Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

బహుముఖ ప్రజ్ఞాశాలి పడాల రామారావు

స్వాతంత్య్ర సమరయోధులు, శతాధిక గ్రంధకర్త, అల్లూరి సీతారామ రాజు చరిత్ర పరిశోధకులు, కమ్యూనిస్టు ఉద్యమకారుడు, కార్మిక నాయకుడు, రంగస్థల నటులు, దర్శకుడు, సినీ రచయిత, పాత్రికేయుడిగా ఎనలేని సేవలందించిన బహుముఖ ప్రజ్ఞాశాలి పడాల రామారావు. 1922, ఏప్రిల్‌ 22న సాంస్కృతిక నిలయంగా పేరుగాంచిన రాజమహేంద్రవరంలో పడాల వీరభద్రుడు, వీరమ్మ(పెంటమ్మ) దంపతులకు ప్రథమ సంతానంగా పేద చేనేత కుటుంబంలో జన్మించారు. విద్యలో ముందంజలో ఉండి, ఉత్తమ విద్యార్ధిగా ఎదుగుతున్న తరుణంలో ఆర్ధిక పరిస్థితుల రీత్యా 6వ తరగతితో చదువుకు స్వస్తిపలికి ఒక చింతపండు దుకాణంలో గుమస్తాగా చేరారు. ఆయన 16వ ఏటనే ఆయన మేనత్త కూతురు నాగరత్నంతో వివాహం జరిగింది. వివాహం అనంతరం అంచెలంచెలుగా చాలాచోట్ల పనిచేసి ఆర్ధికంగా నిలద్రొక్కుకుని రాజమహేంద్రవరం మెయిన్‌రోడ్డులో సొంతంగా కిరాణాషాపును ప్రారంభించారు. రాజమండ్రి శాసనసభ్యులుగా పనిచేసిన కమ్యూనిస్టు నాయకుడు చిట్టూరి ప్రభాకర్‌ చౌదరి కెపిగా ప్రసిద్ధి చెందిన కొరపాటి పట్టాభిరామయ్య పరిచయాలతో వారి స్పూర్తితో పడాల కమ్యూనిస్టు పార్టీకి ఆకర్షితులయ్యారు. కుటుంబంలో తండ్రి, తమ్ముడు కమ్యూనిస్టుపార్టీలో నీవు తిరగడానికి వీల్లేదని ఆంక్షలు విధించారు.
కమ్యూనిస్టు పార్టీని వదలడానికి పడాల ససేమీరా అంగీకరించలేదు. ఇంటి నుంచి వెళ్లిపోమన్నారు. భార్య, పిల్లలతో కట్టుబట్టలతో బయటకు వచ్చేసారు. అద్దె ఇంట్లో దిగారు. కుటుంబ పోషణకోసం షాపుల్లో గుమస్తాగా పనిచేసారు. పనికూడా నిలకడలేకపోవడం వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఎదురయ్యాయి. అప్పటికి ముగ్గురు పిల్లలు పుట్టారు. అందులో ఇద్దరు కవలలు. వారు క్రాంతి, జ్యోతి. అయితే ఆర్థిక కష్టాలు వెంటాడడంతో పాలు పట్టడానికి కూడా సొమ్ములు లేకపోవడంతో ఆ ఇద్దరు పిల్లలు చనిపోయారు. ఆయన స్వాతంత్య్ర పోరాటానికి, కమ్యూనిస్టు ఉద్యమానికి దూరంకాలేదు. కెపి స్పూర్తితో మరింత ఉదృతంగా, ఉత్సాహంగా ముందుకు నడిచారు. 1942లో రాజమండ్రి జాంపేటలో అల్లూరి సీతారామరాజు యువజన సంఘాన్ని ఏర్పాటుచేసారు. యువజన సంఘం ఆధ్వర్యంలో గాంధీజయంతి నిర్వహించి, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో మొదటిసారి అరెస్టు అయ్యారు. 1944లో అదే సెంటర్‌లో బ్రిటీషు ప్రభుత్వ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా నిరసన ప్రదర్శన చేయడంతో మరోసారి అరెస్ట్‌చేసి జైలుకు పంపారు. అప్పుడు భార్య నాగరత్నం చంటిపిల్లవాడితో రోడ్డున పడ్డారు. అయినా ఆమె పడాల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఆ సమయంలో ఆమె పినతండ్రి బత్తుల ముత్యం ఆమెను ఆదుకున్నారు. ఆయనకు పిల్లలు లేకపోవడంతో నాగరత్నంని కూతురుగా భావించి చేరదీసి పోషించాడు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కమ్యూనిస్టు పార్టీకి పూర్తిగా అంకితమై క్రియా శీలకంగా పనిచేసారు. కమ్యూనిస్టు సిద్ధాంతాలకు కట్టుబడి గొప్ప వాగ్ధాటి కలిగి ఉండడంవల్ల ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కడ ఏ బహిరంగసభ జరిగినా పడాలనే ప్రధాన వక్తగా పిలిచేవారు.
స్వాతంత్య్రం అనంతరం భారత కమ్యూనిస్టు పార్టీపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించడంతో పడాలకు కష్టాలు తప్పలేదు. భార్య, బిడ్డలను వదలి రహస్యంగా గడపవలసి వచ్చింది. ఆ సమయంలో భార్య బిడ్డలను చూసుకోవడానికి వెళ్లిన సందర్భాల్లో రెండు, మూడు సార్లు అరెస్టు అయ్యారు. ఈ సందర్భంగా ఇక్కడ ఆయన సతీమణి నాగరత్నం ఇంటిని ఎందరో కమ్యూనిస్టు నేతలకు స్థావరంగా చేసి కాపాడిరది. 194850 సంవత్సరాల్లో కడలూరు జైల్లో జీవితాన్ని గడిపిన పడాల జైలులో అన్ని రాష్ట్రాలకు చెందిన మేధావులైన రాజకీయ ఖైదీల వద్ద ఇంగ్లీషు, హిందీ, తమిళం తదితర భాషలు నేర్చుకోవడంతో పాటు సాహిత్యంపై మెళకువలు నేర్చుకుని జ్ఞానాన్ని సముపార్జించారు. ఆ మెళుకువలతోనే జైల్లో ఉండగానే ‘‘ఖైదీ’’ అనే నవలను రాశారు. అలా సాహిత్యానికి శ్రీకారం చుట్టిన పడాల కలం నుండి 102 గ్రంథాలు జాలువారాయి. అందులో పేరెన్నిక గన్నది అల్లూరి సీతారామరాజు చరిత్ర ‘ఆంధ్రశ్రీ’ నవల. మల్లుదొర విశాఖపట్నం పార్లమెంట్‌ నియోజకవర్గం నుండి 1952, 1957లో పోటీ చేసినప్పుడు పడాల ఆయనకు సహాయకుడిగా పనిచేసారు. మల్లుదొర 1952 గెలుపొందగా, 1957లో ఓడిపోయారు. అల్లూరి సీతారామరాజు చరిత్రను సినిమాగా తీయడానికి నందమూరి తారకరామారావు ముందుకు వచ్చి 1956లో పడాలచే ఒప్పందం కుదుర్చుకుని ఆయనతో స్క్రీన్‌ప్లే, కొన్ని పాటలు రాయించుకుని, 1957లో మద్రాసు విజయాగార్డెన్స్‌లో చిత్ర నిర్మాణానికి శ్రీకారం, పాట రికార్డు చేశారు. అయితే అనివార్య కారణాల వల్ల చిత్ర నిర్మాణం ఆగిపోయింది. ఆ కాలంలో 6 సంవత్సరాల పాటు పడాల మద్రాసులో నివాసం ఉన్నారు. రాజమండ్రి వచ్చి వెళ్తుండేవారు. ఎన్‌టిఆర్‌కు సాహిత్య సలహాదారునిగా ఉండేవారు. ఆ కాలంలో పడాలకు హిందీ భాష తెలిసుండడంతో 1958లో నీలవేణి, శ్రీకృష్ణలీలలు సినిమాలను తర్జుమాచేసి మాటలు రాసారు. మద్రాసులో ఉంటూ బతుకు తెరువు కోసం ఎన్నో డిటెక్టివ్‌ నవలలు రాశారు. మద్రాసు నుంచి రాజమండ్రికి మకాం వచ్చేసారు. కమ్యూనిస్టు పార్టీపై, కార్మిక సంఘాలపై కేంద్రీకరించారు. కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా, రాజమండ్రి నగర కార్యదర్శిగా పనిచేసారు. రాజమండ్రిలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ భవనం పడాల కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆయన సారధ్యంలో నిర్మితమైనదే. అలాగే ఎఐటియుసిలో జాతీయ కౌన్సిల్‌ సభ్యునిగా పనిచేసారు. సొంతంగా కార్మిక సంఘాలను నిర్మించారు. ఆయన రచనలు చేసిన నాటకాలను ముందుగా ప్రదర్శనలు ఇచ్చి, ఆ తర్వాత ముద్రింపబడేవి. ఆ నాటకాల్లో పడాల ఏదో పాత్ర పోషించేవారు. అల్లూరి సీతారామరాజు నాటకంలో సింగన్న పాత్ర వేసేవారు. అభ్యుదయ రచయితల సంఘంలో క్రీయాశీలక పాత్ర పోషించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అభ్యుదయ రచయితల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసారు. పాత్రికేయునిగా 1959 నుంచి 1971 వరకు ‘చౌచౌ’ అనే మాస, పక్షపత్రిక నడిపారు. పాత్రికేయునిగా పడాలను ఆనాటి తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్‌ ఎల్‌.మాలకొండయ్య కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఘనంగా సన్మానంచేసి, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రాజమండ్రిలో 200 గజాల స్థలంలో ఇంటిని నిర్మించి ఇచ్చారు. పడాల రాసిన అల్లూరి సీతారామరాజు నాటకాన్ని ప్రజానాట్యమండలి వ్యవస్థాపకుడు, కళాతపస్వి డా.గరికిపాటి రాజారావు సినిమా సాంకేతికతో ప్రదర్శనలు ఇచ్చారు. హైదరాబాద్‌ సెక్రటేరియట్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ అధికారులు హైదరాబాద్‌ రవీంధ్రభారతిలో ప్రదర్శన ఇవ్వగా రాష్ట్రపతి వి.వి.గిరి ప్రదర్శనను చివరివరకు తిలకించి పడాలను శ్లాఘిస్తూ ఘనంగా సన్మానించారు. ఆనాడు సీతారామరాజు పాత్రను సినీ హీరో శ్రీధర్‌ వేసారు. 1982లో నందమూరి తారకరామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించి పడాలను పార్టీలోకి ఆహ్వానించి, ఎంఎల్‌ఎగా పోటీ చేయమని కోరారు. అయితే పడాల అందుకు సున్నితంగా తిరస్కరించారు. నా చివరి శ్వాసవరకు కమ్యూనిస్టు పార్టీలోనే ఉంటానని, తనను బలవంతం పెట్టవద్దని ఎన్‌టిఆర్‌కు విన్నవించారు. తర్వాత తెలుగుదేశం పార్టీ విజయం సాధించి, ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. అయితే పడాలతో ఉన్న స్నేహ బంధాన్ని మరచిపోకుండా ఎన్‌టిఆర్‌ ముఖ్యమంత్రి హోదాలో హైదరాబాద్‌ రవీంద్రభారతిలో అల్లూరి సీతారామరాజు 86వ జయంత్యుత్సవాన్ని జరిపి, పడాలకు ఘన సన్మానం చేసారు.
గోర్కి ‘అమ్మ’ మార్క్స్‌ ట్రేడ్‌ నవలలు తర్జుమా చేశారు. పడాల చేసిన సాహిత్య సేవలకుగాను సోవియట్‌ ప్రభుత్వం ఆహ్వానం మేరకు 1977లో సోవియట్‌ యూనియన్‌ 9 రోజులపాటు సందర్శించారు. 1982లో పడాల షష్ట్యబ్ది ఉత్సవం రాజమండ్రిలో ఘనంగా జరిగింది. ముఖ్యఅతిధిగా అఖిల భారత విప్లవ కారులు సంఘం ప్రధాన కార్యదర్శి, భగత్‌సింగ్‌ సహచరుడు, అండమాన్‌ జైలులో యావజ్జీవ ఖైదు అనుభవించిన విజయకుమార్‌ సిన్హా పాల్గొన్నారు. 2020లో తంతి తపాలశాఖ స్వాతంత్య్ర సమరయోధులుగా శతాధిక గ్రంథకర్తగా పడాల రామారావును గుర్తిస్తూ ఆయన పేరున ప్రత్యేక పోస్టల్‌ కవర్‌ను విడుదల చేసింది. పడాలలో తీరని కోరిక ఒకటి ఉండేది. అది ఆయనకు ఖ్యాతి తీసుకువచ్చిన ‘ఆంధ్రశ్రీ’ నవల అల్లూరి సీతారామరాజు చరిత్రను ఆంగ్లంలో గ్రంథస్థం చేయాలనుకునే కోరిక నెరవేరలేదు. చివరిగా చిన్నప్పటి నుండి కలిసి తిరిగిన మేనత్త కూతురు చివరివరకు సహజీవనం సాగిస్తుందనుకున్న భార్య నాగరత్నం 25 జూలై 1999లో ఆయన కంటే ముందుగా మరణించడాన్ని తట్టుకోలేకపోయి.. ఆయన కృంగిపోయి..2006, ఏప్రిల్‌ 4న తుది శ్వాస విడిచారు.
(నేడు పడాల రామారావు శత జయంత్యుత్సవాల సందర్భంగా..)
` పడాల వీరభద్రరావు.తూ॥గో॥జిల్లా అరసం అధ్యక్షులు
సెల్‌ : 9493281776.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img