జ్యోతిరావు పూలే పూర్తి పేరు మహాత్మా జ్యోతిరావు గోవింద రావు పూలే. 11 ఏప్రిల్ 1827 నాడు మహారాష్ట్రలోని సాతర గ్రామంలో చిమ్నా బాయి, గోవింద్ రావు పూలే దంపతులకు జన్మించారు. స్కాటిష్ మిషన్ హైస్కూలు పూనెలో విద్యాభ్యాసం చేశారు. జ్యోతిరావు పూలే భార్య పేరు సావిత్రిబాయి పూలే. సావిత్రిబాయి పూలే మొదటి ఉపాధ్యాయురాలు. పూలే కుల, మత వ్యవస్థ, అంటరానితనం నిర్మూలనకు, మహిళలు, బాలికల అభ్యున్నతికి కృషి చేశారు. 1873 సెప్టెంబర్ 24న పూలే తన అనుచరులతో కలిసి అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం ‘సత్యశోధక్ సమాజ్’ ను ఏర్పాటు చేశాడు. పూలే ప్రజలలో సామాజిక చైతన్యానికి అనేక పుస్తకాలు రాసారు. ఆయన రాసిన రచనలలో ప్రసిద్ధి చెందినది ‘గులాం గిరీ’. సమాజంలోని బానిసత్వాన్ని రూపుమాపేందుకు, ప్రజలను జాగృతం చేయడానికి కృషి చేశారు.
సమాజంలోని మూఢనమ్మకాల నిర్మూలనకు, మద్యపానం, ధూమపానానికి వ్యతిరేకంగా మహిళలు విద్యావంతులు కావాల్సిన అవసరం, ఆవశ్యకత ఎంతైనా ఉందని జ్యోతిరావు పూలే గుర్తించారు. బాలికలకు, మహిళలకు విద్యను బోధించడానికి ఎవ్వరు ముందుకు రాకపోవడంతో తన భార్య సావిత్రిబాయి పూలేను విద్యావంతురాలనుచేసి ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్దాడు. సావిత్రిబాయి పూలే బాలికలను, మహిళలను విద్యావంతులను చేయడానికి కృషి చేశారు. సావిత్రిబాయి పూలే, ఫాతిమా షేక్ ఇద్దరు బడుగు, బలహీన వర్గాల బాలికలను, మహిళలను విద్యావంతులను చేయడానికి సమున్నత కృషి చేశారు. మహిళలను విద్యావంతులను చేయడానికి ఇష్టపడక సావిత్రిబాయిని అనేక ఇబ్బందులను గురి చేశారు. కొంతమంది దౌర్జన్యాలు, దాడులకు పాల్పడ్డారు. మన్ను, టమాటా, కోడిగుడ్డులతో దాడులు చేశారు. ఎన్నిరకాలుగా ఇబ్బందులకు గురిచేసినా దాడులకు, దౌర్జన్యాలకు భయపడకుండా ధైర్యంతో బాలికలకు, మహిళలకు విద్యాబోధన చేశారు.
జ్యోతిరావు పూలేపై గౌతమబుద్ధుడు, కబీర్, ముహమ్మద్, తుకారాం వంటి సంఘసంస్కర్తల ప్రభావం ఉంది. పూలే వితంతు వివాహాలను ప్రోత్సహించారు. సతీసహగమనాన్ని ఎదిరించారు. మూఢనమ్మకాలను ఖండిరచారు. విద్య ద్వారా సమాజంలో మార్పు జరుగుతుందని బలంగా విశ్వసించి దానికోసం కృషి చేశారు. అనేక మంది బ్రాహ్మణులు, బ్రాహ్మణ సంఘాలు జ్యోతిరావు పూలే చేస్తున్న పనులని వ్యతిరేకించారు. వారిని తమ వాదన పటిమతో మెప్పించి ఒప్పించారు. మహారాష్ట్ర బ్రాహ్మణ సమాజం పూలేకు ‘మహాత్మా’ అనే బిరుదుతో సత్కరించారు. భారతదేశ రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ జ్యోతిరావు పూలేను తమ గురువుగా భావించారు. మహారాష్ట్రలోని అనేక ప్రాంతాలకు, ఉద్యానవనాలకు జ్యోతిరావు పూలే పేరు మనకు కన్పిస్తుంది. జ్యోతిరావు పూలే సంఘసంస్కర్తగా, ఉపాధ్యాయులుగా, పుస్తక రచయితగా, మంచి ఉపన్యాసకులుగా బహుముఖ ప్రజ్ఞాశాలి. జ్యోతిరావు పూలే ఆశయాలు, లక్ష్యాలు, సిద్ధాంతాలు, విధానాలు ఈనాటి తరానికి ఆదర్శప్రాయం. బడుగు, బలహీన, దళిత బహుజన, మహిళా ఉద్యమాలకు ఆదర్శనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే.
( నేడు మహాత్మా జ్యోతిరావుపూలే 196 వ జయంతి సందర్భంగా…..)
డాక్టర్. ఎస్. విజయభాస్కర్,
9290826988