Sunday, September 24, 2023
Sunday, September 24, 2023

ప్రశాంతమైన మేవాత్‌లో అగ్ని జ్వాలలు

విభూతీ నారాయణ్‌ రాయ్‌

హర్యానాలోని నూప్‌ాలో గతవారం మతపరమైన హింస ప్రారంభమైన సమయంలో ఏమి జరిగిందనే విస్తృత వివరాల్లోకి వెళ్లకుండానే చట్టాన్ని అమలుచేసే సంస్థల అధీనంలోనే మొత్తం దుర్ఘటనలన్నీ కొనసాగాయని చెప్పవచ్చు. ఈ సందర్భంగా హర్యానా పోలీసులలో ఎలాంటి వృత్తిపరమైన నైపుణ్యం, నిబద్ధత కనిపించలేదు. సత్వర ఆర్థికాభివృద్ధి సాధిస్తున్న హర్యానా లాంటి చోట్ల శాంతి భద్రతలను పరిరక్షించడంలో హర్యానా పోలీసులు చాలా సమర్థవంతంగా వ్యవహరించి ఉండాలి. కానీ ఎక్కడా ఆ ఛాయలే కనిపించలేదు. మొదట్లోనే పరిపాలనా విభాగం స్పందించిన తీరు, వారు వేసుకున్న ప్రణాళిక అత్యంత నాసిరకంగా ఉన్నాయి. ఆ తరవాత పాలనా విభాగం, చట్టాన్ని అమలు చేయవలసిన బాధ్యత ఉన్న పోలీసు బలగాలలో పక్షపాత ధోరణి కొట్టొచ్చినట్టు కనిపించింది. పోలీసుదళాలలో క్రియారాహిత్యం ప్రస్ఫుటంగా కనిపించింది. హింసాకాండ చెలరేగుతుంటే పోలీసులు చేతులు ముడుచుకుని తమాషా చూస్తూ ఉండిపోయారు.
ఆకాశహార్మ్యంలోని ఇరవయ్యవ అంతస్తునుంచి చూస్తే రోడ్డు మీదనుంచి వెళ్తున్న ఒక సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి నరకండి-చంపండి అని అరుస్తూ ఉంటే మనసు ఎలా ఉంటుంది? ఆ ప్రాంతంలోని సమస్త ఆస్తులను అగ్నికి ఆహుతి చేస్తుంటే ఎమనిపిస్తుంది? వారి మధ్య సమన్వయం ఎలా కుదిరందనుకోవాలి? ఆ సమన్వయం ఎలా సాధ్యమై ఉంటుంది అని ఆలోచిస్తే హృదయం బండబారి పోతుంది. దహన కాండకు పాల్పడుతున్న వారిలో కొంచెపు మనుషులే కనిపిస్తారు. నరకండి-చంపండి అనే సాఫ్ట్‌వేరు ఉద్యోగిలోనూ అదే కొంచెపు మనిషే కనిపిస్తాడు. ఆ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి ఫార్చూన్‌ 500 కంపెనీలో ఏదో ఒక బహుళజాతి కంపెనీలోనో పనిచేయడానికి వచ్చినప్పుడు గుర్‌గావ్‌ క్రమంగా విస్తరిస్తోంది. అప్పుడు గుర్‌గావ్‌ ఓ ఎదుగుతున్న నగరం. 1980-90ల్లో ఇదీ పరిస్థితి. ఆ రోజుల్లో భారత్‌ ప్రజలను కంప్యూటర్‌ అక్షరాస్యులుగా మార్చడానికి ప్రయత్నాలు సాగుతున్నాయి. అప్పుడు భారత్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అయిదవ స్థానంలో ఉంటే ఇప్పుడు మూడవ స్థానానికి చేరామని సంబరపడి పోతున్నాం. ఈ బహుళ అంతస్తుల ఆకాశహార్మ్యాలు, విశాలమైన రోడ్లు, ఆధునిక పరిశ్రమలు ఆధునికమవుతున్న నగరంలో హింసకు తావు లేకుండా చేస్తారని ఆశించాం. కానీ ఆ ఆశలు కలలుగానే మిగిలిపోయాయి. గుర్‌గావ్‌ లో జులై 31న ప్రారంభమైన కొన్ని ఘటనలు మన ఆలోచనలను, ఆశలను, అంచనాలను తారుమారు చేసేశాయి.
మేవాత్‌ ప్రాంతంలో అంత అభివృద్ధిచెందని నూప్‌ా జిల్లాలో జరిగిన సంఘటనలు చాలా త్వరితంగా వ్యాపించాయి. గుర్‌గావ్‌కు విస్తరించడం అంటే ఆధునిక పారిశ్రామిక సంస్కృతిని భుజాన మోయవలసిన నగరంలో అనాగరికత పురివిప్పినాట్యం చేస్తోందన్న మాట. ఆలయంలో శివుడికి జలాభిషేకంకోసం ప్రారంభమైన ఒక ఊరేగింపుతో హింసాత్మక ఘటనలు ప్రారంభమైనాయి. కానీ ఎప్పుడూ లేనిది ఈసారి ఈ ఊరేగింపులో పాల్గొన్నవారు కర్రలు, పెద్ద పెద్ద కరవాలాలతో పాల్గొన్నారు. గత వంద సంవత్సరాలుగా దేశంలోని పోలీసులు మతపరమైన సమావేశాలకు, ఊరేగింపులకు అనుమతి ఇవ్వడంలో దాదాపు ఒకే రకమైన కొలమానాలే పాటిస్తున్నారు. కొత్త ఊరేగింపులకు అంత సులభంగా అనుమతి ఇవ్వరు. భారతీయ సమాజం మనోభావాలను దృష్టిలో ఉంచుకుని ఇలాంటి నియమాలు అనుసరిస్తున్నారు. ఎందుకంటే చిన్న సంఘటన కూడా నిప్పుకణికలా మారి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని భస్మం చేయవచ్చు. ఊరేగింపునకు అనుమతిచ్చే ముందు పోలీసులు నిర్వాహకులతో సంప్రదింపులు జరుపుతారు. సంభాషిస్తారు. ఊరేగింపు ఏయే వీధులగుండా వెళ్తుందో ఉభయపక్షాల వారూ నిర్ధారించుకుంటారు. ఆ ఊరేగింపులో ఎంతమంది పాల్గొనవచ్చుననే అంచనా కూడా ఉంటుంది. ఎలాంటి నినాదాలుంటాయో కూడా తేలుతుంది. ఒకవేళ ఊరేగింపు భిన్న మతాలవారు నివసించే ప్రాంతాల గుండా వెళ్లవలసివస్తే తగిన కట్టుదిట్టం చేస్తారు. ఊరేగింపు వెళ్లేదారిలోని పోలీసుస్టేషన్లలో కూడా దీనికి సంబంధించిన వివరాలు అందుబాటులో ఉంచుతారు. నూప్‌ాలో శోభాయాత్రలు నిర్వహించే సంప్రదాయం నాలుగేళ్ల కిందే మొదలైంది. ఇది హర్యానాలో మారుతున్న రాజకీయ సమీకరణల పర్యవసానం కావచ్చు. పత్రికల్లో వెలువడిన పోలీసు అధికారుల ప్రకటననుబట్టి చూస్తే పోలీసులు నియమ నిబంధనలన్నింటినీ క్షుణ్నంగా పాటించారనిపించడం లేదు. నిబంధనలను సక్రమంగా పాటించి ఉంటే ఊరేగింపులో పాల్గోనే వారి చేతిలో లాఠీలు, కరవాలాలను ఎలా అనుమతించారు? ఒకవేళ వారు అనుమతి లేకుండానే సాయుధులై ఊరేగింపులో పాల్గొంటే వారిని ఎందుకు ఆపలేదు?
ఊరేగింపు పొడవునా వినిపించిన నినాదాలు కూడా పనిగట్టుకుని రూపొందించినవనిపిస్తోంది. ఈ ఊరేగింపుకన్నా రెండు, మూడు రోజుల ముందు నించే సామాజిక మధ్యమాలలో రెచ్చగొట్టే, భయకంపితుల్ని చేసే సందేశాలు వస్తుంటే పోలీసు యంత్రాంగానికి ఆ విషయం తెలియదునుకోలేం. ఇలాంటి పరిణామాలు జరుగుతూ ఉంటే హింస ప్రజ్వరిల్లడంలో ఆశ్చర్యం లేదు. ఈ బీభత్సాన్ని నివారించడానికి పోలీసులు ప్రయత్నం చేసిన దాఖలాలే కనిపించడంలేదు. నూప్‌ా లోనూ, ఆ పరిసర ప్రాంతాలలోనూ ప్రజ్వరిల్లిన హింస శూన్యంలోంచి పుట్టిందేమీ కాదు. కొద్ది సంవత్సరాలుగా పశువుల వ్యాపారంచేసే వారిని నడిరోడ్డున పట్టుకుని హింసించడం సాగుతూనే ఉంది. రాజస్థాన్‌లోని భివానీ జిల్లాలో 2023 ఫిబ్రవరి 15న జునైద్‌, నాసిర్‌ ను మూకదాడిలో అంతమొందించడానికి కొద్ది రోజుల ముందు కూడా సామాజిక మాధ్యమాలలో ఇలాంటి రెచ్చగొట్టే ప్రచారమే సాగింది. రాజస్థాన్‌, హర్యానా పోలీసులమధ్య వివాదం కారణంగా కొన్ని నెలల తరవాత కాని నిందితులను అరెస్టు చేయనేలేదు. ఈ సంఘటనలోని ఒక నిందుతుడు అసలు సంఘటన జరగడానికి ముందే ప్రచారంలో పెట్టిన రెచ్చగొట్టే వీడియో ఒకటి బయట పడిరది. దీనితో పరిస్థితి దిగజారడం, ద్వేష భావం వ్యాపించడం మొదలైంది.
హర్యానాతో పాటు మరికొన్ని రాష్ట్రాలలో విస్తరించి ఉన్న మేవాత్‌లో స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో ఇతర ప్రాంతాలలోలాగా మతకలహాలు ఎన్నడూ జరగలేదు. దేశ విభజన తరవాత ముస్లింలు మేవాత్‌ నుంచి వెళ్లిపోకుండా గాంధీజీ ప్రయత్నించారు. మేవాత్‌లోని ప్రజలు తమను తాము ముస్లిములుగా భావించడం కన్నా మేవాలమనే భావిస్తారు. ఈ వర్గంవారి ఆచార వ్యవహారాల్లో హిందూ సంప్రదాయాలు స్పష్టంగా కనిపిస్తుంటాయి. ఈ కలివిడి లక్షణమే తీవ్రవాద భావాలున్న వారికి కంటగింపైంది. సాంప్రదాయికంగా మేవాలు వ్యవసాయ దారులు, పశుపాలకులు. వీరు గుర్‌గావ్‌, ఆల్వార్‌, నూప్‌ా, భరత్‌పూర్‌ లాంటి పట్టణ ప్రాంతాలలోనే ఎక్కువగా నివసిస్తారు. గ్రామాల నుంచి నగరాలకు వలసలు పెరిగిపోయిన తరవాత మేవాల వంటి వారు పట్టణ ప్రాంతాలలో ఉండడం కొత్తగా వచ్చిన వారికి నచ్చలేదు. వారితో ఘర్షణకు కాలు దువ్వేవారు. ఇటీవలి మత కలహాల తరవాత మేవాల ఇళ్లు బుల్‌డోజర్లతో ధ్వంసం చేశారు. ఒక దుకాణం ఎదురుగా అంటించిన పోస్టర్‌లో ఇక్కడ కేవలం హిందూ కార్మికులే పనిచేస్తారు అని రాసి ఉంది. ఇలాంటి పరిణామాలు నిరాఘాటంగా కొనసాగితే ఆశ్చర్య పడవలసిన పనేలేదు. ఒక మతానికి చెందిన వారే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి అనే పరిస్థితి కూడా రావచ్చు. ఇదే జరిగితే 1980-1990 దశకాలలో కన్న కలలు చెదిరిపోవడమే కాక బర్బరత్వం మరింత పెరగక తప్పదు. అంతే కాదు దేశాన్ని అయిదు ట్రిలియన్‌ డాలర్లు ఉన్న ఆర్థిక వ్యవస్థగా మారుస్తాం అన్న ఊహా సౌధాలన్నీ పిచ్చుక గూళ్లలా చెదిరిపోయాయి.
ఆల్‌ ఇండియా అరసం అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం అధ్యక్షులు, యూపీ మాజీ డీ.జీ.పీి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img