Sunday, August 14, 2022
Sunday, August 14, 2022

బీజేపీకి షాకిచ్చిన ఆత్మకూరు ఓటర్లు!

వి. శంకరయ్య

ఆంధ్రప్రదేశ్‌లో జరగనున్న 2024 ఎన్నికల్లో అధికారంలో కొస్తామని జబ్బలు చరుస్తున్న కమల నాథులకు ఆత్మకూరు ఓటర్లు కర్రుగాల్చి కీలెరిగి వాత పెట్టారు. ఇక మీదట ఇలాంటి హుంకరింపులు చేయవద్దని తుదకు డిపాజిట్‌ కూడా లభ్యం కాకుండా చేశారు. పోటీలో ప్రధాన ప్రతిపక్షం లేకున్నా డిపాజిట్‌ కూడా దక్కించుకోలేదంటే ఇక మీదట 2024 ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని ఎవరైనా బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తే ప్రజలు పిచ్చాసుపత్రికి తరలించే అవమాన కరమైన పరిస్థితిని బీజేపీకి ఆత్మకూరు ఓటర్లు కల్పించడం కొసమెరుపు. 2019 ఎన్నికల్లో 0.86 శాతం మాత్రమే ఓట్లు తెచ్చుకొని పైగా తిరుపతి, బద్వేలు ఉప ఎన్నికల ఫలితాలు కళ్ల ముందు వున్నా అవేవీ పట్టించుకోకుండా సోము వీర్రాజు అండ్‌ కో తెగ విర్రవీగింది. ప్రధాన ప్రతిపక్షం పోటీలో లేనందున కనీసం నలభై యాభై వేల ఓట్లు సంపాదించి జాతీయ నాయ కత్వం వద్ద మార్కులు కొట్టెయ్యాలని సోము వీర్రాజు అండ్‌ కో పథకం పన్నింది. దీనికితోడు తనకు అధ్యక్ష కాలపరిమితి అయిపోతున్నందున తిరిగి అధ్యక్ష పదవిలో కొనసాగేందుకు ఆత్మకూరు ఉప ఎన్నికలను ఉపయోగించుకోవాలని సిద్ధమై నారు. ఒక్కో సమయంలో నేతల కన్నా ప్రజలు ఎంతో చైతన్య వంతులుగా వుంటారు. ఆత్మకూరులో సరిగ్గా అదే జరిగింది. వైసీపీ, బీజేపీ రెండు పార్టీలకూ ఓటర్లు గట్టి షాక్‌ ఇచ్చారు.
బీజేపీకి డిపాజిట్‌ గల్లంతు అయితే లక్ష ఓట్లు మెజారిటీ రావాలని ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలు గాలిలో తేలి పోయాయి. రాష్ట్ర ప్రజలకు జీవనాడులైన ప్రత్యేక హోదా, పోల వరం ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాలకు చట్టబద్దంగా లభించ వలసిన ప్రత్యేక ప్యాకేజీ ఇద్దరూ కలసి దుమ్ములో కలపడం ఆత్మ కూరు ఉప ఎన్నికల్లో బాగా ప్రతిఫలించింది. వైసీపీ బీజేపీ రెండు పార్టీలూ ఒకే ఆకులో చింపుళ్లని ఆత్మకూరు ఓటర్లు పసిగట్టారు. ఒకపక్క ఆత్మకూరులో ఎన్నికల ప్రచారం సాగుతుండగా అదే సమయంలో రాష్ట్రపతి పదవికి బీజేపీ అభ్యర్థి నామినేషన్‌ వేసే సమయంలో ప్రధాని వెంబడి వైసీపీ అగ్రనేతలు వుండటం దాచేస్తే దాగేది కాదు కదా? ఈ నేపథ్యంలో ఆకాశానికి నిచ్చెన లేసిన సోము వీర్రాజుకు ఆత్మకూరు ఓటర్లు చుక్కలు చూపిం చారు. ఇటీవల కాలంలో వైసీపీ ప్రభుత్వంపై సోము వీర్రాజు అండ్‌ కో తెగ విమర్శలు చేయడంలో కూడా గూడార్థముంది. నేను కొట్టినట్లు నటిస్తాను నువ్వు ఏడ్చినట్లు నటించు అనే లోపాయికారీ అవగాహన క్రమేణా వెల్లడి కావడంతో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో దాని ప్రభావం తీవ్రంగా పడిరది. 2024 ఎన్నికల్లో రాష్ట్రంలో తిరిగి జగన్మోహన్‌రెడ్డి అధికారం చేపట్టా లంటే ముక్కోణపు పోటీ అవసరమని ఈలోపు లాలూచీ కుస్తీలో భాగంగా తీవ్ర విమర్శలు చేస్తే ప్రభుత్వ వ్యతిరేక ఓటర్లను కొంత మేర తమ వేపు తిప్పుÛకోవచ్చని కమలనాథులు భావించారు. ఇదంతా కూడా జాతీయ నాయకత్వం కనుసన్నల్లో సోము వీర్రాజు అండ్‌ కో సాగించింది. అయితే గిరీశం చెప్పినట్లు ‘‘డామిట్‌ కథ అడ్డం తిరిగింది’’.
ఆత్మకూరు ఉప ఎన్నికల ప్రకటన వెలువడగానే ముఖ్య మంత్రి జగన్మోహన్‌రెడ్డి మంత్రులకు, ఎమ్మెల్యేలకు టార్గెట్‌ పెట్టారు. లక్ష ఓట్లు మెజారిటీ తీసుకురావాలని నిర్దేశించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు ఏ మేరకు తిరిగారనే అంశం ముఖ్యం కాదు గాని ఈ ఉప ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత శూల శోధన చేస్తే నియోజకవర్గంలో ఓటర్లు ఎన్నికలను సీరియస్‌గా తీసుకోలేదు. వైసీపీ యెడల ఓటర్లకు మొహమెత్తడం బాగా వ్యక్త మైంది. సాధారణంగా జనరల్‌ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో ఎన్నికలు వుంటాయి కాబట్టి నేతల కేంద్రీకరణ విభజితమవుతుంది. కాని ఉప ఎన్ని కల్లో అలా కాదు. అన్ని పార్టీల వారు ఒకే చోట కేంద్రీ కరణ చేస్తారు. ఫలితంగా పోలింగ్‌ శాతం బాగా పెర గాలి. అయితే ఆత్మకూరు ఉప ఎన్నికల్లో సీన్‌ రివర్స్‌ అయింది. సాధారణ ఎన్నికల్లో 82 శాతం పోల్‌ అయితే తాజాగా ఉప ఎన్నికల్లో 64.14 శాతం మాత్రమే పోలింగ్‌ జరిగింది. అంటే ఓటర్లు ఈ ఎన్నికల యెడల పెద్దగా ఆసక్తి చూపలేదు. టీడీపీ పోటీలో లేదు కాబట్టి ఆ పార్టీ ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు రాలేదనే వాదనలో కొంత నిజమున్నా అది పూర్తి నిజం కాదు. జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరు ఒక మారు పరిశీ లించితే ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్దకు వచ్చిన సంద ర్భాలు చాలా తక్కువ. అంతేకాదు. ప్రతిపక్షాల అభ్యర్థులు లేకుండానే నామినేషన్లు ఉపసంహరించుకొన్న సంఘటన లున్నాయి. అధికార పార్టీ నేతలు అధికారులు పాలు నీళ్లులాగా కలసిపోయి ఎన్నికలను అపహాస్యం చేస్తు న్నారు. అయితే ఆత్మకూరులో దాదాపు సీన్‌ రివర్స్‌ అయి నట్లుంది. లేకుంటే పోలింగ్‌ శాతం తగ్గేది కాదు. పోలింగ్‌ గతం కన్నా 18 శాతం తగ్గిందంటే ఈ చిదంబరం రహస్యం గురించి భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. ఒకటి భారీ ఎత్తున ఓట్లు రిగ్గింగ్‌కు ఈ ఉప ఎన్నికలు సందర్భంగా పోలింగ్‌ అధికారులు అనుమతించలేదా? రెండు కొన్ని చోట్ల ఓటుకు రెండు వేలు పలికినా ఓటర్లు ఉత్సాహం చూపలేదా? మూడు వాలంటీర్ల పైనే భారం పెట్టినందున వైసీపీి కింది స్థాయి కార్యకర్తలు మొహం చాటేశారా? అసలు ఓటర్లు ఉత్సాహం చూపలేదా? పోలింగ్‌ సందర్భంగా ఆత్మకూరు నియోజక వర్గంలో పర్యటించిన కొందరు రిపోర్టర్లు ఈ భిన్న కథనాలన్నీ వ్యక్తం చేశారు. గతం కన్నా ఎక్కువ మెజారిటీ ఓట్లు సంపాదించామనే తృప్తి తప్ప వైసీపీకి గతం కన్నా ఘోరంగా ఓటింగ్‌ శాతం పడిపోవడం ఓటర్ల మనోభావాలకు ప్రతిబింబంగా భావించాలి.
వ్యాస రచయిత విశ్రాంత పాత్రికేయులు,
9848394013.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img