Saturday, August 20, 2022
Saturday, August 20, 2022

బడా పారిశ్రామిక వేత్తలకై బ్యాంకుల ప్రైవేటీకరణ

డా. సోమ మర్ల
మొత్తం ప్రభుత్వ బ్యాంకులన్నిటినీ ప్రైవేటీకరణ చేసే బిల్లు రానున్న వర్షా కాల పార్లమెంటు సమావేశాల్లో ప్రతిపాదిస్తామని ఇటీవల ఆర్థిక మంత్రిత్వ శాఖ సంకేతాలనిచ్చింది. గత డిసెంబరులో జరిగిన శీతాకాల సమావేశాల్లో ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్‌ ప్రకటించిన రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు కొనసాగింపుగా ప్రతిపాదిత బ్యాంకింగు బిల్లును గమనించాలి. ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరించటమే కాకుండా వాటిలో విదేశీ పెట్టుబడు లకు ప్రస్తుతం ఉన్న అన్ని పరిమితులను తొలగించటం ముఖ్యోద్దేశం. ఈ నేపథ్యంలో ప్రైవేటీకరణతో ముడిపడిన వివిధ ఆర్థిక, సామాజిక, చట్టపరమైన విషయాలను క్లుప్తంగా చర్చిద్దాం.
ప్రభుత్వ సంస్థల అడ్డగోలు ప్రైవేటీకరణ, నిరంకుశ కార్మిక చట్టాలు, సాగు సమస్యలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాల, రైతు సంఘాల నాయ కత్వంలో ఇటీవల రెండు రోజుల భారత్‌ బంద్‌ దిగ్విజయంగా నిర్వహించారు. బ్యాంకుల ప్రైవేటీకరణకై ప్రతిపాదించనున్న బ్యాంకు చట్టాల సవరణ బిల్లు 2021కి వ్యతిరేకంగా బ్యాంకు ఉద్యోగుల ఐక్యవేదిక రెండు రోజుల సమ్మె నిర్వ హించింది. బ్యాంకులు ప్రభుత్వ యాజమాన్యంలో నిర్వహించటం వలన పారి శ్రామిక రంగానికి అవసరమైన పెట్టుబడులను సమకూర్చటమే కాక, ప్రభుత్వం చేపట్టే వివిధ సంక్షేమ పథకాలకు, రైతులకు పంట రుణాలు, స్వయం ఉపాధి, చిన్న, మధ్యస్థ పరిశ్రమలకు, సామాన్యుల గృహావసరాలకు ఆర్థికంగా వెసులు బాటు కల్పించటానికి వీలవుతున్నది. కాగా ప్రభుత్వ బ్యాంకులను కేవలం లాభాపేక్షకై ప్రైవేటీకరించటం వలన పైన పేర్కొన్న రంగాల అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలగక తప్పదు.
బ్యాంకుల జాతీయకరణ వరకు బ్యాంకు సేవలు సామాన్యులకు అందు బాటులో ఉండేవి కావు. ఆ రోజుల్లో దాదాపు 300 ప్రైవేటు బ్యాంకులు ఉండేవి దేశంలో. అవి తరచూ దివాళా తీస్తూ, సామాన్య ఖాతాదార్లకు తీవ్ర నష్టాన్ని కలిగించేవి. ఈ పూర్వ రంగంలో మాజీ ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ జులై 19, 1969న హఠాత్తుగా 14 ప్రైవేటు బ్యాంకులను జాతీయం చేసింది. ఈ 14 బ్యాంకుల్లో దేశం మొత్తం బ్యాంకుల నిల్వలు, ఆస్తుల విలువలో 85 శాతం ఉండేవి. జాతీయకరణకు నిరసనగా అప్పటి ఆర్థిక శాఖ మంత్రి మొరార్జీ దేశాయ్‌ రాజీనామా చేశారు. కాంగ్రెస్‌లోని మితవాద శక్తులు (వారిని సిండికేట్‌ కాంగ్రెస్‌గా వ్యవహరించేవారు), ప్రస్తుత బీజేపీకి పూర్వరూపం జనసంఫ్‌ుతో సహా వివిధ పార్టీల నుండి తీవ్ర వ్యతిరేకతను ఇందిరాగాంధీ ప్రభుత్వం ఎదుర్కోవల్సి వచ్చింది. పక్షం రోజుల పాటు నాటకీయంగా సాగిన ఈ పరిణామాలను కమ్యూనిస్టు పార్టీల సహకారంతో పార్లమెంటులో గట్టెక్కగల్గింది.
సామాజికాభివృద్ధికి విఘాతం
బ్యాంకుల జాతీయకరణతో బ్యాంకు రుణాల లభ్యతలో, బ్యాంకు ఉద్యోగాల నియామకాల్లో సామాజిక న్యాయ క్రమంలో దళితులకు ప్రాధాన్యత ఏర్పడిరది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజానీకానికి పంట రుణాలు, సేవలు లభించటానికి, హరిత విప్లవం విజయవంతమవటానికి విస్తరించిన బ్యాంకు శాఖలు తోడ్ప డ్డాయి. బడా పారిశ్రామికవేత్తల చెప్పుచేతల నుండి బ్యాంకులు బయటపడ టంతో ఖాతాదార్ల సొమ్ము జాతి ప్రయోజనాలకు వినియోగించటం ప్రారంభ మైంది. అప్పటి జనసంఫ్‌ు ఎంత తీవ్రంగా వ్యతిరేకించినా జరిగిన బ్యాంకుల జాతీయకరణను గుర్తుపెట్టుకొని నేడు అధికారంలోనున్న బీజేపీ ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణకు పూనుకొంటున్నది. బ్యాంకు సేవలు పెట్టుబడిదారీ ధనిక వర్గం, అంతర్జాతీయ ఆర్థిక సంస్థల అవసరాలు తీర్చటానికేనన్నట్టుగా వ్యవహరిస్తోంది. దళిత, బలహీన, సామాన్యులకు బ్యాంకు సేవలను దూరం చేయటమే ప్రస్తుత ప్రైవేటీకరణ ఆశయం.
చట్టపరమైన అడ్డంకులు
భారత రాజ్యాంగంలోని వివిధ అధికరణాలకు అనుగుణంగా ప్రభుత్వ బ్యాంకుల స్థాపన జరిగింది. పార్లమెంటు ఆమోదించిన బ్యాంకింగ్‌ చట్టాల్లో అనేక న్యాయపరమైన అంశాలను చేర్చటం ద్వారా (ఆర్టికల్‌ 19(6) (॥) బ్యాంకు సేవలను జాతి అవసరాలు తీర్చేవిగా రూపుదిద్దారు. ముఖ్యంగా ఆదేశిక సూత్రాల్లో పేర్కొన్న ఆర్టికల్‌ 38(1), 38(2) ద్వారా ప్రజా సంక్షేమం బ్యాంకు సేవల ప్రధాన లక్ష్యంగా నిర్దేశితమైంది. బ్యాంకింగ్‌ చట్టాల నిర్వహణకు ఆర్టికల్‌ 39(బి), 38(2) లను ప్రాతిపదికగా చేయటం ద్వారా నిధుల కేటాయింపు వలన వివిధ సామాజిక వర్గాల మధ్య అంతరాలకు భిన్నంగా, పారిశ్రామిక సంస్థల యాజమాన్యాన్ని తిరస్కరించటం ద్వారా బ్యాంకులను జాతికి అంకితం చేశారు. ఆర్టికల్‌ 16 ద్వారా దళితులకు బ్యాంకు సేవల్లో ప్రాధాన్యతకు అవకాశం చట్టపరంగా కన్పించింది.
కాగా, పైన పేర్కొన్న సామాజిక ప్రాధాన్యతా అవసరాలకు భిన్నంగా నేడు బీజేపీ ప్రభుత్వం బ్యాంకుల ప్రైవేటీకరణ బిల్లును పార్లమెంటులో ప్రతిపాదించ నుంది. బ్యాంకులను సామాన్యులకు దూరం చేసి గుత్త పెట్టుబడిదారుల అవసరాలు తీర్చే, నిధులను అందించే సాధనాలుగా మార్చటమే దీని లక్ష్యంగా ఉన్నది. దశాబ్ద కాలంగా బ్యాంకుల నిర్మాణం, పనితీరు చూస్తే అంబానీ, అదానీ వంటి పారిశ్రామికవేత్తల అవసరాలు (వేల కోట్ల రుణాలు) కోసమే ప్రాధాన్యత నిస్తున్నాయి. నయా ఉదారవాద ఆర్థిక సంస్కరణల్లో భాగంగా విచ్చలవిడిగా అమ్మేస్తున్న ప్రభుత్వ కంపెనీలు, సంస్థలు, పోర్టులు, రోడ్లు, ఎయిర్‌ పోర్టులు, విద్యుత్‌ సంస్థలను తిరిగి బడా పారిశ్రామికవేత్తలు అతి చౌకగా కొనుగోలు చేయ టానికి ప్రభుత్వ బ్యాంకులు విస్తారంగా నిధులు సమకూరుస్తున్నాయి. ప్రభుత్వ బ్యాంకుల నుండి సులభంగా రుణాలు పొంది, పేరుకుపోయిన లక్షల కోట్ల అప్పులు చెల్లించక విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లు చోక్సి, విజయ మాల్యాల గురించి అందరికీ తెలిసినదే. కేవలం ఆదానీ, అంబానీ ఇతర బడా పారివ్రామికవేత్తలు ప్రభుత్వ బ్యాంకులకు చెల్లించవల్సిన రుణాలే దాదాపు 100 లక్షల కోట్లకు చేరుతున్నాయి. దీనివలన ప్రభుత్వ బ్యాంకులు దివాళా తీసే పరిస్థితి కలిగింది. ఈ నష్టాలను పూరించుకోవటానికి ప్రభుత్వ బ్యాంకులు సామాన్యుల, పెన్షను పొందే వృద్ధుల డిపాజిట్‌లపై వడ్డీని గణనీయంగా తగ్గించి, వివిధ రుసుములను రుద్దుతున్నాయి.
ప్రభుత్వ బ్యాంకుల నుండి రుణాలు పొందిన బడా పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ఈ నిధులను, ప్రజల ఉద్యోగ కల్పనకు, పారిశ్రామికీకరణలో ఉత్పత్తి కాకుండా రియల్‌ ఎస్టేట్‌, స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడి పెట్టి చట్టా వ్యాపారంలో వినియోగిస్తున్నారు. అనుత్పాదకత ద్రవ్య పెట్టుబడిగా (ఫైనాన్స్‌ పెట్టుబడిగా) బ్యాంకు నిధులను మళ్లించటం వలన స్టాక్‌ మార్కెట్లు, గృహ నిర్మాణ కంపెనీల అవసరాలకు మళ్లించటం వలన సంభవించే నష్టాలను బ్యాంకులు భరించవల్సి వస్తుంది.
ఒకవేళ 2008వ సంవత్సరానికే మన ప్రభుత్వ బ్యాంకులు ప్రైవేటీకరించి ఉంటే, విదేశీ (సామ్రాజ్యవాద) ఆర్థిక సంస్థల ఆధీనంలో ఉంటే మనదేశ ఆర్థిక వ్యవస్థ సైతం ఎంత సంక్షోభంలోకి వెళ్ళిపోయేదో ఊహాతీతం. అందుకే విదేశీ ఆర్థిక సామ్రాజ్యవాద సంస్థల నుండి దూరంగా దేశీయ బ్యాంకులను, నిధుల ప్రతిపత్తిని, సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలి. ఏ పారిశ్రామికవేత్తలయితే తీసుకొన్న రుణాలను ఎగ్గొట్టి ప్రభుత్వ బ్యాంకుల నష్టాలకు కారణమయ్యారో, అవే సంస్థలు ప్రభుత్వ బ్యాంకులను ప్రైవేటీకరిస్తే తిరిగి కొనుగోలు చెయ్యటానికి తహతహలాడుతున్నాయి. నేటి ప్రభుత్వం ఈ బడా పారిశ్రామిక సంస్థలను ప్రైవేటీకరణ క్రమంలో దూరంగా పెట్టగలదా అన్నది ప్రధాన ప్రశ్న.
సామాన్యులకు బ్యాంకు సేవలను దూరం చేసే, బడా పారిశ్రామికవేత్తలు, విదేశీ ఆర్థిక సంస్థల అవసరాలు తీర్చటానికి ఉద్దేశించిన ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణను కార్మికులు, బ్యాంకు ఉద్యోగులు, రైతులు, సామాన్య ప్రజలు ఐక్య ఉద్యమాల ద్వారా ప్రతిఘటించాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img