Monday, October 3, 2022
Monday, October 3, 2022

బనానా రిపబ్లిక్‌

బుడ్డిగ జమిందార్‌

అమెరికా ఆధిపత్యం లాటిన్‌ అమెరికా దేశాల్ని నయా వలసవాద విధానాల్లోకి నెట్టేసింది. బనానా రిపబ్లిక్‌ ఛాయలు నేటికీ అనేక దేశాల్లో కనబడుతుంటాయి. రూపాలు వేరుగా ఉంటాయి. కరీబిక్‌ దీవుల ప్రజలు చాలాచోట్ల టూరిస్టు అభివృద్ధి పేరిట వారి శరీరాల్ని అమ్ముకుంటున్నారు. ప్రపంచబ్యాంకు ` ఐఎమ్‌ఎఫ్‌ల దగ్గర తీసుకొంటున్న రుణాలకు వడ్డీలు కూడా కట్టలేని దుర్భర పరిస్థితుల్లో అర్జెంటీనా, బ్రెజిల్‌, నికరాగువా, కొలంబియా వంటి దేశాలు పడిపోయాయి.

తనకు ఇష్టంలేని దేశాల్ని‘ బనానా రిపబ్లిక్‌’గా పిలవటం అమెరికా అధికారులకు ప్రభుత్వాధి నేతలకు పరిపాటైపోయింది. ఒకప్పటి సోవియట్‌ యూనియన్‌, సోషలిస్టు దేశాల్ని, అనేక ఆసియా, ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా దేశాలను అప్పుడప్పుడు ఈ తరహాగా పిలుస్తూ హేళన చేయటానికి ప్రయత్నించేది. దౌత్య పరంగా ఒక సార్వభౌమాధికారం కల్గిన తోటి దేశాన్ని ఈ విధంగా పిలిచే నైతిక హక్కు ఏ దేశానికీ లేదు. అసలు ‘బనానా రిపబ్లిక్‌’ నేపథ్యం ఎక్కడిది? దీని సృష్టికర్త ఎవరు అంటే వేరే చెప్పనవసరం లేదు. సాక్షాత్తూ ఇది అమెరికా సృష్టి మాత్రమేనని అందరికీ తెలియకపోవచ్చుగాక.
అమెరికాలో అరటిపండ్లు తెలియని కాలం, తెలిసినా ఇష్టం లేని, సరిగ్గా పండని, ఎక్కువ ఖరీదుకు అమ్ముడగు కాలంలో సామ్యూల్‌ జెముర్రే అమెరికాకు ఈ పండును పరిచయం చేసి అక్కడి ప్రజలకు అలవాటు చేసాడు. పోషక పదార్థాలతో నిండిన బనానాను హాండూరాస్‌ దేశం నుండి ఎగుమతి చేయించిన అమెరికా పౌరుడు ఇతను. 19వ శతాబ్దం చివరలో, 20వ శతాబ్ది ప్రారంభంలో అరటిపండు వ్యవసాయం కోసం హాండూరాస్‌లో కారుచౌకగా పొలాలను సంపాదించి, యాపిల్‌కు ధీటుగా బనానాను అలవాటు చేసాడు. 1970లో లోరెన్సో డౌ బేకర్‌ జమైకా నుంచి అరటి పండ్లను బోస్టన్‌కు తెచ్చి వెయ్యిశాతం లాభాలకు బోస్టన్‌లో అమ్మాడు. ఇది సామ్యూల్‌ జెముర్రేకు ప్రేరణగా నిలిచింది. 1913లో డజను అరటిపండు 25 సెంట్లు ఉండేవి, ఇప్పుడు 2021లో సుమారు 7 డాలర్లు. అమెరికాలో అప్పట్లో రెండు యాపిల్స్‌కు పెట్టే డబ్బుకు డజను అరటిపళ్ళు రావటంతో పోషక పదార్థాలతో రుచికరమైన అరటిపండునే అమెరికన్లు తినేవారు. ముఖ్యంగా రైల్వే, రోడ్ల నిర్మాణ కార్మికుల ఆహారం కోసం కోస్టారీకాలో రైల్వే లైను పక్కనే అరటి తోటలను పెంచాడు హెన్రీ మీగ్స్‌. 19వ శతాబ్ది చివరలో ట్రోపికల్‌ ట్రేడిరగ్‌ ట్రాన్స్‌పోర్టు కంపెనీ, యునైటెడ్‌ ఫ్రంట్‌ కంపెనీ, చిక్సితా బ్రాండ్‌ ఇంటర్నేషనల్‌ ట్రాపికల్‌ పండ్ల వ్యాపారం, వాణిజ్యం చేసేవి. ఈ సమయంలో హాండూరాస్‌ ప్రభుత్వం తన దేశంలో ఒక కిలో మీటరు రైలు మార్గం నిర్మాణానికి గానూ 500 హెక్టార్ల (సుమారు 1250 ఎకరాలు) పంట పొలాన్ని ఉచితంగా ఇచ్చేది. విచిత్రమేమంటే తాము నిర్మించిన రైలు మార్గం నుంచి రాజధాని తెగుసిగల్పా వరకూ అసలు జనం ప్రయాణించేవారు కాదు. ఈ విధంగా హాండూరాస్‌ పొలాలన్నీ అమెరికా కోసం అరటిపళ్ళు పండిరచి ఎగుమతి చేయటానికి ఉపయోగపడేవి. చాలీచాలని వేతనాలతో రేయింబవళ్లు అరగంట కూడా తీరిక లేకుండా 20 నుంచి 30 సంవత్సరాలు లోపు గల యువతీయువకులు మాత్రమే పనిచేసేవారు. మొత్తం హాండూ రాస్‌ ఆర్థిక వ్యవస్థ అంతా బనానామయమైపోయింది. వేరే ఆదాయ మార్గాలుండేవి కావు.
1930 సంవత్సరంనాటికల్లా యునైటెడ్‌ ఫ్రంట్‌ కంపెనీ సెంట్రల్‌ అమెరికా, కరేబియన్‌ దీవుల్లో 35 లక్షల ఎకరాల భూమిని కైవసం చేసుకుంది. ఈ భారీ కమతాల్ని కల్గి ఉన్న అమెరికా పండ్ల కంపెనీలు సెంట్రల్‌ అమెరికా దేశాల్లో పాలనా పరంగా ప్రభావం చూపి వారికి అనుకూల ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసుకొనేవారు. మాట వినకపోతే ప్రభు త్వాల్ని కూల్చటం, అధ్యక్షుల్ని హత్య చేయటం చేసేవారు. తనకు అనుకూల ప్రభుత్వాల్ని ఏర్పాటు చేసుకొన్న అమెరికా 1915 నాటికి హాండూరాస్‌ దేశాన్ని 400 కోట్ల డాలర్ల అప్పులో ముంచేసింది. తీర్చటానికి దేశ భూముల్ని అమ్మటం తప్ప వేరే గత్యంతరం లేకుండా చేసింది. బనానాస్‌ ఎగుమతితో అది పేదదేశంగా మారింది. ద్రవ్యోల్భణం, నిరుద్యోగం విపరీతంగా పెరిగింది. ఇక విదేశీ పెట్టుబడులు స్తంభించిపోయాయి. విదేశీ కంపెనీలు హాండూరాస్‌ను పాలించాయి. దేశం రాజ్య పెట్టుబడిదారీ వ్యవస్థగా మారింది. అమెరికా డాలరు హాండూరస్‌ కరెన్సీగా మారింది. 1933 నాటికి పోటీ కంపెనీలన్నీ సామ్యూల్‌ జెముర్రే కొనేసాడు. బనానా చక్రవర్తిగా పేరుగాంచి, హాండూరాస్‌ను బనానా రిపబ్లిక్‌గా చేసాడు. రోడ్లు, రైళ్లు, గనులు, పంటపొలాలు, నౌకాశ్రయాలు ఒక్కటేమిటి అన్నీ అమెరికా హస్తగతమైనాయి.
బనానా రిపబ్లిక్‌ రాజ్యపెట్టుబడిదారీ వ్యవస్థగా మారిన తర్వాత పాలక వర్గాల ప్రత్యేక లాభాలు, అధికారాల కోసం దేశాన్ని ఒక ప్రైవేటు వాణిజ్య సంస్థగా మార్చారు. దోపిడీకి ప్రభుత్వం అధిక పారిశ్రామిక, విదేశీ కంపె నీల మధ్య అవగాహన కుదిరింది. ప్రభుత్వ ఆస్తుల్ని ప్రైవేటు వ్యాపారస్థులు, పరిశ్రమాధిపతులు కారుచౌకగా కొని విపరీతంగా లాభపడటం వల్ల దేశంలో ఆర్థిక అసమానతలు ఏర్పడ్డాయి. తద్వారా ప్రభుత్వం చేసిన అప్పులు ఆర్థిక ఖజానాకు తద్వారా ప్రజలకు భారమయ్యాయి. జాతీయ కరెన్సీ విలువలు తగ్గిపోయాయి. నిత్యావసర వస్తువుల ధరలు, డీజిలు, పెట్రోలు వంటివి పెరిగిపోయాయి. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థలు దేశాన్ని ఆర్థికంగా అనర్హత జాబితాలో చేర్చాయి. సంస్కరణల పేరిట నేడు అనేక దేశాలు ఇటువంటి సమస్యలతో సంక్షోభంలోకి వెళ్తున్నాయి. 2010 నాటికి హాండూరాస్‌ లాటిన్‌ అమెరికా పేద దేశాల్లో ఒకటిగా ఉంది. జీవన ప్రమాణాల సూచికల్లో సెంట్రల్‌ లాటిన్‌ అమెరికా దేశాల్లో అన్ని దేశాల కంటే వెనుకంజగా ఉంది. గ్వాటెమాల, నికరాగువాల కంటే పేదరిక దేశంగా తయారైంది. ఒక్క హైతీ దేశం కంటే ఆర్థికంగా ముందంజలో ఉండేది. నేటి అమెరికా ఆర్థిక వ్యవస్థ ముందంజలో ఉండటానికి ప్రధాన కారణం ప్రపంచంలో అనేక దేశాలను బనానా రిపబ్లిక్కులుగా చేయటమే. అమెరికా ఆధిపత్యం లాటిన్‌ అమెరికా దేశాల్ని నయా వలసవాద విధానాల్లోకి నెట్టేసింది. బనానా రిపబ్లిక్‌ ఛాయలు నేటికీ అనేక దేశాల్లో కనబడుతుంటాయి. రూపాలు వేరుగా ఉంటాయి. కొన్ని దేశాలు కేవలం అడవులను నరికి కలప ఎగుమతి కోసం, కొన్ని దేశాలు అగ్రిబిజినెస్‌ పేరిట మాంసం ఎగుమతి కోసం, క్యూబా వంటి దేశం పంచదార ఎగుమతి కోసం, చిలీ మినరల్స్‌, లోహాల ఎగుమతి దేశంగానూ పేరుగాంచాయి. కరీబిక్‌ దీవుల ప్రజలు చాలాచోట్ల టూరిస్టు అభివృద్ధి పేరిట వారి శరీరాల్ని అమ్ముకుంటు న్నారు. ప్రపంచబ్యాంకు ఐఎమ్‌ఎఫ్‌ల దగ్గర తీసుకొంటున్న రుణాలకు వడ్డీలు కూడా కట్టలేని దుర్భర పరిస్థితుల్లో అర్జెంటీనా, బ్రెజిల్‌, నికరాగువా, కొలంబియా వంటి దేశాలు పడిపోయాయి. దేశ బడ్జెట్టులో సగం వరకూ వడ్డీలు తీర్చటానికి కూడా సరిపోని దుస్థితి. ఎదురు తిరిగి, చమురు పరిశ్రమల్ని జాతీయం చేసిన వెనుజులా లాంటి దేశాలపై ఆంక్షలు విధించి దేశాన్ని అన్నివైపుల నుంచి మూసేసి ఆర్థిక దిగ్బంధనం చేసింది అమెరికా. ఒక విధంగా చెప్పాలంటే, ఇదొక విధమైన సామాజిక వెలి వంటిది. 20 సంవత్సరాలు అమెరికా కీలుబొమ్మ పాలనలో ఉన్న అమెరికా సైన్యం ఆధీనంలోని అఫ్గానిస్థాన్‌పై నేడు ఇలాంటి ఆంక్షలు విధించటానికి ప్రయత్ని స్తోంది. ఇటువంటి అంటరానితనాన్ని దేశాల మధ్య చూపితే ‘పెరేయ్య’ దేశంగా అమెరికా పిలుస్తుంది. తమిళనాడు రాష్ట్రంలో పెరియార్లు అంట రానితనానికి గురైనారు గనుక అక్కడ నుండి ఈ పేరు వచ్చింది.
అమెరికాకు ఇష్టం లేని దేశాల్ని బాయ్‌కాట్‌ చేసి, తనపై ఆధారపడి ఉండేటట్లు చేసుకోవటమే బనానా స్టేట్‌, పెరేయ్యా స్టేట్‌ల పుట్టుకగా మారాయి. ఇప్పటికే చాలా దేశాల్ని అమెరికా పెట్టుబడిదారీ వ్యవస్థ ఈ పేర్లతో భయపెడ్తూ ఉంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img