Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

ప్రసేన్‌ 63 ఎంఎం థియేటర్‌లో … ఇచ్చట సినిమాలు ఉతకబడును…

ఇదిగో ఇతగాడే ప్రసేన్‌ అంటే ‘‘బండెడు అసత్యాలు.. గంపెడు వక్రీకరణలు.. బోలెడంత చెత్త, నేలబారు టేకింగ్‌… భరించలేనంత బోర్‌… ఇంకొన్ని కలిస్తే…’’ ఇది కాశ్మీర్‌ ఫైల్స్‌ అనే సినిమా సమీక్ష. దేశంలో రాజకీయ భక్తి, భక్తి రాజకీయం పెరిగిపోయిన సందర్భంలో జీవిస్తున్నాం. పైగా ఈ కాశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా తర్వాత ఆ సినిమాని పొగడడం ద్వారా నీ దేశభక్తిని నిరూపించుకోవాల్సిన సందిగ్ధ సందర్భంలో ఉన్నాం. నా అనేకానేక ఇష్ట కవులలో ఒకరైన ఖాదర్‌ మొహిద్దీన్‌ తన ‘పుట్టుమచ్చ’ దీర్ఘ కవితలో ‘‘క్రికెట్‌ మ్యాచ్‌ నా దేశభక్తికి తూనికా, కొలమానమూ అవుతుంది’’ అంటాడు. ఆ కాలంలో ఆ కవి జన్మరీత్యా ఇలా అన్నాడేమో కాని… ఈ కాలంలో మాత్రం ఈ దేశంలో ఉన్న సమస్త మానవులు కాశ్మీర్‌ ఫైల్స్‌ గొప్పతనం గురించి మాట్లాడి దేశభక్తుల జాబితాలో విధిగా చేరాల్సిందే. ఆ జాబితాలో చేరేందుకు ససేమిరా ఇష్టపడని ఓ పొగరుబోతు రాసిన సినిమా సమీక్షల పుస్తకం ‘‘ప్రసేన్‌ ఏ సినిమా’’ లో ‘‘నేటి సినిమా రీళ్లను ఉతికి ఆరేయడం ఇలా’’ అనే మరో పుస్తకం కూడా కనిపించింది నాకు. ఇది శివరాత్రికి ఒకే టిక్కట్‌ మీద రెండు సినిమాలు చూసిన ఆనందం వంటింది. ఈ ప్రసేన్‌ ఖర్మ తొలి తెలుగు కవి. పూర్వ జన్మలో చేసిన ఖర్మ కూడా ఈ జన్మలో వెంటాడి కాలిపోవడం వల్ల జర్నలిస్టు కూడా. ఈ రెండు జాడ్యాలకి, ఈ రెండు దీర్ఘ రోగాలకి, ఈ రెండు వ్యసనాలకి తోడుగా సినిమా సమీక్షకుడు అనే మరొకటి కలిసి మూడక్షరాల ప్రసేన్‌ అయ్యాడు. ఓ పెద్ద హీరో నటించిన బాలీవుడ్‌లో ఇరగదీసిన సినిమాని తెలుగులో మరో పెద్ద హీరో అనువాదం అంటే రీమేక్‌ చేస్తే రెంటికి తేడాలు చెప్పడమే తెలిసిన ప్రేక్షక పాఠకులం మనం. ఇంతకు ముందే చెప్పినట్లుగా పొగరుబోతు ప్రసేన్‌ కదా… తెలుగులో రీమేక్‌ చేసిన వకీల్‌ సాబ్‌ ఎంత ఛండాలమో అక్షరం ముక్కైనా చెప్పకుండా దాని ఒరిజినల్‌ పింక్‌ ఎంత బాగుందో చెప్పాడు. ఇదీ ఒకే టిక్కట్‌పై రెండు సినిమాల్లాంటిదే. ఈ సమీక్ష చదివి పింక్‌ సినిమా చూస్తే…. వీరాభిమానులు కూడా వకీల్‌ సాబ్‌ సినిమా చూడడానికి వాయిదాల మీద వాయిదాలు అడుగుతారు. ‘‘‘సినిమా కోసం వెళ్తే కావ్యం దొరుకుతుంది’’ ఇదీ సమీక్షే. మహానటి సినిమా గురించి. సినిమాని ఇలా చూడాలి అని నేర్పిన సమీక్ష ఇది. దర్శకుడి ప్రతిభను అతను పడ్డ కష్టం నుంచి చెప్పడం ఒక్క ప్రసేన్‌కే సాధ్యమవుతుంది. అందరికి తెలిసిన ఓ వాస్తవాన్ని ‘‘మీకు తెలిసిందే కొత్తగా చెబుతున్నాను’’ అంటూ చెప్పడానికి చాలా కష్టపడాలి. అలా కష్టపడిన దర్శకుడు నాగ్‌ అశ్విన్‌. అందుకే ఈ మహానటి గురించి నేను రాయాలనుకున్నది ప్రసేన్‌ రాసేశాడు. ఓ కవితో, కథో, సినిమానో చదివిన తర్వాత, చూసిన తర్వాత మనం ఏమనుకున్నామో అవన్నీ ఒద్దికగా కూర్చుని మల్లెదండ అల్లినట్టుగా మరొకరు మాలకడితే ఎలా ఉంటుందో అలా ఉంది ఈ మహానటిపై ప్రసేన్‌ భాష్యం. ‘‘ వృద్ధాప్యం సంతానం సాలెగూట్లో పురుగు’’ అంటాడు కవి శివారెడ్డి. ఆ ఏక వాక్యాన్ని నందినీరెడ్డి ఓ బేబీ అంటూ సినిమా తీస్తే…. ప్రసేన్‌ ఆ వాక్యాన్ని, సినిమాని కూడా సర్వనామం చేసేశాడు తన మార్కుతో. మంచి సినిమా తీయడం కంటే ఆ సినిమా మీద వచ్చిన మంచి రివ్యూని చదివితే ఆ దర్శకులకి, అందులో నటించిన వారికి కలిగే ఆనందం ఎలా ఉంటుందో ప్రసేన్‌ రాసింది చదివితే అలాగే అనిపిస్తుంది. జర్నలిస్టుగా ప్రసేన్‌తో కలిసి పనిచేసిన దురదృష్టవంతుల్లో, ఈర్షాసూయలు పెంచుకున్న వారిలో నేనూ ఒకడ్ని. పోలీసుల్లో నక్సలైట్లు, నక్సలైట్లలో పోలీసులు కలగలిసి పోయిన వార్తా కథనానికి ప్రసేన్‌ హెడ్డింగ్‌ ‘‘నక్సలీసులు’’. ఇలాంటివే ఈ ప్రసేన్‌ ఏ సినిమాలో అనేకం ఉన్నాయి. దర్శకుడు మారుతి తీసిన ఓ సినిమా రివ్యూకి ప్రసేన్‌ హెడ్డింగ్‌ మాసిపూసి ‘‘మారుతీకాయి’’. ఇలాంటిదే మరొకటి నాగార్జున గురించి… ‘‘సైకిల్‌ చైన్‌ నుంచి రుద్రాక్షమాల’’, ప్రభాస్‌ సినిమా ‘‘ఆదిపురుష్‌’’కి ప్రసేన్‌ రివ్యూ టైటిల్‌ ‘‘సోది పురుష్‌’’. అన్నీ బాగానే ఉన్నాయి కాని…. వాస్తవ కథకి కమర్షియల్‌ కుళ్లుని జోడిరచి తీసిన విరాటపర్వం దర్శకుడు వేణుకి ప్రసేన్‌ ‘‘లవ్యూ వేణు రాజా’’ అని చెప్పడం పోసాని మార్కు అసహ్యపు కామెడీ. ఇంతకీ చెప్పొచ్చేదేమిటంటే…. తెలుగు సినిమా చండాలం గురించి చెప్పడానికి ఏం లేదని…. ఆస్కార్‌ కొట్టేసిందని చెప్పుకుంటున్న తెలుగు పాటని సినీకవులు వీలున్నప్పల్లా వస్త్రాపహరణం చేస్తున్నారని బాధపడిపోయిన ప్రసేన్‌ శ్రీ కృష్ణునిలా చీరలివ్వలేదు… రివ్యూ అంటూ ఆ సినీ కవుల బట్టలూడదీసాడు. చివరాఖరుగా… నిర్మాతలూ… డబ్బులు ఎవరికి ఊరికే రావు… సినిమా చూసేందుకు ప్రేక్షకుడు ఖర్చు చేసిన గంటలు కూడా తిరిగిరావు. సీనియర్‌ జర్నలిస్టు, 99120 19929

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img