Saturday, June 10, 2023
Saturday, June 10, 2023

బీజేపీని ఓడిరచి దేశాన్ని రక్షించాలి

డి.రాజా, సీపీఐ ప్రధాన కార్యదర్శి

లోక్‌సభకు జరగనున్న ఎన్నికల్లో బీజేపీని ఓడిరచి దేశాన్ని పరిరక్షించాలన్న నినాదంతో 2023 ఏప్రిల్‌14 నుంచి మే 15వ తేదీవరకు దేశ వ్యాప్తంగా ప్రచారం నిర్వహించాలని సీపీఐ జాతీయ సమితి నిర్ణయించింది.1925లో పార్టీని స్థాపించిన నాటి నుంచి ప్రజల జీవనం మెరుగు పరిచేందుకు జరిగిన ప్రజా పోరాటాల్లో సీపీఐ అగ్రభాగాన నిలిచింది. ప్రజల కోసం, దేశం కోసం త్యాగాలు చేయడంతో సీపీఐ మరెవరికంటే రెండో స్థానంలో లేదు. ప్రజాపోరాటాల్లో పార్టీది ఘన చరిత్ర. సమాజంలో దోపిడీకి గురవుతున్న వర్గాలకు వాణిగా సీపీఐ పనిచేస్తోంది. సానుకూలంగా జాతీయ అజెండాను రూపొందించడంలో గణనీయమైన పాత్ర నిర్వహించింది. మనం చేసిన పోరాటాలు అన్ని వర్గాలకు ప్రయోజనకరమైన ప్రధానమైన విజయాలను సాధించింది. కష్టజీవులైన కార్మికుల, రైతుల హక్కులకోసం సీపీఐ చేసిన కృషి,పోరాటం మరవలేనిది. ప్రజలు, సమాజంకోసం అత్యున్నత త్యాగాలు చేసి రక్తం ధారపోసిన అమరవీరులస్పూర్తి వాస్తవంగా చాలా గొప్పది.
నేటి కాలంలో మనం మునుపెన్నడూ లేని అసాధారణ రాజకీయ పరిస్థితులను ఎదుర్కొంటున్నాం. దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ ప్రశ్నార్థకమైంది. కేంద్రంలో, చాలా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నవారు విచ్ఛిన్నకరమైన ఆర్‌ఎస్‌ఎస్‌ అజెండాతో పనిచేస్తున్నారు. మన స్వాతంత్య్ర ఉద్యమ లక్ష్యాలన్నింటినీ ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలం ధ్వంసం చేస్తోంది. లౌకికతత్వం, సోషలిజంతో కూడిన మన మౌలిక విలువలను ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వ ప్రచారం ద్వారా నాశనంచేస్తోంది. మనువాద సిద్ధాంతం, చరిత్ర పొడవునా అణగారిన ప్రజలపై వివక్ష చూపుతున్న నేపధ్యంలో కుల అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఆశ్రిత పెట్టుబడిదారులు మనదేశ అమూల్యమైన వనరులను హరించివేస్తున్నారు. ఈ నేపధ్యంలో మన పార్టీ దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ప్రచారోద్యమం చాలా ప్రాముఖ్యమైంది. ప్రజల సమస్యలపై పోరాడేందుకు, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకోసం ఈ కార్యక్రమం కీలకమైంది. ప్రజారోగ్యం, విద్య, భూమి, గృహం, ఉపాధి, ఉద్యోగాలు, ఆహార భద్రత అంశాలు మన ఎజెండా ప్రాధమిక డిమాండ్‌ అని 2022 అక్టోబరులో విజయవాడలో జరిగిన పార్టీ 24వ మహాసభ రాజకీయ తీర్మానం ఆమోదించింది. పౌరులకు మౌలిక సదుపాయాలు కల్పించడలో ప్రభుత్వం పూర్తిగా విఫల మైందన్న అంశాన్ని మన రాజకీయ ప్రచారంలో ప్రధానంగా తీసుకోవాలి. ఈ డిమాండ్ల సాధనకోసం ప్రజలను సమీకరించి సమర్థవంతంగా పోరాడాలి. మన రాజ్యాంగం రూపకల్పనలో ప్రధానపాత్ర వహించిన డాక్టర్‌ అంబేద్కర్‌ జన్మదినోత్సం ఏప్రిల్‌ 14న జరుగుతుంది. ఆయన తన జీవితాంతం కులనిర్మూలనకు, సామాజిక న్యాయం కోసం పోరాడారు. సామాజిక న్యాయం, సోషలిజం సాధన కోసం ప్రచారం చేయడంతోపాటు ప్రజలను సమీకరించి పోరాడాలి. ఇటీవల జాతీయ, ప్రాంతీయ స్థాయిలో తలెత్తిన సమస్యలపైన పోరాడాలి. హిండెన్‌బర్గ్‌ పరిశోధనా సంస్థ బైటపెట్టిన అదానీ కంపెనీల అక్రమాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు పుట్టించాయి. అలాగే మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఆశ్రిత పెట్టుబడిదారీ విధానం స్పష్టంగా వెల్లడైంది. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేసేందుకు సంయుక్త పార్లమెంటరీ కమిటీని (జేఏసీ) నియమించాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను మోదీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ప్రస్తుతం పార్లమెంటులో బీజేపీ సభ్యులే ఎక్కువ. జేపీసీలో సహజంగా ఆ పార్టీ వాళ్లే ఎక్కువగా ఉంటారు. అయినప్పటికీ జేపీసీని నియామకానికి ప్రభుత్వం భయపడుతోంది.
ఈ అంశంపై మరోకోణం కూడా ఉంది. ఉన్నతస్థాయిలో వ్యవస్థీకృత అవినీతి చాలా తీవ్రంగా ఉంది. ప్రజల కష్టార్జితంతో దేశసంపదను సృష్టించరు. మన పౌరులు సృష్టించిన జాతీయ సంపదను అత్యంత చౌకగా ఎంపికచేసిన కొద్దిమందికి కట్టబెడుతున్నారు. ఇలాచేస్తూ ఎన్నికల బాండ్ల ద్వారా బీజేపీ నిధులను పోగేసుకుంటోంది. ఆర్థికవ్యవస్థలోని అన్ని రంగాలను ప్రైవేటీకరిస్తోంది. ఈ చర్య ప్రజలపై ఎంతగా ప్రభావితం చేస్తుందన్న అంశాన్ని పట్టించుకోవడంలేదు. ఆర్థిక సమగ్రత, స్వతంత్రత కలిగి కాలపరీక్షకు నిలిచిన ఎల్‌ఐసీ, ఎస్‌బీఐ లాంటి సంస్థలను, ఆశ్రిత పెట్టుబడీదారులు దుర్వినియోగం చేస్త్తున్నారు. ఈ సంస్థలలో ప్రజలు దాచుకున్న డబ్బును ప్రభుత్వరంగ సంస్థల పెట్టుబడులకు ఇవ్వడంలేదు. పైగా తమకు మేలుకలిగిస్తూ అత్యంత సన్నిహితంగా ఉన్న కొద్దిమంది పెట్టుబడిదారులకు ఈ డబ్బును కట్టబెడుతున్నారు. దేశంలోని సామాన్య ప్రజలకు ద్రోహంచేసి వారి కష్టార్జితాన్ని అవినీతిపరులైన పెట్టుబడిదారుల ధనాగారాన్ని నింపుతున్నారు. మన ప్రచారంలో ఈ విషయాలను బహిర్గతం చేయాలి. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలను బైటపెట్టడంలో ప్రతిపక్షాలు ఐక్యం కావాలి. ఎన్నికలు ద్వారా బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే బీజేపీతో పాటు ఆర్‌ఎస్‌ఎస్‌ ఆవిర్భావం నుంచి ప్రజాస్వామ్య వ్యతిరేక భావజాలాన్ని ప్రచారంచేస్తోంది. ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తూ ప్రజాస్వామ్య వ్యతిరేక వాతావరణాన్ని సృష్టించింది. పౌరహక్కులను నిరంతరం హరిస్తూనే ఉంది. మన రిపబ్లిక్‌ రాజ్యాంగ నిర్మాణాన్ని ధ్వంసం చేస్తోంది. పార్లమెంటులో మెజారిటీని దుర్వినియోగం చేస్తూ సమావేశాలు స్తంభింపచేస్తోంది. అలాగే ప్రతిపక్షాలు దేశ వ్యతిరేకమైనవిగా ప్రభుత్వం నిందలు మోపుతోంది. ప్రభుత్వానికి అనుకూలంగా, ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు తాము చెప్పినట్లు వినాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని మీడియా ఫిర్యాదు చేస్తోంది. కార్యనిర్వాహకవర్గం క్రమం తప్పకుండా న్యాయవ్యవస్థ స్వతంత్రతను సవాలుచేస్తోంది. ఈ అంశాలను కూడా మన ప్రచారంలో ప్రజలకు వివరించాలి. ఆశ్రితహిందూత్వ శక్తుల దాడి నుండి దేశాన్ని రక్షించుకునేందుకు గాను సెక్యులర్‌, ప్రజాస్వామ్య శక్తులన్నీ ఐక్యం కావాలని మనం విజ్ఞప్తి చేయాలి. కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీని దోషిగా నిలిపి శిక్షకు గురి చేయించడమే కాకుండా ఎంపీగా అనర్హుడని ప్రకటించారు. ఇది ప్రజాస్వామ్య భవిష్యత్తు, నిరసన తెలిపే స్వేచ్ఛను, రాజ్యాంగ సంస్థల మనుగడ తదితర కీలకమైన అంశాలు ఆందోళన కలిగిస్తున్నాయి. బీజేపీ ఆర్‌ఎస్‌ఎస్‌ల సంకుచితత్వాన్ని ఇది వెల్లడిస్తోంది. ప్రతిపక్షాన్ని బెదిరించి నిరంకుశ ఫాసిస్టు రాజ్యాన్ని నెలకొల్పాలని ప్రయత్నిస్తోంది. ఈ అంశాల న్నింటిపైన ఆయా జిల్లాలలో ముందుగా మనం పాదయాత్రలు తదితర మార్గాలద్వారా రాజకీయ ప్రచారం చేయాలి. ఆర్‌ఎస్‌ఎస్‌బీజేపీ ప్రభుత్వ చర్యలను ఎండగడుతూ అన్ని భాషల్లోనూ సోషల్‌ మీడియా ద్వారా మన అజెండాతో కూడిన కరపత్రాలను ముద్రించి పంపిణీ చేయాలి. ప్రత్యేకించి యువత మీడియాను వినియోగించుకుని సమర్థవంతంగా ప్రజలకు ఈ అంశాలను వివరించాలి. ప్రజాసమూహాలు, మన కార్యకర్తలను వినియోగించుకుని సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మత సామరస్యం కోసం, సామాజిక విభజనకు వ్యతిరేకంగా ప్రజలను చైతన్యపరచాలి. అన్ని సెక్యులర్‌, ప్రజాస్వామ్య శక్తులను సూత్రబద్దంగా భావజాలపరంగా ఐక్యం చేయడం అత్యంత ముఖ్యమైన అంశం. వామపక్షం మాత్రమే ఆర్‌ఎస్‌ఎస్‌ బీజేపీ భావజాలాన్ని సమర్థవంతంగా సవాలు చేయగలదు. ప్రజాను కూలమైన ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలి. దేశ చరిత్రలో 2024లో జరుగ నున్న పార్లమెంటు ఎన్నికలు అత్యంత కీలకమైనవి. ఈ ఎన్నికలకు ముందు అనేక రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. కర్ణాటక అసెంబ్లీకి, 2023 మే 10న ఎన్నికలు జరుగుతాయి. ఈ ఎన్నికలలో బీజేపీని ఓడిరచి దేశాన్ని, రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి. మన రాజకీయ ప్రచార ఉద్యమం విజయవంతంగా సాగించి ప్రజలకు ప్రత్యామ్నాయ అజెండాను అందించాలి. ఈ బాధ్యత నిర్వహించే క్రమం లోనే సీపీఐను బలోపేతం చేయాలి. పోరాటాల ద్వారానే పార్టీని పటిష్ఠ పరచి మత, ఫాసిస్టు శక్తులను సవాలు చేయాలి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img