Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

బెంబేలెత్తిస్తున్న ఆన్‌లైన్‌ మోసాలు

జీ. ఈశ్వరయ్య

సైబర్‌ నేరాలు నానాటికీ విపరీతంగా పెరుగు తున్నాయి. అంతర్జాలాన్ని ఊతంగా చేసుకుని సైబర్‌ నేరగాళ్లు కొత్త పంథాల్లో అమాయకుల నుంచి డబ్బులు దోచుకుంటున్నారు. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. సుదూర రాష్ట్రాల నుంచి నేరాలకు పాల్పడుతుండటంతో నిందితులను పట్టుకుని సొమ్ము రికవరీ చేయడం పోలీసులకు సవాలుగా మారింది. అమాయకత్వం, అత్యాశతో ప్రజలు నేరగాళ్లకు చిక్కి మోసపోతున్నారు. ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక కొందరు కుమిలిపోతున్నారు. మరికొందరు బయటకు చెప్పుకుంటే పరువు పోతుందని భయపడుతున్నారు. ఇంకొందరు ఏకంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల కర్నూలులో ఓ యువకుడు విదేశీ ఉద్యోగం నెపంతో ఏకంగా రూ.20 లక్షలు మోసపోయాడు. కొందరు ప్రముఖ సంస్థల వస్తువులను వార్షికోత్సవం సందర్భంగా తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు రాయితీల పేరుతో, సామాజిక మాధ్యమాల్లో ప్రకటనలిచ్చి మోసగిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జిల్లాలోని పోలీసు అధికారుల పేరుతో ఫేక్‌ ఖాతాలు తెరిచి వారి సన్నిహితులను డబ్బులు అడిగి ఖాతాలో వేయించుకునే యత్నం చేశారు. కరోనా సమయంలో బీమా సొమ్ము పేరుతోనూ మోసాలకు పాల్పడ్డారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వ్యక్తులను నమ్మి పంపిన చిత్రాలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌కు గురైన ఘటనలు అనేకం ఉన్నాయి. ఇటీవల పెట్టుబడుల మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒక లక్ష రూపాయల పెట్టుబడితో నెలకు ఐదు నుండి పది వేలు, రూ.5 వేలు వరకు పొందవచ్చని, ఏడాదికి రెట్టింపు ఆదాయమంటూ సైబర్‌ నేరగాళ్లు అనేక నకిలీ వెబ్‌సైట్ల ప్రకటనలతో అమాయకులను ఆకర్షించేయత్నం చేస్తున్నారు. పెళ్లి సంబంధాల వెబ్‌సైట్స్‌తో మోసపోయిన బాధితులున్నారు.
కర్నూలులోని కల్లూరు ముజఫర్‌నగర్‌కు చెందిన ఓ వ్యక్తికి అపరిచితుడి నుంచి ఫోన్‌కాల్‌ వచ్చింది. తమ సంస్థ లక్కీడ్రాలో మీ ఫోన్‌ నెంబరు ఎంపికైందని, కారు బహుమతిగా ఇస్తున్నట్లు చెప్పాడు. ఓ కారు చిత్రాన్ని పంపాడు. కారును త్వరలో డెలివరీ ఇస్తామని చెప్పేసరికి నిజమేనను కున్నాడు. తర్వాత ప్రాసెసింగ్‌ ఫీజు, ఆదాయపన్ను, రిజిస్ట్రేషన్‌ రుసుము పేరుతో మొత్తం రూ.47 వేలు ఖాతాలో జమ చేయించుకుని ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ చేసుకున్నాడు. మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఓఎల్‌ఎక్స్‌లో ఓ అపరిచిత వ్యక్తి తన ద్విచక్ర వాహనాన్ని విక్రయిస్తున్నట్లు ప్రకటన ఇచ్చి వాహనం చిత్రాన్ని ఉంచాడు. జిల్లాకు చెందిన ఓ యువకుడు నమ్మి అతనికి ఫోన్‌ చేయగా తాను మిలిటరీలో పనిచేస్తున్నా నని, బదిలీ అయినందున విక్రయిస్తున్నట్లు చెప్పి నమ్మించాడు. అతని మాటలు నమ్మి కొంత మొత్తాన్ని అడ్వాన్సుగా ఖాతాలో జమచేశాడు. తర్వాత వాహనాన్ని ప్రముఖ ట్రాన్స్‌పోర్టు ద్వారా పంపుతున్నట్లు చిత్రాన్ని పోస్టు చేయటంతో నమ్మి మిగిలిన మొత్తం జమ చేశాడు. మొత్తం 80 వేలు రూపాయలు పంపిన అతడు సదరు ట్రాన్స్‌పోర్టు కార్యాలయాన్ని సంప్రదించగా వాహనం రాలేదని చెప్పారు. అతనికి ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ అని రావటంతో మోసపోయినట్లు తెలుసుకున్నాడు.
నైజీరియాకు చెందిన సైబర్‌ నేరగాళ్లు ఎమ్మిగనూరుకు చెందిన ఓ వ్యక్తిని పరిచయం చేసుకున్నారు. యూకేలో నూనె వ్యాపారం చేస్తున్నట్లు నమ్మించారు. ముంబైలో ముడిసరకు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. తమది విదేశీ సంస్థ అయినందుకు ఎక్కువ పన్ను చెల్లిస్తున్నామని, భాగస్వామిగా చేరితే తక్కువ చెల్లించవచ్చని చెప్పారు. ఆయన ఏకంగా రూ.11.24 లక్షలు వారి ఖాతాలో డిపాజిట్‌చేసి మోసపోయారు. చదువులేని వాళ్ళు, పేదరికంలో ఉన్న వాళ్లే కాదు, ఉన్నత చదువు అభ్యసించి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకున్న వాళ్ళు సైతం మోసపోతున్నారు. బిటెక్‌, ఎంబిఎ వంటి డిగ్రీలు ఉన్న వారు కూడా సరైన ఉపాధి లేక విలాసవంతమైన జీవితాలకు అలవాటుపడి నేరాలు ఎంత సులువుగా చేయాలి, ఎలా తప్పించుకోవాలి యూ ట్యూబ్‌, సినిమాలు ద్వారా తెలుసుకుని నేరాలకు పాల్పడుతున్నట్టు పోలీసు నిఘా లేదా సర్వేల ద్వారా తెలుస్తుంది.
పోలీసుల సూచనలు ఇవే
ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా, ఇతర వ్యక్తిగత వివరాలు అపరిచితులకు ఇవ్వరాదు. కొత్తకొత్త లింకులను క్లిక్‌ చేసి అందులో వ్యక్తిగత వివరాలు నమోదు చేయకూడదు. పాస్‌వర్డ్‌, ఓటీపీ, పిన్‌ నెంబరు ఇతర వివరాలు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులకు చెప్పరాదు. పంపరాదు. లాటరీ తగిలిందని మెసేజ్‌ వచ్చినా, ఫోన్‌ చేసినా నమ్మరాదు. మెసేజ్‌లు ఆగిపోవడం, సిమ్‌ పనిచేయక పోవడం, సిగ్నల్స్‌ తగలకపోవడం, అవాంఛనీయ మెసేజ్‌లు రావడం సిమ్‌ స్వాప్‌కు సంకేతాలు. వెంటనే సంస్థ సర్వీసు ప్రొవైడర్‌ను సంప్రదించాలి. లోన్‌ యాప్స్‌కు దూరంగా ఉండాలి. సైబర్‌ నేరానికి గురై ఆర్థికంగా నష్టపోయిన బాధితులు వెంటనే 1930 నెంబరుకు ఫోన్‌ చేయాలి. లేదంటే పోలీసులను సంప్రదించాలి.
వివిధ రకాల సైబర్‌ నేరాలు
గుర్తింపు దొంగతనం, ఓటీపీ మోసాలు, బ్యాంకుల పేరుతో మోసాలు, ఈ-మెయిల్స్‌ ద్వారా మోసాలు (సంస్థల నకిలీ ఈ-మెయిల్స్‌, లాటరీ, జాబ్‌ ఆఫర్స్‌), ఆన్‌లైన్‌ షాపింగ్‌ మోసాలు, రుణాలు ఇస్తామని యాప్‌లు, ఆన్‌లైన్‌ ద్వారా ప్రకటనల మోసాలు, డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, వాట్సప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, సామాజిక మాధ్యమాల్లో మోసాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు. లాటరీ ఎస్‌ఎంఎస్‌లు, ఫోన్‌కాల్స్‌, స్పామ్‌కాల్స్‌.
సిమ్‌ స్వాప్‌ మోసాలు అంటే ఏంటి?
వాటి బారిన పడకుండా ఎలా జాగ్రత్త పడాలి?
యువతులు, మహిళలకు సైబర్‌ బెదిరింపులు, బ్లాక్‌మెయిల్‌ మోసాలు. ఆన్‌లైన్‌ షాపింగ్‌, ఒఎల్‌ఎక్స్‌ మోసాలు, యాప్‌లు ఇన్‌స్టాల్‌ చేసుకునేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మెసేజ్‌, వాట్సప్‌ ద్వారా గుర్తు తెలియని లింకులు, పొంచి ఉన్న ప్రమాదం, హ్యాకింగ్‌ మోసం. విదేశాల్లో ఉంటూ నేరాలు చేసేవారు ఎలా చేస్తున్నారు? నేరగాళ్లకు వరంగామారిన ఇంటర్నెట్‌ కాల్స్‌, అడ్డుకట్ట వేసేందుకు పోలీసుల వ్యూహం ఏంటి? ఆ సాంకేతికత వీరి వద్ద ఉందా? ఈ-ఫైలింగ్‌, ఇన్‌కంటాక్స్‌ అప్రూవ్డ్‌ పేరిట మోసాలు? అడ్డుకట్ట ఎలా? తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? సైబర్‌ టెర్రరిజం. వ్యక్తులను లక్ష్యంగా చేసుకునే సైబర్‌ పోర్నోగ్రఫీ, సైబర్‌ స్టాకింగ్‌. సైబర్‌ డిఫమేషన్‌. ఆస్తులను లక్ష్యంగా చేసుకునే ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌. మేధో సంపత్తి హక్కుల ఉల్లంఘన.
స్పూఫింగ్‌ అంటే ఏంటి? యువతలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ. సైబర్‌ మోసాలపై యువతలో అవగాహన పెంచేందుకు ఆలిండియా యూత్‌ ఫెడరేషన్‌ (ఏఐవైఎఫ్‌) నడుం బిగించింది. దేశవ్యాప్తంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అన్ని జిల్లాల్లో సభలు, సమావేశాలు, సదస్సులు నిర్వహించనున్నాం. ఆన్‌లైన్‌ మోసాలకు గురికాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరిస్తాం. ఒకవేళ మోసపోతే ఎవరికి ఫిర్యాదు చేయాలి. సైబర్‌ నేరాలకు సంబంధించి అందుబాటులో ఉన్న చట్టాలపై యువతలో అవగాహన పెంచేందుకు కృషి చేస్తాం. ప్రతీ మండల రెవెన్యూ కార్యాలయం, పోలీసు స్టేషన్‌లో సైబర్‌ నేరాలకు సంబంధించి ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాం.
వ్యాస రచయిత ఎఐవైఎఫ్‌ మాజీ జాతీయ కార్యదర్శి

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img