Monday, February 6, 2023
Monday, February 6, 2023

ప్రైవేటీకరణ దిశగా సింగరేణి

వేల్పుల నారాయణ

సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణకు కేంద్రం అడుగులు వేస్తోంది. అందులో భాగంగా 2021, అక్టోబర్‌ 11న కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి దేశంలోని వివిధ రాష్ట్రాల్లో గల 88 కొత్త బొగ్గు బ్లాక్‌లను వేలం వేయడానికి ప్రకటన జారీ చేశారు. వేలం వేసే ప్రక్రియలో సింగరేణికి సంబంధించిన నాలుగు కొత్త బ్లాక్‌లను కూడా అందులో చేర్చారు.
దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్తులను, ప్రభుత్వ రంగ పరిశ్రమలను 2021నుండి 2025వరకు అమ్మివేసి, రూ. 6లక్షల కోట్లు సమకూర్చుకోవడానికి నిర్ణయించింది. అందులో భాగంగా ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటు కార్పోరేట్లకు అమ్మడం ప్రారంభించింది. భారతదేశంలోని 352బొగ్గుగనులుకలిగిన కోల్‌ ఇండియాను ఒకేసారి అమ్మితే కార్మికుల్లో వ్యతిరేకత వచ్చి సమ్మె చేసే అవకాశం ఉందని భావించి, మెల్లమెల్లగా కోల్‌ ఇండియాలో వాటాలను అమ్మివేస్తుంది. ఇప్పటి వరకు 30శాతంవాటాలను అమ్మివేసింది. ప్రస్తుతంఉన్న బావులను అమ్మకుండా కొత్త బ్లాక్‌లను కోల్‌ ఇండియా చేపట్టకుండా వేలం వేసి, ప్రైవేటు కార్పోరేట్లకు దారాదత్తం చేయడానికి నిర్ణయించింది. అందులో భాగంగానే 1973లో వామపక్షాల ఒత్తిడివల్ల అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ జాతీయీకరణ చట్టం చేయడం వల్ల 1976లో బొగ్గుగనులు జాతీయం అయ్యాయి. ఇప్పుడు ఆ చట్టాన్ని బిజెపి ప్రభుత్వం రద్దు చేయడంతో పాటు కోల్‌మైన్స్‌ స్పెషల్‌ ప్రొవిజన్‌ చట్టం 2015, మైన్స్‌, మినరల్స్‌ డెవలప్‌ మెంట్‌ రెగ్యులరైజేషన్‌ చట్టం1957, మార్గదర్శకాల ఆధారంగా కొత్త బొగ్గుగనులను బహిరంగ మార్కెట్‌లో వేలం వేస్తుంది. అందులో భాగంగానే 2021, అక్టోబర్‌ 10న కేంద్ర హోంశాఖ, కేంద్ర ఇంధన బొగ్గుగనుల శాఖ మంత్రులు చర్చించి, కొత్తగనులను వేలం వేయడానికి ప్రకటన జారీ చేశారు. కోల్‌ ఇండియా నుండి అనుకున్నంత బొగ్గు ఉత్పత్తి జరగకపోవడం వల్ల 135 విద్యుత్తు పవర్‌హౌజ్‌లు మూతపడే పరిస్థితి ఏర్పడిరదని, కృత్రిమ కొరతను చూపించి, ఈ వేలం వేసే నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం చేస్తున్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న బొగ్గులో విద్యుత్తు పవర్‌ హౌజ్‌లకు 74శాతం బొగ్గు సరఫరా జరుగుతుంది. ఇది పోను 201920 సంవత్సరంలో దాదాపు 247 మిలియన్‌ టన్నుల బొగ్గును విదేశాల నుండి దిగుమతి చేసుకున్నారు. ప్రస్తుతం విదేశాల నుండి దిగుమతి తగ్గిందే తప్ప, వాస్తవానికి కోల్‌ ఇండియాలో కానీ, సింగరేణిలో కానీ పెద్దగా బొగ్గు ఉత్పత్తి తగ్గింది లేదు. స్వయానా కోల్‌ ఇండియా ఛైర్మనే బొగ్గు ఉత్పత్తి తగ్గించేందుకు తమపై తీవ్ర ఒత్తిడి ఉందని ప్రకటించారు. కోల్‌ ఇండియా 201920 సంవత్సరంలో అనుకున్న బొగ్గు ఉత్పత్తి 730 మిలియన్‌ టన్నులు చేసింది. సింగరేణిలో 2021 అక్టోబర్‌ వరకు 35.24మిలియన్‌ టన్నులు (96 శాతం) బొగ్గుఉత్పత్తిని సాధించింది. 2022మార్చివరకు అనుకున్న 69 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తిని సాధించే దిశగా కొనసాగుతుంది. 2014 నుండి 202021 సంవత్సరాల్లో కోల్‌ ఇండియా వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి 44075.81 కోట్లు చెల్లించింది. సింగరేణి కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేలకోట్లలో పన్నులుచెల్లించింది. కేవలం201920 సంవత్సరంలో సింగరేణి కేంద్రానికి 1906.47కోట్లు, తెలంగాణ రాష్ట్రానికి 3330.22 కోట్లు పన్నులరూపంలో చెల్లించింది. ఇన్ని లాభాలు సమకూర్చి పెడుతున్న బంగారు బాతు గుడ్లుపెట్టే సంస్థలను నిర్వీర్యం చేయడానికి ప్రైవేటు కార్పోరేటర్లకు మెల్లమెల్లగా అప్పగించేందుకు కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది.
సింగరేణిసంస్థ కేంద్రం 49శాతం, తెలంగాణరాష్ట్రం51శాతం వాటాలతో ఉమ్మడిసంస్థగా అభివృద్ధిపథంలో పురోగమిస్తుంది. దాదాపు రెండు దశాబ్దాలుగా లాభాల పంటలుపండిస్తుంది. సింగరేణికి చెందిన మంచిర్యాల జిల్లా, శ్రావణ్‌ పల్లి బొగ్గు బ్లాక్‌కోసం రూ. 20కోట్లు, కళ్యాణిఖని6 బ్లాక్‌ కోసం దాదాపు రూ.10కోట్లు, ఖమ్మం జిల్లా, సత్తుపల్లి ఓపెన్‌ కాస్టు3 కోసం రూ. 8కోట్లు, కొత్తగూడెం జిల్లా, ఇల్లందు కోయగూడెం ఓసిపి`3 కోసం రూ. 15కోట్లు, మొత్తం సింగరేణి వీటి అభివృద్దికోసం రూ. 60కోట్లు ఖర్చు చేసింది. ఈ గనుల నుండి బొగ్గు ఉత్పత్తి ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వానికి పర్యా వరణ అనుమతి కోసం నివేదికలు పంపి, వేచి చూస్తున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం ఈ బ్లాక్‌లను వేలం పాట లిస్టులో పెట్టడాన్ని సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి. దీన్ని వ్యతిరేకిస్తూ సింగరేణిలో 5జాతీయ కార్మిక సంఘాలైన ఎఐటియుసి, ఐఎన్‌టియుసి, సిఐటియు, హెచ్‌ఎమ్‌ఎస్‌, బిఎమ్‌ఎస్‌లు పోరాట కార్యక్రమాన్ని చేపట్టాయి.
తెలంగాణవచ్చిన తర్వాత సింగరేణిని ప్రైవేటుపరంకాకుండా కాపాడు తానని, కేంద్ర ప్రభుత్వం ఒకవేళ తన 49శాతం వాటాలను అమ్మితే రాష్ట్ర ప్రభుత్వమే కొంటుందని, కొత్తగా మరో25బొగ్గుగనులను ప్రారంభించి, లక్షమంది యువకులకు ఉద్యోగఅవకాశాలు కల్పిస్తానని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్‌ నమ్మబలికారు. కొత్తగనులు రాకపోగా పాత గనులు తగ్గిపోయాయి. 64వేల మంది కార్మికులు ఈ ఏడు సంవత్సరాల కాలంలో 40వేలకు తగ్గారు.
కొత్త గనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సింగరేణి వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమం 5 జాతీయ కార్మిక సంఘాలు ఉధృతం చేస్తున్నాయి. అందులో భాగంగా ఐక్య కార్యచరణ కమిటీగా ఏర్పడి, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు నిర్ణయించాయి. గతంలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన మూడు దేశ వ్యాపిత బొగ్గుగనుల సమ్మెలో బిఎమ్‌ఎస్‌ పాల్గొనలేదు. సింగరేణి బొగ్గుగనుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానంచేసి తెలంగాణ రాష్ట్రప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడితేవాలని, టిఆర్‌ఎస్‌ ఎంపిలు, రాష్ట్రంలోని బిజెపి ఎంపీలు, కాంగ్రెస్‌ ఎంపీలు ఐక్యంగా పార్లమెంట్‌లో ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడాలని సింగరేణి కార్మికులు, కార్మిక సంఘాలు కోరుతున్నాయి.
వ్యాసరచయిత సీనియర్‌ జర్నలిస్టు, సెల్‌ నెం. 9440433475

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img