Wednesday, November 30, 2022
Wednesday, November 30, 2022

బారిస్టర్లు ` గాంగ్‌స్టర్లు

పురాణం శ్రీనివాస శాస్త్రి

న్యాయం ఎక్కడుంటుంది? న్యాయస్థానాల్లో ఉంటుందంటే చాలామందికి అనుమానం. అసలు చట్టాల్లోనే ఉండటం లేదని ఈ మధ్యే పెద్ద కోర్టు తాలూకు పెద్ద జడ్జి వాపోయారు. అసలు పార్లమెంటులో న్యాయం తెలిసిన పెద్ద మనుషులు మునుపు ఉండేవారు. ఇప్పుడు దుర్బిణి పెట్టి వెతికినా లేదని కూడా ఆయన వాక్రుచ్చారు… అంతకంటే గిచ్చారు అనడం రైటు. దీని మీద అధికార పార్టీ దైవ భక్తాగ్రేసరులు భుజాలు తడుముకోవడంంతో పాటు కళ్ళెర్రజేసి, తలలు ‘ఒప్పం’ అన్నట్టు ఆడిరచారు. అసలే రాబోయే ఎన్నికల నాటికి ఏ మంట ఎగసనదోయాలా అన్నది వారి సమస్య. దాంతో లాంగ్‌ షాట్‌ ఆలోచనల లోచనాలు గుండ్రంగా పెట్టుకుని మేం అఘోరిస్తుంటే ఒకటి వెంట ఒకటిగా మీ యాసిడ్‌ టంగ్‌ ఏమిటండి. ‘‘నాలిక లోపలికి పోయేలా నోరు మూసుకోండి అని ముఖాలు చిట్లిస్తున్నారు భక్త మొరోన్లు.
‘అవును మరి… అన్నీ వేదాల్లో ఉన్నాయని వెళ్ళి వెతుక్కోకుండా న్యాయం చట్టాల్లో లేదని మొత్తుకోడం ఏమిటో. అసలు కనపడే చూపుంటే ఇవిఎంలలో లేదూ న్యాయం? అసలు సెక్యులర్‌ బ్యాలెట్‌లో లేనిది కమ్యూనల్‌ ఇవిఎంలలో తప్పక ఉందని వేదాలు ఘోషిస్తుంటే కాంగ్రెస్‌, కమ్యూనిస్టు ప్రేమికులు ఇలా బరి తెగించటం ఏం ఫాయిదా? అసలు ఇదంతా నెహ్రూ తెచ్చిన తద్దినం. సుఖంగా బ్రిటిష్‌ పాలన కింద తిండి, గుడ్డ లేకుండా ‘నిరాడంబరంగా’ అజీర్తిరహితంగా బతికే జనానికి ప్రజాస్వామ్యం అలవాటు చేసాడు. వేదాల్లో ఉన్న ‘పెగాస్వామ్యం’ వదిలేసి ప్రజాస్వామ్యం అలవాటు చేసాడు. వేదాల్లో ఉన్న ‘పెగాస్వామ్యం’ వదిలేసి ప్రజాస్వామ్యం మనకెందుకండీ ఖర్మ’ అని ఒక చేత్తో గుండెలు గోక్కొంటూ, మరో చేత్తో నెత్తి సవరించుకుంటున్నారు భక్తులు. (నిజములందు భక్త నిజములు వేరయా!) అసలు పెద్ద కోర్టు బడా జడ్జి మునుపు పార్లమెంట్లో లోతైన చర్చలతో చట్టాలు చేసేవారని గుర్తు చేశారు. ఇప్పుడు చర్చలు లేకుంటే చట్టాలు చేయడం ఏమిటని నిలేశారు. అవును… ఆడోళ్లు చర్చలు, మాటామంతీ లేకుండా అప్పడాలు గూడా చేయరు. అలాంటిది చట్టాలు ఏం పాపం చేశాయని మాటామంతీ లేకుండా వాటిని చేసేస్తున్నారు అంటారు పెద్ద కోర్టు పెద్ద కుర్చీ ఆయన.
‘నిజమే. పూర్వం రాజకీయాల్లో న్యాయం తెలిసినవాళ్ళు ఆడని చెట్టుకి ఎన్ని ఆకులుంటాయో అంతమంది ఉండేవారు. ఇప్పుడు న్యాయం తెలియడం విషయంలో పార్లమెంటు ఆకులు రాలిన అశోక వృక్షంలా తగలడుతోంది’ అనడం రైటే. ఆలోచిస్తే, పూర్వం రాజకీయ రంగం నిండా బారిస్టర్లు కోకొల్లలు. గెలిచేవోడు, ఓడేవోడు, అహింస సైద్ధాంతికుడు, హింస గర్జనుడూ అంతా బారిస్టర్లే. ఇప్పట్లా, అప్పట్లో గాంగ్‌స్టర్లు రాజకీయాల్లో తక్కువ! అంచేత పార్లమెంట్‌లో చేయబోయే చట్టాల భరతం పట్టే చర్చలు సాగేవి. అసలు అప్పుడు గాంధీ, నెహ్రూ, పటేల్‌ అంతా బారిస్టర్లే. నెహ్రూ గారూ ‘తరగని కాసులయ్య’ అయి ఉండీ, గోచీ పాత గాంధీ గారి వెంట పడి చెమటోడుస్తూ తిరిగేవారు. ఎందుకు? చట్టాల గుట్టు తెలిసి సాతాఫ్రికాలో తెల్లోడిని అట్టే అదరగొట్టి వచ్చినవాడు కాబట్టే. ‘అహింస సిద్ధాంతం అంటే… ఏమీ లేదు. తెల్లోడి చట్టాలు అదను చూసి తెల్లోడి మెడకే బిగించడం’ అని చల్లగా గాంధీగారు చెప్పేశాక ఆయన వెనక, ఆయన చుట్టూ తిరిగి చట్టాల బట్టీ పట్టాకే తెల్లోడిని ఓ పట్టు పట్టడం జరిగింది. దాని పేరే సొతంత్ర పోరాటం. ఇమ్రాన్‌ స్వామిచెప్పినట్లు అఫ్గాన్‌ తాలిబన్లు చేస్తున్నది కాదెంతమాత్రం కాదు!.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img