Sunday, September 24, 2023
Sunday, September 24, 2023

బండబారిన సమాజం

ఆర్వీ రామారావ్‌

మణిపూర్‌లో ఇద్దరు మహిళల మీద అత్యాచారం చేసి, చివరకు హతమార్చిన కిరాతకుల కన్నా 2012లో దిల్లీలో నిర్భయ మీద మూకుమ్మడి అత్యాచారం చేయడమే కాక చిత్రహింసలు పెట్టిన దుర్మార్గులే మేలు అనుకునే దశకు సమాజం చేరుకున్నట్టుంది. 2012 డిసెంబర్‌ 16న బస్‌స్టాప్‌లో ఒంటరిగా నిలబడ్డ యువతి ఓ ప్రైవేటు బస్సులోకి చేరుకుంది. ఆ బస్సులో ఉన్న ఆరుగురూ కలిసి ఆమె మీద అత్యాచారం చేసి, ఆమె మర్మాంగాల్లోకి ఇనుప కడ్డీలు జొప్పించి అత్యంత పైశాచికంగా ప్రవర్తించారు. ఆమెను సఫ్దర్‌ జంగ్‌ ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం సింగపూర్‌ కూడా తీసుకెళ్లారు. కానీ రెండు రోజుల తరవాత ఆ 22 ఏళ్ల ఫిజియోథెరపీ విద్యార్థి ప్రాణాలు వదిలారు. ఆ ప్రైవేటు బస్సులో డ్రైవర్‌తో సహా ఆరుగురు ఉన్నారు. వారంతా ఆమె మీద అత్యాచారం చేశారు. ఆమె నిర్భయ. ఆత్యాచారానికి గురైన మహిళల పేరు చెప్పకూడదన్న నియమం ప్రకారం ఆమెను నిర్భయ అన్న పేరుతో పిలిచాం. కానీ తరవాత ఆమె తల్లిదండ్రులే తమ కూతురి పేరు జ్యోతీ సింగ్‌ అని చెప్పారు. నిర్భయ మీద అత్యాచారం జరిగినప్పుడు ఒక్క ఉదుటన ప్రతిఘటించిన జనం మణిపూర్‌లో అంతకన్నా ఎక్కువ ఘోరాలు జరుగుతున్నా సామాజిక మాధ్యమాలలో తప్ప వీధుల్లోకి వచ్చి ఆగ్రహం వ్యక్తం చేయడంలేదు. అంటే మన సమాజం పది పదకొండేళ్ల స్వల్ప వ్యవధిలో అంతగా బండబారిపోయిందా?
అప్పుడు ఒక అమ్మాయి మీద ఇంత హేయమైన అత్యాచారం జరిగినందుకు దేశమంతటా నిరసన జ్వాలలు చెలరేగాయి. అన్ని చోట్లా నిరసన ప్రదర్శనలు జరిగాయి. దేశవాసులందరూ ఈ దురాగతాన్ని ముక్త కంఠంతో నిరసించారు. అప్పుడు అధికారంలో ఉన్న డా.మన్మోహన్‌ సింగ్‌ నాయకత్వంలోని యూపీఏ సర్కారు నిర్భయ చట్టం కూడా తీసుకొచ్చింది. అత్యాచారానికి పాల్పడ్డ వారిని శిక్షించేందుకు అంతకు ముందూ చట్టంలో వెసులుబాట్లు ఉన్నా మరింత కఠిన నిబంధనలతో నిర్భయ చట్టం తీసుకొచ్చారు. నిర్భయ ఉదంతానికి ముందూ అత్యాచారాలు జరిగాయి. ఆ తరవాతా జరుగుతున్నాయి. కేవలం చట్టాలవల్ల నేరాలు ఆగవని ప్రపంచమంతటా రుజువైంది. చట్టాలు విచారణ జరపడానికి, శిక్షించడానికి ఉపకరించవచ్చునేమో. నేర నిరోధకాలుగా చట్టాలు ఎందుకూ కొరగావడం లేదు.
నిర్భయ కూడా అసమానమైన ధైర్యం ప్రదర్శించారు. బతికి ఉండాలన్న గాఢకాంక్ష వ్యక్తం చేశారు. నిందితులను శిక్షించాలని కోరారు. కానీ మణిపూర్‌ లో జరిగిన సంఘటన నిర్భయ ఉదంతంకన్నా తక్కువ హేయమైంది ఏమీ కాదు. కానీ మణిపూర్‌ అత్యాచార బాధితుల పేర్లు తెలియదు. అత్యాచారానికి, ఆ తరవాత హత్యకు పాల్పడిన వారు ఆటవిక జంతువులకన్నా హీనంగానే ప్రవర్తించారు. అయినా సమాజంలో రావలసినంత ప్రతిఘటన ఛాయలు కనిపించడం లేదు. అక్కడక్కడా నిరసన ప్రదర్శనలు జరుగుతున్నాయి. కానీ దేశవ్యాప్తంగా ఆ నిరసనలు ఒకే రకంగా లేవు. నిర్భయ సంఘటన చూసి ప్రతి భారతీయుడూ సిగ్గుతో తల దించుకున్నాడు. ఇప్పుడు ప్రధానమంత్రి మోదీ మణిపూర్‌ ఉదంతం తలదించుకునేలా ఉంది అన్నారు. అంతకన్నా ఆయన చేసింది ఏమీ లేదు. కానీ నిర్భయ దురంతం తరవాత అప్పటి ప్రభుత్వం బాగానే స్పందించింది. రోడ్డు మీద జరిగే అత్యాచారాలను ఏ ప్రభుత్వమూ నిరోధించలేకపోవచ్చు. కానీ యువతరం ఇంత దుర్మార్గానికి ఎందుకు పాల్పడుతున్నట్టు? అమానుషత్వం పురి విప్పుతోందేమో? సమాజమే అమానుషంగా తయారవుతున్న దశలో మానవత్వం ఇంకా మిగిలి ఉంటుందనుకోవడం అత్యాశే.
అన్యాయాన్ని ఎదుర్కోలేని శక్తి హీనత సమాజాన్ని ఎందుకు ఆవహించిందో మాత్రం ఆలోచించవలసిందే. నిర్భయ ఉదంతంలో నిరసన జ్వాలలకు దేశమంతా స్తంభించిపోయినంత పనైంది. జాతి యావత్తు ఈ ఘటనతో సిగ్గుతో తల వంచుకుంది. అప్పుడు యూపీఏ అధ్యక్ష స్థానంలో ఉన్న సోనియా గాంధీ కూడా అర్థరాత్రి దిల్లీ వీధుల్లోకి వచ్చి ఆగ్రహోదగ్రులైన జనంతో మాట్లాడారు. నిర్భయ చట్టం తీసుకురావడంతో పాటు ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది. జన జీవనం సాగిపోయింది. మణిపూర్‌ సంఘటన తరవాత పరిస్థితి చూస్తే జనం తమలో గూడుకట్టుకున్న అమానవీయ లక్షణాలను వ్యక్తం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రపంచంలో ఎక్కడా ఇలా ఉండదేమో! ఒక సమాజంగా భారత్‌ స్థానం ఎక్కడ అన్న అనుమానాలు సహజంగానే వ్యక్తం అవుతాయి. విఫలమైంది ‘‘భారతీయులమైన మనం’’ మన రాజ్యాంగం కేవలం పవిత్ర గ్రంథం లాంటిది కాదు. అది బహుళత్వానికి ప్రతిరూపం. అది సజీవంగా ఉండాలి. అమలవుతూ ఉండాలి. కానీ ఈ ఛాయలు ఎక్కడా కనిపించడం లేదు. మోదీ ప్రభుత్వమే రాజ్యాంగాన్ని ఛిద్రం చేస్తోంది. ఈ స్థితిలో రాజ్యాంగాన్ని పరిరక్షించవలసిన బాధ్యత అంతిమంగా ప్రజలదే. అప్పుడే ప్రజల ఆకాంక్షలు చట్టసభల్లోనూ, కార్యనిర్వాహక వర్గంలోనూ, న్యాయ వ్యవస్థలోనూ ప్రతిధ్వనిస్తాయి. ప్రజాస్వామ్యం కుళ్లు కంపు కొడ్తోంది అంటే జనమూ కుళ్లిపోయినట్టే. సమాజం అనాగరికంగా మారకుండా చూడడం ప్రజల బాధ్యతే. ప్రపంచం శరవేగంగా ముందుకు వెళ్తున్నప్పుడు మనం అసహనం, విద్వేషం, నైతిక పతనంలో కూరుకుపోయి ఉండాలని జనం ఆకాంక్షిస్తున్నారేమో అనిపిస్తోంది. దేశం అంతా క్షతగాత్రం అయినట్టు కనిపిస్తోంది. ఈ గాయాలు చేసిందీ దేశవాసులే. ఇది ఘోరాతి ఘోరం.
వేదనా భరితమైన ఈ దశలో కైఫీ ఆజ్మీ కవితలోని నాలుగు పాదాలను మననం చేసుకుందాం.
‘‘నేటి రాత్రి వేడి గాలులు వీస్తున్నాయి
నేటి రాత్రి ఫుట్‌పాత్‌ మీద కునుకు పట్టదు
అందరూ లేవండి, నేనూ లేస్తాను, మీరూ లేవండి
ఇవే అడ్డు గోడల నుంచి ఏదో ఓ కిటికీ తెరుచుకుంటుంది’’

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img