Wednesday, February 8, 2023
Wednesday, February 8, 2023

ప్రతిపక్షం అసెంబ్లీ ఎన్నికలపై శ్రద్ధ చూపాలి

నిత్య చక్రవర్తి

జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలు అసాధారణ ఐక్యతను ప్రదర్శించాయి. నరేంద్రమోదీ ప్రభుత్వ విధానాలపై పోరాటానికి ఒకే మాట మీద నిలవాలని నిర్ణయించాయి. పెగాసస్‌ నిఘా వ్యవహారంపై చర్చ నుండి తప్పించుకోవడానికి ఎత్తులు వేసిన ప్రభుత్వం పార్లమెంట్‌ను రెండు రోజులు ముందుగానే నిరవధిక వాయిదా వేసింది. 13వ తేదీ వరకూ జరగాల్సిన సభలను 11వ తేదీనే ముగించారు. పెను ప్రకంపనలు సృష్టించిన బోఫోర్సు కుంభకోణం సమస్య 1989 పార్లమెంటు ఎన్నికల్లో రాజీవ్‌గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ను ఓటమిపాలు చేసింది. పెగాసస్‌ నిఘా వ్యవహారం కూడా ప్రజ్వలిత సమస్యే. సభల్లో చర్చిస్తే తన ప్రభుత్వానికి కూడా ముప్పు కలుగుతుందేమోనని మోదీ భావించి సభను ముందుగానే వాయిదా వేశారు. 1989లో కాంగ్రెస్‌ ఓడిపోగా వి.పి.సింగ్‌ నాయకత్వంలో ఏర్పడిన ప్రభుత్వానికి బయటి నుండి వామపక్షాలు, బీజేపీ మద్దతు నిచ్చాయి. పెగాసస్‌ సమస్య, మూడు వ్యవసాయ చట్టాలు, కరోనా మహమ్మారి కాలంలో పేదలను, అసంఘటిత రంగంలో పనిచేసే వారిని ఆదుకోవడంలో మోదీ ప్రభుత్వ ప్రధాన వైఫల్యం తదితర ప్రజాసమస్యలు తక్షణం చర్చనీయాంశాలు. బోఫోర్సు కంటే చాలా రెట్లు ఎక్కువగా ఈ సమస్యలు ప్రజలతో పూర్తిగా ముడిపడి ఉన్నవి. ఈ సమస్యలపైన ప్రతిపక్షాలన్నీ కలసి సంయుక్త పోరాటం చేసి 2022లో, 2023లో జరిగే అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కోవాలి. సమస్యల ఆధారంగా పోరాడుతూ అసెంబ్లీల ఎన్నికల తర్వాత 2024లో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలి.
ఈ నెల 20న సోనియాగాంధీ ప్రతిపక్ష పార్టీల నాయకులను ఆహ్వానించి సమావేశం ఏర్పాటు చేశారు. ఎన్‌సిపి నేత శరద్‌ పవార్‌, బెంగాల్‌, మహారాష్ట్ర, తమిళనాడు ముఖ్యమంత్రులు మమతా బెనర్జీ, ఉద్దవ్‌ థాక్రే, ఎం.కె.స్టాలిన్‌ ఇతర ప్రతిపక్ష పార్టీల నాయకులు హాజరుకానున్నారు. కపిల్‌ సిబల్‌ ఏర్పాటు చేసిన విందు సమావేశానికి బీజేడీ, టీడీపీ, వైఎస్‌ఆర్‌సీపీ నాయకులు హాజరై కేంద్రం విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ప్రతిపక్షాల ఐక్యతకు భూమిక ఏర్పడినప్పటికీ ఆయా పార్టీల మధ్య పొందిక సక్రమంగా లేదన్న సూచనలు ఉన్నాయి. శరద్‌పవార్‌ తదితర నాయకులు ప్రతిపక్షాల ఐక్యతకు ఆటంకంగా ఉండే సమస్యలను పరిష్కరించగలరని భావిస్తున్నారు. అంతక్రితం జరిగిన సమావేశాలకు, రాహుల్‌ నాయకత్వంలో జరిగిన ర్యాలీలో తృణమూల్‌ ఎంపీలు పాల్గొనలేదు. ఎన్ని విభేదాలున్నా సర్దుకొని 2024 లోక్‌సభ ఎన్నికలను కలిసికట్టుగా ఎదుర్కొంటేనే ప్రజలు ఆదరించే అవకాశాలుంటాయి. మమత ప్రతిపక్షాల తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ముందుకు వస్తారని భావించారు. అయితే ప్రధాని అభ్యర్థి విషయం మాట్లాడేందుకు ఇది తగిన సమయం కాదని మమత స్పష్టం చేశారు.
జులై 26న దిల్లీ చేరిన మమత ఐదు రోజులు దిల్లీలో పర్యటించిన సందర్భంలోనే ప్రతిపక్షాల ఐక్యతకు ఒక స్వరూపం ఏర్పడిరది. అయితే ప్రతిపక్షాల ఐక్యత మరింతగా బలపడాలి. ప్రతిపక్షాల నాయకులు ఒకరిపై మరొకరు విమర్శలు ఎక్కుపెట్టకుండా ఒకే మాటకు కట్టుబడి ఉంటేనే ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. ఉత్తరప్రదేశ్‌లో మినహా ఎన్నికలు జరగనున్న ఇతర రాష్ట్రాల్లో బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ పైన మమత, రాహుల్‌, ప్రియాంకల సమక్షంలోనే మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్‌ వ్యూహం, ఇతర ప్రతిపక్షాల వ్యూహంతో ఏకీభవిస్తుందా లేదా అనేది మున్ముందు గానీ తేలదు. మమత చొరవతో ప్రశాంత్‌ కిశోర్‌ అసెంబ్లీలకు, పార్లమెంటుకు జరిగే ఎన్నికల్లో కాంగ్రెసు, ఇతర రాజకీయ పార్టీల మధ్య గరిష్ట అవగాహన కలిగేందుకు ప్రణాళిక రూపొందించినట్టు తెలుస్తోంది. రాష్ట్రాలలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే ప్రతిపక్షాలు కలసి పోటీ చేయలేకపోతే విడివిడిగా స్థానిక రాజకీయ ఒత్తిళ్ల మేరకు పోటీ చేస్తాయి. లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం వీలైనంత ఎక్కువగా బీజేపీకి వ్యతిరేకంగా అన్ని ప్రతిపక్షాలు కలిసి పోటీచేసే అవకాశం ఉంటుంది.
క్షేత్ర స్థాయిలో ఉన్న పరిస్థితుల అంచనాను బట్టి ప్రతిపక్షాలు పోటీ చేయవలసి ఉంటుంది. బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌లో పూర్తి స్థాయి అవగాహన కుదరనిచోట బీజేపీ వ్యతిరేక ఓట్లు చీలకుండా అత్యధికంగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇది చాలా కష్టమైన కసరత్తే కాని అసాధ్యం కాదు. పంజాబ్‌, ఉత్తరాఖండ్‌, గోవా, మణిపూర్‌లలో కాంగ్రెస్‌ అధికారానికి వస్తేనే రాహుల్‌గాంధీ తన సత్తా నిరూపించుకున్నట్లవుతుంది. పంజాబ్‌లో కాంగ్రెస్‌ గెలుపు అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి. తక్కిన మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్‌ గెలుపొందితేనే ఆ పార్టీపై విశ్వాసం ఏర్పడుతుంది. కాంగ్రెస్‌ మంచి ఫలితాలను సాధించలేకపోతే రాహుల్‌ ప్రతిపక్ష ఫ్రంట్‌కు నాయకత్వం వహించే అవకాశం ఉండదు. మమతా బెనర్జీ ఇప్పటికే బెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మోదీ, అమిత్‌షాల సవాళ్లను ఎదుర్కొని నిలిచి బ్రహ్మాండమైన విజయం సాధించి తన సత్తా నిరూపించుకొన్నారు. త్రిపురలోనూ బీజేపీని సవాల్‌ చేయనున్నారు. మమత పైన ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విశ్వాసం కలిగి ఉన్నారు. అయితే ప్రతిపక్ష ఫ్రంట్‌తో కలిసే విషయాన్ని ఇప్పుడే నిర్ణయించుకోలేని స్థితిలో ఉన్నారు. అవసరమైతే బీజేపీతో సంబంధాలు కొనసాగిస్తారు. ప్రతిపక్ష ఫ్రంట్‌ ముందుగా అసెంబ్లీల ఎన్నికల పైన ముఖ్యంగా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల పైన కేంద్రీకరించి పని చేయాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img