ఆర్వీ రామారావ్
అవిభక్త ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘానికి 80 వసంతాల చరిత్ర ఉంది. ఈ దశలో తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం మూడవ మహాసభలు అక్టోబర్ ఒకటి, రెండు తేదీల్లో హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. మూడవ మహాసభలు అంటే అంతకు ముందు తెలంగాణలో అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఉనికి లేదనికాదు. 1943లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితలసంఘం అవతరించినప్పుడు అప్పుడు నిజాం ఏలుబడిలో మగ్గుతున్న హైదరాబాద్ సంస్థానం, ఇప్పటి తెలంగాణలో ఈ సంస్థకు అస్తిత్వం కనిపించకపోవచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘంతో సంబంధం ఉన్న వట్టికోట ఆళ్వార్ స్వామి లాంటి ప్రసిద్ధ రచయితలు అప్పుడూ ఉన్నారు. స్వాతంత్య్రానికి ముందు తెలంగాణలో అరసం అస్తిత్వంలోకి రాకపోవడానికి నిర్దిష్ట కారణాలున్నాయి. నిరంకుశ నిజాం పాలనలో తెలుగు చదువుకోవడం, కడకు మాట్లాడడానికి కూడా అవకాశాలు కొరవడినప్పుడు ప్రగతిశీల భావాలుగల రచయితలు సంఘటితం కావడానికి అవకాశం చిక్కలేదు. కానీ తెలంగాణ ప్రాంత రచయితలు ప్రజలపక్షాన నిలబడి సమాజ పురోగమనానికి ఉపకరించే సాహిత్యం బోలెడు సృష్టించారు. తెలంగాణ సాయుధ పోరాట క్రమంలో తెలంగాణలో వివిధ సాహిత్య ప్రక్రియల్లో అభ్యుదయ సాహిత్యం దండిగానే వచ్చింది. సాయుధ పోరాటం ఇతివృత్తంగా కోస్తా ప్రాంత రచయితలు అపారమైన సాహిత్యం వెలువరించారు.
1936లో అఖిలభారత అభ్యుదయ రచయితల సంఘం ఏర్పడడానికి, 1943లో ఆంధ్ర అభ్యుదయ రచయితల సంఘం అవతరించడానికి నిర్దిష్టమైన కారణాలున్నాయి. జాతీయ, అంతర్జాతీయ పరిణామాలు అభ్యుదయ రచయితల సంఘం అవతరణకు దోహదం చేశాయి. 1930 నాటి ఆర్థిక మాంద్యం తరవాత సాంస్కృతికరంగంలో ప్రధానంగా రెండు ధోరణులు వ్యక్తమయ్యాయి. ఒక పాయ క్షీణ సాహిత్యానికీ, నిరర్థక ప్రయోగవాదానికి దారితీసింది. మరొకటి మానవాళి మనుగడను, భవిష్యత్తును ప్రభావితం చేసే శక్తి ప్రజలకే ఉందని, ఆ ప్రజలకు ప్రయోజనకరంగా ఉండే సాహిత్యాన్ని సృజించడమే సాహితీవేత్తల కర్తవ్యం అని భావించిన వారు అభ్యుదయ రచయితలుగా గుర్తింపు పొందారు. సంఘాలు పెట్టుకున్నారు. ఆలోచనలు కలబోసుకున్నారు. కచ్చితమైన సిద్ధాంత ప్రాతిపదిక కోసం అన్వేషించారు. మానవాళి భవిష్యత్తును ప్రభావితంచేసే శక్తి ప్రజలకే ఉంటుందని, వారి సంవేదనలకు అక్షర రూపం కల్పించడమే రచనల లక్ష్యం అని అనుకున్న వారు ఈ రెండో పాయకు చెందినవారు. ఈ ధోరణి కేవలం సాహిత్య రంగానికే పరిమితమైంది కాదు. సకల కళారూపాలకూ ఇది వర్తిస్తుంది. ఈ వాస్తవాన్ని గుర్తించిన వారే 1936లో జాతీయ స్థాయిలో అభ్యుదయ రచయితల సంఘం ఏర్పాటుకు పాటుపడ్డారు. 20వ శతాబ్దం మొదటి మూడు దశాబ్దాల కాలంలో జాతీయ అంతర్జాతీయ పరిణామాలు సాంస్కృతిక రంగాన్ని తీవ్రంగా కలచి వేశాయి. ఆ దశలో పారిస్‌లో జరిగిన ప్రపంచ రచయితల సమావేశానికి అప్పుడు లండన్‌లో విద్యార్థిగా ఉన్న సజ్జాద్ జహీర్ (బన్నే భాయ్) హాజరయ్యారు. ఈ ప్రభావంతోనే 1936లో లక్నోలో అభ్యుదయ రచయితల సంఘం అవతరించింది. ఆ సమయానికే ఇటలీలో ముస్సోలిని ఫాసిస్టు విధానా లకు పాదులు వేస్తుంటే, జర్మనీలో హిట్లర్ ఫాసిస్టు పోకడలకు ప్రతి రూపమైన నాజీయిజానికి బీజాలు వేశారు. ఈ జాత్యహంకార ధోరణే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. లక్నోలో అభ్యుదయ రచయితల సంఘం అవతరించే నాటికే స్పెయిన్‌లో అంతర్యుద్ధం జరుగుతోంది. ప్రసిద్ధ రచయిత, కమ్యూనిస్టు అయిన రాల్ఫ్ ఫాక్స్ స్పెయిన్ అంతర్యుద్ధంలో పాల్గొని ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆర్థర్ కోస్ట్లర్, ఎర్నెస్ట్ హెమింగ్వే, ఇల్యా ఎహ్రెన్ బర్గ్, పాబ్లో నెరూడా, జార్జ్ ఆర్వెల్, ఫెడరికో గార్షియా లోక్రా లాంటి వారు స్పెయిన్‌లో ఫ్రాంకో నాయకత్వంలోని ఫాసిస్టు శక్తులను ఏదో ఒక రూపంలో వ్యతిరేకించారు. ఫాసిజానికి వ్యతిరేకంగా ప్రజలను చైతన్య పరిచారు.
ఈ పరిణామాలన్నీ భారతీయ రచయితలను ప్రభావితంచేశాయి. నెహ్రూ కూడా స్పెయిన్ అంతర్యుద్ధంలో పాల్గొనాలనుకున్నారు. కానీ మోతీలాల్ నెహ్రూ, మహాత్మా గాంధీ ఆయన స్పెయిన్ వెళ్లకుండా నిలవరించడానికి 1936లో నెహ్రూను కాంగ్రెస్ అధ్యక్షుడిని చేసేశారు. అదే సంవత్సరం లక్నోలో జరిగిన కాంగ్రెస్ మహాసభలో నెహ్రూ స్ఫూర్తిదాయకమైన ప్రసంగం చేశారు. ఇది అభ్యుదయ భావాలున్న వారిని బాగా ఆకర్షించింది. ఆ ఫలితంగానే కాంగ్రెస్ మహాసభల పంథాలోనే అభ్యుదయ రచయితలసంఘం అవతరించింది. లక్నోలో జరిగిన అభ్యుదయ రచయితలసంఘం అవతరణ సభకు అబ్బూరి రామకృష్ణా రావు, సోమంచి యజ్ఞన్న శాస్త్రిలాంటి కొద్ది మంది తెలుగువారు హాజరయ్యారు.
1943లో తెలుగునాట అరసం ఏర్పడడానికి ముందు భావకవిత్వం రాజ్యమేలుతుండేది. అంతమాత్రం చేత అంతకు ముందు పురోగామి రచయితలు లేరని కాదు. హిట్లర్ రెచ్చగొట్టిన జాత్యహంకారం తెలుగు రచయితలను కూడా ఆలోచింప చేసింది. భావ కవిత్వంలో ఊహలకే కానీ మనిషికి స్థానం ఉండేది కాదు. ఊహా ప్రేయసి చేలాంచలాలను పట్టుకుని వేలాడడమే భావకవుల లక్ష్యం. కానీ అంతర్జాతీయ పరిణామాలు విశ్వనాథ సత్యనారాయణలాంటి రచయితలను కూడా నేలమీద నిలబడి ఆలోచించేట్టు చేశాయి. ఆయన ‘‘విప్లవం’’ కవిత రాశారు. భావకవిగా ప్రసిద్ధుడైన దేవులపల్లి కృష్ణశాస్త్రి అఖిలభారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ)్ మహాసభ జరుగుతూ ఉంటే అభ్యుదయ భావాలు గల పాటరాశారు. అదే సమయంలో తెలుగునాట కమ్యూనిస్టు పార్టీ ఏర్పడి సంఘటితం కావడం మనిషిని పట్టించుకునే రచయితలలో స్ఫూర్తి నింపింది. అభ్యుదయ భావాల వ్యాప్తికి వామపక్ష ఉద్యమం తోడ్పడిరది. ఊహలు, కల్పనలు మాత్రమే సాహిత్యానికి పరమావధి కాదన్న చైతన్యం ప్రజలపక్షాన నిలబడే రచయితలను అభ్యుదయ రచయితల సంఘంగా ఏర్పడడానికి పురికొల్పింది. జన బాహుళ్యం బతుకు పోరాటాలు, జీవన విధానాలు, ఆకాంక్షలు సాహిత్యానికి ప్రధాన వస్తువు అనుకునేవారు అభ్యుదయ రచయితల సంఘం ఛత్రచ్ఛాయల కింద చేరారు.
ప్రగతిశీల భావాలున్న కలంవీరులు ఫాసిజాన్ని గట్టిగా వ్యతిరేకించారు. అప్పుడు మన దేశం వలసవాదపాలనలో మగ్గిపోతున్న మాట నిజమే. కానీ ఫాసిజం మనకు ఆనాడు తక్షణ సమస్యకాదు. అయినా విశ్వమానవుల శ్రేయస్సు కోరే సాంస్కృతిక రంగానికి చెందినవారు స్పందించారు. సంఘటితమయ్యారు. ఇప్పుడు ఫాసిస్టు పోకడలు మనదేశంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి. సంస్కృతి మీద దాడిజరుగుతోంది. మెజారిటీవర్గ భావాలను, సంస్కృతిని ఇతర మతాలను అవలంబించేవారి మీద రుద్దాలన్న ప్రయత్నం తీవ్రస్థాయిలో కొనసాగుతోంది. అధికారంలో ఉన్నవారిని ప్రశ్నించే వారిని దేశద్రోహులుగా చిత్రిస్తున్నారు. మైనారిటీ మతాల వారి సంస్కృతిని నాశనంచేసే ప్రయత్నాలు బాహాటంగానే జరుగుతున్నాయి. ప్రశ్నించే గొంతులను అణగదొక్కుతున్నారు. గౌరీ లంకేశ్, గోవింద్ పన్సారే, నరేంద్ర ధబోల్కర్ లాంటి వారు ఈ వికృత దాడికి బలయ్యారు. 87ఏళ్ల కింద అభ్యుదయ రచయితల సంఘం జాతీయ స్థాయిలో అవతరించినప్పుడు, 1943లో తెలుగునాట అరసం ఏర్పడినప్పుడూ అనేక రకాల అణచివేతలు ఉండొచ్చు. కానీ ఫాసిస్టు పోకడలు ఆనాడులేవు. ఇప్పుడు అవి మనం ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. ఈ తరుణంలో ప్రజల గొంతుక వినిపించడానికి నిబద్ధులైన రచయితలు ఫాసిస్టు పోకడలను ప్రతిఘటించడం అనివార్యం అయింది. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికే నిరంతరం పోరాడవలసిన దుస్థితిలో ఉన్నాం. అందువల్ల అభ్యుదయ రచయితల బాధ్యత మరింత పెరిగింది. ఈ స్థితిలో జరుగుతున్న తెలంగాణ అభ్యుదయ రచయితల సంఘం రచయితలకు స్పష్టమైన దిశా నిర్దేశం చేయవలసి ఉంది.