Friday, August 19, 2022
Friday, August 19, 2022

ఫిరాయింపులతో ప్రజాస్వామ్య పతనం

సంగిరెడ్డి హనుమంతరెడ్డి

కృష్ణుడే పాంచాలికి ఆరవ పతిని చేస్తానన్నా కర్ణుడు పక్షం మారలేదు. ఇది కర్ణుల కరువు కాలం. విభీషణ భాతృ వంచనాసూత్ర రాజ్యం. మహా రాష్ట్రలో 30 నెలల్లో 3 సార్లు ప్రజాస్వామ్యం భ్రష్టు పట్టింది. బీజేపీియేతర రాష్ట్రాల్లో ప్రజాస్వామ్య పతన యజ్ఞమిది. పాలక స్పీకర్ల, సంఫ్‌ు గవర్నర్ల, రబ్బరు స్టాంపు రాష్ట్రపతుల ఈ యోగయాగం సాగుతూనే ఉంటుంది.
ప్రతిపక్షాలను, ప్రజాస్వామ్యాన్ని ఫిరాయింపు యాగంలో కాల్చేస్తోంది బీజేపీ. దానికి అంతటా తానే ఉండాలన్న దురాశ.’’ ఒక పార్టీకి ఇబ్బంది కలిగిందని మరో ఫిరాయింపు చట్టం తేవాలా?’’ కేంద్రమంత్రిగా వెంకయ్య ప్రశ్న. ఇబ్బంది పార్టీలకు కాదు, దేశానికి. ఉపాధ్యక్షునిగా ఫిరా యింపులపై చాలా నీతి సూత్రాలు చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక తరగతి హోదాలో మాట తప్పినట్లు నీతి తప్పి టీడీపీ రాజ్యసభ సభ్యులకు చట్ట వ్యతి రేకంగా కాషాయ కండువా కప్పారు. గతంలో కాంగ్రెస్‌ వారు పదవులతోపాటు పార్టీలు మారారు. తెలంగాణలో టీడీపీ సభ్యుల టి.ఆర్‌.ఎస్‌. ప్రవేశాన్ని విమర్శిం చిన చంద్రబాబు ఎపిలో పాత పార్టీ సభ్యత్వం వదలని ఫిరాయింపుదార్లను మంత్రులను చేశారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడాలని, బీజేపీకి చెడ్డ పేరు రాకూడదని (నాడు టీడీపీ బీజేపీ మిత్రపక్షం) ఈ అంశాన్ని మీ దృష్టికి తెస్తున్నా నని బీజేపీ మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, కేంద్ర పూర్వ (కాంగ్రెస్‌) మంత్రి పురంధేశ్వరి మోదీ, షాలకు లేఖ రాశారు. ఇది చంద్రన్నపై కోపమే కాని ప్రజాస్వామ్య నిబద్దత కాదు. రాష్ట్ర విభజనలో నోరెత్తకుండా, విభజన విధానం నచ్చలేదని, జాతీయ, అంతర్జాతీయ ఖ్యాతినందించిన కాంగ్రెస్‌ను వదిలి అసలు విభజనకర్త బీజేపీలో చేరిన నైతికత ఈమెది. ఫిరాయింపులను బీజేపీ ప్రోత్స హించినా ఈ ప్రజాస్వామ్యవాది నోరెత్తలేదు. ఉత్తరాఖండ్‌, అరుణాచల్‌లలో బీజేపీ రాజ్యాంగ విరుద్ధ చర్యలను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. మణిపూర్‌ ముఖ్య మంత్రితో సహా నాయకులంతా అధికారం కోసం బీజేపీకి మారినవారే. త్రిపుర, బెంగాల్‌లో కుర్చీ కోసం సిద్ధాంతాలను వదిలి కాంగ్రెస్‌, తృణమూల్‌, వామపక్ష సభ్యులను చేర్చుకున్న ఘనత బీజేపీదే. నేడు తెలంగాణ కాంగ్రెస్‌ టి.ఆర్‌.ఎస్‌.లో కలిసింది. ఫిరాయింపులలో ప్రజాస్వామ్య విలువలున్నదెవరికి?
ప్రజాస్వామ్య పునాదుల పెకలింపునకు ఒక పార్టీ నుంచి మరో పార్టీకి గెంతితే చాలని మాజీ కేంద్ర మంత్రి, లోక్‌ సభ స్పీకర్‌, సామ్యవాద నాయకుడు, గాంధేయ వాది కీ.శే. రబీ రే అన్నారు. పార్టీ ఫిరాయింపు వికృతమై ప్రజా స్వామ్యానికే చీడగా మారుతుందని రాజ్యాంగ నిర్మాతలు ఊహించలేదు. రాజ్యాం గం అమలైన 35 ఏళ్ళకు ‘ఫిరాయింపు వ్యతిరేక చట్టం’ చేయాల్సి వచ్చింది. ఈ చట్టం రాజ్యాంగ 10వ షెడ్యూల్‌, రాజ్యాంగ (52వ సవరణ) చట్టం, 1985 ద్వారా ప్రవేశపెట్టి రాజ్యాంగ (91వ సవరణ) చట్టం, 2003 ద్వారా సవరిం చారు. క్లుప్తంగా 10వ షెడ్యూల్‌ నిబంధనలు : 1. చట్టసభలకు ఒక పార్టీ నుండి ఎన్నికైన/నియమితుడైన సభ్యుడు ఆ పార్టీ సభ్యత్వాన్ని ఐచ్ఛికంగా వదులుకున్నా, సభలో ఆ పార్టీ ఆదేశాలకు వ్యతిరేకంగా ఓటేసినా, ఓటింగ్‌ నుండి తప్పుకున్నా సభా సభ్యత్వానికి అనర్హుడవుతాడు 2. స్వతంత్ర సభ్యుడు రాజకీయ పార్టీలో చేరితే అనర్హుడవుతాడు 3. ఏ పార్టీకీ చెందని నియామక సభ్యుడు 6 నెల్ల తర్వాత రాజకీయ పార్టీలో చేరితే అనర్హుడవుతాడు 4. మూడిరట రెండొంతుల సభ్యుల ఆమోదంతో ఒక పార్టీ ఇంకో పార్టీలో విలీనమైతే అనర్హత కాదు 5. దిగువ సభల సభాధిపతులు, ఉప సభాధిపతులు, ఎగువ సభల అధ్యక్ష ఉపాధ్య క్షులు తమ పార్టీతో సంబంధం తెంచుకోవటం అనర్హత కాదు 6. అనర్హతను సభాధ్యక్షుడు నిర్ణయిస్తారు. సభాధ్యక్షుని అనర్హత నిర్ణయించవలసి వస్తే సభ ఎన్నుకున్న మరొక సభ్యుడు ఆ పని చేస్తారు 7.10వ షెడ్యూల్‌ అమలుకు నియమాలు చేసే అధికారం సభాధ్యక్షునిదే. ఐతే వాటిని సభ ముందుంచాలి. సభ వాటిని సవరించవచ్చు. తిరస్కరించవచ్చు. 8. పార్లమెంటుకు, సభ్యులకు ప్రత్యేక అధికారాలు, హక్కులు, మినహాయింపులనిచ్చే రాజ్యాంగ నిబంధనలు 105, 194లతో నిమిత్తం లేకుండా 10వ షెడ్యూల్‌ నియమాల తిరస్కరణ సభాహక్కుల ఉల్లంఘనగా పరిగణిస్తారు.
1985 డిసెంబర్‌లో లోక్‌సభ స్పీకర్‌ ప్రతిపాదించిన 10వ షెడ్యూల్‌ 8వ పేరా నియమాలు 18.03.1986 నుండి అమల్లోకి వచ్చాయి. సభ్యత్వ అనర్హత నిర్ణయాధికారం స్పీకర్లదే. స్పీకర్లు పాలక పార్టీకి రాజీనామా చేయరు. దానితో సంబంధాలు కొనసాగిస్తారు. (ఇది 10వ షెడ్యూల్‌ 5వ నిబంధన ఉల్లంఘన) తమ నాయకునికి నమ్మిన బంటులా ఉంటారు. ఆయన అభీష్టాన్ని నెరవేర్చ కుంటే తమ పదవి ఊడుతుందని వారికి తెలుసు. చట్టాన్ని నిష్పక్షపాతంగా అమలు చేయరు. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన స్పీకర్లు అధికార పక్షీయు లుగా పాలక పార్టీల ప్రయోజనాలు కాపాడుతున్నారు. పార్టీ ఫిరాయించిన వ్యక్తి ఐచ్ఛికంగా పాత పార్టీ సభ్యత్వాన్ని వదులుకున్నట్లే. 10వ షెడ్యూల్‌ 1వ నిబంధన ప్రకారం ఆ సభ్యుడు చట్టసభ సభ్యత్వానికి అనర్హుడు. స్పీకర్లు విజ్ఞత, వివక్షతలను పాటించరు. అనర్హతలను ప్రకటించరు. 8వ నిబంధన ప్రకారం ఇది సభా హక్కుల ఉల్లంఘన.
ప్రభుత్వ ఏర్పాటుకు ఆధిక్యత లేకపోతే ప్రతినిధులు ఫిరాయిస్తారు. పార్టీ మారి ప్రభుత్వాలను పడగొట్టిన, నిలబెట్టిన సందర్భాలు ఎన్నో. ఇప్పుడు ఇవేవీ లేకుండానే పార్టీ మారి అధికార పార్టీలో దూరుతున్నారు. గుత్త సంస్థల అధిపతులు రాజకీయులయ్యారు. దొడ్డిదార్లలో వ్యాపారాభివృద్ధి, ఆస్తుల సంపా దన, అక్రమాస్తుల రక్షణ వారి ప్రధాన అవసరాలు. అధికార సుఖాలు మరిగిన వారు కుర్చీ లేకుండా బతకలేరు. అధికార పార్టీకి మారుతారు. అధికార పార్టీతో ‘నీకిది నాకది’ సూత్రంలో ఆర్థిక, అధికార పంపకాలు, తప్పుల నుండి తప్పించు కోడం, అవినీతి కుంభకోణాలు, ఆస్తుల జప్తులు, న్యాయ విచారణల నుండి రక్షణ, అక్రమ సంపాదన కొనసాగింపు/ ఏర్పాటు ఫిరాయింపుల లక్ష్యం. పాలక పార్టీలు తమ తప్పుడు విధానాలను, నిరంకుశ పాలనను ప్రశ్నించే ప్రతిపక్షాలను బలహీనపరుస్తున్నాయి. బలహీన ప్రతిపక్షం, ప్రతిపక్షరాహిత్యం చట్టసభల స్వభావాన్ని మార్చి, ప్రజాస్వామ్యాన్ని నాశనం చేస్తాయి. ఏ పార్టీ దీనికి అతీతం కాదు. తమవారు పార్టీ మారితే విమర్శ. ఇతరులు తమ పార్టీలోకొస్తే ప్రోత్సా హం. సంబంధంలేని సందర్భాలలో నిశ్శబ్దం. ఒక పార్టీ సిద్దాంతాలపై, ప్రణా ళికపై ఐదేళ్ళకు ఎన్నుకున్న ప్రతినిధులు పార్టీ మారితే పాత పార్టీ సిద్ధ్దాంతాలు, ప్రణాళికలపై తమను ఎన్నుకున్న ప్రజలను మోసగించడమే. పాత పార్టీ నుండి పొందిన ప్రాతినిధ్యాన్ని, పదవులను, హోదాలను వదిలేయాలి.
స్పీకర్‌ పార్టీరహితంగా, తటస్థంగా ఉండాలని రాజ్యాంగ లక్ష్యం. స్పీకర్‌ పదవులను ఏ పార్టీకీ చెందని రాజ్యాంగ నిపుణులకు ఇవ్వాలి. సభ్యత్వ అనర్హత నిర్ణయాధికారాన్ని ఎన్నికల సంఘానికో, న్యాయవ్యవస్థకో అప్పజెప్పాలి. నిర్ణ యాన్ని వెంటనే ప్రకటించాలి. అనర్హులు సభ్యులుగా కొనసాగే అవకాశమివ్వ రాదు. నేటి ఎన్నికల విధానం పాలకపక్షాలకు అనుకూలం. చట్ట సభల్లో ప్రత్యా మ్నాయ పక్షాల ఉనికికి ఎన్నికల సంస్కరణలు అవసరం. దామాషా పద్ధతిలో వ్యక్తిని కాక పార్టీని ఎన్నుకుంటారు. ఫిరాయింపులుండవు. గెలుపోటముల ప్రసక్తి లేనప్పుడు ప్రజలు కమ్యూనిస్టులకు ఓటేస్తారు. చట్టసభల్లో ప్రాతినిధ్యం కోసం వామపక్షాలు ఎన్నికల సంస్కరణలకు ఉద్యమించాలి. బలమైన పౌర సంఘాలను నిర్మించాలి. ఫిరాయింపులను నిరసించేటట్లు ప్రజలను చైతన్య పర్చాలి. ఫిరాయింపుల్లో పదవుల రాజీనామాకు ఒత్తిడి పెంచాలి. మాధ్యమాలు పార్టీల వత్తాసు మాని, ప్రజా శ్రేయస్సుకు పని చేయాలి.
వ్యాస రచయిత ప్రోగ్రెసివ్‌ ఫోరం
జాతీయ కార్యదర్శి, 9490204545

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img