Friday, March 31, 2023
Friday, March 31, 2023

బడా కంపెనీలకు నిధులిచ్చినా ఉద్యోగాలు కరువే

డాక్టర్‌ సోమ మర్ల
బడ్జెట్‌లో పెద్దపెద్ద కంపెనీలకు నిధులు ఎక్కువగా కేటాయించినప్పటికీ ఉద్యోగాలు సృష్టించడంలో అది విఫలమవుతున్నాయి. ఈ ఏడాది కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో 202324కుగాను పదిలక్షల కోట్లు పెట్టుబడి వ్యయం కింద కేటాయించారు. అయితే ఇందులో నాలుగోవంతు నిధులను కొత్త రోడ్డు, జాతీయ రహదారుల నిర్మాణానికి, మరో పావువంతు వేగంగా నడిచే కొత్త రైళ్లు(వందే భారత్‌) ప్రవేశపెట్టడం కోసం కొత్త లైన్ల నిర్మాణానికి ఖర్చు చేస్తారు. మౌలిక సదుపాయాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వాలకు పదిశాతం రుణాలుగా అందచేస్తారు. మౌలిక సదుపాయాల నిర్మాణానికి బడ్జెట్‌ కేటాయింపులు జీడీపీలో దాదాపు 3శాతం ఉంటాయి. భారీగా నిధులు ఖర్చు చేసినప్పటికీ, ఆర్థికరంగం పుంజుకోకపోవచ్చు. అలాగే కొత్త ఉద్యోగాల సృష్టి ఉండదు. ఆర్థికమంత్రి మాత్రం డిమాండ్‌ను పెంచడంకోసం నిధులు కేటాయించామని చెబుతున్నప్పటికీ అవి కుబేరులకు నయాఉదారవాద ఆర్థిక బహుమతి అవుతాయి. సంప్రదాయ ఆర్థికరంగంలో మౌలికసదుపాయాలపై ఖర్చుచేసి పెట్టుబడులు పెట్టడానికి ప్రయోజనకరంగా ఉంటుందని చెబుతుంటారు. దీనివల్ల బొగ్గు, సిమెంటు, స్టీలు, భారీయంత్రాలు, అనేక ఉద్యోగాల సృష్టి జరిగి ప్రత్యక్షంగా పరోక్షంగా పేదలకు ఆదాయం పెరుగుతుంది. ప్రపంచబ్యాంకు అధ్యయనం ప్రకారం(ఆగస్టీ కౌమినవంబరు 22) ప్రకారం, రోడ్ల నిర్మాణానికి ఖర్చుచేసే ప్రతి రూపాయి అదనంగా ఏడు రూపాయల విలువ ఉంటుంది. బ్యాంకు ఇచ్చిన నివేదికలోనే ఇదే సమయంలో భారతదేశం రానున్న పదిహేనేళ్లల్లో ప్రతి సంవత్సరం 840 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయవలసి ఉంది. ఏడాదికి పట్టణప్రాంతంలో మౌలిక సదుపాయాల నిర్మాణానికి సగటున 55 బిలియన్‌ డాలర్లు ఖర్చు చేయవలసి ఉంటుంది. మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు అంటే ఉదాహరణకు రోడ్లు, జాతీయ రహదారుల నిర్మాణం ద్వారా ఖనిజాలు, వస్తువులు, రవాణా చేసేందుకు దోహదపడుతున్నది. ఫలితంగా వినిమయ డిమాండు ఏర్పడుతుంది. అలాగే ఉత్పత్తిశక్తిని పెంపొందించేందుకు పరిశ్రమలు, పెట్టుబడులను పెంచేందుకు వీలుకలుగుతుంది. అయితే ప్రైవేటు పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడం ద్వారా హామీఇచ్చిన ప్రయోజనాలు పేదలకు అందించడానికి ముందుకు రావడంలేదు. ఈ అంశాన్ని లోతుగా పరిశీలించాలి.
భారీ బడ్జెట్‌ కేటాయింపులు, ప్రైవేటు పరిశ్రమలు పెట్టుబడి అధికంగా వ్యయం చేస్తాయని ఉదారంగా పన్నుల రాయితీలు ఇచ్చారు. అయితే ఈ పరిశ్రమలు పెట్టుబడులు పెట్టడంలో విఫలం కావడంతో ఆర్థికరంగం పుంజుకోవడం ప్రారంభంకాలేదు. రెండేళ్లక్రితం రెండులక్షల కోట్ల రూపాయలు మౌలిక సదుపాయాల కల్పనద్వారా లభిస్తాయని ఆర్భాటంగా ప్రకటించినప్పటికీ ప్రైవేటు పెట్టుబడులు ఏ మాత్రం చెప్పుకోదగినవిగాలేవు. ఈ విధానం దేశ జీడీపీ వృద్ధిరేటు పెంచడంలో విఫలమైంది. ఇటీవల విడుదలచేసిన ఆర్థికసర్వే ప్రకారం అంచనా వేసిన ఫలితాలు రాలేదు. నిరాశే మిగిలింది. ఇందుకు ప్రధాన కారణం వస్తువులు కొనుగోలుకు ప్రజల దగ్గర డబ్బులు లేకపోవడమే. ఇప్పటికీ వినిమయ డిమాండ్‌ తక్కువగా ఉన్నది. ఉపాధి కల్పనకు(జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం), ఆహారభద్రత, ఆరోగ్యరంగం, శిశు మహిళా సంక్షేమం కార్యక్రమాలకు అతి తక్కువ నిధులు కేటాయించారు. చిన్నపరిశ్రమలకు ప్రోత్సాహకాలను విస్మరించారు. ఫలితంగా ప్రజల వస్తువులు కొనుగోళ్లు చేయడం తగ్గిపోయింది. విలాసవంతమైన కార్లు, నివాసానికి విల్లాలు కొనడం బాగా పెరిగింది. ఫలితంగా సంపన్నులు, పేదల మధ్య అపారంగా అసమానతలు పెరుగుతున్నాయి. వినిమయ డిమాండ్‌ లేకపోవడంతో ప్రైవేటు పరిశ్రమలు అదనంగా పెట్టుబడులుపెట్టి తమ ఉత్పత్తి శక్తిని పెంచుకోవాలన్న ఆసక్తి చూపడంలేదు. కేంద్ర ప్రభుత్వం అనేక పన్నులను తగ్గించడం లేదా పెట్టుబడులకు నిధులను సమకూర్చడం చేస్తున్నప్పటికీ ప్రైవేటు పరిశ్రమల పెట్టుబడులు పెరగడంలేదు. అలాగే స్థూల పెట్టుబడి నిల్వలు పెరగడంలేదు. ద్రవ్య కార్యకలాపాలను జీడీపీ స్థూల నిర్దిష్ట పెట్టుబడుల నిల్వల మధ్య నిష్పత్తి సూచిక అవుతుంది. ఈ నిష్పత్తి 201415లో 33శాతం ఉండగా, అది 202223 నాటికి 29శాతానికి పడిపోయింది. ఈ కాలంలో కేంద్రం(తరువాత వార్షిక బడ్జెట్‌లలో) ఖర్చుచేసిన పెట్టుబడి వ్యయం జీడీపీలో నిలకడగా 1.7శాతం నుంచి 2.7శాతానికి పెరిగింది. అంటే దీని అర్థం మౌలిక సదుపాయాలకు ప్రభుత్వ వ్యయం తగినంత లేదు. మొత్తం మీద జీడీపీ రేట్లు కూడా క్షీణిస్తూనే ఉంది. అంటే పెట్టుబడుల రేటు కంటే ప్రైవేటు పెట్టు బడులు వేగంగా తగ్గిపోతున్నాయి. (ఆర్థికసర్వే 202023). మౌలిక సదుపాయాలకోసం ఖర్చు పెంచుతున్నప్పటికీ సానుకూల ప్రభావం చూపడంలేదు. నాలుగురోజుల క్రితం 12 బిలియన్ల విలువగల ముంబైదిల్లీ జాతీయ రహదారి మొదటిదశను ప్రధాని మోదీ ప్రారంభించారు. 1900 సంవత్సరాలలో అమెరికాలో ఆటోమొబైల్‌ ఉత్పత్తిని పెంచడంకోసం దేశం నలుమూలలా జాతీయ రహదారులను నిర్మించింది. అప్పుడు రైల్వేలైనులు, ప్రజారవాణా తగ్గిపోయాయి. దీనితో లక్షలాది అడవులు, జంతుజాలాలు, పక్షులు, ఫల,పుష్పాల వాతావరణం హరించుకుపోయింది. జాతీయ రహదారులు, ఇతర పరిశ్రమలు, నిర్మించినట్లయితే కొత్తగా ఉద్యోగాలు లభిస్తాయని ప్రధాన ఆర్థిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 201617, 202122 సంవత్సరాలలో సిమెంటు పరిశ్రమలో 62శాతం ఉద్యోగాలు తగ్గిపోయాయి. అలాగే స్టీలు పరిశ్రమలో 28శాతం ఉద్యోగాలు తగ్గాయి. గనుల తవ్వకంలోనూ ఇదే పరిస్థితి. ఆధునిక యంత్రాల ఉత్పత్తిలోనూ, ఉద్యోగాలపై కోతపడుతోంది. పరిశ్రమల్లో ఉత్పత్తి శక్తిని విస్తరించాలన్న అభిలాషలేకపోవడం ఇందుకు ప్రధానకారణం. రోడ్ల నిర్మాణం విషయంలోనూ ఉపాధికల్పనకు ఇదే పరిస్థితి. ప్రభుత్వం విద్యుత్‌ ఉత్పత్తి, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కేటాయింపులు పెంచినట్లయితే ఉద్యోగాలు పెరుగుతాయి. అలాగే ఆరోగ్యం, విద్య, మహిళ,శిశువులకు పౌష్టికాహారం అందించడానికి మురికివాడల్లో ప్రాధమిక ఆరోగ్య సౌకర్యాలను విస్తరించడానికి ఎక్కువగా నిధులను కేటాయించాలి. దీనివల్ల మానవాభివృద్ధి లక్ష్యాల సాధనకు, జీడీపీ పెరుగుదలకు అవకాశం కలుగుతుంది. ఆయా ప్రభుత్వాలు నయా ఉదారవాద ఆర్థిక విధానాన్ని పాటిస్తూ ప్రజాప్రయోజనంకల కార్యక్రమాలకు నిధులు కేటాయించకపోవడం ప్రధానకారణం. ప్రపంచబ్యాంకు నయాఉదారవాద, సామ్రాజ్యవాదుల ఆదేశాలను తప్పనిసరిగా ఆమోదిస్తూ ఈ ఆర్థిక విధానాన్ని ప్రభుత్వాలు రూపొందిస్తున్నాయి. గత మూడు దశాబ్దాలుగా భారతదేశంలో నయాఉదారవాద విధానాలనే అనుసరిస్తున్నారు. భారత ఆశ్రిత పెట్టుబడిదారులకు, విదేశీ పెట్టుబడిదారులకు భారీగా నిధులు కేటాయిస్తూ కోట్లాదిమంది పేదలను తీవ్రమైన పేదరికంలో ఉంచుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img