Thursday, September 21, 2023
Thursday, September 21, 2023

భయపెడుతున్న వ్యాధులు

తాజాగా భారత వైద్య పరిశోధనా మండలి ఆధ్వర్యంలో జరిగిన ఒక పరిశోధనా పత్రం ప్రముఖ అంతర్జాతీయ పత్రిక లాన్‌ సెట్‌లో ప్రచురిత మైంది. దాని ప్రకారం భారత్‌లో ఇప్పుడున్న మధుమేహ వ్యాధిగ్రస్తులు 10 కోట్ల మంది. మరికొద్ది కాలంలో ఆ వ్యాధి బారిన పడబోయే రిస్క్‌ ఉన్న వారు (సాధారణం కన్నా ఎక్కువ బ్లడ్‌ షుగర్‌ కలిగి ఉన్నవారు- ప్రీ డయాబెటిక్స్‌)13 కోట్లమంది. ఈ వ్యాధి మాత్రమే కాకుండా స్థూలకాయం, అధిక రక్తపోటు, రక్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్‌ ఉన్నవారు ఈ దశాబ్దంలో ఎక్కువ సంఖ్యలో నమోదయ్యారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం రానున్న ఏడేళ్లలో భారత్‌ అదనంగా 6 లక్షల కోట్ల రూపాయల్ని ఈ వ్యాధుల వల్ల నష్టపోతుంది. ఈ నివేదికల్లో అంకెలపై భేదాభిప్రాయాలు ఎవరికైనా ఉండొచ్చు కానీ అందరూ అంగీకరించేది ఒకటే : అదేమిటంటే భారత్‌ ప్రపంచ మధుమేహ కేంద్రంగా మారిందని. జీవన శైలి వ్యాధులు అంటురోగాల కన్నా ఎక్కువగా విజృంభిస్తున్నాయని. ఇది భయపడాల్సిన విషయం. ఇక ధైర్యం పొందాల్సిన విషయం ఏమిటంటే సరైన ప్రణాళికతో ఈ స్థితి నుండి బయటపడొచ్చు. ఆరోగ్య సమాజాన్ని సాధించొచ్చు. వ్యక్తి నుండి వ్యవస్థ దాకా మేల్కొంటే చాలు.
జీవన శైలి వ్యాధులకు మూలకారణం దాని పేరులోనే ఉన్నట్లు తప్పుడు జీవన శైలి. ఆహారంలో, రోజువారీ శారీరక కదలికల్లో, మానసిక అంశాల్లో సరిగ్గా లేకపోవడం.అసహజ ధోరణులు అలవర్చుకోవడం. వాటిని కొనసాగించడం.వాటివల్లనే అధిక బరువు,శరీరంలో కొవ్వు పేరుకుపోవడం. వివిధ రకాల వ్యాధులు చుట్టముట్టడం. సహజంగా నియంత్రించుకోదగ్గ ఈ వ్యాధుల వల్ల ఆయా వ్యక్తులు శారీరకంగా, ఆయా కుటుంబాలు ఆర్ధికంగా చితికిపోతున్నాయి. సమాజంపై అదనపు ఆర్ధిక భారం పడుతోంది. ఈ స్థితి నుండి బయటపడడానికి అందరూ నడుం కట్టాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పౌరసమాజం పూనుకొంటే ఈ వ్యాధులు అదుపులో ఉండడమే కాకుండా, ఇప్పుడు అనుకొంటున్న ఆ 13 కోట్ల మంది చక్కెర వ్యాధి రాగల అవకాశం ఉన్నవారిలో సగం మంది అయినా హాయిగా బయటపడిపోతారు. మరికొంతమంది చేరికలు తగ్గుతాయి.
వ్యక్తిగత స్థాయిలో జంక్‌ ఫుడ్‌కి దూరంగా ఉండాలి. ఫాస్ట్‌ ఫుడ్‌, అధిక మోతాదులో కొవ్వు, ఉప్పు, నూనె ఉన్న పదార్ధాలు తినడం మానెయ్యాలి. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు పాటించాలి. ప్రతీ రోజూ కనీసం అరగంట వ్యాయామం లేదా నడక చెయ్యాలి. ఒక నివేదిక ప్రకారం ప్రతీ రోజూ గంట నడిచే వాళ్లలో, ఎలాంటి వ్యాయామం చెయ్యని వారికన్నా గుండెపోట్లు 67శాతం తక్కువ.ఇలా ప్రత్యక్షంగా ప్రభావం కనబడుతున్న మంచి జీవన శైలి అలవర్చు కోవాలి. ఇది ఖర్చులేని పని కూడా. అలాగే మానసిక వత్తిడికి, పొగాకు, మద్యపానం వ్యసనాలకు దూరంగా ఉండాలి.
డా.డి.వి.జి.శంకరరావు, మాజీ ఎంపీ, 9440836931

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img