డా.జ్ఞాన్‌పాఠక్
భారతదేశంలో నిరుద్యోగం ప్రబలిపోతోంది. అయినప్పటికీ బీజేపీ నాయకత్వంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం లక్షల ఉద్యోగాలు సృష్టిస్తున్నామని ప్రచారం చేస్తోంది. 2023 మార్చితో ముగిసిన మూడు నెలలకాలంలో నిరుద్యోగం రేటు జనవరిలో 7.14శాతం కాగా, అది మార్చినాటికి 7.8శాతానికి పెరిగింది. ఈ మూడునెలల్లోనే 26లక్షల మంది ఉద్యోగాలు ఊడాయి. రానున్న రోజుల్లో మరికొన్ని లక్షలమంది ఉద్యోగాలు ఊడేప్రమాదం పొంచిఉంది. పెద్ద పెద్ద ఐటీ కంపెనీలు సైతం వేలాదిమందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న విషయం తెలిసిందే. ఒక్క మార్చిలోనే 22.7లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు. కార్మిక మార్కెట్‌లో క్షేత్రస్థాయి పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉంది. ఇటీవల రిజర్వు బ్యాంకు విడుదల చేసిన వినిమయదారుల విశ్వాసం సర్వే వాస్తవాలకు భిన్నంగా ఉంది. ఉద్యోగ మార్కెట్‌లో పరిస్థితి 2019 మధ్య కాలంలో ఉన్న పరిస్థితిని గుర్తు చేస్తోంది. ఆనాడు నిరుద్యోగం రేటు ఎక్కువగా నమోదైంది. రానున్న సంవత్సరంలో ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని వినిమయదారులు ఆశిస్తున్నారు. అయితే కోవిడ్‌కేసులు తిరిగి పెరుగుతున్న తరుణంలో పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ఇంకా నిర్దిష్టమైన అంచనాకు వచ్చే అవకాశంలేదు. ఆర్‌బీఐ సర్వే పూర్తి అవాస్తవమని సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమి (సీఎమ్‌ఐఇ`భారత ఆర్థికవ్యవస్థ పరిశీలనా కేంద్రం) తన తాజా నివేదికలో స్పష్టం చేసింది. 2022 డిసెంబరులో కార్మికులు 40.5శాతం పనులు చేస్తుండగా అది 2023 మార్చి నాటికి 39.8శాతానికి తగ్గింది. ఎందుకంటే కార్మిక మార్కెట్‌లో డిమాండు తగ్గింది.
అలాగే 2022 డిసెంబరులో ఉద్యోగిత రేటు 37.1శాతం నమోదుకాగా 2023 మార్చినాటికి 36.7శాతానికి తగ్గింది. అంటే ఈ కాలంలో 26లక్షల మందికిపైగా ఉద్యోగులు, కార్మికుల ఉద్యోగాల ఊడిపోయాయి. ఒక్క మార్చిలోనే మార్కెట్‌లో మాంద్యం ఏర్పడి 22.7లక్షల మంది ఉద్యోగాలు, పనులుకోల్పోయారు. మార్కెట్‌లో ఉన్న ఆందోళనకరమైన పరిస్థితిని ఈ సంఖ్య తెలియజేస్తోంది. ఒక్కనెలలోనే లక్షల ఉద్యోగాలు కోల్పోవడం కార్మిక మార్కెట్‌లోఉన్న తీవ్ర ఒడిదుడుకులను తెలియజేస్తున్నది. ఉద్యోగాలు కోల్పోయినవారు తక్కువ నాణ్యత, వేతనాలు ఉండే పనులలోనైనా సర్దుబాటు చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు. నిర్మాణరంగంలో పని చేస్తున్న కార్మికులు అత్యధికంగా పనులు కోల్పోయి ఆర్థిక ఇబ్బందులకు లోనవుతున్నారు. నిర్మాణరంగంలో ఫిబ్రవరి నెలలో 723.4లక్షల మందికి పనులు లభించగా, మార్చిలో ఇవి 627.6లక్షల కోట్లు తగ్గిపోయాయి. ఇది తీవ్ర ఆందోళన కలిగించే అంశం. ఆర్‌బీఐ వాస్తవ అంశాలను మరుగున పరచి మోదీ ప్రభుత్వానికి సహకారంగా ఉంటుందన్న భావన కలుగుతోంది. కోవిడ్ మహమ్మారి రెండవదశలో విజృంభించింది. 2021మే నెల నాటి నుంచి నిర్మాణరంగం అలాగే వివిధ పరిశ్రమలలో ఉద్యోగులు, కార్మికులస్థితి అత్యంత దారుణంగాఉంది. ఆ సమయంలో ఒక్క నిర్మాణరంగంలోనే 116లక్షలమంది కార్మికులు పనులు లేక అల్లాడిపోయారు.
కరోనా రెండవ దశలోనే చిల్లర వాణిజ్యం అధ్వాన్న పరిస్థితిని ఎదుర్కొంది. ఈ రంగంలో పనిచేసేవారు కనీసం 80లక్షలమంది పనులు కోల్పోయారు. 2021 మే నెల నుంచి ఇదే అత్యంత దారుణమైన పరిస్థితిగా విశ్లేషించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చిల్లరవ్యాపారంలో 757.5 లక్షల మంది పనిచేస్తుండగా, ఈ సంఖ్య మార్చిలో 676.5లక్షలకు పడిపోయింది. వ్యవసాయేతర రంగాలలో పరిస్థితి అత్యంత నిరాశాజనకంగా ఉందని అందరికీ తెలిసిందే. 2023 జనవరి నాటినుంచే పట్టణప్రాంతాల్లో నిరుద్యోగం గ్రామీణ ప్రాంతాలలో కంటే ఎక్కువగాఉంది. పట్టణాలు, నగరాలలో వ్యవసాయేతర రంగంలో ఎక్కువమంది కార్మికులు తమ పనులు కోల్పోయారు. ఫలితంగా మార్చిలో వ్యవసాయ రంగంలోకి ఎక్కువమంది కార్మికులు ప్రవేశించారు. ఈ విధంగా వ్యవసాయేతర రంగాలలో పనులు కోల్పోయినవారికి వ్యవసాయరంగంలో ఉపాధి లభించింది. అయినప్పటికీ వ్యవసాయరంగాన్ని ప్రయోజనకరంగా, రైతులకు లాభసాటిగా తయారు చేసేందుకు బదులుగా కేంద్ర ప్రభుత్వం దీన్ని మరింత దిగజార్చేందుకు ప్రయత్నించడం శోచనీయం.
వారానికి ఒకరోజు పని దొరికేవారిని కూడా ఉపాధి పొందుతున్నవారిగా ప్రభుత్వం అంచనావేయడం మరింత దారుణం. అందువల్ల ఆర్‌బీఐ సర్వే వాస్తవాలను ప్రతిబింబించదు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకంలోనే ఎక్కువమంది కార్మికులు పనిచేసేందుకు సిద్ధపడవలసి వచ్చింది. అయితే ఈ పథకానికి కేటాయించే నిధులను కేంద్ర ప్రభుత్వం ప్రతిసంవత్సరం తగ్గిస్తోంది. మొదట ఈ పథకాన్ని క్రమంగా రద్దు చేయాలన్న ఆలోచనలోనే ఈ ప్రభుత్వం ఉండిరది. ఆ తరువాత నిధులను తగ్గిస్తూ వస్తోంది.
అయితే ఆకస్మికంగా ఒకేసారి లక్షలమంది కార్మికులు పనులు కోల్పోయారు. వీరందరికీ వ్యవసాయరంగం పనులు కల్పించే అవకాశం లేదు. ఉదాహరణకు 2022 మార్చిలో వ్యవసాయ కార్యకలాపాలు 10.4శాతం పెరిగాయి. ఆ తర్వాత ఏప్రిల్‌లో 3శాతం, మేలో 6శాతం, జూన్‌లో 6శాతానికంటే ఎక్కువగా కార్మికులు పనులు కోల్పోయారు. మార్చిలో 12శాతం పెరిగినప్పటికీ అది తాత్కాలికమే. ఈ వేసవికాలంలో వ్యవసాయ కార్యకలాపాలు గణనీయంగా తగ్గిపోతాయి. అందువల్ల లక్షలాదిమందికి వ్యవసాయరంగంలో పనులు లభించవు. వ్యవసాయ రంగంలో కార్యకలాపాలు ఆయా సీజన్‌లనుబట్టి పెరగడం, తరగడం ఉంటుంది.