Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ప్రపంచంపై వేలాడుతున్న అణుబాంబు

సి.ఆదికేశవన్‌
ప్రపంచంపై అణుయుద్ధంనీడ విస్తరిస్తున్నదని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్‌ తాజగా కూడా హెచ్చరించారు. అభివృద్ధిచెందిన దేశాల వద్ద అణ్వాయుధాలు, బాంబుల నిల్వలు పెరుగుతూనే ఉన్నాయి. అభివృద్ధిచెందిన దేశాల మధ్య వైరుధ్యాలు, చీలికలు మూలంగా ఉద్రిక్తతలు రోజురోజుకూ ఎక్కువవుతున్నాయి. ఒక్కసారి మనం రెండో ప్రపంచయుద్దం ముగిసే సమయంలో అమెరికా జపాన్‌ నగరాలైన హిరోషిమాపై 1945 ఆగస్టు 6వ తేదీన, 1945 ఆగస్టు 9న నాగసాకిలపై అణుబాంబులువేసి మానవాళిపట్ల అత్యంత క్రూరంగా వ్యవహరించిన ఘోరాన్ని గుర్తుచేసుకోవాలి. జపాన్‌ నగరాలు అనేకం మంటల్లో కాలిపోయాయి. ఎంతమంది మరణించారన్న సంఖ్య తెలియకపోయినప్పటికీ, మృతులు లక్షల్లోనే ఉంటారని భావించవచ్చు. ఈ మృతుల సంఖ్య లక్షా పదివేలని కొందరు, రెండులక్షల పదివేలని మరికొందరు అంచనావేశారు. రెండో ప్రపంచ యుద్ధం అనంతరం వివిధ రకాల వ్యాధులతో తల్లడిల్లిన ప్రజలు లక్షల్లోనే ఉన్నారు. ఇప్పటికీ కళ్లకు కాటరాక్టులు, శరీరంపై హానికరమైన గడ్డలు, థైరాయిడ్‌, రొమ్ము, ఊపిరితిత్తుల కేన్సర్ల మూలంగా అనేక లక్షలమంది బాధపడుతున్నారు. అణుబాంబులు వేసని తర్వాత జన్మించిన మూడుతరాల వారిపైనకూడా వాటి విపత్కర పరిణామాలు సంభవించాయి. అణ్వాయుధాలవల్ల మానవాళికి ఎంత ప్రమాదమనే అంశాన్ని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా వేసినబాంబులు గుర్తుచేస్తున్నాయి. బాంబుల ప్రభావానికి గురైనవారు ప్రమాదకరమైన వ్యాధులతో తల్లడిల్లారు. అనేకరకాల వ్యాధులతో బాధలు పడుతున్నారు. దాదాపు 80ఏళ్ల క్రితం ఈ దుర్ఘటన ప్రపంచమానవాళికి తీవ్రమైన హెచ్చరిక.
సైనిక వ్యయం ప్రతిఏడాది పెరుగుతూనేఉంది. గత సంవత్సరం ఆయుధాల కొనుగోళ్ల విలువ రెండు ట్రిలియన్‌ డాలర్లకంటే ఎక్కువగాఉంది. ఇది ప్రపంచ జీడీపీలో 2.2శాతంగా అంచనావేశారు. అమెరికాలో 2022లో సైనిక వ్యయానికి 877 బిలియన్‌ డాలర్లు కేటాయించారు. ప్రపంచవ్యాప్తంగా కేటాయించిన నిధుల్లో అమెరికా ఒక్కటే 39శాతం కేటాయించింది. స్టాక్‌హోమ్‌ అంతర్జాతీయ శాంతి పరిశోధనా సంస్థ ప్రకారం, అమెరికా సైనిక కార్యకలాపాలకు, నిర్వహణకు 295 బిలియన్‌ డాలర్లు కేటాయించిందని తెలిపింది. ఇటీవల కాలంలో శాంతిగ్రూపులు, సైనికవ్యయాన్ని ఇకపై అమెరికా నిలిపివేయాలని తద్వారా ప్రపంచంపై వేలాడుతున్న అణుయుద్ద ముప్పును నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. చరిత్ర సృష్టించిన క్యూబా విప్లవనేత ఫిడెల్‌ కాస్ట్రో అణుయుద్ధ ముప్పును గురించి పదేపదే హెచ్చరించారు. అణుయుద్దంకనుక సంభవిస్తే ప్రపంచ మానవాళికి అది తుది దినం అవుతుందని ఆయన అనేకమార్లు ప్రపంచ నాయకులను హెచ్చరించారు. అత్యంత ప్రమాదకరమైన ఆయుధాలను నిల్వచేయడం ఎంతమాత్రం సురక్షితంకాదని కాస్ట్రో అన్నారు. అణ్వాయుధాలు మానవాళి రక్షణకు ఉపయోగపడవని ఆయన చెప్పారు. నేడు ఉక్రెయిన్‌లో కమ్యూనిస్టులంతా మరణం ముప్పును ఎదుర్కొంటున్నారు. ఉక్రెయిన్‌లో కమ్యూనిస్టు యువనాయకులు అలెగ్జాండర్‌ కొనొ నొ విచ్‌, ఆయన సోదరుడు మైఖేల్‌ అరెస్టయి గృహనిర్బంధంలో ఉన్నారు. తమకు మరణముప్పు ఉందని ఇరువురు వెల్లడిరచారు. ఈ కార్యకర్తల అరెస్టులో ప్రపంచవ్యాప్తంగా అనేకమంది ఖండిరచారు. వీరి అరెస్టును, గృహ నిర్బంధాన్ని వివిధ కమ్యూనిస్టు, ప్రగతిశీల యూత్‌ గ్రూపులు ఖండిస్తూ ప్రకటనలు చేశాయి. పోలీసు అధికారులు పదేపదే తమ ఇంటికివచ్చి హత్యచేస్తామని బెదిరిస్తున్నారు. వీరి ఇంటి అడ్రసును ప్రకటించి వీరిని హత్యచేయాలని ప్రజలను కొరుతూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేస్తున్నారు. ప్రపంచ ప్రజాస్వామ్య యువజన సమాఖ్య, గ్రీస్‌ కమ్యూనిస్టుపార్టీ, గ్రీసు కమ్యూనిస్టు యూత్‌ తక్షణం వారి ఇద్దరినీ గృహనిర్బంధం నుంచి విడుదల చేయాలని డిమాండ్‌ చేశాయి. ఏథెన్స్‌లోఉన్న ఉక్రెయిన్‌ రాయబార కార్యాలయం ముందు గ్రీసు కమ్యూనిస్టు పార్టీ, యువజన సమాఖ్య కార్యకర్తలు నిరసన ప్రదర్శన జరిపారు. ఉక్రెయిన్‌`రష్యా మధ్యజరుగుతున్న యుద్ధానికి అంతం పలకడానికి బదులుగా అమెరికా దాన్ని తైనాతి దేశాలు ఉక్రెయిన్‌కి ఆధునిక ఆయుధాలను సరఫరాచేసి యుద్ధం కొనసాగడానికి దోహదం చేస్తున్నాయి. ఈ విషయం తెలిసినప్పటికీ భారత్‌ అమెరికా వెంటనడుస్తూ హానికరవ్యూహాన్ని అనుసరిస్తున్నది. రష్యా, చైనా దేశాల మధ్య ఇటీవలికాలంలో ఏర్పడిన సఖ్యతను దెబ్బతీయాలని అమెరికా అనేకరకాల ప్రయత్నాలు చేస్తున్నది. భారత దేశంతో సహా ఆరు అభివృద్ధి చెందిన దేశాలు ఆయుధాల కొనుగోళ్లను మరింత పెంచుతున్నాయి. శాంతి పరిరక్షణకోరుతూ నిల్వపడిన అణ్వాయుధాలను ధ్వంసంచేయాలని అనేకమార్లు ఐక్యరాజ్యసమితి, శాంతిసంస్థలు చేసిన విజ్ఞప్తిని అమెరికా దాని అనుంగుదేశాలు పట్టించుకోవడంలేదు. అణ్వాయుధాలను నిరోధించాలని, ఉన్న ఆయుధాలను ధ్వంసం చేయాలని ప్రపంచదేశాల్లో ప్రజాఉద్యమాలు రావలసిన అవసరంనేడు ఎంతైనాఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img