మారనున్నాయి. అనేక మలుపులు చోటు చేసు కోవచ్చు. ఏ దేశంలోనైనా ప్రజల ఈతి బాధలు, ఆకాంక్షలను రాజకీయాలలో ప్రతిబింబించాలి. ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీల పాలన వచ్చిన తర్వాత ప్రజల కష్టాలు మరింత పెరిగాయి. మోదీ అనేక వాగ్దానాలను గుప్పిస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటీ ప్రజా సంక్షేమానికి ఉపయోగ పడేవి కాదు. సబ్‌కాసాత్‌ సబ్‌కా వికాస్‌ ముసుగులో దేశ, విదేశీ కార్పొరేట్లకు అనుకూల చర్యలనే మోదీ తీసుకుంటున్నారు. ఆత్మ నిర్భర్‌ పేరుతో భూమి ఆకాశాన్ని కూడా అపరిమితమైన ఆశలు గల అపార సంపన్నులైన వారికే కట్టబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటూ ప్రజల ప్రయోజనాలను విస్మరిస్తోంది.
ఒక్కటైన ప్రతిపక్షం
ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షాలు ఒక్కటై ప్రజా వ్యతిరేక సమస్యలపైన ఐక్య కార్యాచరణ చేపట్టేందుకు నిర్ణయించాయి. ఆగస్టు 20వ తేదీన జరిగిన 19 ప్రతిపక్షాలసమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రజలజీవన ప్రమాణాలపై స్పందించిన ప్రతిపక్షాలు దేశ పరిస్థితులపైన చర్చించాయి. సామాన్య ప్రజల సమస్యలపైన కేంద్రీకరిస్తే ప్రతిపక్షాల చొరవ అర్ధవంతంగా ఉంటుంది. సామాజిక, రాజకీయ పరిస్థితులను ఈ సమావేశం అంచనా వేసింది. ఇదొక సానుకూలమైన ముందడుగుగా భావిస్తున్నారు. విశాలమైన భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలు ఒక రూపుదిద్దుకోవడం సంక్లిష్టమైన అంశమే. విభిన్న శక్తుల, పార్టీల భావనలు అనుసరించే ధోరణులు భిన్నంగా ఉంటాయి. అయితే, నేడున్న వాస్తవ సరిస్థితులను దృష్టిలో ఉంచుకొన్నప్పుడు అవసరమైన రాజకీయ కార్యాచరణకు ఎంతో కాలం వేచి ఉండటం సరైనది కాదని ప్రతి ఒక్కరికి అనిపిస్తోంది. ప్రజలలో విశ్వాసం, ఆశాభావం కలిగేందుకు రాజకీయ కార్యాచరణలు దోహదం చేస్తాయి. మోదీ ప్రభుత్వాన్ని 60శాతం మంది వ్యతిరేకిస్తున్నప్పటికీ వ్యతిరేకత ఏకోన్ముఖంగా లేదు. వీరంతా ఐక్య కార్యాచరణ చేపట్టినట్లయితే దేశ రాజకీయాలు మారిపోతాయి. అలాంటి మార్పు తప్పనిసరి. అయితే అది అంత తేలిక కాదు.
2024లో రాజకీయ పోరు కీలకం
వివిధ ప్రతిపక్ష పార్టీలు తమతమ పంథాలో నిరసన తెలియజేస్తున్నాయి. అయితే విశ్వసనీయమైన ప్రత్యామ్నాయాన్ని ప్రజలు కోరుకుంటున్న దశలో ఏకోన్ముఖ రాజకీయ కార్యాచరణ మాత్రమే విశ్వాసాన్ని కల్పించగలదు. సెక్యులర్‌, ప్రజాస్వామ్య, వామపక్ష శక్తులతో కూడిన విశాల ఐక్యవేదిక అవసరమని 2015 నుంచి సీపీఐ ప్రతిపాదిస్తున్నది. అలాంటి ప్రయత్నం ఏదైనా పార్టీ ఆహ్వానిస్తుంది. 2024లో జరగనున్న రాజకీయ పోరాటం దేశ భవిష్యత్తుకు నిర్ణయాత్మకమైనది. అత్యధిక ప్రజలు గత ఎన్నికల్లోను బీజేపీకి వ్యతిరేకంగానే ఓటు చేశారు. వీరి శాతం 60కి పైగానే ఉంది. వివిధ రాజకీయ, ప్రజాస్వామ్య శక్తులు ఉమ్మడిగా కదిలి అవాంఛనీయమైన ఈ ప్రభుత్వాన్ని గద్దె దించాలి. అయితే ఇది నిర్దిష్టమైన సంక్లిష్టతలతో కూడిన భారీ లక్ష్యం. సెక్యులర్‌, ప్రజాస్వామ్య పంథాకు కట్టుబడి ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా ఈ లక్ష్యం నుండి దూరంగా ఉండదు. కొద్ది కాలంలోనే ఈ లక్ష్య సాధనకు ముందడుగు వేయాలి. ఈ దిశలోనే 19 ప్రతిపక్ష పార్టీల సమావేశం పయనించాలని నిర్ణయించింది. ఈ సమావేశాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఏర్పాటు చేశారు. అన్ని అంశాల పైన ఏకాభిప్రాయం ఉండదు. వీరి మధ్య భావజాల పరమైన, రాజకీయ విభేదాలు ఉంటాయి. అయినప్పటికీ ఉమ్మడి శత్రువుపై పోరాడాలన్న అవగాహనకు వచ్చాయి.
సెప్టెంబరులో దేశ వ్యాప్త నిరసన
సెప్టెంబరు 20 నుంచి 30వ తేదీ వరకు దేశ వ్యాప్త నిరసన పోరాటాన్ని నిర్వహించాలని ఈ సమావేశం నిర్ణయించింది. రాజకీయ కార్యాచరణలో ఇది ప్రశంసనీయమైన అడుగు. ప్రజలను వేధిస్తున్న సమస్యలపై పదకొండు డిమాండ్లపైన నిరసన చేపట్టనున్నారు. రైతులు, కార్మికులు న్విహిస్తున్న పోరాటాల పరిష్కారం తదితర అంశాలపైన నిరసన తెలియజేయనున్నారు. ఈ డిమాండ్లలో సమాజంలో అణగారిన వర్గాల ప్రజలకు సంబంధించినవే ఉన్నాయి. వామపక్షాలు ఈ సమస్యలను గుర్తించాయి. ఈ పోరాటం సామాన్య ప్రజల కోసమే. ఈ ఆందోళన కార్యక్రమం పెద్దఎత్తున, అర్థవంతంగా జరిగేందుకు వామపక్ష ప్రజాస్వామ్య, సెక్యులర్‌ శక్తులు కీలక పాత్ర నిర్వహించవలసి ఉంది. దేశ మౌలిక సూత్రాలకు కట్టుబడి ఉన్న ప్రజల ప్రయోజనాలను పరిరక్షించటంలో ఈ ఆందోళన పునాది కానున్నది.
సంక్షోభంలో ఆర్థిక వ్యవస్థ
దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. పెద్దనోట్ల రద్దు, జీఎస్‌టీ తదితర మోదీ ప్రభుత్వ నిర్ణయాలు మెజారిటీ ప్రజల జీవన ప్రమాణాలను దెబ్బతీశాయి. నిరుద్యోగం 9.17 శాతానికి ( సీఎమ్‌ఐఈ 2021 జూన్‌ ) చేరింది. ద్రవ్యోల్బణం 12శాతానికి జులై 2021 నాటికి ఎగబాకింది. ప్రపంచ ఆరోగ్య సూచీలో 107 దేశాలలో మన దేశం 94వ స్థానంలో ఉన్నది. మోదీ చెప్పే స్వయం సమృద్ధి, పురోగామి భారత్‌ దుస్థితి ఇది. కొవిడ్‌ మూలంగానే ఈ దుస్థితి రాలేదు. ప్రభుత్వ అనుకూల ప్రచార దళాలు ఈ స్థితికి కారణం కొవిడ్‌ అని ప్రచారం చేస్తున్నాయి. ఇది మనిషి చేసినదే గాకుండా ఈ వ్యవస్థలోనే ఉంది. ఆర్థిక మంత్రి మాత్రం ఇది దేవుడు చర్య అని మాట్లాడతారు. ప్రజల బాధలను, సమస్యలను తీర్చడానికి బదులుగా మోదీ ప్రభుత్వం వారికి మరిన్ని కష్టాలను సృష్టిప్తోంది. రైతు వ్యతిరేక చట్టాలు, కార్మిక వ్యతిరేక కోడ్స్‌, బీమా జాతీయకరణ సవరణ చట్టం అలాగే అనేక ప్రభుత్వ రంగ సంస్థల విక్రయం వంచనతో కూడిన ఈ ప్రభుత్వ అసలు స్వరూపాన్ని, దేశ వ్యతిరేకతను ప్రతిబింబిస్తున్నాయి ˜మత ఘర్షణలు, సామాజిక విభజనను ఆర్‌ఎస్‌ఎస్‌, దాని అనుబంధ సంస్థలు సృష్టిస్తూ కార్పొరేట్‌ అనుకూల విధానాలను తెర వెనుక నుండి రూపొందిస్తోంది. ప్రజా అసమ్మతిని, సమస్యలపై చర్చించడాన్ని బీజేపీ ప్రభుత్వం అణచివేస్తూ తన ఫాసిస్టు వైఖరిని ప్రదర్శిస్తోంది. పార్లమెంటు శీతాకాల సమావేశంలో ప్రజానుకూల చట్టాలను చేయవలసిన ఈ గొప్ప సంస్థ పట్ల ప్రభుత్వానికి ఎంత గౌరవముందో స్పష్టమైంది. తమ వర్గ ప్రయోజనాల కోసం ఫాసిస్టులు ప్రజాస్వామ్యాన్ని, పార్లమెంటు వ్యవస్థలను నామమాత్రంగా ఆమోదిస్తారు. ఈ పరిస్థితులు ప్రజాస్వామ్య భవితకు ముప్పుగా పరిణమించే బలమైన సూచనలున్నాయి.
వ్యాస రచయిత సీపీఐ కార్యదర్శి, పార్లమెంటరీ పార్టీ నాయకుడు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img