Sunday, December 4, 2022
Sunday, December 4, 2022

ప్రపంచ పేదరికంలో 60 శాతం భారత్‌లోనే

ప్రొఫెసర్‌ బి.రామకృష్ణారావు

కరోనా మొదటి రెండు దశలలో సృష్టించిన సంక్షోభం పేద ధనికుల మధ్య భారీ అంతరాలతో ఒక కొత్త ప్రపంచాన్ని వెలుగులోకి తెచ్చింది. ఇక పొంచి వున్న మూడో దశ ఎక్కడకు దారితీసి ఈ అంతరాలను ఎంత పెంచుతుందోనని అందరూ భయభ్రాంతు లవుతున్నారు. ఈ సంక్షోభం దేశాన్ని ప్రజలను ఆర్థికంగా దెబ్బతీసి ప్రజల జీవన ప్రమాణాలను భారీగా దిగజార్చింది. 2005-06 నుంచి 201516 మధ్యకాలంలో 2730 కోట్ల మంది దారిద్య్రం నుంచి బయటపడ్డారని, ఈ దశాబ్ద కాలంలో పేదరిక నిర్మూలనలో భారత్‌ గణనీయమైన ప్రగతి సాధించిందని యుఎన్‌ఓ నివేదిక వెల్లడిరచింది. కానీ ఆ తర్వాత కాలంలో కేంద్రం తీసుకున్న పెద్ద నోట్ల రద్దు, జీయస్‌టీ వంటి తొందరపాటు చర్యల వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ కరోనాకు ముందే తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి జారుకొంది. గోరుచుట్టుపై రోకటిపోటులా అదే సమయంలో కరోనా మహమ్మారి జడలు విప్పింది. ఈ ఏడాది జనవరికి దేశంలో వృద్ధిరేటు రికార్డు స్థాయిలో () 9.6 శాతానికి దిగజారిన విషయాన్ని గమనిస్తే దేశ ప్రజల జీవన ప్రమాణాలపై దాని ప్రభావం ఏ మేర పడిరదో విశదమవుతుంది. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 15 శాతం, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం పెరిగిందని అజీం ప్రేంజీ విశ్వవిద్యాలయ పరిశోధకులు పేర్కొన్నారు.
మహమ్మారి సోకిన ధనవంతులు చాలా వరకు ఈ గండం నుంచి గట్టెక్కగలిగారు. పేదలు, మధ్యతరగతి కుటుంబాల పరిస్థితి దీనికి భిన్నం. దీర్ఘకాలం లాక్‌డౌన్‌ విధించడం వల్ల వీరందరూ తమ ఉపాధిని పోగొట్టుకున్నారు. వ్యాధి సోకిన వారిలో చాలామంది తమ ఆదాయాలను, దాచుకున్న సొమ్మును, ఉద్యోగాలను, కొనుగోలు శక్తినీ తమ ఆరోగ్యంతోబాటు పోగొట్టుకున్నారు. వైద్యానికి చేతిలో సొమ్ము లేక అప్పులపాలయ్యారు. ఇంటి యజమాని, యజమానురాలు మరణించడంతో పిల్లలు అనాథలుగా మిగిలిపోవడం బాధాకరం. హోటళ్ళు, సినిమా థియేటర్లు, ఆతిథ్యం, రవాణా, టూరిజం వంటి అసంఘటిత రంగాల్లో పనిచేసే పేద కార్మికులు కొవిడ్‌ మూలంగా తమ ఉపాధి కోల్పోయారు.
ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి పేదరికం, అసమానతలను మరింత పెంచింది. భారత్‌ వంటి పేద దేశాలను ఇది కోలుకోలేని దెబ్బ తీసింది. కొవిడ్‌ రెండో దశ పతాక స్థాయిలో ఉన్న జూన్‌ నెలలో ఊపిరి ఆడక, ఆక్సిజన్‌ అందక లక్షల మంది ఆసుపత్రుల్లోనూ, బయటా ఇబ్బంది పడుతున్న సమయంలో మెర్సిడెస్‌ సూపర్‌ లగ్జరీ కారు ఎస్‌యువి అమ్మకాలు రికార్డు స్థాయిలో పెరిగాయి. దేశ కష్టకాలంలో అంబానీ కంపెనీ లాభాలు భారీగా పెరగడం గమనార్హం. గత ఏడాది 202021లో ఎన్నడూ లేని రీతిలో దేశ జీడీపీ భారీగా కోసుకుపోయినా, దేశంలో బిలియనీర్లు 102 నుండి 140కి పెరిగారు. అదే సమయంలో 75 మిలియన్ల మంది భారతీయులు పేదరికంలోకి జారుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా పెరిగిన పేదరికంలో ఇది 60 శాతమని ప్యూరిసెర్చి సంస్థ పేర్కొంది. అలాగే దేశంలో సుమారు 230 మిలియన్ల మంది రోజువారీ ఆదాయం దేశ జాతీయ కనీస ఆదాయం అయిన రూ.320ల కన్నా దిగజారిందని, అదే సమయంలో స్టాక్‌ మార్కెట్‌లో విశేషంగా పెట్టుబడులు జరిగాయని అజీం ప్రేంజీ విశ్వవిద్యాలయ అధ్యయనం పేర్కొంది. సీఎంఐఈ సమాచారం ప్రకారం గత ఏడాది లాక్‌డౌన్‌ పతాక స్థాయిలో ఉన్నప్పుడు దేశంలోని నిరుద్యోగం 23.5 శాతం స్థాయికి పెరిగిన సమయంలో లిస్టెడ్‌ కంపెనీల లాభాలు గత 10 సంవత్సరాలలో ఎన్నడూ లేని రీతిలో దేశ జీడీపీలో 2.6 శాతం మేరకు పెరిగాయని రిజర్వు బ్యాంకు మాజీ గవర్నరు దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. జనాభాలో అధిక సంఖ్యాకులు కరోనా బారిన పడి ఆదాయం కోల్పోవడంతో వారి కొనుగోలు శక్తి పడిపోయింది. ఫలితంగా వస్తు సేవల గిరాకీ సన్నగిల్లింది. లాక్‌డౌన్‌తో ఫ్యాక్టరీలు మూతపడడం, ఎక్కడా పనులు లేకపోవడం కూడా ఇందుకు కారణం. ఈ దుస్థితిని చక్కదిద్దాలంటే ప్రజల చేతిలో నగదు చేరాలి. ఈ సమస్యను కేవలం ప్రభుత్వాలు మాత్రమే నగదు బదిలీ పథకం, ఉపాధి హామీ పథకం వంటి చర్యలతో పరిష్కరించగలవు. లాక్‌డౌన్‌ కారణంగా పిల్లల చదువులూ కొండెక్కాయి. డిజిటల్‌ సౌకర్యం కొందరికి మాత్రమే పరిమితమైంది. విద్యా సంస్థలు ఆన్‌లైన్‌ తరగతులు మొదలుపెట్టడంతో పేద విద్యార్థులు చాలా మంది తరగతులకు దూరమయ్యారు. సిగ్నల్‌ సౌకర్యం లేక మరికొంతమంది విద్యార్థులు నష్టపోయారు. ఏసర్‌ సంస్థ నిర్వహించిన అధ్యయనంలో కేవలం మూడో వంతు పిల్లలు మాత్రమే ఈ ఆన్‌లైన్‌ తరగతులు వినియోగించుకున్నారని తేలింది. ఒక తరం పేదరికం నుంచి బయటపడాలన్నా, రెండో తరం జీవన ప్రమాణాలు పెరగాలన్నా విద్య ఒక్కటే సరైన ఆయుధం. అట్టి విద్యను పిల్లలకు అందించలేని నాడు దేశం ఎప్పుడూ పేద దేశంగానే కొనసాగుతుంది. అందరికీ నాణ్యమైన విద్యను అందించడంలో మన దేశం ఎప్పుడూ వెనకనే ఉందనేది వాస్తవం. దేశంలో తొలిదశ లాక్‌డౌన్‌, రెండో దశ పాక్షిక లాక్‌డౌన్‌ కర్ఫ్యూలతో పేదరికం భారీస్థాయిలో విస్తరించింది. పేదరికంలోకి జారిన మధ్య తరగతి కుటుంబాలు మరో అయిదారు సంవత్సరాల వరకు మరల తమ పూర్వ స్థితిలోకి వచ్చే అవకాశం లేదు. ఈ పరిస్థితిని ‘‘మిడిల్‌ ఇన్‌కం ట్రాప్‌’’ అంటారు. దేశ జనాభాలో 50 శాతం దిగువస్థాయి ప్రజల వద్ద ఉన్నంత సంపద కేవలం ఒక శాతం అగ్రస్థాయి ధనికుల వద్ద పోగయి ఉంది. ఆర్థిక వ్యవస్థ రథ చక్రాలను పరుగులెత్తించడానికై ఉత్పత్తి కార్యక్రమాలను వేగిరపర్చేందుకు తక్కువ వడ్డీరేట్లకు విడుదల చేసిన పెద్ద మొత్తాలను (భారీ రుణాలను) శ్రీమంతులు ఉత్పాదక కార్యక్రమాల్లో పెట్టకుండా, స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి తమ సంపదను కేవలం ఒక్క ఏడాదిలోనే 35 శాతం పెంచుకున్నారు. ఇక రిస్కుకు దూరంగా ఉన్న ఆదాయ వర్గాలు తమ మిగులు ఆదాయాన్ని బ్యాంకు డిపాజిట్లలో పెట్టారు. బ్యాంకు వడ్డీరేట్లు 100 బిపిఎస్‌ తగ్గించినప్పటికీ 202021లో బ్యాంకు డిపాజిట్లు 11.4 శాతం పెరగడం దీనికి బలం చేకూర్చుతోంది.
ఆర్థిక అసమానతలు దేశానికి మంచిది కాదు. ఆర్థిక అసమానతలకు ప్రాంతీయ అసమానతలు తోడైతే వేర్పాటువాదానికి దారితీస్తుంది. భారీ శాతం ఉన్న పేద, మధ్య తరగతి ప్రజల వస్తు సేవల వినియోగమే దేశ ఆర్థిక అభివృద్ధికి మూలం. ఆర్థిక వ్యవస్థ రథ చక్రాలు పరుగులెత్తాలంటే ఈ ప్రజల పాత్రే కీలకం. ఇది కార్యరూపం దాల్చాలంటే వీరి కొనుగోలు శక్తిని పెంచేలా వారి చేతిలో నగదు ఉండాలి. ఇది ప్రైవేట్‌ వ్యవస్థల్లో అసాధ్యం. కేవలం ప్రభుత్వాలే దీనిని చేయగలవు.
వ్యాస రచయిత ఆంధ్రా విశ్వవిద్యాలయం
విశ్రాంత ఆచార్యులు, 9849102403

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img