Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

బైజూస్‌ ‘పాఠాలు’… ప్రచార పటాటోపాలు!

హరి వెంకట రమణ
ఆంధ్రప్రదేశ్‌లో పాఠశాల విద్య కొండ నాలుకకు మందు వేస్తే వున్న నాలుక ఊడిరదనే చందంగా ఉంది. అత్యంత వేగవంతమైన సంస్కరణల్లో భాగంగా డిజిటలీ కరణనూ తీసుకొస్తోంది. జాతీయ విద్యా విధానం`2020 చెబుతున్నదీ ఇదేగా. ఆ దిశగా అడుగులేస్తున్న మన రాష్ట్ర ప్రభుత్వం రూ. 500 కోట్లతో టాబ్‌లను కొను గోలు చేసేందుకు బైజూస్‌ మల్టీ నేషనల్‌ కంపెనీతో ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇందుకోసం బైజూస్‌నే ఎందుకు ఎంచుకుంది? ఎన్‌సిఈఆర్‌టితో ఈ పని చేయలేమా? వీటి ద్వారా లబ్ధి పొందే అవకాశాలెంత? ఓ పరిశీలన చేద్దాం.
పిల్లలకు డిజిటల్‌ విద్యను అందించడం ద్వారా అనుభవాత్మక విద్యనందించ వచ్చునని మన రాష్ట్రప్రభుత్వం చెబుతోంది. సుమారు 4.5 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందుతారని, డిజిటల్‌ పద్ధతి ద్వారా విద్యా సామర్థ్యాలు మెరుగయ్యే అవకాశాలు అధికమని అంచనా. ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ 2025లో పదవ తరగతి సి.బి.ఎస్‌.సి.లో రాసే విద్యార్థులు దీని పరిధిలోకి వస్తారు. దీని ద్వారా నాలగవ తరగతి నుండి పదవ తరగతి వరకు చదివే పిల్లలు సబ్జెక్టు పరమైన పరిణితిని పొందుతారంటోంది ప్రభుత్వం. సాంప్రదాయ బోధనా విధానాన్ని అధిగ మించడానికి, స్వీయ అభ్యసన ప్రాతిపదికలో డిజిటల్‌ విద్య ప్రధాన పాత్ర పోషి స్తోంది. కొత్త విషయాలు నేర్చుకోవడంలో పాఠ్య పుస్తకాలకన్నా అదనంగా విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి ఆన్‌లైన్‌, డిజిటల్‌ విద్య ఈ పోటీ ప్రపంచంలో ప్రధానమైనది. నూతన విద్యా విధానం 2020 ప్రకారం ప్రతి విద్యార్థి ప్రాథమిక స్థాయి నుండి ఆధునిక విద్యా బోధన అందుకోవడానికి పాఠశాల విద్య కొత్త పుంతలు తొక్కుతూ డిజిటల్‌ వేదికలు వచ్చాయి. ఇదంతా బానే ఉంది కానీ జనాభాలో అధిక శాతమైన బహుజనులకు, పేద పిల్లలకు, గిరిజనులకు ఇవి ఎంతమేరకు అందుతాయన్నదే ఇక్కడ అసలు ప్రశ్న?
కోవిడ్‌ ఆన్‌లైన్‌ విద్యను ముందుకు తెచ్చింది. ఈ అనుభవాలు భౌతిక తరగతుల ఆవశ్యకతను తెలిపాయి. ఆన్‌లైన్‌ విధానం ద్వారా విద్య అందించడానికి ప్రభుత్వం, ప్రభుత్వేతర సంస్థలు కృషి చేసినప్పటికీ ఎక్కువశాతం మందికి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలకు ఆన్‌లైన్‌ విద్య అందని ఫలంలా ఉండిపోవడం, అందరికీ డిజిటల్‌ పరికరాలు లేకపోవడం, కంప్యూటర్‌ సౌకర్యం లేకపోవడం, ఆండ్రాయిడ్‌ ఫోను ఉన్నప్పటికీ ఇంటర్నెట్‌ సదుపాయం అందుబాటులో ఉండకపోవడం, గిరిజన ప్రాంతాల్లో, పట్టణ పేద కుటుంబాలలో ఎటువంటి వసతి లేకపోవడం లాంటి ఇలా ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి, 3-17 వయసు కలిగిన 1.3 బిలియన్‌ మంది పిల్లల్లో 50 శాతం మందికి ఇంటర్నెట్‌ సౌకర్యం, కంప్యూటర్‌ సౌకర్యం కూడా లేదని యునిసెఫ్‌-యు.టి.ఐ నివేదిక వెల్లడిరచింది. ఎన్‌.సి.ఆర్‌.టి సర్వే ప్రకారం దేశంలో 27శాతం విద్యార్థులు కంప్యూటర్లు, స్మార్ట్‌ ఫోన్లు లేనందువలన ఆన్‌లైన్‌ విద్య అందుకోలేక వెనుకబడ్డారు. భారతదేశంలోనే కోవిడ్‌ విపత్తు వల్ల సుమారు 32 కోట్ల మంది విద్యార్థులు అభ్యసనకు దూరమైనట్లు యునెస్కో 2020 నివేదిక వెల్లడిరచింది. ఇందులో అధిక శాతం డిజిటల్‌ పరికరాలు అందుబాటులో లేనివారే అని మనం గుర్తు పెట్టుకోవాలి. మనదేశంలో కంప్యూటర్లు ఉన్న బడుల శాతం 22 మాత్రమే. ఈ సమస్యలేవీ ఇంకా సమసిపోలేదు. అందుకు తగిన చర్యలూ లేవు. అయినా డిజిటల్‌ విద్య వైపు మొగ్గు చూపుతున్నారు.
అసలు బడికే వెళ్ళలేని నిరక్షరాస్య కుటుంబాల్లోని పిల్లల పరిస్థితిని ఆలోచించ వలసిన ఆవశ్యకత వుంది. పట్టణాలకు, చదువుకు చాలా దగ్గరగా వున్న విద్యార్థులు ఒక వైపు – బడి బాటకన్నా కూలి పని, చేతి పని మిన్న అని భావిస్తూ చదువుపై అవగాహన లేని పిల్లలు మరోపక్క వున్న ప్రపంచంలో మనం ఉన్నామని ప్రభుత్వం గుర్తించాలి.
బైజూస్‌ సేవలు అందుకొనే విద్యార్థులు ఒక కోవకు చెందినవారు. మన పిల్ల లకు డిజిటల్‌ లిటరసీ పైన అవగాహన ఉండాలి. ఎంతవరకు డిజిటల్‌ అక్షరాస్యత సాధించాం అన్నదానిపై ప్రభుత్వం వద్ద లెక్కలు లేవు. సైబర్‌ భద్రత నియమాలపై పిల్లలకు, ఉపాధ్యాయులకు అవగాహన కల్గించాలి. బైజూస్‌ ద్వారా లభ్యమయ్యే డిజిటల్‌ పాఠాలు వారు ఉపయోగించిన భాష మన రాష్ట్ర భాష, స్థానికతకు సరితూగుతుందా? అన్నది చూడాలి. ఒకవేళ బైజూస్‌ పాఠాలు పాఠశాలలోనే స్క్రీన్‌, ట్యాబుల ద్వారా అందుబాటులో ఉంచితే సైబర్‌ భద్రతాంశాలు, భాష, పిల్లలు ప్రాక్టీసుకు వెసులుబాటు కల్పించడం ఒక ప్రధాన అంశం. ట్యాబులకు తగినన్ని ఛార్జింగ్‌ పాయంట్ల ఏర్పాటు, ఇంటర్నెట్‌, విద్యుత్‌ నిరంతరం అందుబాటులో ఉండడం తప్పనిసరి. దీనిలో పాఠాలు ముందే రికార్డు చేసి ఉండటం వలన ఆఫ్‌ లైన్‌ కూడా వినడానికి వెసులుబాటు ఉంటుంది. కాని లైవ్‌ పాఠాలు వినే వెసులుబాటు ఉండదు. పిల్లల ఆరోగ్య భద్రత విషయానికొస్తే స్క్రీన్‌ సమయం ఎక్కువవుతుంది ఉపాధ్యాయులతో చర్చించే వెసులుబాటు ఉండదు.
బైజూస్‌తో ఒప్పందం, ట్యాబ్‌లతో పాఠాలు వల్ల ఉపాధ్యాయ పోస్టులు గల్లంతవు తాయి. డీఎస్సీపై ఈ ప్రభావాన్ని కాదనలేం, మూడేళ్ళుగా ఉపాధ్యాయ నియామకాలు చేపట్టలేదు. ఇప్పటికే 25 వేల పోస్టులు ఖాళీగా వున్నాయి, వాటినుంచి తప్పించుకోవడానికి ప్రభుత్వం బైజూస్‌ను ముందుకు తెస్తోంది అన్న వాదన వుంది. ఉపాధ్యాయుల నియామకం, శిక్షణను నిర్లక్ష్యం చేస్తే మొదటికే మోసం వస్తుంది. ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత అయిన విద్యారంగంలోకి కూడా కార్పొరేట్లను ఆహ్వాని స్తోంది. ఇది రాబోయే రోజుల్లో విద్యారంగానికి ప్రమాదకరం. ఇందుకు బదులుగా ఎన్‌.సి.ఈ.ఆర్‌.టీ.కి కేవలం వందకోట్లు కేటాయించినట్లయితే అందరికీ అర్థ మయ్యేలా స్థానిక పాఠాలను రూపొందిస్తుంది కదా!
ఆన్‌లైన్‌ విద్య అందుకోలేని పాఠశాల పిల్లలకు ప్రత్యామ్నాయ పద్ధతులు ప్రభుత్వం వద్ద ఉన్నాయా?, డిజిటల్‌ తరగతులను చేరుకునేందుకు పిల్లలకు తగిన డిజిటల్‌ పరికరాల ఏర్పాటుతో బాటు ఇంటర్నెట్‌ సౌకర్యాల కల్పనకు కార్యాచరణ ఉందా?. సాధారణ ప్రాథమిక-ఉన్నత పాఠశాలలో విద్యార్థుల వయసు, తరగతి వారీ విద్యా సామర్థ్యాలను సాధించేలా ప్రణాళికలు రచించి అమలు చేయగలుగు తున్నామా? పిల్లల చదువులపై ఏటా వస్తున్న నివేదికల పరిస్థితి ఏమిటి?. కొవిడ్‌ కారణంగా కోల్పోయిన విద్యా సామర్థ్యాలను పునరుద్ధరించేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేసాం? చేస్తున్నాం? ఇవేవీ లేకపోగా పాఠశాలల విలీనం పేరుతో విద్యార్థులను, వారి తల్లితండ్రులను క్షోభ పెడుతున్నారు. హడావుడిగా కేంద్రం మెప్పు కోసం నూతన విద్యా విధానాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే వేగంగా అమలు చేస్తోన్న ఏపీ ప్రభుత్వం వీటి సంస్కరణల ఫలితాలను బేరీజు వేస్తోందా?
తాయిలాలు ఇచ్చి పిల్లలను బడికి రప్పించడం కన్నా భవిష్యత్తు తరాలకు భరోసాను కల్పించే నాణ్యమైన గుణాత్మక విద్యకు ప్రాధాన్యతనివ్వాలి. ఈ విషయంలో ఉపాధ్యాయులు, తలిదండ్రులు, పౌర సమాజం, విద్యావేత్తల సూచనలు పరిగణలోకి తీసుకోవాలి. దురదృష్టవశాత్తు అటువంటి ప్రయత్నాలు ఏవీ కానరావడం లేదు. పిల్లల తల్లితండ్రులను ఓటు బ్యాంకులుగా చూసినంత కాలం ఈ పరిస్థితిలో మార్పు రాదు. అంతవరకూ బైజూస్‌లు ప్రచార పటాటోపానికే పనికొస్తాయి.

వ్యాస రచయిత బాలల హక్కుల కార్యకర్త

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img