Friday, March 31, 2023
Friday, March 31, 2023

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

వి. శంకరయ్య

దేశంతోపాటు రాష్ట్రంలో కూడా ప్రజాస్వామ్యం పరిహాసంగా మారింది. పౌర హక్కులను కాలరాస్తున్నారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న మత, కుల పరమైన పాశవిక క్రూరమైన విధానాలు వేర్వేరుగా లేవు. గంగపట్నం నౌకాశ్రయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదానీపరంచేస్తే విశాఖ ఉక్కుకర్మాగారం ప్రైవేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధ మౌతోంది. ఈ నేపథ్యంలో విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటుపరంకాకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి అడ్డుకుంటాడని ఏలా భావించగలం? కేంద్రాన్ని నిలదీయ లేరు. అడిగినా నువ్వేం చేస్తున్నావని ఎదురు దాడి చేస్తారు.! ఎన్నికల కమీషన్‌ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల చేసిన తర్వాత కూడా ప్రతిపక్షాల నేతల ఇళ్ల పై సిబిఐ ఇడి అధికారుల ద్వారా ప్రజాస్వామ్య విరుద్ధంగా దాడులు చేయిస్తూ, ప్రజల్లో భయోత్పాతం కలిగించి నోరెత్తిన వారిపై దేశ ద్రోహ కేసులను మోదీ ప్రభుత్వం బనాయిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో కూడా వైకాపా ప్రభుత్వం ఏ చిన్నసాకు దొరికినా ప్రతిపక్షాల నేతలను అర్థరాత్రుల్లో అరెస్టులు చేస్తోంది. న్యాయ వ్యవస్థ ఇంకా సజీవంగా వుంది కాబట్టి బతికి పోతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న క్రూరమైన విధానాల్లో చాలా పోలికలు వున్నాయి. ప్రభుత్వం రంగంలోని సంస్థలను మోదీ ప్రభుత్వం వరస బెట్టి ఒక్కొక్క సంస్థను ఆదానీ అంబానీల పరం చేస్తోంది. లాభాల్లో నడుస్తున్న జీవిత బీమా (యల్‌ఐసి) ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమౌతోంది.
మోదీ ప్రభుత్వానికి తనేం తీసిపోనని చెబుతూ రాష్ట్రంలో జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వం వరస బెట్టి ప్రభుత్వం ఆస్తుల అమ్మకాలకు సిద్ధమౌతున్నది. జెన్‌కోను ప్రైవేటుపరం చేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇంత కాలం వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ ఇస్తుండగా కేంద్ర ప్రభుత్వం చూపుతున్న అప్పులకు ఆశపడి ఎపిలో మీటర్లు పెడుతున్నారు. తుదకు పక్క రాష్ట్రం తెలంగాణలో ముఖ్యమంత్రి వీలుకాదని చెబుతుంటే జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం కేంద్రం ఏదిచెబితే అందరికన్నా ముందు ‘‘యస్‌ బాస్‌’’ అంటున్నది. పార్కులను కూడా కుదవపెట్టి అప్పు చేస్తున్నారు. రాజ్యసభలో వైసీపీ అండ కేంద్ర ప్రభుత్వానికి అవసరం. అంతేకాదు. కనీసం కెసిఆర్‌, మమత బెనర్జీలాగా కేంద్ర ప్రభుత్వం విధానాలను తూర్పారపట్టే జాబితాలో మరొక ముఖ్యమంత్రి లేకుండా చూసుకోవడం ప్రధాని మోదీకి అవసరం. అదే సమయంలో తనపై వున్న కేసుల నుండి జగన్మోహన్‌రెడ్డికి రక్షణ కావాలి. పైగా తన ప్రభుత్వం అనుసరిస్తున్న ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యంతో రోజురోజుకు గుల్లఅవుతున్న ఖజానా కాలు నిలదొక్కుకోవాలంటే పూట గడవాలంటే కేంద్ర ప్రభుత్వం అండ అవసరం. తనకు 25 మంది పార్లమెంటు సభ్యులను గెలిపించి ఇచ్చితే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తానని నమ్మించి రాష్ట్రాధికారం చేజిక్కించుకున్న జగన్మోహన్‌రెడ్డి కేంద్రం వద్ద తలవంచక తప్పలేదు. రెండు రాష్ట్రాలకు చెంది విభజన నాటి సమస్యల పరిష్కారానికి సబ్‌ కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ సమావేశం ఎజెండాలో ప్రత్యేక హోదా వెనుకబడిన ప్రాంతాలకు ప్యాకేజీ లోటుబడ్జెట్‌ అంశాలను చేర్చారు. విధానపరమైన నిర్ణయాలు తీసుకునే వేదిక కాదది. హోంశాఖలో అవగాహనలేని వారు ఈ ఎజెండా పెట్టారు. ఈ తర్వాత కనీసం ఈ అవగాహన లేని వైసీపీ మంత్రులు చిందులేసి చంకలు గుద్దుకొని తుదకు చప్పచల్లారిపోయారు. ఎజెండానుండి రెండుఅంశాలు తొలగించ డానికి చంద్రబాబునాయుడు కారణమని ఆరోపణ చేశారు. ప్రత్యేక హోదా కేంద్ర ప్రభుత్వం స్థాయిలో నిర్ణయం తీసుకోవాలి. ఇంత జరిగినా కేంద్రాన్ని ఇదేమని అడగ లేని స్థితిలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి వున్నారు.
ఆయన సరే! టీడీపీ నేత చంద్రబాబు నాయుడు పాచి పోయిన లడ్డు తెచ్చారని ఒకప్పుడు వెటకారం చేసిన జనసేన అధినేత పవన్‌కళ్యాణ్‌ ప్రత్యేక హోదా గురించి కేంద్ర ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు? ప్రత్యేక హోదా సాధించలేదని జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం మీద విమర్శలు చేయడం కాదు. వివిధ సాకులు చూపెట్టి ప్రత్యేక హోదా ఎగ్గొట్టిన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసినపుడే జగన్మోహన్‌రెడ్డికి భిన్నంగా రాష్ట్ర ప్రజలు వీరిని గౌరవిస్తారు. లేకుంటే ముగ్గురిని ఒకే గాటన కడతారు! అదీ కాకుంటే ప్రధాని మోదీకి భయపడి ఆయన భజన చేస్తున్నారని భావిస్తారు!
ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వామపక్ష శక్తులు మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎట్టి శషబిషలు లేకుండా ఎదిరించి పోరాడ గల స్థానంలో వున్నాయి. పది వామపక్షాలు మొన్న ఒకే వేదికపైవచ్చి కేంద్ర రాష్ట్రప్రభుత్వాల అప్రజాస్వామ్య విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమం సాగించాలని నిర్ణయం తీసుకోవడం శుభ పరిణామం. రాష్ట్రంలో తమతో కలసి వచ్చే పార్టీలు, వ్యక్తులు, సంస్థతో పోరాటానికి సిద్ధపడుతున్నారు. ఈ కీలక దశలో రాష్ట్రంలోని టిడిపి, జనసేన పార్టీలు కేవలం వైకాపా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాత్రమే పోరాడదలుచు కొంటే అది జగన్మోహన్‌రెడ్డికి మరింత బలం చేకూర్చిన వారౌతారు. ప్రత్యేక హోదాతోపాటు కేంద్రం నుండి రావాల్సిన నిధులు, రాయితీలు రాబట్టేందుకు ప్రజాతంత్ర వామపక్ష శక్తులతో భుజం భుజం కలిపి పోరాడవలసిన తరుణం ఆసన్నమైనది. మోదీ వ్యతిరేక వైఖరి తీసుకొని 2019 ఎన్నికల్లో ఓడిపోయాననే అవగాహన చంద్రబాబునాయుడుకు వుండవచ్చు. ఈ రోజు మోదీని ఖచ్చితంగా వ్యతిరేకించనందున జాతీయ స్థాయిలో గుర్తింపు లభించడం లేదనేది వాస్తవం కాదా? దేశ వ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమం రాష్ట్రంలో వైసీపీ, బిజెపిలకు వ్యతిరేకంగా సాగవలసిన ఉద్యమం ఒకటేనని చంద్రబాబునాయుడు ఎంత త్వరగా గుర్తించితే టిడిపి భవిష్యత్తుతోపాటు ఆంధ్రప్రదేశ్‌ ప్రజల ప్రయోజనాలను కాపాడినవారౌతారు.
పవన్‌ కళ్యాణ్‌ విశాఖ ఉక్కుకర్మాగారం ప్రైవేటుపరం కాకుండా రెండు దఫాలుగా దీక్ష చేశారు. దీక్షలో కేంద్ర ప్రభుత్వాన్ని ఒక్క మాట అనకుండా జగన్మోహన్‌రెడ్డిని తిట్టిపోశారు. ఇప్పటికీ అదే వైఖరి అనుసరిస్తున్నారు. ప్రైవేటు పరం చేసేది కేంద్ర ప్రభుత్వం. దాన్ని వదలి పెట్టి జగన్మోహన్‌రెడ్డిని తిట్టిపోసినందున ఇరువురు మధ్య వున్న వైషమ్యాలు వెల్లడవుతాయి తప్ప సమస్య పరిష్కారానికి దోహద పడలేదు. ఇప్పటికైనా చంద్రబాబునాయుడు పవన్‌కళ్యాణ్‌ బిజెపి యెడల భ్రమలు వీడాలి. ప్రజాస్వామ్య వామపక్ష శక్తులతో కలిసి పోరాడితే రాష్ట్రంలో జగన్మోహన్‌రెడ్డి ఆగడాలను కేంద్రంలో మోదీ దూకుడును కట్టడి వేయటానికి అవకాశం ఉంటుంది.
వ్యాస రచయిత విశ్రాంత పాత్రికేయులు, 9848394013

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img