Friday, September 22, 2023
Friday, September 22, 2023

బైడెన్‌ నిర్వాకం కాదా?

బి. లలితానంద ప్రసాద్‌

స్వదేశంలో విదేశాల్లో స్వపక్షంలో విపక్షంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ అఫ్గానిస్థాన్‌ నుంచి తన బలగాలను గడువు కన్నా ఒకరోజు ముందుగానే తరలించగలిగాడు. అంతకుముందు అఫ్గాన్‌లో ఆత్మాహుతి దళం జరిపిన కిరాతక చర్యల్లో స్థానికులు అనేక మందితో పాటు అమెరికా బలగాల్లో 13 మంది బలయ్యారు. దీనికి ఆయన ఎంతగానో కలత చెందారు. దాచుకోలేని ఆయన భావోద్వేగాల్ని మీడియా ప్రపంచ ప్రజల ముందుంచింది. తరలింపు పూర్తయిన అనంతరం ఆయన ప్రకటనల్లో తన నిర్ణయం తెలివైనది ఉత్తమమైనదిగా పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో పరిశీలకులు, విశ్లేషకులు వీటన్నింటికీ ఆయన ఎంతవరకూ బాధ్యులు అనేది అంచనాలు వేస్తున్నారు.
పార్టీ ఏదైనా అమెరికాలో అన్నింటా ప్రథమ స్థానం అధ్యక్షుడిదే. ఇప్పుడు ఆ స్థానంలో బైడెన్‌ ఉన్నాడు. పాలనాపరంగా ఎవరికైనా ఎత్తుపల్లాలు సహజమే. కానీ, అర్ధ శతాబ్దంగా వాషింగ్టన్‌తో ఏదో రీతిలో సంబంధబాంధవ్యాలు ఉన్న బైడెన్‌ అఫ్గాన్‌ సమస్యను ఇంత క్లిష్టం చేయకుండా, ఇలాంటి విషమ పరిస్థితులకు దారి తీయకుండా జాగ్రత్త పడాల్సిందని పరిశీలకులు అంటున్నారు. జార్జి డబ్ల్యూ బుష్‌ నుంచి ఒబామాకి, ఆయన నుంచి ట్రంపునకు ఈ సమస్య ఎలా బదిలీ అవుతూ వచ్చిందీ, ట్రంపు ఏ విధంగా తాలిబన్లకు లొంగిపోయి దోహా సమా వేశంలో వాయిదా వేసింది, తద్వారా బాధ్యత నుండి ఎలా వైదొలగినదీ అందరికీ తెలుసు. మరి వారి అనుభవాల నుండి బైడెన్‌ ఏం గ్రహించి నట్టు? ఇది ఏమాత్రం నాయకత్వ లక్షణం కాదు. ఇందుకు సలహాదారులు మద్దతుదారుల భాగస్వామ్యం ఎంత ఉందో ఆయనకే తెలియాలి. అఫ్గాన్‌లో ఈ గందరగోళానికి, మరణాలకు ప్రధాన కారణమైన అగ్ర రాజ్యం అమర్యాద నిష్క్రమణలు తప్పవనే ఆలోచనతోనే ఈ ప్రక్రియలో కొంత వేగం పెంచింది. అగ్నికి ఆజ్యం తోడవకుండా ఉండేందుకు పాకిస్థాన్‌ సీఐఏ డైరెక్టర్‌ విలియం జె బర్న్స్‌ను జూన్‌లో కాకుండా జనవరిలోనే పంపి ఉండవలసిందని న్యూయార్క్‌ టైమ్స్‌ పత్రిక అభిప్రాయం. ఆయన కాకుండా ఏ సీనియర్‌ అధికారి అయినా ఈ పరిణామాన్ని కనీసం అంచనా వేయగలిగాడా? అనే ప్రశ్నలు ప్రపంచ మీడియా సంధిస్తోంది. వీటన్నింటికీ పూర్తి బాధ్యత బైడెన్‌దే. అంతా స్వయంకృతం. గతం నుండి పేరుకున్న నిఘా వైఫల్యంతో 9/11 ఘటనలకు బుష్‌ బాధ్యుడు అయినట్లు, ఇరాన్‌ మూడు దశాబ్దాల సంక్షోభం జిమ్మీ కార్టర్‌ సొంతం అయినట్లు, వియత్నాంలోని సైగాన్‌ నుండి బలగాల తరలింపునకు జెరోల్డ్‌ ఫోర్డ్‌ బాధ్యుడు అయినట్లు, నేటి అఫ్గాన్‌ దుస్థితికి బైడెనే కారణం.
అనవసర ఆత్రుతతో, అహేతుక అంచనాలతో ప్రజల్ని తప్పుదారి పట్టించారు. చివరకు దేశంలో ఎక్కడా, ఎవరికీ భద్రతే లేకుండా పోయింది. దేశం యావత్తూ తాలిబన్ల అధీనంలోకి వచ్చినా ఇక వారిని నివారించగల సామర్థ్యం అమెరికాకి ఏమాత్రం లేదు. పర్యవసానంగా దేశం యావత్తు తాలిబన్ల స్వాధీనమైంది. సైనిక స్థావరాలు అవినీతి మయమై పూర్తిగా విఫలమయ్యాయి. సాధారణంగానే అక్కడ మిలటరీ సామర్థ్యం అంతంత మాత్రమే. వీరికి తగినట్లు ఆ దేశాధ్యక్షుడు వారికి ఏనాడూ తగిన స్ఫూర్తిని ఇవ్వలేకపోయాడు. ఈ బలగాలు పరస్పర సాంస్కృతిక సాన్నిహిత్యం బదులు సంఘర్షణ పెంచాయి.
ఒబామా హయాంలో అఫ్గాన్‌లో అమెరికా దళాలు లక్షకు పైగా పెరిగాయి. ఇంత పెద్ద సేన కూడా తాలిబన్లను ఏమీ చేయలేక పోయింది. వారు సులభంగా కొండ గుహల ద్వారా పాకిస్తాన్‌లోకి జారుకుని అక్కడి వారితో కలిసి పోయారు. ట్రంపు చివరి ఒప్పందం ఫిబ్రవరి 2020 నాటికి అక్కడ మిగిలిన అరకొర సైన్యం కనీసం అక్కడ ఒక్క విమానాశ్రయం కూడా కాపాడే పరిస్థితి లేదు. ఇక పౌర జీవనమంతా గందరగోళం, అగమ్యగోచరంగా మారింది. సుదీర్ఘ యుద్ధ చరిత్రలో తిరిగి అధికారం తాలిబన్లకే దక్కింది. ఇది గత అధ్యక్షుని ఒప్పందాన్ని అమలు జరపడమే అయినా దీని అనంతర పరిణామాలకు బైడెన్‌ తన బాధ్యతల నుండి తప్పించుకోలేరు. ఇందులో బైడెన్‌ నిర్వాకమూ ఉందని ప్రపంచమంతా ఎలుగెత్తి చెబుతోంది.
వ్యాస రచయిత సెల్‌ 9247499715

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img