Monday, September 25, 2023
Monday, September 25, 2023

బ్రోచే వారెవరురా!

చింతపట్ల సుదర్శన్‌

‘చార్జింగ్‌’ ఐపోవస్తుండటంతో కిరణాల్ని సూటిగా విసిరెయ్యలేక అక్కడోటీ ఇక్కడోటీి దులుపుతున్నాడు సూర్యుడు. కిరణాలు లేనిచోటనీడలు పరుచుకుంటున్నవి. బస్‌ షెల్టర్‌ పక్కన నీడలో కూచుని కళ్లు మూసుకుంది డాంకీ. ఇవ్వాళ ఫుడ్‌ కొంచెం ఎక్కువే తిన్నట్టున్నా కొంపకు వెళ్లే ఓపిక లేదు. కాసేపు ఇక్కడ రెస్టు తీసుకుంటే గానీ నడవలేను అనుకుంటున్న డాంకీకి బస్‌షెల్టర్‌లోకి ఎవరో వస్తున్న శబ్దం వనిపించింది. ఒక చెవిని నిలబెట్టి ఒక కన్ను సగం తెరిచి చూసింది డాంకీ. ఎవరో అమ్మాయి కాలేజీ నించి ఇంటికి వెళ్లడానికి బస్సుకోసం వచ్చినట్టుంది అనుకుంది. బస్సు వస్తున్న శబ్దాన్ని మరో చెవిని నిలబెట్టి వింది డాంకీ. అమ్మాయి బస్సుఎక్కి వెళ్లిపోయి ఉంటుంది అనుకుంది బస్సు శబ్దం దూరం అవుతుండటంతో. కానీ షెల్టర్‌లో అడుగుల చప్పుడు వినిపించి కళ్లు రెండూ తెరిచి చూసింది. భుజాన వేలాడుతున్న పుస్తకాల బ్యాగుతో అమ్మాయి అక్కడే ఉంది. బస్సు ఆగకుండా పోయినట్టుంది అనుకుంది డాంకీ. వెంట ఎవరూ లేరు. బహుశా తనకి లేటైవుంటుంది బస్సు ఏదైనా వచ్చి అమ్మాయి ఎక్కి వెళ్లిపోతే బాగుండుననుకుంది. అసలే రోజులు బాగాలేవు. ఇది కొత్తకాలనీ అవడాన్ని ఇళ్లు ఇప్పుడిప్పుడే కడ్తున్నారు. జనసంచారం లేదు. పాపం అమ్మాయి చీకటి పడకముందు ఇల్లుచేరగలదో లేదో అనుకుంది డాంకీ.
కాస్సేపటికి మరో బస్సువచ్చి వెళ్లిపోయింది. అమ్మాయి మాత్రం వెళ్లిపోలేదు. అది ఆమె ఎక్కాల్సిన బస్సుకాదేమోననుకుంది డాంకీ. వెలుతురు మసక బారసాగింది. ఇక వెళ్దాం అని లేచి నిలబడిరది డాంకీ. అప్పుడు కపడ్డారువాళ్లు సైలెన్సర్‌ తీసేసిన మోటర్‌ బైక్‌ మీద వచ్చారు ముగ్గురు. ముగ్గురి వయస్సూ కలిపితే డెబ్బయి దాటదు. ఒకడు దున్నపోతులా వుంటే మరొకడు సీమపందిలా బలిసున్నాడు. ఇంకొకడు మాత్రం కరువు ప్రాంతంలో తిండి అడుక్కునే వాడిలా బక్క చిక్కిపోయి ఉన్నాడు. ముగ్గురూ వచ్చి షెల్టర్‌ ముందు బండి ఆపారు. ఒకడు షెల్టర్‌లో అమ్మాయివైపు చూస్తూ పళ్లికిలించాడు. బక్కోడు కన్నుకొట్టాడు. పందిలాగున్నోడు షెల్టర్‌ మెట్టెక్కి అమ్మాయి ముందు నిలబడ్డాడు. డాంకీ ఉలిక్కిపడ్డది. చుట్టూ ఎవరూలేరు. ఈ దొంగనాకొడుకులు ఆ అమ్మాయిని ఏమైనా చేస్తారేమోనని భయపడ్డది డాంకీ. ఆనవాలు చిక్కకుండా అమ్మాయిని కాల్చి బూడిద చేస్తారేమోనని భయపడ్డది డాంకీ. ఏం చెయ్యను? అమ్మాయిని ఎలా రక్షించను? అని ఆలోచించసాగింది. ఇలాంటి ఘోరాలు జరుగుతుంటే మనుషులే చూసీ చూడనట్లు వెళ్లిపోతారు గాడిదను. ఒక్కడిని. ఏం చెయ్యగలను? అనుకుంటూ షెల్టర్‌లోకి అడుగుపెట్టింది గాడిద. అమ్మాయికి దగ్గరగా వచ్చి నిలబడ్డ అడ్డగాడిద, డాంకీని పట్టించుకోలేదు. ముగ్గురూ అమ్మాయి చుట్టూ తిరుగుతూ ఏమేమో కూస్తున్నారు. ఓ గాడ్‌! నన్ను గాడిదగా ఎందుకు పుట్టించావు పులిలా పుట్టించాల్సింది ఒక్క పంజా దెబ్బతో ముగ్గురి తోలుతీసి గోడమీద ఆరేసేదాన్ని అనుకుంది డాంకీ. అప్పుడెప్పుడో ఏనుగును మొసలి నీళ్లలోకి లాగుతుంటే వచ్చి రక్షించాడంట దేవుడు. ఇప్పుడేమై పోయాడు. ప్రతిరోజూ ఎంతమందో, అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, అవమానపరుస్తున్న వాళ్లను పట్టించుకోడేం అనుకుంటున్న డాంకీకి ఓ పక్కనుంచి అబ్బాయీ, తన ఫ్రెండ్‌ డాగీ రావడం కనిపించింది. ఇక చెప్తాం మీ పని అనుకుని అలర్ట్‌గా నిలబడిరది డాంకీ. అబ్బాయి షెల్టర్‌లో ఆ ముగ్గురి ముందూ నిలబడి ఏం చేస్తున్నారు. అమ్మాయిని ఏడిపిస్తున్నారా అన్నాడు. అవును ‘బే’ నీ కెందుకు పో అన్నాడు ముగ్గురిలో ఒకడు. డాగీ వచ్చి డాంకీ పక్కన నిలబడ్డది. ఆ బోర్డు చూడండ్రా అన్నాడబ్బాయి. మాకు చదువురాదు నువ్వు చదువు ‘బే’ అన్నాడొకడు మెల్లకన్ను మూసుకుంటూ. ‘బేటీ పడావో బేటీ బచావో’ ఉందక్కడ అంటే ఏమిటో అన్నాడు ఊరపంది గుండుమీద అరచేతి వేళ్లతో తాళం వేసుకుంటూ. ఆడపిల్లల్ని చదివించాలి ఆడపిల్లల్ని రక్షించాలి అన్నాడు అబ్బాయి. చింతగింజలు రేకు డబ్బాలోవేసి ఊపినట్టు నవ్వారు ముగ్గురు. మీకు మంచిగా చెప్తే అర్థంకాదు పోలీసుల్ని పిలుస్తాను అన్నాడు అబ్బాయి. పోలీసులా పొడిచేస్తారా. మేం ఎం.ఎల్‌.ఏ మనుషులం. ఇందాక పోలీసుస్టేషన్లో మా వాడ్ని విడిపించడానికిపోయి లేడీ కానిస్టేబుల్‌ చున్నీ చించి పడేశాం అన్నాడొకడు అమ్మాయి భుజంమీద చేయివేస్తూ. డాగీకి సైగచేస్తూ డాంకీ వెనక్కి తిరిగి రెండు కాళ్లూ ఎత్తి దున్నపోతులాగు న్నోణ్ణి ఫెడీమని తన్నింది. ఆ దెబ్బకు వాడు బక్కోడితో సహా దూరంగా వెళ్లిపడ్డాడు. వాడికింద పడ్డ బక్కోడు కెవ్వుకెవ్వు మనసాగాడు. పందిలాగున్నోడికి ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపునే డాగీ వాడి పిక్క కండ ఊడి వచ్చేట్టు కొరికేసింది. లబోదిబోమంటూ వాళ్లు పరుగెడ్తుంటే వచ్చిన బస్సు ఎక్కుతూ అమ్మాయి అబ్బాయి కేసీ డాగీ డాంకీలవైపూ కృతజ్ఞతగా చూసింది. అర్థరాత్రి ఆడది భయంలేకుండా నడవాలని మనవాళ్లు కలలుగన్న దేశంలో నడివీధిలో నగ్నంగా వాళ్లని ఊరేగిస్తుంటే ప్రభుత్వాలకు చీమకుట్టినట్లు కూడాలేదు. అదో ‘రొటీన్‌’ విషయంగా కొట్టిపారేస్తున్నారు అన్నాడు అబ్బాయి ఇంటికి వెళ్తూ. మన రాజకీయ నాయకులకు సమస్యల్ని సృష్టించడం తెల్సినట్లు పరిష్కరించడం తెలీదు. స్వంతడబ్బా కొట్టుకోడానికి, అవతలి వాళ్లమీద బురద చల్లడానికి మాత్రమే చట్టసభల సెషన్లు వాడుతున్నారు అన్నది డాంకీ. ఏమైతేనేం ఆ అమ్మాయిని ఏ ప్రభుత్వం వచ్చి కాపాడిరది. ఒక్కోసారి ప్రభుత్వాలు చెయ్యలేని పన్లు వెనకకాళ్లతో గాడిదలూ, పిక్కలు పీకే కుక్కలూ చెయ్యగలవు అంది డాగీ.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img