శిరందాసు నాగార్జున
తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను పరిశీలిస్తే భారతీయ రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) హ్యాట్రిక్ సాధించే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పుంజుకొని బిఆర్‌ఎస్‌తో పోటీపడుతుందటున్నారు. తెలంగాణ సాధించిన పార్టీగా ఇప్పటివరకు బిఆర్‌ఎస్‌కు గుర్తింపు ఉంది.అయితే, ఆశించిన స్థాయిలో తమ జీవితాలు మెరుగుపడలేదన్న భావన అన్నివర్గాల్లో నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఆ పార్టీ గెలుపు అంత తేలికగా కనిపించడంలేదు. ప్రభుత్వంపైన, బీఆర్‌ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మందిపై తీవ్రవ్యతిరేకత వ్యక్తమవుతోంది. అనేక మంది భూములు ఆక్రమించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా పథకాలు అన్నీ బీఆర్‌ఎస్ పార్టీ కార్యకర్తలకే ఇస్తున్నారన్నది ప్రజల ఆరోపణ. చాలా పథకాలు పూర్తి స్థాయిలో అమలు కాకపోవడం, పథకాల అమలులో అవకతవకలు జరగడం వల్ల బీఆర్‌ఎస్ ప్రభుత్వం అంటే తీవ్రవ్యతిరేకత ఏర్పడిరది. అనేక వర్గాలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం విఫలమైంది. జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ వారికి 2008లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం నిజాంపేట, పేట్ బషీరాబాద్‌లలో భూమి కేటాయించింది. సొసైటీవారు ఆ భూమికి అప్పటి మార్కెట్ ధర ప్రకారం ప్రభుత్వానికి డబ్బు చెల్లించారు. సుప్రీంకోర్టు కూడా ఏడాది క్రితం సొసైటీకి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఆ భూమిని సొసైటీకి అప్పగిస్తామని సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కూడా నమ్మబలికారు. ఒక్క నిజాంపేట భూమిని మాత్రమే ఈ ప్రభుత్వం సొసైటీకి అప్పగించింది. పేట్ బషీరాబాద్ భూమిని ఇప్పటి వరకు అప్పగించలేదు. ఈ సొసైటీలో దాదాపు 1100 మంది సభ్యులు ఉన్నారు. వారిలో 70మంది వరకు తనువు చాలించారు. హైదరాబాద్‌లోని మిగిలిన జర్నలిస్టులు కూడా సొసైటీ ఏర్పాటు చేసుకుంటే భూములు ఇస్తామని ఈ ప్రభుత్వం చెప్పింది. వారు సొసైటీలు ఏర్పాటు చేసుకున్నారు. భూమి మాత్రం కేటాయించలేదు. దాంతో జర్నలిస్టులలో అత్యధిక మంది ఈ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు. దాంతోపాటు నిరుద్యోగ సమస్య, ఉపాధి లభించక యువత చాలా నిరుత్సాహంగా ఉన్నారు. టికెట్ల కేటాయింపులో బీసీలు, మహిళలతోపాటు చాలా వర్గాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇలా ఒకరేమిటి అన్ని వర్గాల ప్రజలు ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నారు.
బీఆర్‌ఎస్ మేనిఫెస్టో కూడా అంత ఆశాజనకంగా లేదు. పాత పథకాలు కొనసాగిస్తామని, ప్రజలందరికీ బీమా సౌకర్యం, ఆరోగ్యశ్రీ గరిష్ట పరమితి రూ.15 లక్షలకు పెంచుతామని, పేద మహిళలకు, జర్నలిస్టులకు రూ.400కే గ్యాస్ సిలిండర్, పేద మహిళలకు రూ.3వేల గౌరవ భృతి, రేషన్ కార్డుపై సన్న బియ్యం, రైతుబంధు, దివ్యాంగుల పెన్షన్, ఆసరా పెన్షన్‌ల పెంపు వంటి హామీలు ఇచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఓపీఎస్ అమలు సాధ్యాసాధ్యాలు అధ్యయనం చేయడానికి ఒక కమిటీ నియమిస్తామని చెప్పారు. అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తివేతకు ప్రయత్నం చేస్తామని మాత్రం హామీ ఇచ్చింది. ఈ హామీలన్నిటికీ మెలికలు పెట్టారు. అందువల్ల ఓటర్లు వాటిని నమ్మే పరిస్థితుల్లో లేరంటున్నారు. జనంలో వ్యతిరేకత బాగా ఉంది. ఎన్నికల సర్వేలలో అధిక శాతం కాంగ్రెస్‌కు అనుకూలత వ్యక్తమవు తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్‌ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు,జడ్పీ చైర్మన్, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలతోపాటు పలుకు బడికలిగిన ముఖ్యనేతలు, జడ్పీటీసీ, ఎంపీపీ, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు అనేక మంది బీఆర్‌ఎస్‌కు రాజీనామాచేసి అత్యధిక మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు.
బీఆర్‌ఎస్ పై వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీకి కలిసివస్తోందని పరిశీలకులు భావిస్తున్నారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి రాష్ట్రపార్టీలో ఓ ఊపు తెచ్చారు. దానికితోడు బీఆర్‌ఎస్‌పై అసంతృప్తి, భారీస్థాయిలో బీఆర్‌ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరడం…వంటి అంశాలన్నీ కాంగ్రెస్‌కు కలిసివస్తున్నాయి. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు పథకాలహామీ కూడా ఓటర్లలోకి బాగా చొచ్చుకు వెళ్లింది. మహిళలు, యువతపై వారు ప్రత్యేక దృష్టి పెట్టారు. మహిళా పథకాలు పక్క రాష్ట్రం కర్ణాటకలో అమలు చేయడంతో ఆ పార్టీపై నమ్మకం పెరిగిందంటున్నారు. ఎన్నికల సర్వేల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి 70 స్థానాల వరకు వచ్చే అవకాశంఉంది.
సీనియర్ జర్నలిస్ట్ 9440222914